నో లోక్ సత్తా… చూపిస్తా నా సొంత సత్తా

November 28, 2018 | News Of 9

JD Lakshmi Naryana | telugu.newsof9.com

హైదరాబాదు: లోక్ సత్తా పార్టీతో సంబంధం లేకుండా మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ సొంతంగానే పార్టీని స్థాపించి… ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్సులో నిర్వహించిన సమావేశానికి లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ కూడా హాజరై… లోక్ సత్తా పార్టీ పగ్గాలను స్వీకరించాలని లక్ష్మీనారాయణను కోరారు. అయితే… అందుకు ఆయన వెంటనే స్పందించలేదుకానీ, తర్వాత ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. లోక్ సత్తా పగ్గాలు స్వీకరించి ముందుకెళ్లాలని తొలుత భావించినప్పటికీ… పబ్లిక్ గార్డెన్స్ సమావేశంలో లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణను చూసినా ప్రజలు ఈ సమీకరణంపై మండిపడ్డారు. ఒక విఫలమైన పార్టీతో ఎలా వెళాతారని కొందరు, తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ… ఆ పార్టీ నుంచి ఎంపీ పదవి కోసం ప్రయత్నిస్తున్న జేపీతో ఎలా కలుస్తారని కొందరు సోషల్ మీడియాలో తీవ్రంగానే స్పందించారు.

ముఖ్యంగా లక్ష్మీనారాయణ సామాజిక వర్గం కాపులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది జనసేనను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం రాజ గురువు రామోజీరావు ఆడిస్తున్న నాటకంగా అనుమానించారు. ‘ఈనాడు’ దిన పత్రిక ఒక అడుగు ముందుకేసి.. కొత్త సత్తా అన్న శీర్షికతో వార్తను ప్రచురించి, లక్ష్మీనారాయణకు సారధ్య బాధ్యతలనీ, జేపీ సలహాదారుగా ఉంటారని వెల్లడించింది. జరుగుతున్న విషయాలను లోతుగా అధ్యయనం చేసి, విశ్వసనీయ వర్గాలతో మాట్లాడిన తర్వాత, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న విషయాన్ని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ బయటపెట్టింది. తెలుగుదేశం పార్టీ, లోక్ సత్తాలు.. లక్ష్మీనారాయణను పావుగా వాడుకునే ప్రయత్నం బహిర్గతం కావడంతో కావచ్చు… లేదా లోక్ సత్తాపై ప్రజల్లో ఉన్న అసహ్యం కావచ్చు…మొత్తానికి లక్ష్మీనారాయణ లోక్ సత్తాతో కలిసి అడుగులు వేయరాదని నిర్ణయించుకున్నారు. పూర్వం అనుకున్నట్లుగా సొంత పార్టీనే స్థాపించి తాను నమ్మిన సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు, పార్టీ ప్రారంభ తేదీ, ప్రదేశం వంటి తదితర వివరాలను త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని బుధవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *