కూకట్ పల్లి: అభివృద్ధి పక్కన పెట్టు! ఆత్మగౌరవంపైనే కొట్టాడుగా!!

December 2, 2018 | News Of 9

Kukatpally: Chandra babu hit right on our self-respect | Newsof9

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకున్నాడని తెరాస వాదిస్తుంటే, అభివృద్ధిని అస్సలు అడ్డుకోలేదని చంద్రబాబు బంగారం అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వాదిస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు కూడా తెలంగాణ అంటే నాకు ప్రాణం అన్నట్లు చెబుతున్నారు. మరో అడుగు ముందుకేసి తెరాసపై ఆయన కౌంటర్లు వేస్తున్నారు. ”దళితుడిని సీఎం చేస్తే అడ్డుకున్నానా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తే అడ్డుకున్నానా? గిరిజనులకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకున్నానా? అని ఆయనే ప్రశ్నించాడు. మహా కూటమి కూడా ఇదే స్థాయిలో తెరాసకు కౌంటర్లపై కౌంటర్లు ఇస్తోంది.

వాస్తవం ఏమిటనేది అలా ఉంచి.. ఈ రెండు రకాల వెర్షన్లూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. వాస్తవాలను ఒకసారి రివైండ్ చేసుకుని చూసుకుందాం.

2014 నుంచి 2018 సెప్టెంబర్ వరకు తెలంగాణాలో తెరాస పాలన నడిచింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వపరిపాలన జరిగింది. పాలనా ఎలా జరిగింది? కేసీఆర్ ఎలా పరిపాలించాడు? పాలనలో అంతర్గతంగా ఎవరెవరు ఏం చేశారు? ఇదంతా ప్రజలకు పెద్దగా తెలియక పోవచ్చు. ఇంత వరకు ఏ అభివృద్ధి పనులను చంద్రబాబు అడ్డుకున్నదీ అధికారంలో ఉండగా తెరాస ఎక్కడా స్పష్టం చెయ్యలేదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సాధారణమే. తెలంగాణ ఎన్నికల వేళ చంద్రబాబు మీద ఎక్కువ చర్చ జరుగుతున్నది.

ఒక విషయం మాత్రం నిజం.

తెలంగాణకు సంబంధించి ఇంతవరకు చంద్రబాబు ప్రత్యేకంగా దేనిని అడ్డుకున్నాడో తెలియదుగానీ.. 2018 ఎన్నికలకు సంబంధించి తెలంగాణ నాయకత్వాన్ని మాత్రం అడ్డుకుంటున్నాడనేది పదహారణాల వాస్తవం. తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన కోసం. ఇప్పుడు జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణ నేతలను అడ్డుకుంటున్నాడు. అంతే కాదు తెలంగాణ నేతలపై ఆంధ్ర నేతల, నందమూరి కుటుంబ సభ్యుల పెత్తనం నడిచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విషయం కూకట్ పల్లిలో తేట తెల్లమవుతోంది.

అంటే ఇక్కడ తెలంగాణ నేతలు రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు అడ్డుకోవడం ఎలాంటి పరిణామం?
ఇంతకాలం నందమూరి ఆడపడుచులు ఎవరూ గుర్తుకు రాని చంద్రబాబుకు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతుంటే నందమూరి సుహాసిని మాత్రమే ఎందుకు గుర్తొచ్చింది? ఎక్కడో మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సుహాసినీని బలవంతంగా చంద్రబాబు కూకట్ పల్లి నుంచి నామినేషన్ వేయించడం తెలంగాణ నాయకత్వం బలపడకుండా అడ్డుకోవడం కాదా అన్నది అందరూ మరచిపోయిన ప్రశ్న?

తెలంగాణ ఉద్యమంలో బిడ్డలు చచ్చి పోతుంటే కనీసం సంతాపం కూడా తెలపని నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక మహిళను బరిలోకి దించడం అంటే… రాజకీయంగా తెలంగాణలో అడ్డుపడటం కింద రాదా?

నాలుగేళ్లుగా తెలంగాణలో గల్లీ గల్లీ లో ఘనంగా ఆడపడుచులంతా బతుకమ్మ ఆడుతుంటే ….ఒక్క రోజు కూడా బతుకమ్మ ఆడినట్టు కనిపించని నందమూరి ఆడపడుచును తెచ్చి, బలవంతంగా తెలంగాణ ఓటర్లపై రుద్దడం తెలంగాణ సంస్కృతిని అడ్డుకోవడం కాదా?

తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ….తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా రాజ్యసభలో తెలుగులో మాట్లాడి మరీ రాజీనామా సమర్పించిన నందమూరి హరికృష్ణ కూతుర్ని తెచ్చి కూకట్ పల్లిలో నిలబెడితే తెలంగాణ నాయకత్వాన్ని అడ్డుకోవడం కాకపోతే మరేమిటి చంద్రబాబుగారూ? కూకట్ పల్లిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పరిటాల సునీతలాంటి వారిని తెచ్చి ప్రచారం చేయించడం, స్వయంగా చంద్రబాబు కేవలం తెలుగుదేశం నేతలు పోటీ చేస్తున్న నియోజక వర్గాలపైనే దృష్టి పెట్టడం, ప్రచారం ముగిసిన తరువాత రహస్యంగా ఓ స్టార్ హోటల్ లో తమ సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశాలు ఏర్పాటు చెయ్యడం ఇదంతా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అడ్డుకోవడం కాదా?

నిజంగానే తెలంగాణ పై చంద్రబాబుకు ప్రేమ ఉంటే …కూకట్ పల్లిలో నందమూరి సుహాసిని కాకుండా బాబుకు ఏ పెద్దిరెడ్డో, ఎల్లయ్యో, పుల్లయ్యో ఎందుకు గుర్తుకు రాలేదు. తెలుగుదేశం పార్టీకి జెండాలు మోసి ఊడిగం చేసిన తెలంగాణ బిడ్డలు కూకట్ పల్లిలో లేరా? అలాంటి వారిని నిలబెట్టి బాబు ప్రచారం చేస్తే నిజగానే చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉందని జనం నమ్మేవారు. ఓట్లు ఎవరికీ ఎన్ని పడతాయి? ఎవరు గెలుస్తారు? అనే విషయం కాదిక్కడ. ఏదైనా ఆటలోనైనా ఒకరే గెలుస్తారు ? అది రాజకీయం లేదా ఇంకేదైనా కావచ్చు. కూకట్ పల్లిలో సుహాసిని గెలుపు పెద్దగా కష్టం కాకపోవచ్చు. కానీ ఈ గెలుపు ఓటముల వెనుక తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం ముడిపడి ఉంది. ఈ ఆత్మ గౌరవానికి చంద్రబాబు అందరూ చూస్తుండగా అడ్డు పడుతున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి లాంటి ప్రాంతాల్లో ఆంద్ర వలస దారుల జనాభా కొంత ఎక్కువ ఉండొచ్చు. అంత మాత్రాన తెలంగాణ ప్రాంత వాసుల మనో భావాలను, ఆత్మగౌరవాన్ని అడ్డుకోవడం ఎంత వరకు సబబు? ఇదే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో తెలంగాణ బిడ్డలనో, ఉద్యమ కారులనో, అమరవీరుల కుటుంబాల నుంచో, లేదా బడుగు బలహీన వర్గాల నాయకులనో బరిలోకి దించి వారిని గెలిపించమంటూ చంద్రబాబు రోడ్ షో చేసి ఉంటే…తెలంగాణ బిడ్డలు శభాష్ చంద్రబాబు అనేవాళ్ళు కావచ్చు. నాలుగేళ్ళ తెరాస పాలనలో చంద్రబాబు ఏం అడ్డుకున్నాడో తెలియదు కానీ 2018 నుంచి తెలంగాణ బిడ్డల నాయకత్వాన్నీ, తెలంగాణ ఆత్మగౌరవాన్నీ చంద్రబాబు ఇక అడ్డుకుంటూనే ఉంటాడు అనడంలో సందేహం లేదు. అరవై ఏళ్ళ తరువాత కొంత ప్రశాంతత లభించిందన్న తెలంగాణ ఆత్మగౌరవానికి మళ్లీ ప్రమాద ఘంటికలు మొదలయ్యాయి. మనల్ని మనం కాపాడుకోడానికి మరో ఉద్యమం తప్పదేమో!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *