కుందేళ్లకు రాజ్యాధికారమా..?

November 18, 2018 | News Of 9

Political power to Rabbits in AP…?

 

(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేక కథనం)

1. బహుజనులకు రాజ్యాధికారం ఎందుకు?

2. అది ఇపుడే ఎందుకు?

3. అందుకు ఏం చేయాలి?

4. ఇన్నీ చేసినా నిజంగా బహుజనులకు రాజ్యాధికారం సాధించే అవకాశం అంది వస్తుందా?

5. బడుగుల కోసం పవన్ కళ్యాణ్ రాజ్యాధికారాన్ని తేగలరా?

ఇలాంటి ఎన్నో అనుమానాలు ప్రజల మదిని తొలుస్తున్నాయి. ఈ అయిదు ప్రశ్నలకు సమాధానాలను కనుగొనే ప్రయత్నం చేద్దాం:

1. బహుజనులకు రాజ్యాధికారం ఎందుకు?

1947 నుంచి 1983 వరకూ రెడ్డి సామాజిక వర్గం వాళ్లే సీఎంలుగా ఉన్నారు. తర్వాత నుంచీ రాష్ట్ర విభజన వరకూ కమ్మ సామాజిక వర్గమే ఉన్నది. ఒకరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, కులం ఉందన్నది వాస్తవం. కులం పేరును ఉపయోగించుకుని కొన్ని కులాలు ఆర్థికంగా ముందుకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే మధ్య తరగతి ప్రజల్లో, ముఖ్యంగా పేదల్లో కులానిదేముంది అన్న భావన బలంగా ఉంది. కుల ద్వేషం ఉండటం తప్పు కానీ, కులం ఉందన్న వాస్తవాన్ని గుర్తెరగడం తప్పుకాదు. పుండు ఎక్కడ ఉంటే అక్కడే చికిత్స అవసరం. అందుకని కుల రహిత సమాజం దిశగా… మనుషులు, ఈ సమాజాలు ఎదుగుతాయి. కానీ రేపే ఆ సమ సమాజం రాబోదు. అందుకు మరో 100 సంవత్సరాల సమయం పట్టవచ్చు. ఈ లోపు కులం పేరుతో జరిగే దోపిడీని అరికట్టకపోతే, సహజ వనరులు, ఆర్థిక ఫలాలూ బడుగు వర్గాలకు అందవు. కటికి పేదరికంలోనే వారు కొట్టుమిట్టాడుతూ ఉండాలి. ఆర్థిక సమానత్వం రానిదే… కుల సమానత్వం రాదు. ఈ దిశగా జరిగే ప్రయత్నాల్లో రెడ్లు, కమ్మల తర్వాత రాజ్యాధికారాన్ని అందుకోవాల్సింది బడుగు వర్గాలేనని ప్రజారాజ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రముఖ సోషల్ సైంటిస్టు కంచి ఐలయ్య 2009లోనే చెప్పారు. కాబట్టి ఈ సందేహం తీరినట్లే.

2. అది ఇపుడే ఎందుకు?

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయినా… కాపులుగానీ, మిగిలిన దళిత, బహుజన వర్గాలన్నీ కూడా రాజకీయాధికారానికి దూరంగా ఉన్నాయి. దీనివల్ల దళిత బహుజన బడుగు వర్గాలు చదువులు లేక, ఉద్యోగాలు లేక, తినడానికి తిండిలేక పేదరికంలో మగ్గిపోతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అన్నట్లు ఉన్నవాళ్లే ఉన్నవాళ్లు అవుతున్నారు. కాపుసారా కాసుకునే సీఎం రమేష్ కోట్లకు పడగలెత్తాడుగానీ బడుగు జనాలు గంజి మెతుకులతోనే కాలక్షేమం చేస్తున్నారు. దిగువ కులాల్లో అందరిదీ ఒకటే పరిస్థితి. అందుకే ముద్రగడ పద్మనాభం వంటి నేతలు కంచం చూపిస్తూ.. బీసీ రిజర్వేషన్ హోదా ఇవ్వండి అంటూ ఉద్యమాన్ని నడిపారు. ఇది ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది.

దేవుడు అందరికీ ఒకే జీవితాన్ని ఇచ్చినా.. సామాజిక హోదాను మాత్రం ఇవ్వలేదు. ఇంకా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ‘మన ఖర్మ. బతుకులు ఇంతే’ అని బడుగు వర్గాలు ఊరుకుని ఉండాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ జనసేన తరఫున రెల్లి కులస్థులను కలిసి మాట్లాడారు. చేనేత కార్మికులను గానీ, చేతి వృత్తులు చేసుకునే కార్మికులను గానీ ఎవరినీ రాజకీయ పార్టీలు ఆదుకున్నది లేదు. రెల్లి కులస్థుల సమస్యలను విన్న పవన్ కళ్యాణ్ కన్నీళ్లను బలవంతంగా ఆపుకున్నారు. ఆ భావోద్వేగంలో ‘‘నేను ఈ రోజు నుంచి రెల్లి కులస్థుడినే అమ్మా… ఎవరైనా అడిగితే మాకు పవన్ ఉన్నాడని చెప్పండి’’ అని అన్నారు. ప్రజలది మూకుమ్మడి మనస్తత్వం. నువ్వెవరివి మంచి చెప్పడానికి అని ప్రశ్నిస్తే నేను దైవ కుమారుడిని అని ఏసు క్రీస్తు చెప్పాడు. మంచి చెప్పిన మహ్మద్ ప్రవక్తను నువ్వెవరివి చెప్పడానికి అని అంటే ఆ అల్లా ఆదేశమని చెప్పాడు. పవన్ ఏం చెబుతాడు? రెల్లి కులస్థుడనని, మీ వాడినే అని అంటాడు. బాధపడే వాడిది ఏ కులమైతే నాదే అదే కులమని చెబుతున్నాడు. అణిచివేతకు గురయ్యే వాడి కులమని చెబుతున్నాడు. బడుగులతో మమేకం అవుతున్నాడు. సామాన్యుడి గొంతు ఈ కుట్రల కీకారణ్యంలో ఎవరికీ వినిపించదు. పవన్ గొంతు వేయి గొంతుకలై… దుర్మధాంధులను దునుమాడుతోంది. వజ్రాయుధమై వారిని వెంటాడుతున్నది. తాడిత పీడిత వర్గాలు ఆయన వెనక నడిస్తే నల్లడబ్బు ‘కట్టల’ పాముల పీచమణచడం చిటికెలో పని. సమరానికి సన్నద్ధం అవ్వండి. శంఖం పూరించాడు. ఇపుడు పవన్ అంటే ఒక ఝంఝా మారుతం! విజయ దుంధుబి మోగిద్దాం. ప్రభలు కడదాం. లేవండి.. బడుగులు అంటే… డబ్బున్న వర్గాల అడుగులకు మడుగులు వత్తే వాళ్లం కాదని నిరూపించే సమయమిదే!!

3. అందుకు ఏం చేయాలి?

ప్రజారాజ్యం అధికారాని వచ్చి ఉంటే, ‘‘సామాజిక న్యాయం’’ జరిగి ఉండేది. బడగులకు రాజ్యాధికారం లభించి ఉండేది. బడుగులకు రాజ్యాధికారం అన్నది యాదృచ్ఛికమో, మరొకటో కాదు. సమాజంలో ఈ మార్పు అత్యవసరం’’ అని సోషల్ సైంటిస్టు కంచి ఐలయ్య వాదిస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మ, రెడ్ల నుంచి సీఎం పదవిని కిందికి దించాలని, అప్పుడే అది బహుజనులకు అందుతుందని ఆయన వాదిస్తారు. పుట్టుకతోనే బిడ్డ నోట్లో వడ్ల గింజ వేసి చంపేయమన్నట్లుగా… ప్రజారాజ్యం పార్టీని కుట్రతో గొంతు కోశారు. అయినదేదో అయింది. ఇపుడైనా… రెట్టించిన ఉత్సాహంతో జనసేన గంట మోత మోగిపోవాలి. అక్రమార్కుల గుండెల్లో అది ప్రతిధ్వనించాలి. రాజ్యాధికారం రావడం అంత తేలికేమీ కాదన్నది నిజమే. కానీ నడుం కట్టి… మడమ తిప్పని ఒక నేత ఉంటే చాలు. పవన్ రూపంలో ఆ నేత మన కళ్ల ముందు ఉన్నాడు. ఆయన వెనుక నడవడమే ప్రతి ఒక్కరూ చేయాల్సింది. మనసులో ఉన్న అనుమానాలను పక్కన పెట్టి…చేతి వృత్తుల వారూ, బహుజనులూ, ఇతర సబ్బండ వర్గాలూ ముందుకు కదలాల్సిన సమయం ఇదే. పవన్ ఆదర్శాలను చెబుతున్నాడని, ఇందులో గొప్ప ఏముంది అని కొందరు పని గట్టుకుని ప్రచారం చేస్తారు. 2009లో ఏమీ చేయలేదు… ఇప్పుడు కూడా అంతే అంటారు. సినిమా నటుడు ఏం చేస్తాడులే అంటారు… మీ ఆత్మస్థైర్యాన్ని చంపేస్తారు.

ఒక బ్రాహ్మణుడు మేకను మెడపై మోసుకెళుతుంటే… దాన్ని చూసిన టక్కరి దొంగలు ‘అదేమిటి పంతులు గారూ… కుక్కను మోసుకెళుతున్నారు’ అని అన్నారట. పది మందీ తప్పు ఎలా చెబుతారని అనుకున్న తర్వాత మేకను వదిలిపెట్టి చక్కాపోయాడు పంతులు గారు. మీడియా ప్రజలపైన కుమ్మరించే తప్పుడు సమాచారాన్నే ప్రజలు రోజంతా చర్చిస్తుంటారు. కూకట్ పల్లిలో హరికృష్ణ కూతురు గెలుస్తుందా లేదా అన్న దానిపైనే మీడియా ప్రజల దృష్టిని ఉంచుతుంది. అది దాటి ఆలోచించాలి. తన పేరు కూడా సరిగా పలకడం రాని మహిళను రంగంలోకి దించడం ఆమెను ప్రజల నెత్తిన రుద్దడమే. మీడియా మాయలో పడకుండా కాపులు, ఎస్సీలూ, బీసీలూ, ముస్లింలు అప్రమత్తంగా ఉండాలి. యల్లో మీడియా కబుర్లు ఆపండి బాబూ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేయండి.

4. ఇన్నీ చేసినా నిజంగా బహుజనులకు రాజ్యాధికారం సాధించే అవకాశం అంది వస్తుందా?

ఖచ్చితంగా వస్తుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారి శాతం ఎంత? రెడ్లు 6 శాతం, కమ్మలు 4 శాతం. మరి కాపులు ఎంత మంది… 26 శాతం, మిగిలిన బడుగు వర్గాలను కలుపుకుపోతే… 90 శాతం. అధికారానికి దూరంగా 90 శాతం మంది ఉన్నపుడు భయపడటం ఎందుకు? ఏ దేశంలోనైనా మెజారిటీ ప్రజలే అధికారంలో ఉంటారు. ఆఫ్రికాలో నీగ్రోలు ఉంటారు కానీ… తెల్లవాళ్లు ఉండరు కదా? మైనారిటీ అంటే… ఒక శాతం, రెండు శాతం ఉన్న డబ్బున్న వర్గాలే ఎప్పుడూ మన దగ్గర అధికారంలో పాతుకుపోతాయి. ఆ ఒక్కటీ తప్ప (సీఎం కుర్చీ) ఏది అడిగినా ఫర్వాలేదంటారు. అడవిలో సింహాలు పదో పరకో ఉంటాయి. అయినా.. అడవికి సింహమే రాజు. నిజమే. అది అటవిక న్యాయం. ఈ అటవిక న్యాయమే రాచరికంలో కనిపించేది కదా. కానీ మనం ఉన్నది ప్రజాస్వామ్యం. మెజారిటీ ప్రజలే సింహాలు.. ప్రజలే ప్రజాస్వామ్యం. వాళ్లే అధికారంలో ఉండాలి. కానీ అతి తక్కువ సంఖ్యలో ఉన్న డబ్బున్న వర్గాలే నేడు రాజకీయాధికారాన్ని శాసిస్తున్నాయి. 70 ఏళ్లుగా రాజ్యాధికారం రెండు వర్గాలు, లేదా రెండు కుటుంబాల చేతిలో బందీ అయిపోయింది. సహజ వనరులపై ఆధిపత్యం వారిదే. డబ్బు, పోలీసులూ వారికి మద్దతుగా ఉంటాయి. నియంతృత్వం పెచ్చరిల్లిపోతుంది. కానీ… 90 శాతం ప్రజలు కలిసికట్టుగా ఉద్యమిస్తే? …కుందేళ్లూ సింహాలవుతాయి. అందుకే బడుగువర్గాలను కలవనివ్వరు. ఎస్సీలను కూడా రెండుగా విడగొట్టారు. ఇపుడు వాళ్లు కూడా ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. కింది కులాలు కలవనంత వరకూ వేటాడే వాళ్లదే రాజ్యం. (అయినా… పవన్ కళ్యాణ్ ఈ తేడాను పాటించకుండా అందరూ సమానమేనంటున్నారు. అది ఆయన వ్యక్తిత్వం. దానినీ గౌరవిద్దాము). గడ్డి పోచలన్నీకలిస్తే.. ఏనుగును కట్టేయలేవా? చేయీ చేయీ కలిపితే చాలు. కుర్చీ కోసం కొట్టుకుంటున్న 10 శాతం కూడా డబ్బులు ఇచ్చేది మన ఓటర్లకే కదా. అందుకే ఈ సారి ఓటును పవిత్రంగా భావించండి.

5. బడుగుల కోసం పవన్ కళ్యాణ్ నిజంగానే రాజ్యాధికారాన్ని తేగలరా?

అన్ని అనుమానాలూ పక్కన పెట్టండి. పవన్ కేవలం 4 శాతం, 6 శాతం వర్గాల కోసం పని చేయడం లేదు. తిండి లేకుండా డబ్బుకూ, సామాజిక సౌకర్యాలకూ ఆమడ దూరంలో ఉన్న 90 శాతం ప్రజల కోసం ఆయన పని చేస్తానని చెబుతున్నారు.

బయలు దేరినపుడు తాను ఒక్కడినే ఉన్నానని, ఇపుడు మీరంతా ఉన్నారని చెప్పారు పవన్. అకుంఠిత దీక్షతో… ఏకోన్ముఖ లక్ష్యంతో ముందుకు ఉరకాల్సిన సమయమిదే. ఓట్లను జాగ్రత్తగా చూసుకుంటూ… జనసేనకు మద్దతుగా ఉండటం ముఖ్యం. బడగు వర్గాలను కూడా కలుపుకుని వెళ్లడం ముఖ్యం. కాపులూ.. కాపుల్లోని ఇతర వర్గాలూ, బీసీలూ, ఎస్సీలూ, ముస్లింలను కలిసి ముందుకువెళ్లండి. అన్నంలేని వాళ్లంతా బహుజనులే. నిలబడేండుకు గజం నేల లేని వారంతా బడగు జనులే. వాళ్ల కోసమే జనసేన ఉన్నదని పవన్ ఎప్పుడో చెప్పేశారు.

ఒక అడవిలో కుందేళ్లు ఉన్న ప్రాంతానికి ఏనుగులు వస్తాయి. కుందేళ్లను తొక్కిపారేస్తాయి. అవి తెలివితో… భారీ ఏనుగులకు సైతం చెక్ పెడతాయి. కుందేళ్లకు కూడా రాజ్యాధికారం వస్తుంది. నమ్మండి… నమ్మకం లేకపోతే కుందేళ్ల విజయంపై నీతి చంద్రిక చదవండి. గడ్డి పోచలతోనూ ఏనుగుల్ని కట్టేయవచ్చు. 90 శాతం బహుజనులు తలచుకుంటే కానిదేముంది? అంబ పలుకుతుంది! జగదాంబ పలుకుతుంది!!

Other Articles

6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *