ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేస్తే..

August 13, 2019 | News Of 9

రాజోలు ఎమ్మెల్యే రాపాక, మలికిపురం ఎస్సై మధ్య జరిగిన ఘర్ష చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. చిన్న పేకాట కేసుగా మొదలైన వాగ్వాదం ఎమ్మెల్యేను అరెస్టు చేసే స్థాయికి వెళ్లింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తన నియోజకవర్గానికి చెందిన కొందరు పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారని వారిని విడిచిపెట్టమని ఎమ్మెల్యే రాపాక మలికిపురం ఎస్సై రామారావును కోరారు. పేకాడుతూ డబ్బులతో దొరికిన 9మందిని విడిచిపెట్టడం కుదరదని ఎస్సై చెప్పడంతో న్యాయపరంగా ముందుకెళ్తానని చెప్పి రాపాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ ఎస్సై తనను అసభ్య పదజాలంతో దూషించాడనీ, కాల్చిపారేస్తాననీ అన్నట్లు రాపాకకు తెలిసింది. దాంతో ఆయన మళ్లీ పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ప్రజా ప్రతినిథినైన నన్ను ఇలా దూషిస్తావా అని ఎస్సైని నిలదీశారు. అప్పుడు కూడా ఎస్సై అంతే దురుసుగా ప్రవర్తించడం, ఆగ్రహించిన రాపాక డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేసి నీ ఉద్యోగం ఊడగొడతానని హెచ్చరించడం వేగంగా జరిగిపోయాయి. ఈ వాగ్వాదాన్ని గమనించిన రాపాక అనుచరులు, జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తామంటూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ తలుపులు కూడా విరగ్గొట్టారంటూ ఎస్సై రామారావు ఎదురు కేసు పెట్టాడు. ఈ రగడ కాస్తా డీఎస్పీ వరకూ వెళ్లడంతో ఆయన రాపాకను కేసుగురించి ఎంక్వైరీ చేస్తానని చెప్పి సముదాయించి పంపేశారు.

అనంతరం రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు బొంతు రాజేశ్వరరావు. మీడియాతో మాట్లాడుతూ సదరు ఎస్సై నీతిమంతుడనీ ఎమ్మెల్యే రాపాక కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నాడనీ చెప్పారు. నిజానికి ఎమ్మెల్యే రాపాకకే ఇసుక మాఫియాతో సంబంధాలున్నాయంటూ ప్రత్యారోపణలు చేశారు. ఇది తెలిసిన రాపాక తన వద్దకు వచ్చిన మీడియాతో ఎస్సై నిజాయితీ గురించి వకాల్తా పుచ్చుకున్న బొంతు రాజేశ్వరరావు కూడా అవినీతిపరడేనని చెప్పారు. అలాగే ఎస్సై రామారావు కెరీర్ లో అనేక అవినీతి చర్యలు చేశాడనీ, ఇసుక లారీలను పట్టుకుని డబ్బిచ్చిన వారిని వదిలి ఇవ్వని వారిని నెలలుగా తన చుట్టూ తిప్పుకుంటున్నాడనీ అన్నారు. ఓ అక్రమ సంబంధం గొడవలో అతన్ని పొదలాడ గ్రామంలో స్థానికులు దేహశుద్ధి కూడా చేశారనీ చెప్పారు. వైసీపీ లీడర్ బొంతు కూడా గతంలో ప్రభుత్వ అధికారిగా పనిచేసి పోగేసుకున్న కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని వివరించారు. ఇవి నిజాలో కాదో విచారించుకోవచ్చని అన్నారు. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజోలు నియోజకవర్గం వేడెక్కింది.. పేకాడిన వారిని వెనకేసుకొస్తున్నారని ఒకరంటే, అధికార పార్టీ వారయితే ఏనేరం చేసినా కేసులుండవా అని ఒకరు ఇలా ఇరుపక్షాల మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ ఇదే విషయంపై చర్చలు జోరందుకున్నాయి.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిచారు. జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్ ప్రజా ప్రతినిథిని దూషించిన ఎస్సై చర్యలను ఖండించారు. రాపాకపై పోలీసులు అక్రమంగా బనాయించిన కేసులపై జిల్లా జనసేన నాయకులు కాకినాడ లో సమావేశమయ్యారు. ఒకవేళ అరెస్ట్ జరిగితే జరగబోయే పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయం పై చర్చించడానికి జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హైదరాబాద్ నుండి కాకినాడకు చేరుకుంటారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు పంతం నానాజీ, కందుల దుర్గేష్, శెట్టిబత్తుల రాజబాబు గారు, ముత్తా శశిదర్, పితాని బాలకృష్ణ తుమ్మల బాబు, బండారుశ్రీనివాస్, పాఠంశెట్టి సూర్యచంద్ర, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, సంగిశెట్టి అశోక్, చిక్కాల బాబులు తదితర నాయకులు పాల్గొన్నారు

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *