ఉద్యోగులకు వరాలిచ్చన మంత్రి మండలి సమావేశం..

February 9, 2019 | News Of 9

Ministers Meeting showered boons on Employs

అమరావతి: శుక్రవారం సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలోనే కొన్ని వరాలు కూడా ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2018 జూలై నుంచి అమలు లోకి వచ్చే ఈ పెంపుదల 20019 జూలైలో చెల్లించేలా నిర్ణయించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు

అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి సత్వరం చెల్లింపులు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ చెల్లింపులు ఏప్రిల్ మొదటి వారంలో చేసే అవకాశం ఉంది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దిని కోర్టు అభినందించిందని మంత్రిమండలి పేర్కొంది. సత్వర ఊరటగా రూ.250 కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో హైకోర్టు అంగీకరించిందనీ, ఇక భూముల వేలం పూర్తిచేసి మిగిలిన బాధితులకు న్యాయం జరిగేలా హైకోర్టు చర్యలు తీసుకోవాల్సి వుందనీ మంత్రిమండలి అభిప్రాయపడింది.

వైకుంఠపురం ఎత్తిపోతల ప్రాజెక్టు

వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై మంత్రిమండలిలో చర్చించారు. గతంలో టెండర్లు రాలేదనీ ఇప్పుడు ఎవరు తక్కువకు వేస్తే వారికి ఇవ్వాలనీ నిర్ణయించారు. రాజధాని అమరావతి భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా కృష్ణానదిపై వైకుంఠాపురం దగ్గర బ్యారేజ్ నిర్మించాలని గతంలో నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజ్‌కు 23 కి.మీ. ఎగువున, పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ. దిగువున వైకుంఠాపురం బ్యారేజ్ నిర్మాణం కానుంది. ఈ బ్యారేజ్ మొత్తం పొడవు 3.068 కిలోమీటర్లు వుంటుంది. వైకుంఠాపురం దగ్గర కృష్ణానదిపై నిర్మించే ఈ బ్యారేజ్‌కు రూ. 3,278.60 కోట్లు వ్యయం కానుందని ప్రాథమిక అంచనా వేశారు. దీని నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది

అమరావతి లో జేఎన్ టీయూ

అమరావతి: జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ కొత్త వర్శిటీని మోడల్ యూనివర్శిటీగా ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

విజయనగరం వర్సిటీకి గురజాడ పేరు

విజయనగరం విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని మంత్రిమండలిలో నిర్ణయించింది. అలాగే ఓ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం. తీసుకున్నారు.

అకార్డ్ వర్శిటీకి భూమి..

విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరా 10 లక్షల చొప్పున, విశాఖ రూరల్ మండలం యెండాడ గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరా కోటి రూపాయిల చొప్పున అకార్డ్ యూనివర్శిటీకి కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హెల్త్ సైన్సస్ విభాగంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన మల్టీ స్ట్రీమ్ యూనివర్శిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. చెన్నైలో 7 యూనివర్సిటీలు ఉన్న వీరు అన్ని విద్యాసంస్థలకు కలిపి 120 ఎకరాలు కావాలని అభ్యర్థించారు. ఈ కేటాయింపుల అంశలో నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.

పేదలకు ఇరిగేషన్ భూములు  

జల వనరుల శాఖకు చెందిన భూములలో 2వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. వేరే ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఏళ్ల తరబడి నివాసం ఏర్పరచుకున్న పేదలందరికీ ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

 ఏలూరు స్మార్ట్ సిటీ

ఏలూరు స్మార్ట్ సిటీ అంశంపై మంత్రి మండలిలో చర్చ జరిగింది. వినూత్న నమూనాగా స్మార్ట్ ఏలూరు అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇవి కాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడం వంటి అనేక ఇతర నిర్ణయాలను కూడా ఈ మంత్రిమండలి సమావేశంలో  నిర్ణయించారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *