బాగానే మొట్టికాయలు పడ్డాయిగా..!!

February 10, 2019 | News Of 9

• నిధుల దుర్వినియోగం జరిగింది
• లెక్క చెప్పమంటే తప్పించుకుంటున్నారు
• ఏపీ గౌరవానికే బాబు అండ్ కో చేటు తెస్తున్నారు
• ఇదీ ప్రధాని మోడీ ప్రసంగానికి అర్థం

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా ఉన్నది సీఎం చంద్రబాబు, అతని వెనుక ఉన్న స్వార్ధపరులేనని, వారంతా ప్రజల సొమ్మును దారి మళ్లించుకున్నారని పరోక్షంగా సాక్షాత్తూ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్ధలు కొట్టారు. ఏపీ అభివృద్ధికి సహకరించడంలేదంటూ తనను తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ అందుకు దీటైన సమాధానం చెప్పారు. ‘సత్యమేవ జయతే’’ పేరుతో గుంటూరు నడిబొడ్డున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆ పేరుకు తగినట్లుగానే.. మీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చానని అంటూ టీడీపీ పాలనను ఉతికి ఆరేశారు. తీసుకున్న పైసలకు లెక్క చెప్పనిదే… నిధులు ఇచ్చే ప్రశ్నేలేదని తేల్చేశారు. అందువల్ల చంద్రబాబు పేరు చెబితే ఇక ఆంధ్ర రాష్ట్రానికి నిధులు రావని దీంతో అర్థమైపోయింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గొప్ప సంస్కృతి గురించి దేశం మొత్తానికీ తెలుసునని, అయితే ఏపీ సీఎంగా చంద్రబాబు మాట్లాడుతున్న మాటల్ని చూస్తే అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గొప్ప పేరును దెబ్బతీస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఉన్న మాటే ఆయన చెప్పారు. చంద్రబాబు స్థాయిలో అసత్యాలు మాట్లాడే రాజకీయ నాయకుడు తెలుగు చరిత్రలో ఆయనే మొదటి వ్యక్తి… చివరి వ్యక్తి కూడా కావచ్చు. కేవలం రాజకీయం కోసమే ఆయన అనేక అబద్ధాలు చెబుతుండటం ఇపుడు మనం ప్రతి రోజూ చూస్తున్నదే. ఒక టంగుటూరి ప్రకాశం పంతులుగానీ, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగానీ, మాడపాటి హనుమంతరావుగానీ… వీరంతా మాటకు కట్టుబడిన మహనీయులు. ఇది మరీ సత్తె కాలం కాకపోయినా… తెలుగువాళ్లు ఒక సారి మాట అంటే దానికి కట్టుబడి ఉంటారనీ, ఇతరులను గౌరవిస్తారనీ.. సర్వత్రా ఉంది. చంద్రబాబు వ్యక్తిత్వం తెలుగు వారికి చెడ్డ పేరును తేవడం ఖాయమన్నది ప్రధాని మాటల్లో ధ్వనించడం విషాదం.

టీడీపీ ప్రభుత్వంలోనూ, సీఎం చంద్రబాబు చుట్టూ ఉన్న నేతలు వారి పిల్లల కోసం స్వార్థంతో పని చేస్తున్నారని, అయితే… ప్రజల్ని పిల్లల్లా చూసుకుంటారని కదా ప్రజలు ఎన్నుకున్నది అంటూ ఆయన చెప్పాల్సిరావడం కూడా మరో పెద్ద విషాదం. ఇచ్చిన డబ్బులకు లెక్కలు చెప్పేది లేదని అంటున్నారనీ, వీరి ఆటలు తన దగ్గర సాగవని కూడా ఆయన మొట్టికాయలు వేశారు. చంద్రబాబు ఏపీ ప్రజల కలల్ని నీరుగార్చేశారని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు కేవలం పార్టీ నిర్మాణాన్ని చేసుకున్నారని అన్నారు. లోకేష్ ను రాజకీయాల్లో నిలబెట్టేందుకే ఆయన తాపత్రయ పడుతున్నారని అన్నారు. భాజపా సభ గురించి ప్రస్తావిస్తూ… ఈ సభను తమ పార్టీ నిధులతో నిర్వహిస్తున్నామనీ, అలాంటిది చంద్రబాబు తన సొంత కార్యక్రమాలకూ, రేపు ఢిల్లీలో జరిగే పార్టీ కార్యక్రమాలకూ ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని, దీనిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పుకోక తప్పదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలిచే అవకాశం లేదని కూడా ప్రధాని చెప్పారు.

సరే, ప్రధాని అన్న మాటలకు చంద్రబాబు ఎలా సమాధానాలు ఇస్తారు? ఎప్పటిలాగానే అడ్డంగానే ఇస్తారు. దీనిని కప్పి పుచ్చుకోవడానికి మధ్యలో విలేకరులపై చిత్రమైన నవ్వు ఒకటి విసురుతారు. సాధారణంగా మాలట్లాడుతున్నపుడు సీఎం చంద్రబాబు ముఖం సీరియస్ గా ఉంటుంది. కానీ… అడ్డంగా మాట్లాడేటప్పుడు మాత్రం ఈ మధ్య ఆయన తెచ్చిపెట్టుకున్న నవ్వులు పులుముకుంటున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి ఎందుకు, ఎలా మాట్లాడుతున్నారు… ముఖ కవళికలు ఏమైనా ప్రత్యేక సందేశాన్ని ఇస్తున్నాయా అన్న విషయాలను విశ్లేషించుకోవడం తప్పులేదు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *