కేసీఆర్ గారూ.. మీరు ఆంధ్రా రావద్దు… ప్లీజ్!!

March 14, 2019 | News Of 9

pawan kalyan and KCR | telugu.newsof9.com

  • అందరం బాగుందాం.. కొత్త గొడవలు పెట్టకండి
  • ఆయన్న ఎందుకు తెస్తున్నావ్? తిట్టిన వారితో ఎలా కలుస్తావ్ జగన్?
  • భాజపాతో ఎందుకు కలిసిపోయిందీ ప్రజలకు జవాబు చెప్పాలి
  • మాట మార్చినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
  • తీర్పు ఎలా ఉన్నా.. తుదిశ్వాస వరకూ ఈ నేల తల్లికి సేవ చేస్తా
  • నేను నచ్చితే ఓటు వేయండి. లేదంటే మీ ఛాయిస్
  • పార్టీ ఆవిర్భావ శంఖారావ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

(న్యూస్ ఆఫ్ 9)

‘‘ మీ భవిష్యత్తు కోసం…మీరు తీర్పును ఎలాగైనా ఇవ్వండి. లేదనుకుంటే.. నా తుది శ్వాస వరకూ నా నేల తల్లికి సేవ చేస్తాను’’ ఇదీ గోదావరి నదీ తీరం నుంచి పవన్ కళ్యాణ్ గుండె లోతుల్లో నుంచి చెప్పిన మాటలు…  పార్టీ 5వ ఆవిర్భావ శంఖారావం నుంచి అశేష జనవాహినిని ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఒకటి రెండు సార్లు కోపాన్ని ప్రదర్శించినా ఆద్యంతం.. ఒక నిండు గోదావరిలా ఆయన ప్రసంగం సాగిపోయింది. తెలుగు ప్రజల భవిష్యత్తు, వారి సంక్షేమం ముఖ్యం అన్న దిశగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణ నేతలతో తిట్లు తిన్నామని, విడిపోయిన తర్వాత కూడా పరిస్థితులు బాగుపడలేదని, నమ్మి చంద్రబాబుకు అధికారాన్ని అప్పగిస్తే… అవినీతిమయం చేసేశారని అన్నారు. స్పెషల్ స్టేటస్ పై సీఎం చంద్రబాబు పదే పదే మాట మార్చినందుకు ఆయన తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. తాను ఒకసారి మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటానని అన్నారు. చంద్రబాబు ఆరు నెలలకోసారి మాట మార్చేస్తారని, అదేమంటే పార్టీ విధానమే అది అని చెబుతారని అన్నారు.

2019 సంవత్సరం మార్పునకు ప్రతీకగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ‘‘అందరం బాగుందాం. కేసీఆర్ మళ్లీ ఇక్కడకు వస్తున్నాని అంటున్నారు. ఇలా వచ్చి మళ్లీ పాత గొడవల్ని పెంచకండి. ఆంధ్రుల్ని వదిలెయ్యండి.. ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను’’ అని పవన్ రెండు చేతులూ జోడించి కేసీఆర్ ను వేడుకున్నారు. ‘‘రాజ్యాల మధ్య గొడవులు ఉంటాయి కానీ… ఆ రాజ్యాల మధ్య ఉన్న ప్రజల మధ్య కాదు’’ అంటూ చరిత్ర పరిశోధకుడు.. మల్లంపల్లి సోమశేఖర శర్మ ఒక పుస్తకంలో రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అన్యాయం చేసిన… భాజపాతో పొత్తుఎందుకు పెట్టుకున్నదీ జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండు చేశారు. ఆంధ్రుల్ని ఛీకొట్టిన వారితో తిరుగుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడగలరో జగన్ చెప్పాలని అన్నారు. దీనిపై జగనే ఆలోచించుకోవాల్సి ఉంటుందన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని జగన్ చెబుతుంటారని, ఆయన అడుగు జాడల్లో నడవడం అంటే ఇదేనా జగన్ అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇక్కడకు మీరు ఎలా తెస్తారు అని అన్నారు. వైసీపీకి బీజేపీ అండగా ఉంటానని చెప్పడం తీవ్రమైన బాధను కలిగిస్తోందని అన్నారు. కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందని, కానీ అనవసరంగా ఆంధ్రుల్ని ఎందుకు శిక్షించడం అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆంధ్రాకు రాకుండా ఉండాలని అన్నారు. భాజపాతో ఎందుకు కలిసిపోయారన్నది కూడా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఆంధ్రుల్ని వదిలివెయ్యండి అంటూ కేసీఆర్ కు కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. అందరం బాగుందామని హితవు పలికారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. పోలవరం ఎందుకు ఇవ్వరు అంటూ మోడీని ప్రశ్నించారు. ఎవరితోనూ కలవకుండా… ఒంటరిగా తాను మాత్రమే ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తననను వ్యక్తిగతంగా తిట్టారని, అయితే ఫర్వాలేదని, ప్రజల క్షేమం కోసం తిట్టను భరిస్తానని అన్నారు.

పవన్ కళ్యాణ్ రైటు అంటే నాకు ఓటు వెయ్యండి. లేదంటే మీ ఛాయిస్… అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

అంతక ముందు మాట్లాడుతూ… తాను పార్టీ పెట్టిన ప్రస్థానాన్ని వివరించారు. మొదట్లో ఎవరూ తనను నమ్మకపోయినా, మీరంతా నమ్మారని, ఆ బలంతోనే ఇపుడు మీ ముందు ఉన్నానంటూ జనసైనికులను చూపించారు. సీఎం పదవిని తాను ఒక బాధ్యతగా చూస్తానని, సీఎం అయిపోవాలి అన్న యావ లేదన్నారు. మీరు పవర్ స్టార్ అన్నా, మరొకటి అన్నా పొంగిపోలేదని అన్నారు. మార్పు రావాలన్న సమయం వచ్చిందని, అందుకే మీరు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. లెనిన్ మహాశయుడు అన్నట్లు… గర్భధారణ పరిస్థితులు ఉన్నప్పుడు.. నాయకుడు వచ్చి చేసేది మంత్రసానితనమే అని, ఇపుడు తాను చేస్తున్నది కూడా అదేనని, అందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టే… ఇది సాధ్యం అవుతున్నదని అన్నారు. నాయకులందరూ యువతను ఓటు బ్యాంకులుగా చూసి… వారి స్వార్థానికి వాడుకుంటున్నారని అన్నారు. ప్రకృతి, చెట్టు వంటి వాటికి ఇచ్చే గుణం ఉంటుందని, తాను కూడా అంతేనని, సంపాదించుకోవడానికి రాలేదని అన్నారు. తాను ఆర్ధికంగా ఏ స్థాయికి వెళ్లిపోయినా… ఎవరో ఇంత అన్నం ముద్ద పెట్టకపోరు అని అన్నారు. అయితే… అన్నీ వదులుకున్నానని, ఇవ్వడానికే తాను వచ్చానని అన్నారు. కోట్లాది రూపాయల్ని ఇలా ఇచ్చేయగలనా అని కూడా ఆలోచించుకున్నానని, పవన్ కళ్యాణ్ ను ఎవరో వచ్చి పరీక్షించక్కర్లేదని, తనను తాను చాలాసార్లు పరీక్షించుకున్నానని తెలిపారు. ‘‘మనందరం ఒక తల్లికి పుట్టలేదు. పేగు బంధం లేదు. అయినా విశ్వబంధం కలిపేసింది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘రేపు తెలంగాణలో ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు… అప్పుడు అక్కడ కూడా జనసేన వెళుతుంది’’ అని అన్నారు. జనసేన అవసరం రెండు రాష్ట్రాలకూ ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చదరంగంలో ఒక భటుడు… భయపడుతూ భయపడుతూ ఒక్కో గడీ దాటుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటాడన్న… జావెద్ అక్తర్ చెస్ కవిత్వాన్ని ఉటంకించారు.

‘‘12 ఏళ్ల వయసులోనే తాను దేశానికి సేవ చేయాలని అనుకున్నాను. ఆ కల కాలగతిలో నన్ను నటుడ్ని చేసింది. తర్వాత జనసేన ద్వారా ఇలా మీ ముందుకు తెచ్చి నిలబెట్టింది’’ తన గురించి చెప్పారు. ఈ దేశంలో రెండు కులాలే పాలకులుగా ఉన్నారని, కులాల ఐక్యత అభివృద్ధికి అవసరమని అన్నారు. మానవత్వానికే నిలబడుతున్నామా లేదా అని మాత్రమే తాను చూస్తానని అన్నారు. జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని, అవి ఎవరికీ తెలియదని, విమానాల్లో వెళుతున్నా… కార్లలో వెళుతున్నా… రోడ్డు పక్కన ఉన్న సామాన్యుల గురించి ఆలోచనలు సాగిపోతుంటాయని.. ఈ బాధ ఇప్పటిది కాదని అన్నారు.

 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *