కోల్డు బ్లడెడ్… హాట్ బ్లడెడ్… యల్లో బ్లడెడ్!!

March 27, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బొక్కబోర్లా పడబోయేది తెలుగుదేశం పార్టీనే కాబట్టి.. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టేందుకు తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్న అస్త్రం ఏమిటి? ప్లాను చేసుకున్నట్లుగా ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలు ఎలాంటి ఫలితాలనూ ఇవ్వకపోగా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. మరి ఈ పరిస్థితిలో బాబు చేతిలో ఉన్న ఆఖరి అస్త్రం ఏమిటి? సెంటిమెంటు.. ఈ కారణంగానే అనేక రోజులుగా తన ప్రసంగాల్లో చంద్రబాబు దాని పైనే గట్టిగా ఫోకస్ పెట్టారుగానీ… ప్రజల నుంచి ఎలాంటి స్పందనా కనిపించడం లేదు.

చంద్రబాబు హైద్రాబాద్ లో కాలుపెట్టిన తర్వాత 2018 తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంటు విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. తెలంగాణ సీఎంకు బాగానే ఉపకరించడం… తెరాస పార్టీకి తిరుగులేని మెజారిటీ రావడం జరిగిపోయింది. తెలంగాణ సీఎం కూడా రిటర్ను గిఫ్టు ఇస్తానంటూ ప్రకటించారు కానీ ఇంత వరకూ అది జరగలేదు. మరి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి ఇంత వరకూ ఒక “గట్టి” ప్రకటన కూడా చేయలేదు. తెలంగాణ గడ్డపై నుంచి తిట్టినా పెద్దగా ఫలితం ఉండదు. కానీ కేసీఆర్ ఏ విజయవాడకో వెళ్లి బాబును ఉతికి ఆరేస్తే… అది బాబుకు సానుభూతిగా మారి ఓట్లు రాల్చవచ్చు. కానీ కేసీఆర్ ఎందుకో ఇంత వరకూ స్పందించ లేదు. జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారుగానీ… వారి వల్ల పెద్దగా టీడీపీకి ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. తెరాస ఆంధ్రకు వచ్చినా.. వైసీపీ జగన్ తరఫునే రావాలి. కానీ అలా రావడానికి వైసీపీ ఒప్పుకోకపోవచ్చు. తెర వెనుక బంధమే మంచిదని వైసీపీ భావిస్తున్నది.

వైసీపీ విముఖత చూపిస్తే… మరి తెరాస అధినేత కేసీఆర్ ఆంద్రాకు ఎలా వస్తారన్నదే ప్రశ్న. ఆయన ఏ వ్యూహాన్ని అనుసరిస్తారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న.

జనసేన విజయావకాశాలను దెబ్బతీసేందుకు ఇటు తెలుగుదేశం, అటు వైసీపీలు రెండూ కలిసి పని చేస్తున్నాయని అనిపిస్తుంది. వైసీపీని ఎదుర్కొనే ధైర్యంలేకనే… తెలుగుదేశం ఎంతసేపూ కేసీఆర్ పాట పాడుతున్నదనేది సుస్పష్టం. వైసీపీకీ తెరాస లేదా భాజపాతో కూడా సంబంధాలు ఉన్నాయన్న అంశం చుట్టూనే చంద్రబాబు ప్రసంగాలు సాగుతున్నాయి.

ఇలా రెండు పార్టీలూ ఒకవైపు కుమ్ములాడుకుంటూ… మూడో పక్షంగా ఉన్న జనసేనను దెబ్బకొట్టేందుకు ఈ రెండు పార్టీలూ కూడబలుక్కున్నట్లు పని చేస్తున్నాయి. పవన్ పై దాడి చేయకుండా తెలుగుదేశం మౌనంగా ఉండటానికి కారణం ఇదే. జగన్ అధికారంలోకి రాకూడదన్నది టీడీపీ ఏకైక లక్ష్యం.

పవన్ విషయంలో తెలుగుదేశం మౌనంగా ఉండటానికి కారణం కూడా దురుద్దేశమే.

మొదట జనసేనతో కలుద్దామని తెలుగుదేశం ప్రయత్నించింది. టీజీ వెంకటేశ్ వంటివారు చిల్లర ప్రయత్నాలు చేసినపుడే.. పవన్ గడ్డిపెట్టడంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది.

తెలుగుదేశం ఎలాగూ బలహీనమైంది. 2014లోనే అధికారంలోకి వచ్చేస్తున్నామనుకున్న జగన్ ఆశలపై పవన్ నీళ్లు చల్లాడు. తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడంతో అధికారం జగన్ చేయి జారిపోయింది. ఈసారి అయినా… సీఎం కుర్చీ దక్కుతుందేమో అని 360 డిగ్రీల్లో అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నా… పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగిపోయాడు. ఇపుడు మళ్లీ అధికారం చేజారిపోతుందేమోనన్నది జగన్ భయం. అందుకే… టీడీపీ పార్టనర్ అంటూ జగన్, సాక్షి పేపర్ జనసేనపై దుమ్మెత్తిపోస్తున్నాయి. విచిత్రం ఏమంటే… సీఎం పోస్టు కోసం జగన్, చంద్రబాబులే బరిలో ఉన్నట్లు ‘‘సాక్షి’’ రాస్తున్నది. మీ కుటుబాల్లోనే రాజకీయాలు ఉండాలా? ఎవరూ రాకూడదా అంటూ పవన్ నిప్పులు చెరుగుతున్నారు. పవన్ అంటున్నది నిజమే కదా!!

ఆయన అనుకున్నట్లుగానే జగన్, చంద్రబాబులు చేస్తున్న కుళ్లు రాజకీయాలకంటే… పవన్ కళ్యాణ్ చేస్తున్న స్వచ్ఛమైన రాజకీయాలే మంచిది అన్న భావనకు ప్రజలు వచ్చేశారు.

తెలుగుదేశం, వైసీపీలు అధికారం కోసం… రక్తాలు కారేట్లు కొట్టేసుకుంటున్నాయి. హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అధికారం కోసం తెర వెనుక ఎవరో… ఇవన్నీ నడిపిస్తున్నట్లే అనిపిస్తున్నది. ఈ హత్యా రాజకీయాల కంటే జనసేన ఎంతో నయమన్నది నిజం. నిన్న పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట చెప్పారు. తెలుగుదేశం 2 లక్షల కోట్లు తినేసిందని వైసీపీ పుస్తకం వేసిందనీ, వైఎస్ హయాంలో 2 లక్షల కోట్లు తినేశారని తెలుగుదేశం పుస్తకం వేసిందనీ… ఇవన్నీ చూస్తే ఇద్దరూ దొంగలనే విషయం అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారాంతా… వైసీపీలో చేరిపోతున్నారు. ఎవరు అధికారంలో ఉన్నారు అన్నదాని కన్నా… వారికి రేపు కాంట్రాక్టలు తెచ్చుకోవడం ముఖ్యం. డబ్బులేని రాజకీయం వృధా అన్నది ఆ సామాజిక వర్గపు నిశ్చితాభిప్రాయం. అందులో సందేహం లేదు. అందుకే… అనేక మంది వచ్చి వైసీపీలో చేరిపోయారు. ఒక వేళ జగన్ సీఎం అయితే… అన్న భయంతోనే అనేక మంది ఇపుడు జై జగన్ అంటున్నారు. కాంట్రాక్టర్లను నేతలుగా చూడటానికి కూడా పవన్ ఇష్టపడటం లేదు.

ఒకవేళ జగన్, చంద్రబాబు కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే పరిస్థితి వచ్చేస్తే… ఏం జరుగుతుందో తెలుసా? పవన్ గేట్లు తీస్తే… మొత్తం కట్టకట్టుకుని జనసేనకు వచ్చేస్తారు. అందుకు క్షణాల్లో రంగం కూడా సిద్ధం చేసేసుకుంటారు. పవన్ ను పొగుడుతూ పత్రికల్లో, టీవీల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసుకుంటారు. నిజానికి జగన్ దగ్గరకు వెళ్లాలని అనుకోలేదు గానీ… గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయని అందంగా చెప్పేసి తప్పేసుకుంటారు.

ఇదంతా డబ్బులెక్కే. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిలో… సగం మంది వైసీపీలో ఉంటారు. సగం మంది టీడీపీలో ఉంటారు. టీడీపీ వచ్చినా వారి పనులు అయిపోతాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చినా పనులు అయిపోతాయి.

ఇలా వైసీపీకి వచ్చిన చంద్రబాబు సామాజిక వర్గం వారిని ‘‘సాక్షి’’లో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. చంద్రబాబు బంధువు నార్నే శ్రీనివాసరావును ఇంటర్వ్యూ చేస్తూ…‘‘అవునా… చంద్రబాబుకీ, ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడికీ పడదా…? అరే, మీరు భలే సంచలన విషయాలు చెబుతున్నారే?’’ అంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు. అందరికీ అన్నీ తెలుసు. ప్రజల ముందు రక్తికట్టించే ఒక నాటకం.

చంద్రబాబు దాష్టీకాలు తట్టుకోలేక వైసీపీలోకి వస్తున్నట్లు ఒక డ్రామానీ, లేదా ఒక భ్రమను సృష్టిస్తున్నారు. ఎప్పటికీ వారు చంద్రబాబుకు వ్యతిరేకం కానే కాదు. ఆ సామాజిక వర్గం ప్రగతి కోసమే తెలుగుదేశం పార్టీ 1983 నుంచి అనుక్షణం పని చేసింది. పనులు చేసి పెట్టింది.

వాళ్లు వైసీపీలోకి వచ్చారని జగన్ అనుకుంటున్నారు. కానీ నిజం ఏమంటే… వైసీపీనే వారి చేతుల్లోకి వెళుతున్నది.

రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు కోసమే కదా… పేరు టీడీపీ అయితే ఏమిటి? వైసీపీ అయితే ఏమిటి? రంగులూ జండాలూ తేడా అంతేగా..!!

మీ మెదడులో మేమే తిష్ఠవేస్తాం

అసలు కామెడీ ఏమంటే… తెలుగు ప్రజలు ప్రతిరోజూ టీవీలోగానీ, పత్రికల్లోగానీ టామ్ అండ్ జెర్రీ సీరియల్ లా… మీరు ఆ రెండు సామాజిక వర్గాల కుయుక్తులూ, కుట్రలూ, వారి బాధలూ, మోసాలూ… వింటూ మీరు వారి గురించే ఆలోచిస్తూ ఉండాలి. మూడో వారు మీ మనసులోకి కూడా రాకూడదు. చంద్రబాబు గురించీ మీరే బాధపడాలి…. చంద్రబాబును వ్యతిరేకించి వైసీపీలోకి వచ్చిన మోహన్ బాబు గురించి కూడా మీరే జాలి పడాలి. బాధపడాలి. విచిత్రం ఏమంటే… హీరోలూ వాళ్లే… విలన్లు కూడా వాళ్లే. మధ్యలో రిఫరీలు (జర్నలిస్టులు) కూడా వాళ్లే. ఇదీ తెలుగు సినిమాని మించిన కథ… పైగా ఉచిత ప్రదర్శన. ప్రజల మెదళ్లు కూడా పూర్తిగా వారి గుత్తాధిపత్యంలోనే చలామణీ అవుతున్నాయి.

కొద్దో గొప్పో… మూడో వారి గురించి ఆలోచించే సందు ఉన్నా దాన్ని కూడా మూసేయడానికి ‘‘సురాజ్య’’ యాత్ర పేరుతో జయ ప్రకాష్ నారాయణను కాలేజీల్లో తిప్పుతున్నారు. ‘‘ఒక రెడ్డికో, కమ్మకో, కాపుకో మీరు ఓటేయాలి’’ అంతేగా అంటూ ఆయన కుర్రాళ్ల చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ మాట జయప్రకాష్ నారాయణ గారు అనలేదు. ఇప్పుడు చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకంలేదు కాబట్టి… పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఒకటే అంటూ అందర్నీ పులుసులో కలిపేయడం. ఎంత దుర్మార్గం నడుస్తోంది తెలుగు నాట. జయ ప్రకాష్ నారాయణ… ప్రత్యామ్నాయం కాదు అని ప్రజలు ఆయన్ని ఎప్పుడో వదిలేశారు. అందరినీ వెధవలని చెప్పడం ద్వారా ఎవరికి ఓటేయమని చెబుతున్నట్లు? పరోక్షంగా చంద్రబాబే బెటర్ అనుకోవాలని జయ ప్రకాష్ నారాయణ భావమా…? పవన్ కళ్యాణ్ నేను కాపు కాదు మొర్రో అంటే… స్వయంగా జయ ప్రకాష్ నారాయణ అలా అనడంలో కుట్ర లేదా? నిజానికి తనకీ కులం లేదంటూ జయప్రకాష్ నారాయణ చెప్పడమే ఒక కుట్ర.

ఈ కుట్రలూ కుతంత్రాలూ తెలియని కొందరు యువత… ‘‘సార్ మీరు లక్ష సంవత్సరాలు బతికాలి’’ అంటూ ఈ మాజీ ఐఏఎస్ అధికారిని కోరుకుంటూ… యూట్యూబు కామెంట్లలో పెడుతున్నారు. జనసేన బలం కాలేజీ యువత. వారిని తికమకపెట్టేయాలి. అదీ లక్ష్యం. ఈ వయసులో జయ ప్రకాష్ నారాయణ కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూచొని పుస్తకాలు చదువకోవచ్చు కదా. ఇంత కష్టం ఎందుకో ఆయనకు…?

మోసంతో ప్రజల్ని వంచించి… తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండిపోవాలని కొందరు ముసుగు వీరుల్ని ప్రజలపై వదులుతున్నది. అందుకోసం కొందరిని తయారు చేసి పెట్టుకున్నది. ఈ ముసుగు వీరుల్లో శాస్త్రవేత్తలు, సాఫ్ట్ వేరు ఇంజినీర్లు, ఎన్నారైలు, టెలికం, విద్యుత్తు రంగ నిపుణులు, న్యాయరంగానికి చెందిన వారు, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న వారూ, రిటైరైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మీడియా అధిపతులూ ఉంటారు.

జంతువులను కోల్డు బ్లడెడ్ అనీ, హాట్ బ్లడెడ్ అనీ విభజిస్తారు. అలా వీళ్లను ‘‘యల్లో బ్లడెడ్’’ అని అనాల్సి ఉంటుంది.

వ్యవస్థీకృతమైన రాజకీయ మాఫియా అంటే ఇదే కదా…!!

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *