మెగా బ్రదర్స్… మెగా ఆలోచనలు!! మీకు అభినందనలు!!

May 13, 2019 | News Of 9
  • ఆధునిక భావాలతో… నాగబాబు!
  • మత రహిత సమాజంవైపు అడుగు పడాలి
  • స్వర్గం నరకం… మానవ కల్పితాలు
  • సరైన చట్టం, సరైన అమలు అవసరం
  • ఈ తరం మర్చిపోయిన ఆదర్శాలు మళ్లీ తెరపైకి

(న్యూస్ ఆఫ్ 9)

నర్సాపురం జనసేన అభ్యర్ధి నాగబాబు… ‘‘మై ఛానెల్ నా ఇష్టం’’ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ప్రజలకు అందించారు. అంతరిక్షంలో కాలనీలు కట్టుకునే దిశగా ప్రపంచం ప్రయాణిస్తున్న దశలో… కులాలు, మతాలు అంటూ ప్రజలు ఒకరిపై ఒకరి దుమ్మెత్తిపోసుకోవడాన్ని నాగబాబు తప్పు పడుతున్నారు. దేవుడని ఒక వైపు నమ్ముతూ… మరో వైపు అరాచకాలు చేయడాన్ని ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. స్వర్గం, నరకం వంటివి మనుషుల్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి పెట్టినవేతప్ప… నిజానికి అలాంటివి ఏమీ ఉండవని ఆయన చెప్పారు. స్వర్గానికి వెళ్లిన తర్వాత మనుషులు ఏం చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అక్కడ రంభ, ఊర్వశి వంటి అందగత్తెలు ఉంటారని, వారితో ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం ఉంటుందని చెప్పారని ఇదంతా ఉత్తిదేనని చెప్పారు. మరి పుణ్యం చేసిన స్త్రీలు స్వర్గానికి వెళ్లినపుడు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తూ… ఇదంతా పురుషులు రాసుకున్న పుక్కిట పురాణమని నాగబాబు కొట్టిపారేశారు.

సమాజంలో నేరాలను అదుపు చేయడానికి సరైన చట్టాలు ఉండాలని, వాటిని ఉక్కు క్రమశిక్షణతో అమలు చేయాలని అప్పుడే సమాజం బాగుంటుందని అన్నారు. రాబోయే వందేళ్లలో మతం పోయి… భూమి అందమైన స్వర్గంగా మారుతుందని చెప్పారు.

ఓ చిన్న వీడియో ద్వారా నాగబాబు… ఒక పెద్ద దార్శనిక భావనను వ్యక్తం చేస్తున్నారు. అది మతానంతర సమాజం. ప్రస్తుత సమాజంలో కొందరు మేథావులు ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. మతాన్ని వదిలివేసే సమయం వచ్చేసిందని, మత ప్రస్తావన లేని సమాజంలోకి ప్రజలు ప్రయాణించాల్సిన సమయం ఇదేనన్న వాదన ఇపుడు మేథావుల్లో ఉంది. ప్రకృతి గురించి సరైన అవగాహన లేని కాలంలోనే దేవుడు, దెయ్యం వంటి భావనలు మనిషి మనసులోకి, సమాజ పరివ్యాప్తిలోకి వచ్చాయన్నది నిజం. సైన్సు ఇంత అభివృద్ది చెందిన కాలంలో… మనుషులు మతంపై ఆధారపడని జీవితాన్ని ప్రారంభించడానికి చక్కటి అవకాశం ఉందని, దీనిని ఈ ఆధునిక కాలపు మనుషులు ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నారన్నదే ప్రశ్న. పాతను పట్టుకుని వేలాడదామనే వారు ఎప్పుడూ ఉంటారు. అయితే మెజారిటీ ప్రజలు కోరుకుంటే మత ప్రస్తావనలేని లేదా మత రహిత సమాజంలోకి అడుగుపెట్టడం పెద్ద కష్టంకాకపోవచ్చు… దీని గురించి ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం కూడా ఇదే.

ప్రజల ఆలోచనలు తప్పుదారిలో ఉన్నపుడు… వాటిని ధైర్యంగా ప్రశ్నించేవాళ్లే దార్శనికత ఉన్న నేతలుగా మారతారు. ఇలాంటి గొప్ప ఆలోచనను ప్రజల్లోకి తెచ్చినందుకు నాగబాబు ఎంతైనా అభినందనీయులు!!

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *