మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న విపక్ష పార్టీ నేతల భేటీ

December 10, 2018 | News Of 9

CBN | telugu.newsof9.com

  • ఢిల్లీలో మమతా, ఫరూక్ లను కలిసిన చంద్రబాబు

హైదరాబాద్: నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో భాజపాయేతర కూటమిని ఏర్పాటు చేయడంలో భాగంగా చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సోమవారం ఇందుకు సంబంధించి భాజపాయేతర కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఢిల్లీలో సంయుక్తంగా సమావేశం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాలతో భేటీ అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే చంద్రబాబు ఎకాఎకి మమతా నివాసానికి వెళ్లారు. చంద్రబాబు వెంట అశోక్ గజపతి రాజు, మాగంటి బాబు, రవీంద్రబాబు, సీతారామ లక్ష్మి ఉన్నారు. మొత్తం 14 పార్టీలకు చెందిన భాగస్వామ్య పక్షాలన్నీ ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆసక్తి చూపిస్తున్న పార్టీలన్నింటికీ చంద్రబాబు ఆహ్వానం పంపారు. సోమవారం సాయంత్రం 3.15 నిమిషాలకు పార్లమెంటు ప్రాంగణంలోని అనెక్స్ భవనంలో ఈ సమావేశం జరగనున్నది. కేరళ, పంజాబ్, పుదుచ్చేరి సీఎంలు పినరయి విజయన్, అమరీందర్ సింగ్, నారాయణస్వామి కూడా దీనికి హాజరవుతున్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ ను కూడా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ కూటమికి ఒక పేరు పెట్టాలా లేదా అన్నది కూడా ఈ సమావేశంలోనే నిర్ణయిస్తారు. తర్వాత కూడా మరికొన్ని పార్టీలు ఈ కూటమిలో చేరతాయని భావిస్తున్నారు. ఎస్పీ నేతలు ములాయం, లేదా అఖిలేష్, జనతాదళ్ నేత శరద్ యాదవ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మాయావతి మాత్రం దీనికి హాజరుకావడానికి ఇష్టత చూపలేదని సమాచారం. కాంగ్రెసు తరఫున రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి వస్తున్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *