కన్నీటి భారతం: వాళ్లు దోచుకున్నది రూ.3138 లక్షల కోట్లు!!

January 2, 2019 | News Of 9

New Revelations And The English Colonial Rule in India | telugu.newsof9.com

  • ఆంగ్లేయులు సాయం చేశారన్నది శుద్ధ అబద్ధం
  • కట్టుకథనే ఇప్పటి వరకూ నమ్మిన ప్రపంచం
  • మన వెండీ, బంగారాన్నీ అక్కడే ఆపేశారు
  • లేదంటే.. భారత్ సుసంపన్న దేశంగా ఉండేది
  • 200 ఏళ్ల ప్రతాల పరిశోధన చెప్పిన చేదు నిజాలు

‘‘భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలించడం వల్ల భారతీయులకు ఎంతో మేలు జరిగిందంటూ ఇప్పటి వరకూ పాశ్చాత్యులు చేస్తున్న వాదన శుద్ధ తప్పని ఓ భారతీయ ఆర్థికవేత్త తన పరిశోధన ద్వారా తేల్చింది. ఆంగ్లేయులు భారత దేశాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆధారాలతో సహా ఇపుడు తేలిపోయింది’’  ఉత్సా పట్నాయక్ రాసిన ఈ పరిశోధన ఫలితాలు మనల్ని  కన్నీళ్లు పెట్టిస్తాయి. చదవండి!

భారతదేశాన్ని ఇంగ్లిషువాళ్లు దోచుకుపోయారు అన్న మాట మనం చాలాసార్లు విని ఉంటాం. కానీ ఎంత దోచుకున్నదీ ఎవరూ చెప్పలేదు. నిజానికి బ్రిటీషు వాళ్లలో దీనికి భిన్నమైన అభిప్రాయం ఇప్పటి వరకూ ఉంది. భారతదేశాన్ని పరిపాలించడం వల్ల బ్రిటీషు ప్రభుత్వానికి నష్టం జరిగింది తప్ప లాభం జరగలేదన్న వాదన అక్కడ ఉన్నది. జాలీ, దయ అన్న కారణంగానే భారతదేశాన్ని వారు పరిపాలించారని ఇంగ్లిషువాళ్లు నేటికీ చెప్పుకుంటారు.

అయితే.. కొత్తగా వచ్చిన పరిశోధన మాత్రం బ్రిటీష్ వాళ్ల అభిప్రాయం తప్పని, దోపిడీయే నిజమేనని చెప్పి, ఎంత దోచుకున్నదీ లెక్కలు తీశారు. ఆర్థిక వేత్త  ఉత్సా పట్నాయక్ చేసిన పరిశోధన పత్రాన్ని తాజాగా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రచురించింది. 200 ఏళ్లనాటి నుంచి ఉన్న కాగితాల ఆధారంగా పట్నాయక్ తన పరిశోధన సాగించారు. ఆమె పరిశోధన ప్రకారం..బ్రిటీష్ వాళ్లు మన దగ్గర నుంచి పన్నులు, వ్యాపారం పేరుతో దోచుకున్నది అక్షరాలా… రూ.3138 లక్షల కోట్లు (45 ట్రిలియన్ డాలర్లు) అని తేల్చారు. ఇదంతా 1765 నుంచి 1938 మధ్యకాలంలో జరిగిందే. ఈ రోజు బ్రిటన్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే ఇది 17 రెట్లు ఎక్కువ అని పట్నాయక్ అంచనా వేశారు.

(45 ట్రిలియన్ డాలర్లురూ.3,13,83,00,00,00,00,000.50)

New Revelations And The English Colonial Rule in India | telugu.newsof9.com

ఈ అంచనాకు ఆమె ఎలా వచ్చారు?

బ్రిటీష్ వాళ్లు వాణిజ్యపరంగానే ఈ మొత్తాన్నీ దోచుకున్నారు. బ్రిటీష్ పాలన రాకపూర్వం బ్రిటన్ మన దగ్గర ఉన్న నూలు వస్త్రాలు, బియ్యాన్నీ కొనుగోలు చేసింది. ఆ రోజుల్లో ఉన్న దాన్ని బట్టి…అందుకు  బదులుగా వెండిని చెల్లించింది. బ్రిటన్ ఏ దేశంతో వాణిజ్యం చేసినా వస్తువులకు బదులుగా వెండిని చెల్లించేది. 1765లో ఈస్టిండియా కంపెనీ ఆసియా ఉప ఖండాన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. భారత వాణిజ్యంపైన బ్రిటన్ ఏకచ్ఛాత్రాధిపత్యం నెలకొన్నది.  స్థూలంగా అదిలా ఉండేది. ఈస్టిండియా కంపెనీ వచ్చిన తర్వాత నుంచి పన్నుల వసూలు మొదలైంది. పన్నుల్లో మూడో వంతు డబ్బును మళ్లీ వాణిజ్య అవసరాల కోసం బ్రిటన్ వినియోగించేది. బ్రిటీష్ వాళ్లు వాడుకునే వస్తువులకు మన దగ్గర వసూలు చేసిన పన్నులనే మనకు చెల్లించేవారన్నమాట. అంటే వాళ్ల సొంత నిధులను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే వస్తువులు బ్రిటన్ దేశానికి తరలించుకుపోయారు. మన దగ్గర తీసుకున్న డబ్బుల్నే మళ్లీ మనకు ఇచ్చేవాళ్లన్నమాట.

ఇది పెద్ద కుంభకోణం. భారీ మొత్తంలో అప్పనంగా దొంగిలించుకుపోయారు. ఏం జరుగుతున్నదన్నది భారతీయులకు తెలిసేది కాదు. పన్నులు వసూలు చేసే వ్యక్తులు వేరుగానూ, వాణిజ్య రంగంలో కొనుగోళ్లు చేసేవారు వేర్వేరుగా ఉండటం వల్ల మన వాళ్లకు ఎలాంటి అనుమానాలూ రాలేదు. రెండూ ఒకరే చేసి ఉంటే అనుమానం వచ్చేది.

భారతదేశం నుంచి తరలించుకుపోయిన వస్తువులను సొంతానికి కొన్నింటిని వాడుకుని, మిగిలిన వాటిని వేరే దేశాలకు ఎగుమతి చేసేవారు. వీటిని ఐరోపా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అక్కడి నుంచి దిగుమతులు చేసుకునేందుకు వారికి మార్గం లభించింది. బ్రిటన్ పారిశ్రామికీకరణకు ఐరన్, కలప చాలా ముఖ్యం. ఇవి ఐరోపా నుంచి వచ్చేవి. బ్రిటన్ పారిశ్రామిక విప్లవంలో భారతదేశం నుంచి దొంగబుద్ధితో దొంగిలించుకుపోయిన సొత్తు పాత్ర చాలానే ఉంది.

మన దేశం నుంచే ఎత్తుకుపోయిన వస్తువుల్ని ఇతర దేశాలకు అమ్మేవాళ్లు. ఇలా ఉచితంగా తరలించుకుపోయిన వస్తువులకు 100 శాతం ధర బ్రిటిన్ వాళ్లకు దక్కేది. పైలాభం కూడా వారి జేబులోకే పోయింది.

1858 వచ్చే సరికి, భారతదేశంలో బ్రిటీష్ వలస పాలన మొదలైంది. పన్నులు-వస్తువుల కొనుగోలు విషయంలో కొత్తగా వచ్చిన వలస పాలకులు కొత్త మెలిక పెట్టారు. ఈస్టిండియా కంపెనీ పాలన తొలగిపోవడంతో భారతదేశంలోని ఉత్పత్తిదారులే ఎకాఎకి విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే వాటి చెల్లింపులు లండన్ లో జరిగేలా ఇంగ్లిషు పాలకులు జాగ్రత్త పడ్డారు.

దీనివల్ల ఏమైంది? భారతదేశం నుంచి వస్తువుల్ని కొనుగోలు చేయాల్సిన వారు బ్రిటీష్ రాజ ముద్ర ఉన్న కౌన్సిల్ బిల్లులను కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇది పేపర్ కరెన్సీ వంటిది. వీటిని వెండి లేదా బంగారం చెల్లించి లండన్ లో మాత్రమే కొనుగోలు చేయాలన్నది నిబంధన. ఈ బిల్లుల కోసం వ్యాపారులు లండన్ లో బంగారం, వెండి చెల్లించేవారు. భారతీయ ఉత్పత్తిదారులకు కౌన్సిల్ బిల్లు కాగితాలను ఇచ్చేవారు. పన్నులు మినహాయించుకుని రూపాయల్లో స్థానిక ఉత్పత్తి దారులకు వలసపాలకులు చెల్లించేవారు. అంతకు ముందు వరకూ పన్నులను నేరుగా వసూలు చేస్తుండేవాళ్లు. అందువల్ల బ్రిటీష్ వాళ్లు చెల్లించింది ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా మోసమే.

చేసిన ఎగుమతులకు భారతీయుల చేతికి రావాల్సిన వెండి, బంగారం లండన్ లోనే ఆగిపోయాయి. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చితే.. వాణిజ్యపరంగా మనకు ఎప్పుడూ చాలినంత మిగులు ఉండేది. 20వ శతాబ్దం తొలి మూడు దశాబ్దాల వరకూ భారత దేశంలో మిగులు ఉండేది. అయితే జాతీయస్థాయి లెక్కల్లో మాత్రం లోటు ఉన్నట్లుగానే చూపించేవారు. ఎందుకంటే… ఎగుమతుల ద్వారా వచ్చిన లాభం బ్రిటన్ దొంగిలించింది.

New Revelations And The English Colonial Rule in India |telugu.newsof9.com

ఈ కల్పిత లోటు వల్లనే… బ్రిటన్.. భారతదేశపు ఆర్ధిక భారాన్ని మోస్తున్నది అన్న వాదన ప్రచారంలోకి వచ్చింది.  వాస్తవం తద్విరుద్ధం. భారతీయ ఉత్పత్తులను బ్రిటన్ ద్వారా మళ్లించి, మన ఉత్పత్తిదారులకు చెందిన లాభాల్ని బ్రిటన్ మింగేసింది. భారతదేశాన్ని బంగారు గుడ్లు పెట్టే బాతులా బ్రిటన్ భావించింది. లోటు కారణంగా… భారతదేశం చేసుకునే దిగుమతులకు బ్రిటన్ నుంచి అప్పు తెచ్చుకోక తప్పదు. అనవసరంగా వలస పాలకులకు భారతీయులు అప్పు ఉన్నట్లుగా అయిపోయింది. దీంతో.. భారతదేశంపై బ్రిటన్ పెత్తనం మరింత పెరిగింది. వలస పాలనపై వచ్చిన తిరుగుబాటును అణచివేసేందుకు కూడా అప్పనంగా వచ్చి పడిన ఈ నిధులనే వినియోగించారన్నది మరో దారుణం. 1840లో చైనా దురాక్రమణ సమయంలో చైనీయులకు నిధులను కూడా అందించారు బ్రిటన్ వలస పాలకులు. 1857 సిపాయిల తిరుగుబాటును కూడా ఈ రకంగానే అణచివేశారు. బ్రిటన్ ఇతర దేశాలతో చేసిన యుద్ధాలకు కూడా భారతీయుల నుంచే పన్నులు వసూలు చేయడం మరో దారుణం. భారత్ మినహా, బ్రిటన్ ఇతర దేశాలతో చేసిన యుద్ధాలకు భారతదేశం నుంచే వసూలు చేశారన్న చేదు నిజాల్ని కూడా ఆమె కనుగొన్నారు.

ఇంతటితో అయిపోలేదు. ఐరోపా, ఐరోపా వలస ప్రభుత్వాలున్నకెనడా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో  పెట్టుబడిదారీ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి కూడా భారతదేశం నుంచి వస్తున్న నిధుల్నే వినియోగించారు. బ్రిటన్ పారిశ్రామిక విప్లవంతోపాటు, పాశ్చాత్య దేశాల్లో జరిగిన పారిశ్రామికీకరణకు కూడా బ్రిటీష్ వలస ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాల నుంచి దోచుకున్న నిధులు ఉపయోగపడ్డాయన్నది మరో కఠిన వాస్తవం.  

బ్రిటీష్ ఇండియాలో 1765 నుంచి 1938 మధ్య కాలంలో నాలుగు ఆర్థిక కాలాలను పట్నాయక్ గుర్తించారు. ఈ నాలుగు కాలాల్లో దోచుకున్న సొమ్మును పట్నాయక్ లెక్కించారు. దానికి 5 శాతం వడ్డీని కలిపారు. ప్రతి కాలం మధ్య భాగం నుంచీ…ప్రస్తుతం వరకూ ఆయన వడ్డీ లెక్కించారు. దీంతో దోచుకున్న మొత్తం 44.6 ట్రిలియన్ డాలర్లుగా ఆమె తేల్చారు. ఇది కూడా ఉదారంగా లెక్కించినదేనని ఆమె అంటారు. భారతదేశంపై బ్రిటన్ మోపిన అప్పుల్ని లెక్కలోకి తీసుకోలేదని అన్నారు.

ఇవన్నీ చూస్తుంటే… కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. జపాన్ లా.. భారతదేశం తన పన్నులనూ, విదేశీ మారక ద్రవ్యాన్ని తన ప్రజల కోసమే ఖర్చు చేసి ఉంటే… చరిత్ర ఎలా ఉండేదో ఊహించండి. ఒక విషయాన్ని చెప్పవచ్చు. ప్రపంచంలోనే భారతదేశం నేడు గొప్ప ఆర్థిక సుసంపన్నదేశంగా ఉండేది. శతాబ్దాల తరబడీ పేదరికంతో భారతమాత కన్నీరు పెట్టుకునేది కాదు.

మన దేశంపై జాలి పడి.. వాళ్లేదో మనపై దయ చూపించారన్న కల్పిత కథకు భిన్నమైన చేదు నిజం ఇపుడు మన కళ్ల ముందు ఉన్నది.

బ్రిటీష్ పాలన వల్ల భారతదేశం అభివృద్ధి చెందిందంటూ సంప్రదాయ చరిత్రకారుడు నెయిల్ ఫెర్గ్యూసన్ చెప్పారు. దీనినే చాలా మంది నిజమని నమ్మారు. ప్రచారం చేశారు. 2014లో బ్రిటన్ లో నిర్వహించిన సర్వేలో.. బ్రిటీష్ వలస పాలన వల్ల ఆయా దేశాలకు మేలు జరిగిందని 50 శాతం మంది నేటికీ  విశ్వసిస్తున్నారు. ఆంగ్లేయుల పాలన ఉన్న 200 సంవత్సరాల్లో భారతదేశపు తలసరి ఆదాయంలో దాదాపు ఎలాంటి పెరుగుదలా నమోదు కాలేదు. 19వ శతాబ్దం చివరి అర్థభాగం చూస్తే భారతదేశం ఆదాయం సగానికి పడిపోయింది. 1870 నుంచి 1920 మధ్యకాలంలో సరాసరి ఆయుర్ధాయం కూడా 5వ వంతుకు పడిపోయింది. సరైన పాలన లేక… అనేక లక్షల మంది అనవసరమైన కరవుతో చనిపోయారు.

ఆంగ్లేయులు భారతదేశాన్ని అభివృద్ధి చేసింది లేదు. నిజానికి భారతదేశమే.. బ్రిటన్ దేశాన్ని అభివృద్ధి చేసింది అన్నది పట్నాయక్ చేసిన పరిశోధన నిరూపిస్తున్నది.

మరిప్పుడు బ్రిటన్ ఏం చేయాలి? క్షమాపణలు చెబితే సరిపోతుందా? ఖచ్చితంగా ఆ పని చేయాలి. నష్టపరిహారం చెల్లించాలా? బహుశా చెల్లించనూవచ్చు. ఇపుడు పట్నాయక్ చెబుతున్న ప్రకారం అంత  డబ్బుల్ని చెల్లించాలంటే.. బ్రిటన్ మొత్తంలో కూడా అంత డబ్బు లేదు. లోగా ఒక పని చేద్దాం. తప్పుడు కథను తుంగలో తొక్కి.. అసలు కథ ఇదిరా బాబూ అని అందరికీ చెబుదాం. మనపైన జాలితో ఆంగ్లేయులు మనల్ని పరిపాలించారన్నది సరికాదనీ, బ్రిటన్ మనల్ని దోచుకోవడానికే వచ్చిందని చెబుదాం. స్టీమ్ ఇంజన్ల వల్ల బ్రిటన్ ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు. బ్రిటన్ వలస పాలన దేశాల నుంచి దోచుకున్న సొమ్ముతో అది జరిగింది.

Other Articles