అదిగో… తూరుపున…విప్లవ సూరీడు!!

March 13, 2019 | News Of 9

360 Degree Analysis: 2019 is for JanaSena.. one can write on the wall | telugu.newsof9.com

  • మార్చి 14- జనసేన పార్టీ ఆవిర్భావ సంబరాలు
  • నమ్మకమే పెట్టుబడిగా.. కదలిన జన సైన్యం
  • అపోహలెన్ని ఉన్నా.. మొక్కవోని సేనాని ధైర్యం
  • తిరోగామి శక్తులది తెచ్చిపెట్టుకున్న మతిమరుపు
  • పార్టీ ప్రయాణం- ఒక విహంగవీక్షణం

  (న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేకం)

 

‘‘అసలే కారు చీకటి..

గాఢాంధకారం…

దారంతా గతుకులు…

చేతిలో దీపం లేదు…

కానీ గుండెల నిండా ధైర్యం ఉంది… ’’

 

ఖాకీ చొక్కాలో… అసలు సిసలు సైనికుడు మాదిరిగా పవన్ కళ్యాణ్ గర్జించడం ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అప్పుడే అయిదేళ్లు అయిపోయిందా అనిపిస్తోంది. కాలం కళ్ల ముందే కరిగిపోతుంది.

‘‘సమాజం కోసం ఏమైనా చేస్తే బాగుండు’’,

‘‘ఈనాటి రాజకీయాలను మార్చేద్దాం’’

‘‘అందుకు సమయం ఆసన్నమైంది’’

ఎంతో మంది యువతీ యువకుల మనస్సులు అప్పటికే రగిలిపోతున్నాయి. కానీ సాహసం చేయలేని నిస్సహాయత, బతుకు పోరాటం.. ఆలోచనల్నిచిదిమేస్తుంటాయి. సరిగ్గా అదే సమయంలో ఓ అగ్గి బరాటా హైదరాబాదు నడిబొడ్డున గాల్లోకి లేచింది. రెపరెపలాడుతూ కనిపించింది. కోపంతో రగిలిపోయింది. కారు చీకటిలో కాంతి రేఖలా యువతరాన్ని కమ్మేసింది. గుండెల్లో రగులుతున్న నిప్పు కణికల్ని అగ్ని శిఖలుగా మర్చేసింది.

Janasena trudging into people's heart News of 9

 వచ్చాడు… అదిగో పవన్ కళ్యాణ్. స్వార్థ పూరిత రాజకీయాలను సమాధి చేయడానికి అవతరించాడు. రేపు వెలుగులు రావడం ఖాయం… అన్న ఆశ ముంచెత్తింది. వారి ముఖాల్లో ఆనందం దోబూచులాండింది. కొందరికి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.  కాలం గడిచేకొద్దీ… కణ కణమనే ఆ నిప్పు కణికి ఆరిపోతుందన్నారు. అదిగో మళ్లీ సినిమాలు చేస్తున్నాడు అన్నారు. పెదవి విరిచారు. ‘‘అన్న పీకింది లేదుగానీ… తమ్ముడు వచ్చాడండి’’ అంటూ కరివేపాకులా తీసిపారేశారు. సొంత సమస్యలు కొన్ని. అయినా యువత ఆశలు ఎనాడూ వమ్ము చేయలేదు. ‘‘ఎందరు ఎన్ని అన్నా… నాతోపాటు మొదటి నుంచీ ఉన్నదీ, నన్ను నమ్మింది ఈ జన సైనికులే… అది మీరే’’ అంటూ ఎన్ని సమావేశాల్లో జన సేనాని చెప్పాడో లెక్కలేదు. అవును. వాళ్లు మొదటి నుంచీ ఆయన్ని నమ్మారు. తొలుత గుడ్డిగానే నమ్మారు. మనసులో స్వార్థం లేదు. అందుకే ఆ నమ్మకం వమ్ము కాలేదు. దినదిన ప్రవర్థమానమైనట్లు… ఇంతై వటుడింతై అన్నట్లు ఈ రోజున ‘‘జనసేన’ … ఆకాశమే హద్దుగా జైత్రయాత్ర చేస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి కోస్తా, రాయలసీమల వరకూ తానై అన్ని ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాలతో మమేకం అయిపోయింది. జనసేన… ఓ సరికొత్త రాజకీయ జన కావ్యం. యువ హృదయాల కళ్ల ముందు సాక్షాత్కరించిన ఒక సుందర స్వప్నం. ఈ సుందర స్వప్నాన్ని చిదిమివేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారు ప్రజల ఆగ్రహాగ్నికి గురికాకతప్పదు.

 కోట్లాది రూపాయల నల్లధనం ఉంటే పరిస్థితి వేరు. డబ్బులు లేనపుడు..  ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించడానికి సైద్ధాంతిక భూమిక చాలా ముఖ్యం. పార్టీ పెట్టక ముందే పవన్ కళ్యాణ్ తనను అద్దంలో చూసుకున్నాడు. కళ్యాణ్ అనే వాడికి ఎంత ధైర్యం ఉందో కొలుచుకున్నాడు. రాజకీయ వైకుంఠ పాళీలో బుసలు కొట్టటే పాములుంటాయని తెలుసుకున్నాడు. నిచ్చెనలు ఎక్కగలనా అని అనేకమార్లు ప్రశ్నించుకున్నాడు. హరిహరాదులే అడ్డం వచ్చినా ముందుకు ప్రయాణం చేయగలనా అని ప్రశ్నించుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భావం జరిగిపోయింది.

 ఒక వ్యక్తి తలచుకుంటే… ప్రపంచాన్ని మార్చగలడా…? ఒక వ్యక్తి సంకల్పబలం ముందు హిమాలయాలు కూడా చిన్నవే. సంకల్పబలం ఎంత శక్తిమంతంగా ఉంటుందన్నదే కొలత. మహామహులు రాసిన గ్రంథాలన్నీ చదువుకున్నాడు. పాఠశాల విద్యలో లేని ప్రపంచాన్ని దర్శించాడు. యేసు క్రీస్తు, బుద్ధుడు దగ్గర నుంచీ మార్టిన్ లూధర్ కింగ్ వరకూ తెలుసుకున్నాడు. అలా మొదలైన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగిపోతున్నది.

 రాజకీయాల్లో నిజం చెప్పేవాడు లేదు. అందుకే తాను నిజాలే చెప్పాలని అనుకున్నాడు. అందులో విజయం సాధించాడు. అవకాశవాదం రాజ్యమేలుతున్నది అని గుర్తించాడు. అవకాశవాదాలకు దూరంగా జనసేనను నిర్మించాడు. డబ్బు రాజకీయాలే ప్రజాస్వామ్యాన్ని ఒక ఆట ఆడిస్తున్నాయని గ్రహించాడు. డబ్బు రాజకీయాలు వద్దనుకున్నాడు. స్వయంగా తనకు తానే ‘‘లక్షణ రేఖలు’’ గీసుకున్నాడు. ఆ గీత దాటకుండా… స్వచ్ఛమైన రాజకీయాలకు శ్రీకారం చుట్టాడు.

 తానే గీసుకున్న గీతలు దాటకుండా… పార్టీని విజయవంతంగా అయిదేళ్లు నడిపించాడు. ఇక ఎన్ని ఏళ్లు అయినా నడిపిస్తాడు. సందేహం లేదు. ‘‘అయిదేళ్ల అయనా ఇంకా పార్టీకి… ’’ అని నాతో ఒక జర్నలిస్టు అన్నారు. మనం పుట్టే నాటికే ఈ ప్రపంచం ఎలా ఉందో తెలియదు. పాపం పుణ్యం తెలియని శిశువుగా ఈ భూమి మీదకు వచ్చేస్తాం. మళ్లీ ఎప్పుడో వెళ్లిపోతాం. కానీ ఈ మధ్యలో… మొదట వింతగా కనిపిస్తాయి. తర్వాత వాస్తవం అని తేలుతుంది. చిన్నప్పుడే కళ్లు తెరిచాం కదా అనుకున్నాం… కానీ మనకు 40 ఏళ్లు వచ్చిన తర్వాత సమాజాన్ని నియంత్రించే శక్తులు- ఈ ప్రకృతీ, దేవుడూ కాకుండా వేరే వాళ్లు ఉన్నారని తెలుస్తుంది. వాళ్లు ఏం చెబితే ప్రపంచం అది చేస్తుంది. అర్థం కాదు… పుస్తకాలు చదువుతాం. దీన్ని దోపిడీ అంటారనీ, బానిసత్వమంటే ఇదే నేటి సమాజమని తెలుస్తుంది. మనిషి మరో మనిషిని దోచుకుంటున్నాడనీ, అదే డబ్బుల్నే ఎరగా వేసి ప్రజల డబ్బుల్ని దోచుకుంటున్నాడనీ అర్థం అవుతుంది. తట్టుకోలేం. ఒకటే మార్గం. దుర్మార్గుల్ని తుపాకీతో చంపేయడం. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. దేవుడు ఇచ్చిన ఈ అందమైన జీవితం ఇలా అయిపోయిందే అనే బాధ. ఇలా ఆలోచించిన యువతీ యువకులు జనసేనకు ఆకర్షితులయ్యారు. మార్పు కోసం జనసేన జండా పట్టుకుని పవన్ కళ్యాణ్ వెంట పరుగులు తీశారు.. నేటికీ అలానే ఉన్నారు. వారి ఆశలు నెరవేరుతాయి. అందుకే జనసేన తెలుగునాట ఒక గౌరవ వాచకం అయిపోయింది. జనసేన జండా పట్టుకోవడాన్ని జాతీయ జండాను మోసినంత గౌరవంగా వారు భావిస్తున్నారు. జనంలో మార్పు వచ్చిందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం ఉంటాయి? వైరి పార్టీలు తెచ్చిపెట్టుకున్న మతిమరుపును ప్రదర్శిస్తున్నాయి. మార్పును స్వాగతించలేని తిరోగామి శక్తులు ఇంతకు మించి ఏం చేస్తాయి?

 పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చంద్రబాబు వస్తే అమరావతినీ, జగన్ వస్తే రాయలసీమనూ బాగు చేస్తామంటున్నారు. మీరు వస్తే మీ జిల్లాను బాగు చేసుకుంటారా అన్న ఓ ఆడపడుచు ప్రశ్నకు ‘‘మానవత్వాన్ని కాపాడతాను’’ అన్న పవన్ కళ్యాణ్ మంచి చెడుల గురించి ఏం చర్చిస్తాం. సమాజం స్తన శల్య పరీక్షలు (స్త్రీ స్థనంలో ఎముక ఉందేమోనని వెదికే కుయుక్తులు) చేస్తూనే ఉంటుంది. వారికి ఏమీ చెప్పలేం. ఒక విప్లవం వచ్చినపుడు అపోహలు సహజమే. డౌటింగ్ థామస్ లు ఎప్పుడూ ఉంటారు. వారిని వదిలివేసి… జనసేన జండాను భుజాన వేసుకుని రేపటి వెలుగుల వైపు ప్రయాణం సాగించడమే జన సైనికులు చేయగలిగింది. పార్టీకి నేతలుగా ఎవరున్నా… చెదరని పునాది జన సైనికులే. వారే పార్టీకి శ్రీరామరక్ష. వారి నమ్మకమే పార్టీ. పార్టీయే వారు. పవన్ కళ్యాణ్ విజయంపై వారికి హిమాలయాలంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మించింది లేదు.

JSP Public meeting in Paderu on Jan 23 | telugu.newsof9.com

 ముగింపు:

వర్చువల్ ప్రపంచంలో ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించాలన్నది ఫేస్ బుక్ కుర్రాడు జూకర్ బెర్గ్ ఆశ. అదిప్పటి వరకూ  నెరవేరలేదు. కానీ.. జనసేన అలాంటి వర్చువల్ ప్రపంచాన్నీ, ఒక వసుధైక కుటుంబాన్నీ ఇప్పటికే సృష్టించింది. వారు వర్చువల్ గానూ, ఎక్కడెక్కడో ఉన్నా భౌతికంగానూ జనసేన కుటుంబంలా పెనవేసుకుని పోయి ఉన్నారు. అందులో నాకూ ఎందరో మిత్రులు పరిచయం అయ్యారు. పరిశోధన చేయదగ్గ అంశం. జనసేన ప్రయత్నాలు అసాధారణం. దాని విజయం అసాధారణం అవుతుంది. జన సేనానికి తెలుగు వారికి దొరికిన సోషలిస్టు పితామహుడు రామ్ మనోహర్ లోహియా వంటివాడు. తెలుగు వారి సోషలిస్టు. అధికారం రావడం అన్నది

అయితే గియితే, ఆలస్యం కావచ్చు.. కానీ మీ ఆశ నెరవేరుతుంది.  

విజయీభవ!!

 

–      గుగ్గిళ్ల శ్రీనిసవారావు

ప్రధాన సంపాదకుడు

Other Articles

2 Comments

  1. Thank you, I’ve just been searching for info about this topic for ages and yours is the best I’ve discovered till now. But, what about the conclusion? Are you sure about the source?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *