డిసెంబరు 2 నుంచి పవన్ అనంతపురం పోరాట యాత్ర

November 30, 2018 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

తూర్పు గోదావరి జిల్లాలో పోరాట యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబరు 2వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలి రోజు జరిగే భారీ కవాతుతో అనంతపురం జిల్లా పోరాట యాత్ర ప్రారంభం అవుతుంది. రాయలసీమలో ఉన్న కరువు పరిస్థితులపై పవన్ ప్రముఖంగా దృష్టి సారించే అవకాశం ఉంది. రాయలసీమ నుంచి అనేక మంది రైతులు బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరువనంతపురం వంటి ప్రాంతాలకు వలస వెళుతున్న విషయం ఆయన దృష్టిలో ఉంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న కరవు పరిస్థితులపై జనసేన టీమ్ సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రస్తుతం రాయలసీమలో కరవు లేదని, ప్రభుత్వం కరవును తగ్గించేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారుగానీ, వాస్తవం వేరుగా ఉంది. ప్రస్తుతం పంట దిగుబడి సరిగా లేకపోవడం, గిట్టుబాటు ధరలేకపోవడం వంటి కారణాల వల్ల పంటను వీధుల్లో పారవేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ టమాటాలను తెచ్చి రోడ్లపైన పారబోశారు. రైతులు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. రైతుల్ని ఆదుకోవడంలో వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. యజమానులు వలస వెళ్లిపోవడంతో ఇళ్లలో మహిళలు, పిల్లలు మాత్రమే ఉంటున్నారు. కరవుపై కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపి.. రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

దీనిపైనే పవన్ కళ్యాణ్ దృష్టిపెట్టనున్నారు. ఉద్ధానంలో బాధితులను ఎలా అయితే ఆదుకున్నారో, అదే స్థాయిలో రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఉన్న కరవు సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది నెలలపాటు పవన్.. రాయలసీమ జిల్లాలకే పరిమితం అవుతారు. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *