ఆ లక్షణాలున్న గొప్ప నేత పవన్ ఒక్కడే

March 17, 2019 | News Of 9

  • జనసేన మ్యానిఫెస్టో అద్భుతం…
  • ప్రపంచంలోనే అది అరుదు కావచ్చు..
  • అందరం కలిసి సమాజంలో మార్పు తెస్తాం
  • సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ
  • జనసేనలో చేరిన మరో దార్శనికుడు
  • ఆయన వెంటే జెఎన్టీయూ మాజీ వీసీ రాజగోపాల్
  • అందరినీ సాదరంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్
  • రాయలసీమ నుంచే పోటీకి అవకాశాలు
  • జన సైనికుల్లో వెల్లువెత్తిన హర్హాతిరేకాలు

                 (న్యూస్ ఆఫ్ 9)

ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో మార్పు తీసుకుని రావాలంటే.. జ్ఞానం, ధైర్యం, ప్రజాదరణ అన్న మూడు అంశాలు తప్పక ఉండాలనీ, ఇవన్నీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లో ఉన్నాయని సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మూడు అంశాల్లో ఏదో ఒకటి అందరిలోనూ ఉంటుందని, అయితే ఈ మూడు అంశాలనూ పుణికిపుచ్చుకున్న గొప్ప నేత పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు. ఈ రోజు నుంచీ తానూ జన సైనికుల్లో ఒకడిని అయ్యానని, సేనాధిపతి లక్ష్యాల మేరకు అందరం కలిసి పని చేద్దామని అన్నారు. జనసేన అంటే ఏమిటో చూపిద్దామని, మార్పు తెద్దామని అన్నారు. పవన్ కళ్యాణ్ తో తనకు ముందు నుంచీ పరిచయం ఉందని, తమ మధ్య అనేక పర్యాయాలు చర్చలు కూడా జరిగాయని, అయితే కుటుంబపరమైన సమస్యల వల్ల జనసేనలో చేరడం ఆలస్యం అయిందని లక్ష్మీనారాయణ అన్నారు. ‘‘జనసేన మ్యానిఫెస్టోని చూశాను. నిజానికి మ్యానిఫెస్టోని అలా రూపొందించడం ప్రపంచంలో ఎవరికైనా కూడా అసాధ్యమే. ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని అందులో ప్రతిఫలించేలా… అందరికీ వర్తించేలా, అందరికీ నేను ఉన్నాను అన్న భరోసా కలిగించేలా దానిని రూపొందించారు’’ అని లక్ష్మీనారాయణ అభినందించారు.

పవన్ కళ్యాణ్ ఆలోచనలూ, తన ఆలోచనలూ ఒకేలా ఉన్నాయని, దేశం మొత్తం ఇపుడు యువతరంతో నిండిపోయిందని, ఈ యువతరానికి చేయి పట్టుకుని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తమ వంటి వారిపైన ఉందని లక్ష్మీనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ తో కలసి పని చేద్దామన్న కోరిక ఈ రోజుకు నిజమైందని లక్ష్మీనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఒకటి ఒకటి కలిస్తే (పవన్ వైపు చూపిస్తూ) రెండు కాదని, అది పదకొండు అవుతుందని అంటూ ఆయన అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు.

జెఎన్టీయూ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ మాట్లాడుతూ… లక్ష్మీనారాయణ తనకు బంధువేనని (తోడల్లుడు) లక్ష్మీనారాయణ ప్రజల్లో మార్పు తీసుకురావాలన్న కోరికతోనే సీబీఐ నుంచి బయటకు వచ్చేశారని, ఆ సమయంలోనే తాను కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన వెంట ఉన్నానని అన్నారు. తాను కూడా జనసేన పార్టీలో చేరడం ఆనందాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు.

నిజాయితీ గలిగిన సీబీఐ అధికారిగా… అక్రమార్కుల్ని ధైర్యంగా జైలుకు పంపిన అధికారిగా వీవీ లక్ష్మీనారాయణ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ప్రజల్లో ఆయన్ను ఒక హీరోగా కీర్తించేవారు ఎందరో ఉన్నారు. నిజానికి ఆయన కొంత ముందుగానే జనసేనలో చేరితో బాగుండేదన్న మాట వాస్తవం. నిస్వార్థంగా ఈ సమాజంలో ఒక గొప్ప మార్పు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నందున ఆయనతో కలిసి లక్ష్మీనారాయణ కూడా పని చేయాలని, ఆయన పార్టీలోకి రావాలని అనేక మంది జన సైనికులు చాలా కాలంగా కోరుకున్నారు. ఎప్పటికైనా జనసేనలోకి వస్తారని కృష్ణార్జునుల్లా… అవినీతి రాజకీయ సామ్రాట్టులను తోలు తీస్తారని, ఇది సరైన జోడీ అని అనేక మంది భావించారు. అయితే ఆయన రాక వివిధ కారణాల వల్ల ఆలస్యం కావడం కూడా అనేక మంది జన సైనికులను నిరుత్సాహపరిచింది. వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో బహుశా ఆయనకు ఎవరి సలహాలు అవసరం లేదుగానీ… రాజకీయాలు అనే సరికి అనేక అనుమానాలు ఎవరికైనా సహజం. అనేక మంది అనేక సలహాలు ఇస్తుంటారు. బహుశా ఆలస్యం అనివార్యమైంది. లేటుగా వచ్చినా నీటుగా వచ్చేశారు. మొత్తానికి… ఆయన రావాల్సిన చోటకే వచ్చారు. సినిమా కథలా ఈ సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ ‘‘రాజకీయ అరంగేట్రం’’ కథ అందరూ మెచ్చేలా, అందరికీ మేలు జరిగేలా అందరూ హమ్మయ్య అనుకునేట్లు సుఖాంతం అయింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *