అసత్యాలే ఆహారం.. అబద్ధాలే ఇంధనం… 360 డిగ్రీలూ… గ్రేట్, గ్రేట్ !!

November 28, 2018 | News Of 9


పాఠకులు చదివించే వార్తలు రాయడం, ప్రజలకు పని కొచ్చే వార్తలు రాయడం గొప్ప విద్య. అది మన తెలుగు పాఠకులకు పరిచయం లేని వ్యవహారం. ఉదయం పత్రిక ఉన్నంత వరకూ పాత్రికేయం బతికింది. ఆ తర్వాత దానితోపాటే అది కూడా కాలం చేసింది. ఒకప్పుడు వార పత్రికలూ, పక్ష పత్రికలూ లెక్కకు మిక్కిలి వచ్చేవి. కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాటికీ కాలం చెల్లింది. దీంతో వెబ్ సైట్లు ఇబ్బడిముబ్బడిగా వచ్చేశాయి. రాయడానికి మంచి జర్నలిస్టులు దొరక్క… దారికినా వారికి జీతాలు ఇవ్వలేక… ఏదో ఒకలా నెట్టుకురావాలి.
ఇందుకోసం అవి ఎంచుకున్న మార్గం… సెలబ్రీటీల మీద లేనిపోనివి రాయడం. పాశ్చాత్యదేశాల్లో లక్షలకు లక్షలు చెల్లించి సెలబ్రిటీలను ఫోటోలు తీసి.. ప్రచురించి పాఠకుల సంఖ్యను పెంచుకుని సొమ్ము చేసుకునేవి. వీటి వల్లనే యల్లో జర్నలిజం అన్న పేరు వచ్చింది. ఇక్కడ మన వెబ్ సైట్లకు తేరగా దొరికింది… సినిమా నటులు. ముఖ్యంగా ఎక్కువ మంది అభిమానులున్న పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కు జలుబు చేసింది.. అని వార్త రాసినా ఆందోళన పడిపోయే అభిమానులు ఉంటారు. సరిగ్గా 360 డిగ్రీల్లో కొన్ని వెబ్ సైట్లు ఇలాంటి చెత్తనే ఎత్తి వార్తల రూపంలో ప్రజల నెత్తిన గుమ్మరిస్తున్నాయి. ‘‘గ్రేట్’’ అంటూ వడ్డించే వెబ్ సైట్లూ ఉన్నాయి. సెలబ్రిటీలను అనుమానించేలా, తిట్టేలా వార్తలు రాసి.. పాపం పొట్టపోసుకుంటున్నాయి. పవన్ ను ఏమైనా అంటే.. ఆయన అభిమానులు రెచ్చిపోయి.. బూతులు తిడుతూ ఆయా సైట్లలో రాస్తుంటారు. ఈ ట్రాఫిక్ చాలు వాళ్లు నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి.
ఒక రకంగా ఇది శవాల మీద డబ్బులు ఏరుకోవడంలాంటిదే తప్ప మరొకటి కాదు. సినిమా నటుల అభిమానులకు ఈ సంగతులన్నీ తెలియవు. యూ ట్యూబులో కొన్ని వీడియోలు చేస్తుంటారు. ‘‘ఈ వీడియో చూస్తే మీరు కళ్లు తిరిగిపడిపోవడం ఖాయం’’ అని రాస్తారు. చూస్తే కళ్లు తిరిగి పడిపోకపోవడంతో వాళ్ళు మళ్లీ రారు. అయినా ఇలా చేస్తే.. జనాన్ని బోల్తా కొట్టించవచ్చు. కొంచెం చిల్లర డబ్బులు ఏరుకోవచ్చు. అనకొండను మింగేసిన చిలుక అని శీర్షిక పెట్టండి. అయినా చూసే జనం ఉంటారు. అది చాలు… చిల్లర ఏరుకోవడానికి. విచిత్రం ఏమంటే..ఇలాంటి సైట్లను డబ్బున్న వాళ్లు కూడా పెట్టడం విచిత్రంగా ఉంది. టీవీల్లో కూడా అదే తీరు. ‘‘నాగపాము పడగపై నాగమణి ఉంటుందా?’’ ఇది ఒక టీవీ ఛానెల్ కు సాయంకాలపు చర్చా కార్యక్రమం. జన విజ్ఞాన‌ వేదిక వారు వచ్చి అబ్బే అదేం లేదండి అని చెబుతారు. ఎంతకాలం ఈ శవ పాత్రికేయం? బీబీసీ టీవీకి ఒక స్లోగన్ ఉంది. అదేమంటే.. డెలివరింగ్ వరల్డ్ టు యూకే, డెలివరింగ్ యూకే టు వరల్డ్ అని. మనిషి విజ్ఞానాన్ని పెంచుతూ.. సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం. రోజూ పత్రికల్లో అదే నాయకుల బూతులు చదువుకుంటాం.
టీవీల్లో సాయంత్రం అవే బూతులు వింటాం. డబ్బులు ఖర్చు చేసి… తెలుగు ప్రజలకు పంచేది ఇదా? టీవీలో మాట్లాడుతూ.. ‘‘లం…’’ అనే బూతు మాట వాడిన వాడిని జర్నలిస్టు అని అంటామా? ఆ టీవీ… మీడియా అని పేరుతో పిలిచే హక్కును ఇంకా కలిగి ఉందా? నేడున్న రాజకీయ పార్టీల మాదిరిగానే మీడియా కూడా తయారైంది. ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ప్రజలు ఆదరించకపోతే ఏ ఉత్పత్తి అయినా మార్కెటు నుంచి మాయం కావాలి. కానీ టీవీలూ, పత్రికలూ అలా కావడం లేదు. ఎందుకంటే.. వాటిని పోషించేందుకు చీకటి మహారాజులు ఉండనే ఉన్నారు. పార్టీ ప్రాభవం తగ్గింది అంటే దాని అర్థం ఏమిటి? ప్రజలు ఆదరించడం లేదనే కదా. తెలుగుదేశం ఏం చేసింది? ఊరుకోలేదు.. బద్ధ శత్రువు కాంగ్రెసుతో కలిసిపోయింది. అంటే జనంతో సంబంధంలేకుండా నిస్సిగ్గుగా పార్టీలు అదే పని చేస్తున్నాయి. అందుకుని పార్టీలకుగానీ, మీడియాకు గానీ ప్రజలతో సంబంధం లేదు. ప్రజల మద్దతు, నమ్మకాలతో పని లేదు. ఇదీ సంగతి. ఇంతకంటే ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకోవడం అంత ఉత్తమం లేదు. పార్టీల విషయంలో ఛాయిస్ లేదు. కాదంటారా?
గ్రాఫిక్ కర్టసీ: icpfj.com

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *