వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ !!

December 6, 2018 | News Of 9

Pawan gives warning to YSRCP Leaders !! | news of 9

  • అసెంబ్లీకి వెళ్లమంటే… నా పెళ్లిళ్ల సంగతి ఎందుకు?
  • విధానాల గురించి మాట్లాడమంటూ సూచించిన పవన్
  • తీరుమారకపోతే.. మీ జీవితాలను రోడ్డుకు ఈడుస్తా..

గుంతకల్లు: విధానాల గురించి తాను విమర్శలు చేస్తుంటే… ప్రతిపక్ష నేత జగన్ వ్యక్తిగత అంశాలపై తనను విమర్శిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే… తాను అందరి జీవితాలనూ రోడ్డున పెడతానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన పోరాట యాత్రలో ఆయన మాట్లాడుతూ… వైసీపీ నేతలు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, తాను కూడా అలా మాట్లాడగలనని, అయితే అందుకు తన సంస్కారం అడ్డువస్తోందని అన్నారు. ‘‘మాట్లాడితే పెళ్లిళ్లు చేసుకున్నానని వైసీపీ నేతలు అంటున్నారు. నా పెళ్లిళ్ల వల్లనే రాష్ట్ర విభజన జరిగింది? నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగింది… నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైల్లో ఉన్నాడు? ఏం మాట్లాడతారయ్యా మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా? తమాషాలుగా ఉందా?’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విధానాల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని, జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే వెళ్లాలి అని మాత్రమే చెబుతున్నానని, ప్రజల సమస్యల గురించి పోరాడమనే చెబుతున్నాని అన్నారు.

 

విజయమ్మగారిపై అభాండాలు వేస్తే ఖండించాను 

జగన్ అమ్మ గారే చేయించారని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అయినా నేను దానిని ఖండించాను. జగన్ వాళ్ల అమ్మ విజయమ్మ గారిని గౌరవించాను. తెలుగుదేశం నేతలనే తిట్టాను. నిజాన్ని నిజంగానే మాట్లాడతామని, వైసీపీ నేతలు దీనిని దృష్టిలో పెట్టుకుని విధానాల గురించి మాత్రమే మాట్లాడతే బాగుంటుందని చెప్పారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, ప్రతిపక్ష నేత జగన్ గానీ.. ఇద్దరిలో ఎవరూ గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లును తెరిపించలేకపోయారని అన్నారు. స్పిన్నింగ్ మిల్లును తెరిపిస్తామని, లేదా దానిని ఇతర అవసరాలకు వాడుకుని మిల్లు కార్మికులను ఆదుకుంటామని పవన్ అన్నారు. గుంతకల్లును పారిశ్రామిక ప్రాంతంగా తయారు చేస్తామని యువతకు హామీ ఇచ్చారు. ఎవరూ వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా గుంతకల్లును తీర్చిదిద్దుకుందామని అన్నారు.

 

ఎస్ఈజెడ్ లలో మిగులు భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు రైతులకు అవకాశం ఇవ్వాలని, ఇందుకు జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుందామని అన్నారు. పరిస్థితి మారాలని, పట్టుమని పేదలకు పది ఇళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని, ఇవేమి ప్రభుత్వాలని అన్నారు.

కొత్త రాజకీయ వ్యవస్థ దిశగానే తన ప్రతి అడుగూ ఉందని, అయితే దశాబ్దాలుగా వెళ్లూనుకుపోయిన ప్రస్తుత ప్రభుత్వాలను పెకలించడానికి యుద్ధమే చేయాల్సి ఉందని, అందుకు తాను ప్రతిరోజూ చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల స్థాయిలో ఉద్యమం చేయకపోతే… అవినీతి ప్రభుత్వాలను తప్పించడం చాలా కష్టమని అన్నారు.

సీఎం గారూ… మీలో ఆ పౌరుషం ఉందా?

 

సీఎంగానీ, జగన్ గానీ… నిజంగా రాయలసీమ బిడ్డలైతే… రాయలసీమ పౌరుషం ఉంటే… వారు గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లును తెరిపించాలని, అయిదు కోట్ల బకాయిల్ని చెల్లించమని కోర్టు చెప్పిన ప్రకారం కార్మికులకు చెల్లించాలని పవన్ కళ్యాణ్ సవాలు చేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *