కాపు రిజర్వేషన్లు… ముద్రగడ త్యాగఫలం!!

February 7, 2019 | News Of 9

  • 5 శాతం రిజర్వేషన్లకు ఏపీ శాసనసభ ఆమోదం
  • అనేక ఏళ్లుగా ఉద్యమించిన సూరీడు మాజీ మంత్రి పద్మనాభం
  • నా జాతి ఆకలి తీర్చండి అంటూ నినదించిన దీక్షాపరుడు
  • ప్రభుత్వాలకు ఎడతెగని లేఖలు, నిరాహార దీక్షలూ, ఉద్యమాలూ, అవమానాలు
  • పోలీసులు బూటుకాళ్లతో తన్నారంటూ విలపించిన సౌమ్యుడు

అమరావతి: అగ్రకులాల్లో వెనుకబడిన తరగతులకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని పూర్తిగా కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో చర్చించారు. దీనికి పలువురు ఎమ్మెల్యేలు సమర్థించారు. 2017 డిసెంబరులోనే 5 శాతం రిజర్వేషన్లను కాపులకు ఇవ్వాలంటూ చంద్రబాబు ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే… ఈ బిల్లును అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. కాపు మంత్రులకు చంద్రబాబు స్వయంగా స్వీట్లు కూడా తినిపించారు. అగ్రకులాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రం ప్రవేశపెట్టిన బిల్లుకు నిర్వీర్యం అయిపోయింది. కేంద్రం ప్రకటించిన 10 శాతంలో 5 శాతాన్ని కాపులకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు ఈ రోజు బిల్లును ఆమోదించారు.

5 శాతం రిజర్వేషను సరికాదన్నది ముద్రగడ అభిప్రాయం. నిజానికి 10 శాతం ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. మేం అన్నం పెట్టమని అంటే టిఫిన్ మాత్రమే పెట్టారని ముద్రగడ వ్యాఖ్యానించారు.

అయితే.. రాష్ట్రంలో కాపులు ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారన్న అంశంపై మొదటి నుంచీ దీనిపై ఉద్యమించిన ఘనత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికే చెందుతుంది. కాపుల హక్కుల కోసం పోరాడుతూ ఆయన అనేక సార్లు ఉద్యమాలు చేశారు. అనేక అవమానాలను కూడా భరించారు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలీసుల చేతిలో ముద్రగడ కుటుంబం అనేక ఇబ్బందులను ఎదుర్కొందన్నది వాస్తవం. నిజానికి అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లను ప్రకటించిన ఘనత ప్రధానమంత్రి మోడీకే చెందుతుందని చెప్పడంలో సందేహం లేదు. మొదటి నుంచీ కాపు రిజర్వేషన్ల అంశంపై తెలుగుదేశం ప్రభుత్వం సానుకూలంగా లేని విషయం తెలిసిందే. అనేక మంది కాపు యువకులపై కేసులు నమోదు చేసి వారిని నానా ఇబ్బందులు పెట్టింది కూడా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమే. కాపు సామాజిక వర్గం ఓట్లను 2014లో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అధికారాన్ని చేపట్టింది చంద్రబాబుకు ఈ సారి కాపుల ఓట్లను ఆకర్షించడానికి మార్గం లేకపోయింది. ఈ స్థితిలోనే ఆయన 5 శాతం రిజర్వేషన్లను ప్రకటించి దీని నుంచి కాపు ఓట్లకు గాలం వేశారు. ముద్రగడ పద్మనాభం ఒత్తిడి కారణంగా… కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసినా కాపుల విషయంలో ఇప్పటి వరకూ చేసింది కంటితుడుపు చర్యగానే చెప్పుకోవాలి.

2014లో పార్టీ మ్యానిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి… రెండేళ్లయినా ప్రభుత్వం స్పందించడంలేదంటూ ‘‘నా జాతికి తిండి లేదు… రిజర్వేషన్లు ఇవ్వండి’’ అంటూ ముద్రగడ 2016 జనవరి 31న కాపు ఐక్య గర్జనను నిర్వహించారు. అనూహ్య పరస్థితుల్లో తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్సుకు నిప్పు పెట్టారు. ఎవరు పెట్టారో తెలియదు. ఇందులో ఎవరో కావాలనే కుట్ర చేశారని అందరూ అనుమానించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అనేక మంది కాపు యువకులపై కేసులు నమోదు చేసింది. అసలు రైలును తగలబెట్టించి ఆ నేరాన్ని కాపులపైకి నెట్టింది చంద్రబాబేనంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన విషయం కూడా పాఠకులకు గుర్తుండే ఉంటుంది. దీనిపై సీబీఐ విచారణ కూడా కొనసాగింది. రైల్వే పోలీసులు ముద్రగడపై కుట్రదారుగా కేసు కూడా నమోదు చేశారు.

చంద్రబాబు పెట్టిన బాధ బతికి ఉండగా మర్చిపోలేను: ముద్రగడ

తొలి నుంచీ వివాదాలకు, ఘర్షణలకూ ముద్రగడ దూరం. నిజాయితీగల రాజకీయవేత్తగా, సౌమ్యుడిగా పేరు. అనేక సార్లు ఆయన నిరాహార దీక్షలు చేసి గాంధీ మార్గంలోనే తన నిరసనను వ్యక్తం చేస్తుండేవారు. దీంతో కాపుల్లో ఆయనపై ఒక ప్రత్యేక గౌరవం ఉంది. తుని సంఘటన తర్వాత… చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. కాపు ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసింది. ముద్రగడ కుటుంబాన్ని నానా హింసలకూ గురిచేసింది. ఆనాటి సంఘటనలను ఆయన గుర్తు చేసుకుంటూ పద్మనాభం ఇలా అన్నారు.

‘‘నా కొడును నేను ఎప్పుడూ కొట్టలేదు. నా తండ్రి నన్ను కొట్టలేదు. నేను భార్యను ఎప్పుడూ తిట్టలేదు. నా ఇంటికి పోలీసుల్ని పంపి.. నా కోడలనీ, నా భార్యనీ బూటుకాళ్లతో తన్నించారు. బతికి ఉండి… కూడా నా కుటుంబాన్ని కాపాడుకోలేకపోయానని బాధపడుతున్నాను. ఎంచేత నా కుటుంబాన్ని (చంద్రబాబు) కొట్టించాడో నాకు అర్ధం కాదు. ఆయన ఎస్టేటును పంచమని నేను అడగలేదు. అరెస్టు చేసుకోవాలి కానీ… నా కొడుకుని కొట్టుకుంటూ లాక్కువెళ్లారు పోలీసులు. మర్చిపోలేను సార్.. 78లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. వారిది (చంద్రబాబుది) ఆ రోజు పెంకుటిల్లు. ఆయనా ఎమ్మెల్యే అయ్యారు. నేనూ ఎమ్మెల్యేను అయ్యాను. ఆయన పెంకుటిల్లుకు పెంకులు పోతే వేసుకోవడానికి కూడా ఆ రోజున ఆయన దగ్గర డబ్బులు లేరు. ఈ రోజు… వందల కోట్లతో ఇంద్రభవనం… లక్షల కోట్లతో వ్యాపారాలు. అమరావతికి కాంట్రాక్టర్లు వస్తున్నారు. డబ్బు డొంక రూట్లో వెళుతున్నది. 90 శాతం వీళ్లే బినామీలు. (అమరావతిని) దోచేస్తున్నారు…’’ ఇదీ… గత 30 ఏళ్లుగా కాపు జాతి కోసం శ్రమించిన ముద్రగడ పడుతున్న బాధ. ఎవరికీ చెప్పుకోలేక అన్నట్లు ఉంది ముద్రగడ క్షోభ.

కేవలం రిజర్వేషన్ల వల్ల జీవితాలు బంగారుమయం కాకపోయినా… ఎంతో కొంత వెసులుబాటు దొరుకుతుందన్న ఆశ బడుగుజీవులైన కాపు సామాజిక వర్గంలో ఉంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *