భూటాన్ లో మాదిరి ప్రజల సంతోషమే మాకు లెక్క: పవన్

November 30, 2018 | News Of 9

భూటాన్ మాదిరిగా… జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంతోషాన్నే ప్రామాణికంగా తీసుకుని పని చేస్తామని, ఇందుకోసం రాష్ట్ర స్థూల సంతోషాన్ని లెక్కిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అమలాపురంలో గురువారం జరిగిన పోరాట యాత్రలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలకు సమయంలేదని, ప్రజల గురించి వారు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని విమర్శించారు. కోనసీమ నేలలోనే ఉడుకురక్తం ఉందని, ఇక్కడి యువత కోసం జనసేన ప్రభుత్వం యుద్ద విద్యల విశ్వవిద్యాలయన్నా ఏర్పాటు చేస్తుందని, అలాగే స్పోర్ట్స్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఒక్క సెంటు భూమిలేని వ్యక్తి పది ఎకరాలున్న ఆసాములకు కూడా సాయం చేయండి అని శ్రీకాకుళంలో ఒక పేద రైతు అడిగాడని, కోటీశ్వరులు పేదల గురించి ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. రిలయెన్స్, ఓఎన్జీసీ వంటి వాటితో పోరాటం చేసి… ప్రజలకు న్యాయం చేస్తామని అన్నారు.

‘‘సీఎం మాట్లాడితే విజన్ 2020, లేదా 2050 అంటారు… ఆయన నిత్య యవ్వనంతో అప్పటి వరకూ ఉంటారా?’’ అని ఎద్దేవా చేశారు. ‘‘2009లో దెబ్బతిన్నాం.. చీత్కారాలు పడ్డాం. పడే వచ్చాం. పౌరుషం ఉంది. వెన్ను చూపే వాళ్లం కాదు. ఇపుడు పార్టీ పెట్టి మీరేం చేస్తారు అన్న ప్రతి చవటకూ నేను చెబుతున్నా. పొగరు అనుకోండి ఏదైనా అనుకోండి.. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు.

‘‘జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు. తెలుగుదేశానికి రోజులు అయిపోయాయి. తెలుగుదేశం అస్తమిస్తున్న సూరీడు అయితే, జనసేన ఉదయిస్తున్న సూరీడు’’ అని అన్నారు. జగన్ పై విమర్శల వేడిని కూడా పవన్ పెంచారు. ‘‘చిన్న కోడి కత్తి గుచ్చుకుంటేనే భయపడిపోతారు. రాయలసీమ రక్తం అంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు.

కోనసీమ పరిరక్షణ ఉద్యమం చేయకపోతే కోనసీమను రక్షించుకోవడం కష్టం అవుతుందని పవన్ అన్నారు. కాలుష్యం ఒకరికి హాని చేసి మరికొరిని వదిలివేయదని, సంఘటితంగా ఉండి కోనసీమను కాపాడుకోవాల్సి ఉందని చెప్పారు. 2014లో జరిగిన గ్యాస్ లీకు వల్ల హృదయాన్ని కలచివేస్తోందని, ఇప్పటికీ బాధితులకు సాయం అందడంలేదని అన్నారు. మీ హృదయం ఎప్పుడు కరుగుతుంది అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అందరూ చచ్చిపోతేనే మీరు కరుగుతారా? ఛీ సిగ్గుండాలి. మీ బతుకు చెడ అంటూ తిట్టిపోశారు. రిలయన్స్ 2006లో గ్యాస్ ఇచ్చిపోతానని చెప్పి, మొత్తం గుజరాత్ రాష్ట్రానికి తరలించడం ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూసి ఉంటారు. కానీ నాలాంటి వాడిని చూసి ఉండరు. చూడరు కూడా’’ పవన్ సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ‘‘చంద్రబాబు మాటలు తెను… కానీ మనసు విషం’’ అని పవన్ వ్యాఖ్యానించారు. తన మనుషులు కాకపోయినా వేరే దేశం కోసం చేగువేరా… చేసిన విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాకీయాల్లోకి వచ్చానని అన్నారు. తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పాల్సిన రాజకీయ నాయకులే ఉండాలని, కర్ర విరగకుండా, పాము చావకుండా చెప్పే నేతల వల్ల ఉపయోగం లేదని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర ముగిసిందని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అమలాపురం సభకు ఎక్కువమంది యువత, మహిళలు హాజరయ్యారు. మండలానికో డిగ్రీ కళాశాల, వృద్ధులకు ఆశ్రమాలు, మహిళా బ్యాంకులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *