రేవంత్ రెడ్డి అరెస్టు… భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు

December 4, 2018 | News Of 9

Police arrests Revath, Congress fires on KCR | news of 9

కొడంగల్‌: కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు మంగళవార ఉదయం అరెస్ట్‌ చేశారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ కొడంగల్‌ నియోజవర్గంలోని కోస్గిలో మంగళవారం నిర్వహించనున్న బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. దీనిలో భాగంగా రేవంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిగి వద్ద వాచ్‌మెన్‌ను వదిలివెళ్లారు.

పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని, తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, కేసీఆర్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని గీత కోరారు. రేవంత్‌రెడ్డిని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. రేవంత్‌ అరెస్టుకి ముందు అతని నివాసం వద్ద 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. కేసీఆర్‌ సభ నేపథ్యంలో నిరసన ర్యాలీకి పిలుపునివ్వడంతో పోలీసులు రేవంత్‌ను అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది. మరోవైపు బొంరాస్‌పేట మండలంలోనూ పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ మండలానికి చెందిన 9 మంది కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

రేవంత్ రెడ్డి అరెస్టు అరాచకం… అప్రజాస్వామికం: ఉత్తమ్

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కొడంగల్ ప్రజా కూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి ని పోలీసులు అర్ధరాత్రి ఇంటి పై దాడి చేసి ఒక దుర్మార్గమైన పద్ధతిలో అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లడం అరాచక పాలనకు పరాకాష్ట అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేసీఆర్ మీటింగ్, తెరాస సభ ఉందని, సభ విఫలం అవుతుందని కేసీఆర్ భయపడి ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి తలుపులు పగలకొట్టి అరెస్ట్ చేయడం, అనుచరులను అరెస్టులు చేయడం, భయబ్రాంతులకు గురి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెరాస పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఇలాంటి దుర్మార్గమైన ఎత్తుగడలతో ప్రజల అభిప్రాయం మార్చలేరని అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *