గూటి చిలక కాదు… గద్దల్ని వేటాడే చిలుక!

November 28, 2018 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

మతం ఉన్నది ఓట్లు గుంజుకోవడానికే అన్నది మీ అభిమతం కావచ్చు. కానీ మీరు బైబిలు ఆరాధకులుగా రోజూ బైబిలు వాక్యాలను వింటూ, చదువుతూ వాటిని మీరు పాటించనప్పుడు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఎలా వస్తుంది చెప్పండి జగన్ గారూ…?

మత్తయి సువార్త ఏడో అధ్యాయంలో ఇలా ఉంది. ‘‘నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?’’ ఈ వాక్యాలను ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి విన్నారో లేదో, దైవ ప్రార్థన సమయంలో విని కూడా మార్చిపోయారో తెలియదు. పవన్ కళ్యాణ్ పై బురద జల్లుతూ ‘‘బాబు గూటి చిలకే పవన్’’ అంటూ సాక్షి పత్రిక ఈ రోజు ఒక కథనాన్ని వండి వార్చింది.

పార్టీ ప్రయోజనాలూ, సొంత ప్రయోజనాలూ కాదనుకుని, ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అనుకునే నేతలు అరుదుగా కనిపించే రోజులివి. 2014 నాటికి జనసేన ఇంకా శైశవదశను దాటలేదు. ఆనాడు రాష్ట్రం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. తదనంతరం తెలుగుదేశం వారి దురాగతాలు పెరిగిపోవడం, అవినీతి పెచ్చరిల్లిపోవడం వంటి కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా జరగడం అందరికీ తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వాన్నీ, ఆ పార్టీ నాయకులనూ తాట తీస్తానంటూ చీల్చి చెండాడిన మరో నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత వరకూ మీకెవరికైనా తారసపడ్డారా?

సొంతంగా పవన్ పార్టీ ప్రారంభించింది… దళిత, కాపు, ఎస్సీ, బీసీ, ముస్లిం బహుజనులకు రాజ్యాధికారంలో వాటా కోసమే. వారికి కూడా ఆర్థిక ఫలాలను అందజేయడానికే. 1970 నుంచి కేవలం రెడ్డి సామాజిక వర్గమే అధికారంలో ఉంది. ఆ తర్వాత ఆత్మగౌరవం పేరుతో వచ్చిన తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గంలోని పెట్టుబడిదారులకే పెద్దపీట వేసింది. కేంద్రంపై యుద్ధం చేసింది. ఇపుడు చంద్రబాబు కూడా ఇదే పని చేస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ లక్ష్యం ఒకటే. తెలుగువారి ప్రయోజనాల ముసుగులో ఉన్నది సొంత ప్రయోజనాలే.

ఇపుడు కూడా ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లుగా తెలుగుదేశం-వైఎస్సార్సీపీ కొట్టుకుంటున్నాయి. మిగిలిన వర్గాలన్నీ కూడా మీకు ఓటు బ్యాంకులుగా మిగిలిపోవడానికి సిద్ధంగా లేవు. కొంతకాలం మీ రెండు సామాజిక వర్గాల దగ్గర మిగిలిన వారు ఊడిగం చేయవచ్చు. కానీ అది శాశ్వతం ఎంత మాత్రం కాబోదు. ఈ కుట్రను కళ్లకు కట్టినట్లు సామాజిక శాస్త్రవేత్తలు అక్షరబద్ధం చేసి పెట్టారు. త్వరలోనే ఈ కథనాలను ‘‘న్యూస్ ఆఫ్ 9’’ ప్రజల దృష్టికి విస్తృత స్థాయిలో తీసుకురానున్నది.

రోజూ… తిట్టిన తిట్టు తిట్టకుండా పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో తెలుగుదేశం పార్టీని చాకిరేవు పెట్టి ఉతికి ఇస్త్రీ చేసి ఆరేస్తున్నారు. ఇంకా తిట్టడం లేదంటూ మీరు సాక్షిలో రాయడం అసంబద్ధంగా ఉంది. రెడ్డి-చౌదరి సామాజిక వర్గాలకు చెందని వారు పార్టీ పెట్టడం, దానిని నడిపించడం, నేల మాళిగల్లో కోట్లాది రూపాయలను నిల్వ చేసుకున్న రెడ్డి-చౌదరి వర్గాలతో పోటీ పడటం అంటే కొండను ఢీకొట్టడమే. అయినా పవన్ కళ్యాణ్ అందుకు సిద్ధమయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టకపోతే.. మరో వందేళ్లు రెడ్డి-చౌదరి వర్గాలే రాజ్యాధికారంలో ఉంటాయి. మీరు రాసిన వార్తలే చదువుకుంటూ దళిత బహుజనులు ఖాళీ డొక్కల్లో కాళ్లు పెట్టుకుని నిద్రపోతారు. నిమ్న వర్గాలన్నీ మీ బూట్ల కింద పడి నలిగిపోతూనే ఉంటాయి. మీరు విసిరే ఎంగిలి మెతుకులతోనే సరిపెట్టుకుంటాయి. బీసీ నేత కృష్ణయ్య బీసీల కోసమే పార్టీ పెడతానని అన్నారే, కానీ పెట్టే ధైర్యం చేయలేకపోయారు. కారణం బీదరికం. 2014లో 38 లక్షలు ఆస్తిని చూపించిన కృష్ణయ్య ఈ ఎన్నికలకు 38 కోట్లు చూపించారని కొందరు సోషల్ మీడియాలో బుగ్గలు నొక్కుకుంటున్నారు. రెడ్డి-చౌదరి వర్గాలే డబ్బులు సంపాదించాలి… బలహీన వర్గాలైన కృష్ణయ్య, మందా కృష్ణమాదిగ వంటి వారు సంపాదించడం మీకు కంటగింపు… కృష్ణమాదిగ డబ్బులు తీసుకున్నారని ఆంధ్రజ్యోతి గతంలో ఒక వార్త ప్రచురించింది. ఇపుడు మీడియా సంస్థలు శుద్ధ పూసలా చెప్పండి. (డబ్బు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదన్నది వేరే సంగతి. అవసరమైనపుడు మీరే ఇతర ఛానెళ్లకు డబ్బులిస్తున్నారు కదా). మీతో పోటీ పడాలంటే.. బీసీలూ, ఎస్సీలూ, కాపులూ డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఒక రోజుకు కృష్ణయ్య కూడా పార్టీ పెట్టే స్థాయికి వస్తారు. రానివ్వండి. అది ఇవ్వాళే కాకపోవచ్చు. రేపు.. ఎల్లుండి. ఎప్పుడైనా. 70 ఏళ్లుగా నడుస్తున్న రెండు సామాజిక వర్గాల ఏకచ్ఛత్రాధిపత్యంపై పోరాటమిది. భూములు కొల్లగొట్టడం, కాంట్రాక్టుల పేరుతో డబ్బులు సంపాదించుకోవడం అన్న విషయంలో మీరు చెప్పాల్సింది ఏమీ లేదు. తెలుగుదేశం, మీ నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నపుడు ఎన్ని భూ కుంభకోణాలు జరిగాయో, ఎంత మంది ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ నేటికీ తిరుగుతున్నారో అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో కాలు పెట్టారో లేదో మీరు కూడా ‘‘నీకు ఇది నాకు ఇది’’ కేసులో అరెస్టయ్యారు. వీటన్నింటికీ మీరు ఇంకా ప్రజలకు సమాధానాలు ఇవ్వలేదు. దొంగకు కూడా మనసు ఉంటుంది. కొన్ని మంచి పనులు తప్పకుండా చేస్తారు. అంత మాత్రం పనులతో ఎవరైనా గొప్ప నేతలుగా కీర్తిని సంపాదించేస్తారా? తెలుగుదేశం పార్టీ హయాంలోగానీ, కాంగ్రెసు పార్టీ హయాంలోగానీ… గత 70 ఏళ్లుగా అభివృద్ధి జరిగివుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? అన్నం పెట్టే రైతు చనిపోవడం అంటే ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ చచ్చినట్లే లెక్క. దీని గురించి చర్చ అవసరం లేదు. భూముల అక్రమాల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని మీరు అడుగుతున్నారు. పవన్ వాళ్లనీ ప్రశ్నిస్తాడు.. మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాడు. డబ్బుంది కదా అనీ రాజకీయ పార్టీలు పెట్టేసుకుని, మీడియా సంస్థల్ని ప్రారంభించేసి… రెడ్డి-చౌదరి వర్గాలు చేస్తున్న ఆగడాలకు కాలం చెల్లే రోజు దగ్గర్లోనే. ఆ రోజు వస్తుంది. 90 శాతం మంది ప్రజలను గాలికి వదిలేసి సొంత జేబులు నింపుకుంటున్న వారికి ప్రజల మద్దతు ఎక్కువకాలం ఉండదన్నది అక్షర సత్యం. మీ ఓపిక గొప్పది. చంద్రబాబు ఓపికా గొప్పదే. ఎవరి కులాల కోసం వారు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం. మీరు వేల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఇందంతా ప్రజా సేవ కోసమేనా? నమ్మమంటారా? అయినా లక్షల, పోనీ వేల కోట్ల రూపాయలు ఉన్నపుడు మీరు టాటా సంస్థల్లా ప్రజా సేవ చేయవచ్చు కదా. క్యాన్సర్ ఆస్పత్రులు కట్టవచ్చు. ఎన్నో స్వచ్ఛంద సేవలు చేయవచ్చు. ఈ దిశగా ఆలోచించారా ఎప్పుడైనా? లేదే… సీఎం కుర్చీ కావాలి. అధికార దాహం తప్ప మరొకటి ఉందా ఇందులో? రెడ్డి-చౌదరి వర్గాలు అన్నం లేకపోయినా ఉంటాయి కానీ, అధికారం లేకపోతే ఉండలేవు. రోజూ మీ పత్రికలోనే కొమ్మినేని శ్రీనివాసరావు రాజకీయ రాస్తున్నారుగా.. రెడ్ల ఆధిపత్యం తాటికాయంత అక్షరాల్లో కనిపించడం లేదూ..? మరి ఒక మీడియా సంస్థగా సామాజిక న్యాయం గురించి ఆలోచించలేదా ఎప్పుడూ? 90 శాతం కులాల పరిస్థితి ఏమిటి? అదేమంటే.. ఇన్ని సీట్లు ఇస్తున్నాం.. అన్ని సీట్లు ఇస్తున్నాం అంటారు. మీరు ఎవరు ఇవ్వటానికి అన్నది బహుజనుల ప్రశ్న. దామాషా ప్రకారం.. ఎవరి వాటా వారికి రావాలి. అలా చూస్తే తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్లు కాదు టిక్కెట్లు ఇవ్వాల్సింది.. పొన్నాల లక్ష్మయ్య వంటి వారికి ఆ అర్హత ఉంటుంది. 90 శాతం కులాలకు 4 శాతం, 6 శాతం వర్గాలే టిక్కెట్లు పంచుతాయా? ఇదెక్కడి న్యాయం? ఇదేం సామాజిక న్యాయం? ప్రశ్నించే గొంతుకలు లేవనేగా?

సర్కారు అవినీతి, నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షంపైనా, నిరంతరం ప్రజల్లోనే గడుపుతున్న ప్రతిపక్ష నేతపైనా విమర్శలు చేస్తూ అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు… పవన్ అని అన్నారు. ఒకరిని ఆకర్షించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు లేనేలేదు. తను చెప్పాల్సింది చెబుతున్నాడు. ముక్కుసూటిగా వెళుతున్నాడు. ఉన్నదేదో మాట్లాడుతున్నాడు. ప్రజల్ని మభ్యపెట్టి ఎంతకాలం సీఎం కుర్చీని బహుజనులకు దూరం చేస్తారు సార్?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి అని అన్నారు…

మీరెప్పుడైనా… కాకినాడ సీ పోర్టు కేవీరావుని తిట్టిపోశారా? చంద్రబాబు అయితే.. వాళ్ల మనిషే. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచీ అధికారులను, ఎన్జీవోలపై పడటం తప్ప.. రాజకీయ అవినీతిని అది ప్రశ్నించిన పాపాన పోలేదు. చిన్నవాళ్లను బలి ఇవ్వడం… పెద్దవాళ్లు పండగ చేసుకోవడం. ఇదేం దమన నీతి? వంతాడ లాటిరైటు గనుల్లో పది వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నారు. దాని గురించి మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడారా? మాట్లాడలేరు. మాట్లాడితే… ఓబుళాపురం చరిత్ర ముందుకొస్తుంది. నాన్నగారి హయాములో గాలి జనార్ధనరెడ్డి ఏ స్థాయిలో సంపాదించారో మీకు తెలియనిది కాదు. ఒక్క మాట చెప్పండి. ప్రతిపక్ష నేత అంటే దాదాపు ముఖ్యమంత్రి స్థాయి పదవి. ప్రజల కోసం ఎన్నో చేయవచ్చు. పోరాటాలు చేయవచ్చు. ఎమ్మెల్యేలు లేకపోయినా, ఎంపీలు లేకపోయినా మీరు ఒక్కరే కదనరంగంలో నిలబడి పోరాటం చేయవచ్చు. ఏం చేశారు? ఒక్క ఉదాహరణ ఇవ్వండి చాలు. దీనిని పవన్ ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? మీ పైన అవినీతి కేసులున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే నైతిక బలం ఉండాలి. పవన్ చెప్పింది నిజమే కదా. ఇవ్వాళ చంద్రబాబు కూడా నరేంద్రమోడీకి ఎందుకు భయపడుతున్నారు? అరవింద్ కేజ్రీవాల్ ఎవరికైనా భయపడుతున్నాడా? లేదే… అదీ నైతికబలం అంటే. ప్రజలకు నాయకత్వం వహించాలనుకున్న నాయకుడు ఎవరైనా వారికి కావాల్సింది నైతిక బలం. అది మీకు లేదు. అందుకే మీరు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన వ్యక్తికి కేసులు ఉంటే వాళ్లేం పోరాటం చేస్తారు? ఇవ్వాళ రేవంత్ రెడ్డిపైనా కేసులున్నాయి. నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేను కొనడానికి డబ్బులిచ్చిన వ్యక్తి రేపు తెలంగాణలో సీఎం కావాలని తలపోస్తున్నారు. ఇది ఏ రకమైన నీతి? అమెరికా అధ్యక్షుడు అబద్ధం చెప్పవచ్చా అని అమెరికాలో పెద్ద చర్చే జరిగింది. మనం ఎక్కడున్నాం? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా చంద్రబాబు, రేవంత్ ఇంకా ప్రజా జీవనంలో ఉండటం ఏ రకమైన నీతి? ఇది మరింత ప్రమాదకరం కాదా? తెలుగుదేశం వాళ్లు అడ్డంగా దోచుకుంటుంటే.. మీరు ఏం మాట్లాడగలరు? నిజానికి.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత 70 ఏళ్లుగా ‘‘రెడ్డి-చౌదరి’’ ప్రభుత్వాలు దోచుకున్నది ఎంతో చెప్పాలంటే భారత ప్రభుత్వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) దిగి రావాలి. లెక్క వాళ్లకు కూడా సాధ్యం కాకపోవచ్చు. ఒప్పుకుంటారా?

పవన్‌ విమర్శల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మదిలో తలెత్తుతున్నాయి.. అని అన్నారు.

ఏం ఆశించి పవన్ మిమ్మల్ని విమర్శిస్తారు చెప్పండి? మీరు అక్రమంగా సంపాదించిన దాన్లో వాటా అడుగుతాడని మీకు భయమా? తనకు సంపాదించాలన్న ఆశలు లేవు. అమరావతిని మింగేసి… మనవడి పేరున వేల కోట్లు కూడబెట్టాలని చంద్రబాబులా పవన్ కళ్యాణ్ అనుకోవడం లేదు. మీరు ఇస్తానంటే చంద్రబాబు తీసుకుంటాడు. అది నిజం. ఇపుడు ఏ పార్టీ చూసినా… సరుకుల చిట్టాలా బోలెడు హామీలు గుప్పిస్తున్నాయి. ప్రజల సొమ్మే కదా… పెళ్లిళ్లు చేస్తామంటున్నాయి. రేపన్న రోజున శోభనాలు కూడా దగ్గరుండి జరిపిస్తారేమో తెలియదు. ఎవడబ్బ సొమ్మని.. పార్టీలు ఇలా హామీలు గుప్పిస్తున్నాయి? రేపన్న రోజున ఫ్రీగా కార్లు కూడా ఇస్తానంటాయి. రెడ్డి-చౌదరి పార్టీలు ఏమైనా ఇచ్చేస్తాయి జగన్ గారూ. యముడు డైలాగ్.. ఏదైనా కోరుకో ఆ ఒక్కటీ తప్ప. అదేనండీ… సీఎం కుర్చీ!! తెలంగాణలో ఉత్తమ్ రెడ్డి కోరికా అదే. జానారెడ్డి కోరికా అదే… రేవంత్ రెడ్డి కోరికా అదే కదా. నాన్నగారిలా ఢిల్లీకి సూట్ కేసులు ఇస్తే.. సీఎం కుర్చీ ఎవరు తీసుకున్నా కాంగ్రెసుకు ఫర్వాలేదు. అదో దొంగలపార్టీ.

సీఎం చంద్రబాబు సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టడంపై నోరు మెదపని పవన్‌ కల్యాణ్‌ ప్రతి పక్షనేతపై విమర్శలు చేయడాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ముక్కున వేలేసుకుంటున్నారా? లేక.. తెలుగుదేశం, వైఎస్సార్సీపీల అవినీతి చూసి ముక్కులు మూసుకుంటున్నారా? సుజనా, రమేష్ వగైరా ‘వెంకన్న’ చౌదరి అని శ్రీవారిని సంబోధించిన మురళీమోహనుడు.. అందరి పనీ నరేంద్రమోడీ చూసుకుంటున్నాడు కదా. మళ్లీ మనం ఎందుకు వేలు పెట్టడం చెప్పండి. మీ పత్రికలోనే తాటికాయంత అక్షరాలతో రూ.6,000 కోట్ల వార్త వేశారుగా. చర్విత చర్వణం ఎందుకు? పవన్ కళ్యాణ్ బాబు గూటి చిలక కాదు.. గెద్దల్ని వేటాడే చిలుక! గద్దల్ని వేటాడే చిలుక, రాజకీయ రాబందులను వేటాడే చిలుక అని త్వరలోనే అందరికీ తెలుస్తుంది.

ఒక్క సీటుకూ పోటీ చేయకుండా సంపూర్ణ మద్దతు అని అన్నారు కదా…. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తే తెలుగుదేశం పార్టీకి జనసేన పిల్లపార్టీగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు అని రాశారు కదా.

జనసేన పిల్ల పార్టీనో… అక్రమార్కుల పాలిట పిడుగు పార్టీనో ఎన్నికల గోదాలో తెలుస్తుంది. ఇపుడు కూకట్ పల్లిలో తెలుగుదేశం డబ్బులు విసిరేస్తోంది. రిగ్గింగు పాత పాట. ఇపుడు బలహీన వర్గాలను కొంటున్నది. డబ్బు పారేస్తే.. ఓట్లు వస్తాయన్నది ఆ పార్టీ ధీమా. ఎవరిధీమా అయినా అదే కదా. ఈ ఎన్నికలే కానక్కర్లేదు. 2024 కూడా కావచ్చు. ఆ తర్వాత.. ఆ తర్వాత…. ప్రజాభిప్రాయం అంతా ఒకటే అయినపుడు.. ప్రజలంతా ఒకే గొడుగు కిందకు వచ్చినపుడు… అది జనసంద్రం అవుతుంది. పెను ఉప్పెన అవుతుంది. 70 ఏళ్ల ఏకచ్ఛత్రాధిపత్యానికి ముగింపు అవుతుంది. అది జనసేనే చేస్తుందా? లేదా మరో పార్టీ చేస్తుందా? లేదా అరబ్ స్ప్రింగ్ లా ప్రజలే చరమగీతం పాడతారా? కాలం చెబుతుంది. రెండు ముక్కల్లో ముగిద్దాం. పవన్ ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాడు. ధర్మో రక్షితి రక్షిత: అని. తప్పు చేసిన వాడు ఆ పాప భారాన్ని మోయాల్సిందే. అది జగన్ కావచ్చు. పవన్ కావచ్చు. చంద్రబాబు కావచ్చు… !! రేపన్న రోజు ఎక్కడో ఒక దగ్గర సమాధానం చెప్పుకోక తప్పదు. చేసిన పాపాలు తిరిగి మన దగ్గరకే వస్తాయి. కోట్లు సంపాదించి చివరికి జైల్లో ఉండటం అవసరమా అని పవన్ మొన్న విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో అన్నాడు. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రను చూసి రేపు ఎలా ఉండాలన్నది కొత్త తరం నేర్చుకుంటున్నది. మార్పు అనివార్యం. ఎప్పటికీ మారని సత్యం కూడా అదే !!

‘‘నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?’’ – మత్తయి సువార్త.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *