‘‘మూర్తీ’’భవించిన నాయకన్!!

February 7, 2019 | News Of 9

 

(న్యూస్ ఆఫ్ 9)

నాయకుడు అంటే ఎవరు?

అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలి?

ప్రజల ఆస్తులకు ట్రస్టీగా ఉండే వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు ఉండాలి?

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రం పాలనాధిపతిని ఎంచుకోనున్నది. ఈ తరుణంలో ప్రజల ముందుకు ముగ్గురు నేతలు వస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి.

ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేయలన్నదే రేపు ఎన్నికల్లో ప్రధానమైన అంశం.

నాయకుడు అనే వాడు ఎలా ఉండాలన్నది కార్పొరేట్ దిగ్గజం- ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చెప్పారు. నాయకుడు ఆలోచనలు ఎలా ఉండాలో చెప్పారు. కార్పొరేట్ నైతిక పాలనకు నారాయణ మూర్తి దీపస్తంభం. ఆయన చెప్పిన మాటలు నేటికీ మూత్యాల మూటలు. మంచి భారతదేశాన్ని నిర్మించడం ద్వారా.. ఒక మంచి ప్రపంచాన్ని ఆవిష్కరించే దిశగా మనం ఏ రకంగా ఉండాలన్నది ఆయన తన పుస్తకం- ‘‘ఏ బెటర్ ఇండియా, ఏ బెటర్ వరల్డ్’’ లో చక్కగా చెప్పారు.

తన ప్రజలను ఉత్తేజ పరచడానికి నాయకుడు మొదట చేయాల్సిన పని ఏమిటి? మొదట దూరదృష్టి ఉండాలి. అంటే రాబోయే తరాల గురించి కూడా నాయకుడు ఈ రోజే ఆలోచన చేయగలగాలి. ఈ దూరదృష్టి సాధారణమైనది కాకూడదు. గొప్పగా ఉండాలి. ఆదర్శప్రాయంగా కూడా ఉండాలి. సాధించదగిన ఆకాంక్షలను అది ప్రతిబింబించాలి. ఒక రకంగా ఇది భవిష్యత్తును ఆవిష్కరించే ఒక కల. సమాజంలో (సంస్థ విషయంలో కూడా) ప్రతి ఒక్కరినీ అది ఉత్తేజితం చేసేలా ఉండాలి. ప్రతి ఒక్కరినీ అది బలోపేతం చేస్తుందని అనిపించాలి. నాయకుడు రూపొందించుకునే విజన్- అంటే భవిష్యత్తు ప్రణాళిక వల్ల ‘నాకు ఉపయోగం ఉంటుంది’ అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. అలసిపోయిన ప్రతి హృదయంలోనూ, అలసిన ప్రతి మనిషిలోనూ అది స్ఫూర్తిని రగిలించాలి. నేను ఈ సంస్థకు లేదా ఈ పార్టీకీ చెందిన వాడిని అని గొప్పగా ఉదయం సాయంత్రం చెప్పుకోగలగాలి. ఈ సంస్థనూ, లేదా పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడానికి నేను కంకణబద్ధుడినై ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరూ సంకల్పం చెప్పుకునేట్లుగా నాయకుడి దూరదృష్టీ, భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి.

విశ్లేషణ:

దూరదృష్టీ, భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పన విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలూ, కార్యాచరణ చక్కగా సరిపోలుతాయి. తెలుగుదేశం కానీ, వైఎస్సార్సీపీగానీ తాత్కాలిక ప్రయోజనాల వెంట పరుగులు తీస్తుండగా, జనసేన మాత్రం తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా.. సుదీర్ఘమైన ఫలితాలను ఆశిస్తోంది. 25 కిలోల బియ్యం ఇవ్వడం కంటే 25 ఏళ్ల భవిష్యత్తును అందించాలన్న ప్రణాళికను పెట్టుకున్నది. ఈ కోణంలో ఆలోచిస్తే, తెలుగుదేశం, వైసీపీలూ పాత విధానాలను పట్టుకుని అధికార లాలసతో పని చేస్తున్నాయని మనకు అర్థం అవుతున్నది.   

సవాళ్లను ప్రేమించేవాడే నేత!

సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారు కొత్త దారిలో ప్రయాణిస్తారు. సవాళ్లను ఎంచుకుంటారు.

పాత దారిలో వెళ్లేవాడు నాయకుడు కాదు అంటారు నారాయణ మూర్తి. పది మందీ నడిచిన దారిలో నడిచి ఏ మాత్రం రిస్కు లేకుండా చిన్నపాటి లక్ష్యాలను సాధించదలచుకున్న వాడు నాయకుడు కానేరడని ఆయన చెబుతారు. ‘‘కొంతమందికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఇపుడు ఉన్నట్లే రేపు కూడా ప్రపంచం ఉంటుంది అని అనుకుంటారు. ఎలాంటి మార్పునూ చూడలేరు. దూరదృష్టి గలిగిన నాయకుడు వచ్చే 10 ఏళ్లలో, వచ్చే 25 ఏళ్లలో జాజ్వల్యమానమైన మార్పును తన మనోఫలకంపై చూస్తుంటాడు. దానిని లక్ష్యంగా పెట్టుకుంటాడు. రిస్కు తీసుకుంటాడు. తాను చెప్పేది అందరూ అంత తేలికగా నమ్మరని తెలిసి కూడా తన లక్ష్యసాధనే ముఖ్యం అనుకుంటాడు. ఒకసారి ఫలితాలను సాధించడంలో విఫలమైనా… లక్ష్యాన్ని చేరుకోవడానికే నిర్ణయించుకుంటాడు. ఓటమి కూడా అతన్ని చూసి భయపడుతుంది. ఇన్నాళ్లూ ఇదే దారిలో వెళ్లారు. ఈ కొత్త దారిలో ఎందుకు వెళ్లకూడదు అని ప్రశ్నిస్తాడు. ఆవేశంతో ఊగిపోతాడు. మునుపెన్నడూ మనకు తెలియని అనుభవంలో లేని దారులను వెదుకుతాడు. ఇలా ఎందుకు చేయకూడదు అంటాడు. నాయకత్వ సవాళ్లు అంటే ఇవేనని జార్జ్ బెర్నార్డ్ షా కూడా చెబుతాడు. సాధారణ ప్రజల కంటికి, అంటే వారి ఊహాశక్తిని దాటిపోయి నాయకుడు అల్లంత దూరంలో ఉన్న లక్ష్యాలను చూడగలుగుతాడు. అలాంటి శక్తి ఉన్నవాడే నాయకుడు. నాయకుడు చెప్పే వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోవాలి. అరే, ఇంత గొప్ప మార్పులు వస్తాయా అని వారు అంతే గొప్పగా భావించాలి. కొంత మంది భయపడేట్టు కూడా నాయకుడి లక్ష్యాలు ఉండాలి. అప్పుడే అతన్ని కార్యసాధకుడు లేదా లీడర్ అని అంటాం. ‘‘నేను ఈ సవాలును స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఇందులో ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. ఇందులో గౌరవం ఉంది. దీనిని సాధించడం అవసరం కూడా’’ అని చెప్పేవాడు నాయకుడు అని నారాయణ మూర్తి చెబుతున్నారు.

విశ్లేషణ:

ఈనాడున్న రాజకీయ నాయకులు, పార్టీల అధినేతలు ఫక్తు పాత దారిలోనే ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు అయితే ఈవీఎంలు వద్దు… బ్యాలెట్టు ముద్దు అని అనడం వెనుక రిగ్గింగు చేసుకుని రాజదండాన్ని కొట్టేద్దామన్న ఆలోచనే ఉంది. వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా పాత తరం ఆలోచనలతో.. వాగ్దానాలనే కలలుగా చేసి ఓటు మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రపంచం వేగంగా మారిపోతోంది. నేటి ఆధునిక భారతంలో కొత్త ఆలోచనలు పరవళ్లు తొక్కుతున్నాయి. పాత చింతకాయ పచ్చడి ఆలోచనలకు కాలం చెల్లింది. 25 ఏళ్ల భవిష్యత్తు ఈ తరం యువతకు ముఖ్యమని ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్నీ, లక్ష్యాన్నీ నిర్దేశించుకున్న నేత పవన్ కళ్యాణ్ ఒక్కరే. చంద్రబాబు, జగన్ లిద్దరూ ఒకే తాను ముక్కల్లా వాగ్దానాలు చేసుకుంటూ (వేలంపాటలు) ప్రజల్ని మురిపించి, మరపించి కుర్చీని  తన్నుకుపోదామని చూస్తుంటే… పవన్ కళ్యాణ్ ప్రజల భవిష్యత్తు, యువత ఆకాంక్షల గురించి ఆలోచిస్తున్నారు.

ఈ దేశాన్ని దోచుకుందామని ఆలోచించేవారు నాయకులు ఎలా అవుతారు? గనులను దోచుకోవడం ద్వారా ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను కొందరికే దోచిపెట్టే అపరిమితమైన అధికారాన్ని హస్తగతం చేసుకుందామని రెండు పార్టీలు చూస్తుంటే, జనసేన మాత్రం… సహజ వనరులను కాపాడుకుని, ఈ నేల తల్లి బిడ్డలకు అన్యాయం జరగకుండా చూడాలని ‘‘పర్యావరణ హిత అభివృద్ది’’ అన్న నినాదాన్ని ఏకంగా పార్టీ సిద్ధాంతంగానే మార్చుకుంది. ఈనాడు భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ రాజకీయ పార్టీలను లోబరుచుకుని ప్రకృతి వనరులను దోచుకున్నవే. ఇవ్వాళ మువ్వన్నెల జండాలతో మీడియాలో ప్రకటనలు జారీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీల్లో 90 శాతం ప్రజాధానాన్ని దోచుకున్నవే. ఈ నేలతల్లి బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్ని ఎవరికో దోచిపెట్టడానికి అభ్యంతరం లేని పార్టీలు కొన్ని ఉంటే… ఇందుకు భిన్నంగా ఆదర్శాలతో ఎన్నికలకు వస్తున్న పార్టీ- జనసేన.

ఇది మంచికీ చెడుకీ జరుగుతున్న యుద్ధం. పాత చింతకాయ పచ్చడి పార్టీలకూ, నవ నవోన్మేషమైన విధానాలతో వచ్చిన జనసేనకూ మధ్య పోటీ. పాత తరానికీ, కొత్త తరానికీ మధ్య జరుగుతున్న పోటీ. ప్రకృతి వనరుల దోపిడీని సమర్ధించే పార్టీలకూ, ప్రకృతి వనరులపై ఆధిపత్యం స్థానికులదే అన్న జనసేనకూ మధ్య జరుగుతున్న పోటీ.

ప్రజలను వంచించడం ద్వారా కాకుండా… భావితరాల భవిష్యత్తు కోసం అంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పిన నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని హరోం హరహర అంటూ పవన్ కళ్యాణ్… యువ సైనికులతో కవాతు చేస్తున్నారు. జనసేన- సరికొత్త ప్రపంచాన్ని కలగంటున్నది. దోపిడీదారులను అడ్డుకట్ట వేసి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార కిరీటాన్ని సంపాదిస్తానని చెబుతున్నది. నిర్ణయం ప్రజల చేతిలో ఉంది. నైతిక వర్తనకూ, కార్పొరేట్ నైతిక పరిపాలనకూ నిలువెత్తు విగ్రహం-ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. మరి ఆయన చెప్పినట్లు నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నదీ ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ..!!

Other Articles

2 Comments

    1. ఎక్సలెంట్ ఆర్టికల్..

      ఓ ఓ మహోన్నత వ్యక్తిత్వంతో మరో మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు
      మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *