పవన్ కళ్యాణే ఒక మ్యానిఫెస్టో…!!

March 15, 2019 | News Of 9

pawan kalyan election manifesto | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

ఏదైనా డబ్బులే ముఖ్యం. అందరూ నాకు ఎంత అని ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు సామాజిక వర్గం దేశ ఆర్ధిక ప్రగతిలో మా వాటా 3 శాతమా 4 శాతమా అని అని ఆలోచిస్తారు. అది వారిస్థాయి. మరో సామాజిక వర్గం కూడా ఇలానే ఆలోచించి సీఎం కుర్చీ కోసం తల్లకిందులుగా తపస్సు చేస్తోంది.

స్థూలంగా ఆలోచిస్తే ఏదైనా వ్యాపారం లేదా డబ్బు. సీఎం కుర్చీ దగ్గరకు వచ్చే సరికి ‘‘వ్యాపారం’’ అంటే ఏం బాగుటుంది? దీనికి ‘‘ప్రజా సేవ’’ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. చీరలు కావాలా, బూరెలూ కావాలా, నెలకో 5 వేలు డబ్బు కావాలా, ఏం కావాలన్నా తీసుకోండి… చంద్రబాబు 10 అంటే… జగన్ 15 అంటాడు, జగన్ 15 అంటే చంద్రబాబు 20 అంటాడు. పూర్వం పంచాయితీ ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నకునేందుకు డబ్బున్న బాబులకు వేలం పెట్టేవారు. ఊరు అభివృద్ధికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారినే సర్పంచి పదవి వరించేది. కాకపోతే సీఎం కుర్చీ వేలం పాట కాస్త అందంగా, ప్రజాస్వామ్యయుతంగా, చట్టాలకు దొరకకకుండా అందంగా జరుగుతుంది.

అంతే కదా… సిల్క్ స్మిత రేపల్లెలో డ్యాన్పు చేస్తే రికార్డింగ్ డాన్సు అని ‘‘న్యూసెన్సు’’ కేసు పెట్టి ఆమెను అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యాన్ని బతికించినట్లు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అదే డ్యాన్సు ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనే చేస్తే పర్యాటక రంగాన్ని పోత్సహించినట్లు ప్రభుత్వానికి పేరు వస్తుంది.

సీఎం కుర్చీ కోసం ప్రస్తుతం వేలం పాట నడుస్తోంది. ఎవరు ఎక్కువ మొత్తంలో ప్రజలకు డబ్బుల్ని పంచుతారు? పార్టీలు ప్రజాసేవ కోసం రావడంలేదని, అది ఉత్తుత్తిగా చెబుతున్నదే అని ప్రజలకు మహా బాగా తెలుసును. అందుకే ఎవడు ఎక్కువ ఇస్తే రాజ దండాన్ని వారికి ఇచ్చేద్దామని రెడీగా ప్రజలు ఉన్నారు. చంద్రబాబుకీ, జగన్ బాబుకీ.. పెద్ద తేడా ఉందని మనం అనుకుంటాంగానీ… ప్రజలకు ఇద్దరూ ఒకలానే  కనిపిస్తారు. జస్ట్ నెంబర్ గేమ్!

అందుకే చంద్రబాబు, జగన్ ఇద్దరూ పోటాపోటీగా పించను డబ్బుల్ని పెంచుకుంటూ పోతున్నారు. రైతులకు ఇచ్చే సాయాన్నీ పెంచుకుంటూ పోతున్నారు. చంద్రబాబు, జగన్ 3 వేలు పించను ఇస్తే మరి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంత అని చెప్పాలి? 5 వేలు ఇస్తామని అనాలి. పవన్ 5 అంటే దాన్ని బాబు 10 చేస్తారు, జగన్ 15 చేస్తారు. ఈ వేలం పాట ఎక్కడ ఆగుతుంది?

ప్రజల దగ్గర పన్నుల రూపంలో వచ్చిన డబ్బుల్ని మళ్లీ పప్పు బెల్లాల్లా పంచివేయడమే రాజకీయమా? దేశాభివృద్ధి అన్న పదానికి అర్థం ఇంతేనా? ఇంతకంటే ప్రభుత్వాలు చేయాల్సినది ఏమీ లేదా? ఈ మాత్రం వేలం పాటలు పాడుకుంటూ సీఎం కుర్చీని తన్నుకుపోయే దానికి అసలు పార్టీలు ఎందుకు? పార్టీలకు సిద్ధాంతాలు ఎందుకు? పార్టీకి ఒక ఆర్ధిక విధానం ఉండాలని అనుకోవడం ఎందుకు?

తెలుగుదేశం పార్టీకిగానీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకిగానీ సైద్ధాంతిక విధానాలేమీ ఉన్నట్లు కనిపించదు.

సొంత సామాజిక వర్గానికి దేశ ఆర్ధిక ఫలాల్లో వాటా ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. పేదలకు బిస్కెట్లు పారేసి వేల కోట్లను పంచుకోవడమే వారు 1983 నుంచీ చేస్తున్నది. జగన్ అంటారా? సోనియాగాంధీతో విభేదించి పెట్టుకున్న పార్టీ. ఏ మాత్రం కొత్తదనం, మార్పులనూ ఆయన ఆశించడం లేదు. చనిపోయిన తర్వాత కూడా తనను ఎవరూ మర్చిపోకూడదని కేవలం తన కోసం ప్రారంభించుకున్న పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెసు.  

తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుదామనో, లేక దేశంలో దొంగలు పడి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని కన్నీళ్లు పెట్టుకుని.. జగన్ పార్టీ పెట్టలేదు. కేవలం సీఎం కుర్చీ కోసం ఒక వ్యవస్థలనే తన చుట్టూ సృష్టించుకున్నారు. అందులో మీడియా కూడా ఒక వ్యవస్థ. తనకు తాను ఒక రాజుగా ప్రకటించుకుని చుట్టూ రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తనకు తాను ఇప్పటికే రారాజు. ఊళ్లలో కూడా డబ్బున్న మారాజే అన్నీ చలాయిస్తాడు. కానీ ఎమ్మెల్యేనో, ఎంపీనో అయితే దానికి ఇంకా కొంచెం అందం చేకూరుతుందని చిన్న కోరిక. జగన్ స్థాయి పెద్దది కాబట్టి… సీఎం అవుదామని ఆయనకో చిన్న కోరిక. అంతే తేడా.  

జనసేన దగ్గరకు వద్దాం. తెలుగు రాష్ట్రం రెండు ముక్కలు అయినపుడు… తెలంగాణ నేతలు ‘‘ఆంధ్రోళ్లు’’ అని తిడుతున్నపుడు ప్రశ్నించ సాహసం చేసిన వారు ఒక్కరూ లేరు. ఆ సమయంలో పవన్ తెలంగాణ నేతల్ని ధీటుగా ఎదుర్కొన్నారు. తెలంగాణను, తెలంగాణ వనరులను అడ్డంగా దోచుకున్నది తెలుగుదేశం పార్టీ, లేదా ఆ పార్టీకి బయట ఉన్న కోస్తాంధ్ర పెట్టుబడిదారులు. తెలుగు ప్రజల తప్పేమీ లేదు. ఆంధ్రా ప్రజలను మభ్యపెట్టి.. తెలంగాణ రాకుండా అడ్డుకున్న ఆర్ధిక శక్తులు కూడా ఇవే. ప్రజలు ఎప్పటికైనా అర్థం చేసుకోలేనిది ఏమంటే… నాయకులు ప్రజల్ని భావోద్వేగాల ఉచ్చులో పెట్టి వాళ్ల పబ్బం గడుపుకుంటారు.

ఈ కుళ్లు పోవాలనే… పవన్ కళ్యాణ్ జనసేనను తెరపైకి తెచ్చారు. అంతా ప్రజల కోసమే అని చెబుతూ… వైఎస్సార్ కాంగ్రెసులా జనసేన కూడా ఉండి వుంటే.. ఇటు మీడియాకిగానీ, అటు పెట్టుబడిదారులకుగానీ ఇబ్బంది లేదు. కానీ పవన్ జనం కోసమే ఈ తపన, తపస్సు అంటున్నాడు. మీడియాకి దాసోహం అనడం లేదు. పైగా అంత పెద్ద మీడియాను కూడా బహిరంగంగానే ఛీత్కరించిన వాడు. పెట్టుబడిదారులకు దాసోహం అనలేదు. పవన్ రెండు వైపుల నుంచీ యుద్ధం చేస్తున్నాడు. ఒకటి మీడియానీ, పెట్టుబడిదారులను ఎదుర్కోవడం.. ఇది కనిపించని యుద్ధం. రెండోది ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడం. అదీ ఆదర్శం కోసం… కేవలం ప్రజల కోసం.

నిన్న జనసేన తరఫున కూడా మేనిఫెస్టోని ప్రకటించకతప్పలేదు. కొన్ని తప్పకపోవచ్చు. రైతులు పరిశ్రమలకు భూములు ఇస్తే.. అందులో వారికి వాటా ఇస్తానన్నాడు. ఇది విప్లవాత్మకమే కదా. సన్నకారు, చిన్నకారు రైతులకు రూ.5 వేలు ఇస్తానన్నాడు. ఇవన్నీ సామాజిక చట్రంలో అట్టడుగున ఉన్న వర్గాలు. రెల్లి, మత్స్యకారులకు ప్రోత్సాహకాలు ప్రకటించాడు. కానీ జనసేన మానిఫెస్టోలో… ఎక్కడా తన ప్రత్యర్ధి పార్టీల మేనిఫెస్టోలకు పోటీగా ప్రకటించిన అంశాలేమీ లేవు. ఇది సాహసం కదా? ఇపుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న సాహసాలు చాలవా? పెట్టుబడిదారుల పునాదుల్నే కొట్టేస్తానంటున్నాడు పవన్. లేదంటే ‘‘అభివృద్ధితో కూడిన పర్యావరణ విధానం’’ అన్న సిద్ధాంతం విప్లవాత్మకం. ప్రజల్ని అడ్డంగా దోచుకున్న జిందాల్ వంటి కంపెనీలకు ఇది పచ్చివెలక్కాయ. ఒక కాలేజీ విద్యార్ధి మీరు మీ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుంటారా అని అడిగితే.. ‘‘మానవత్వం చచ్చిపోకుండా చూస్తాను’’ అన్నాడు. ఆ మాటలోనే కోటి హామీలు ఉన్నాయి. ఆయేషా మీరా వంటి అబలలకు అన్యాయం జరగదు అన్న హామీ ఉంది. రైతుల భూముల్ని ఆక్రమించుకునే బడా చోర్ లకు సంకెళ్లు అన్న అర్థం ఉంది. అన్నం లేకుండా ఆకలితో ఎవ్వరూ పడుకోవాల్సిన పని లేదు అన్న హామీ ఉంది. ప్రజల డబ్బు మళ్లీ ప్రజలకే అన్న హామీ ఉంది. ఇష్టం వచ్చినట్లు వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం సాధ్యం కాదు అన్న భావన ఉంది.

చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉందో చూస్తున్నాం. దోపిడీ అన్న పదానికి ఆ పార్టీ మారు పేరు. దాని గురించి చెప్పక్కర్లేదు. వైఎస్సార్సీపీ గురించి ప్రజలకు చాలా విషయాలు తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.

అసలు పవన్ కళ్యాణ్ ఒక మానిఫెస్టోని ప్రకటించాల్సిన అవసరమే లేదు. ఆయనే ఒక మానిఫెస్టో. ఆయన 7 సిద్ధాంతాలే ఒక మానిఫెస్టో. ప్రజలకు కష్టం లేకుండా పాలనను అందించగలడు. స్పందించే హృదయం ఉంది. జనసేన టీడీపీలా కాంట్రాక్టర్ల కోసం పెట్టిన పార్టీ కాదు. పేదల కోసం పెట్టిన పార్టీ. జనసేనలోకి కాంట్రాక్టర్లు వచ్చే సాహసం చేస్తారా? ఆలోచించండి. అందుకే వారంతా టీడీపీలో ఉంటారు లేకపోతే వైసీపీలోకి వెళతారు. అయితే ఆ పడవ… లేకపోతే ఈ పడవ. డబ్బు సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తే… ప్రజాసేవ అంటాడేమిటి పవన్ కళ్యాణ్? ఇదీ వారి దుగ్ధ.

బాబే మళ్లీ రావాలి…. జగనే రావాలి… అంటున్న వారికి ఈ సమాజం గురించిగానీ, ఈ సమాజాన్ని నియంత్రించే ఆర్ధిక శక్తులు వేరే ఉన్నాయి అనిగానీ తెలియదు. ఇదీ నిజమని చెప్పడానికి ప్రస్తుతం ఉన్న మీడియా ఇపుడు మీరు చదువుతున్న ఈ తరహా కథనాలను ప్రచురించడానికి అంగీకరించదు. అది ‘‘న్యూస్ ఆఫ్ 9’’లో మాత్రమే సాధ్యం అవుతున్నది. అందుకే అనేక నిజాలను మేం చెప్పగలిగాం. జనసేన అధికారానికి రావాల్సిన ఆవశ్యకతను సహేతుకంగా చెప్పాం. 70 ఏళ్ల బానిసత్వానికి మూలాలు ఎక్కడ ఉన్నదీ చెప్పాం.

జనసేన మ్యానిఫెస్టోని ఇతర పార్టీలతో పోల్చడానికి అవకాశమే లేదు. అందరికీ విద్యావకాశాలూ, ఉద్యోగాలూ ఉంటే… అసలు గొడవలు ఎందుకొస్తాయి? వచ్చే అవకాశమే లేదు. అయితే ఆచరణలో వీటిని పవన్ కళ్యాణ్ ఏ విధంగా అమలు చేస్తారన్న ప్రశ్న ఉంది. అసాధ్యం అన్నది ఏదీ ఉండదని, అసాధ్యంలోనే సాధ్యం అనేది ఉన్న మాట మరిచిపోవద్దని పవన్ అంటున్నారు. అవును. నిజమే. సంకల్పబలం ఉన్నవారు చేయగలుగుతారు. అందులో సందేహం లేదు.

సీఎం కుర్చీ వ్యాపారంగా భావించే పార్టీల మ్యానిఫెస్టోని జనసేన పార్టీ మ్యానిఫెస్టోతో పోల్చలేం. అలాగే పార్టీలనూ, పార్టీల అధినేతల్ని కూడా. జనసేన వరకూ పార్టీ భిన్నమైనది. అధినేత ఆలోచనలూ భిన్నమే. అసలు ఓట్లకు డబ్బులు ఇచ్చి కొనకూడదన్నది తమ సిద్దాంతంగా పవన్ చెప్పాడు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు ఓట్లను కొనే పనిలోనే ఉంటాయి. మరి వాటితో జనసేనను ఎలా పోల్చుతారు ఎవరైనా..?

Other Articles

One Comment

  1. Hmm it looks like your blog ate my first comment (it was super long) so I guess I’ll just sum it up what I submitted and say, I’m thoroughly enjoying your blog. I too am an aspiring blog writer but I’m still new to everything. Do you have any recommendations for novice blog writers? I’d definitely appreciate it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *