ఇన్సులిన్ తీసుకోమని చెప్పడం పెద్ద కుంభకోణం

December 10, 2018 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

ఫోయినా గాడ్లీ బ్రిటీష్ మెడికల్ జర్నల్ (బీఎంజే) కు తొలి మహిళా ఎడిటర్. ఆచరాణాత్మకవాదిగా ఆమె ప్రసిద్ధులు. వైద్యపరమైన మోసాలను కట్టడి చేసేందుకు ఆమె గట్టిగా కృషి చేస్తున్నారు. వైద్యరంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని కూడా ఆమె ఏమాత్రం సహించరు. రోచీ, గ్లాక్సో స్మిత్ క్లయిన్ కంపెనీలు కొత్త మందుల పరీక్షల ఫలితాలను గోప్యంగా ఉంచడంపై ఆమె విరుచుకుపడ్డారు. సైన్సులో ఉన్న అవినీతిపై ఆమె ఉద్యమం చేస్తున్నారు. రోగి సంక్షేమమే ప్రధమ ప్రాధాన్యం అన్నది ఆమె లక్షంగా సాగుతున్నారు. బీఎంజే దక్షిణాసియా అవార్డుల కార్యక్రమానికి హాజరైన గాడ్లీ ‘‘ఎకనమిక్ టైమ్స్’’ తో మాట్లాడారు. బీఎంజీ ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు:

భారతదేశంలో.. కాలుష్యపూరితమైన గాలిని పీల్చుకుంటున్నారు.. మీ అభిప్రాయం?

(నవ్వుతూ) ఈ దేశం అంటే నాకు ఇష్టం. గొప్ప దేశం. రెండేళ్ల తర్వాత మళ్లీ వచ్చాను. రెండు రోజుల కిందటితో పోల్చితే ఇపుడు ఫర్వాలేదు. దీని వల్ల జరిగిన మంచి గురించి ఆలోచిస్తే.. కాలుష్యం అన్నది ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా ఇపుడు ప్రజల ముందు ఉన్నది. శిలాజ ఇంధనాల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెస్తూనే, మరోవైపు ప్రభుత్వాలను జవాబుదారి చేయడం ముఖ్యం. భారతదేశంలో ఎక్కువ మంది మధుమేహ రోగులు విదేశాల్లో తయారయ్యే ఇన్సులిన్ సూదిమందుపై ఆధారపడుతున్నట్లు తెలుసుకున్నాను. అది ఎక్కువ ఖరీదు కూడా. కొన్ని విషయాల్లో మనం తప్పుడు మార్గంలో ఉన్నాం. రోగులకు ఇన్సులిన్ తీసుకోమని చెప్పడం, ఆ దిశగా ప్రోత్సహించడం కంపెనీలు చేసే మాయాజాలం. మధుమేహ రోగులకు ఇన్సులిన్ తీసుకోమని డాక్టర్లు ఎవరైనా చెప్పినా వారు తప్పకుండా ఇన్సులిన్ కంపెనీల ప్రభావంలో ఉండి చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. జీవిన విధానాలను మార్చుకోకుండా.. ఇన్సులిన్ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఇన్సులిన్ ఖరీదైనదే కాకుండా.. దాని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఇన్సులిన్ ఇవ్వడం అన్నది పెద్ద కుంభకోణమని నాకు అనిపిస్తోంది. ఇన్సులిన్ మంచి మందు అని రోగులు భావిస్తుంటారు. దీని కోసం డబ్బు ఖర్చు చేయాలి.. లేదా చనిపోతామని వారు అనుకుంటారు. ఎక్కువ మంది రోగులు ఈ మోసానికి గురయ్యే అవకాశాలే ఎక్కువ. రోగులకు ఇన్సులిన్ ఇవ్వడంపై మనం పెద్ద ఎత్తున చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. అసలు భారతదేశంలో మధుమేహం ఎందుకు ఎక్కువగా ఉందన్న పరిశోధనపై ఎక్కువ దృష్టి పెట్టి మూల కారణాలను తెలుసుకోవడం ముఖ్యం.

భారత దేశంలో సహజ ప్రసవాల కంటే, ఆపరేషన్ల ద్వారా జరిగే ప్రసవాలు ఎక్కవ అయ్యాయి. సిజేరియన్ ప్రసవాలు అన్న సమస్య ఈ దేశానికే పరిమితమైన సమస్య కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. సిజేరియన్ చేయించుకోవడం వల్ల వైద్యులకు డబ్బుల ఎక్కువ వస్తాయి. అందుకే, సిజేరియన్ చేయించుకోవడం మంచిదంటూ మహిళలను ప్రోత్సహిస్తూ ఉంటారు. సిజేరియన్ అందరికీ అవసరం ఉండదని, కొన్ని కేసుల్లో మాత్రమే అవసరం అవుతుందని అన్నారు. సిజేరియన్ చేయించుకోవడం అన్నది ప్రమాద రహితమైన ఆపరేషన్ అనుకోవడం సరికాదన్నారు. మత్తు ఇస్తారు, ఆపరేషన్ చేస్తారు, మందులు వాడాలి, ఎక్కువ కాలం ఆస్పత్రిలో ఉండాలి… తర్వాత కాన్పులకు సమస్యలు కూడా ఉంటాయని ఆమె అన్నారు.

వైద్యరంగంలో ఉన్న అవినీతి గురించి మీ అభిప్రాయం?

ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యే. వైద్య రంగంలో కూడా అవినీతి ఉంది. సరైన మార్గాల్లోనే వైద్యులకు ఎక్కువ డబ్బులు వచ్చే ఏర్పాటు ఉంటే, చాలా వరకూ అవినీతి తగ్గుతుంది. లేందంటే.. అనవసరపు ఆపరేషన్లు, అనవసరపు ఇన్వెస్టిగేషన్లు పెరుగుతాయి. లంచాలు ఇలాంటి పరిస్థితిని మరింతగా పెంచుతుంది. ఈ పరిస్థితిని వ్యతిరేకిస్తున్న వైద్యులు ఇపుడు గణనీయంగా పెరుగుతున్నారు. వినియోగదారుల చైతన్యం భారతదేశంలో చాలా తక్కువ. వినయోగదారుల చైతన్యాన్ని పెంచడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఎంత ఎక్కువ మందులు తింటే.. అంత ప్రమాదం అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి. రోగులు ప్రశ్నలు వేయాలి. ఒకటికి రెండుసార్లు వేర్వేరు వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ఫలానా చికిత్స వల్ల ఉండే లాభాలు ఏమిటన్నది క్షణ్ణంగా తెలుసుకోవాలి.

మీరు 1990ల్లో ఇక్కడకు వచ్చారు. వైద్యరంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

కార్పొరేట్ ఆస్పత్రి వైద్యం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. మిగిలిన ప్రపంచం సిగ్గుపడాల్సిన స్థితి. ఇక్కడున్న వైద్య నిపుణులను చూస్తే.. మిగిలిన దేశాల వారు ఆశ్చర్యపోతారు. ఎక్కువ సంఖ్యలో రోగులకు చికిత్సలు, నాణ్యమైన చికిత్సలు… రెండో విషయం. మరి వైఫల్యం ఏమిటి? ప్రాథమిక వైద్యం విషయంలో నాణ్యత లేదు. కార్పొరేట్ వైద్య రంగంలో చేస్తున్న డబ్బులూ, శక్తినీ చూస్తే, ప్రాథమిక వైద్య రంగంలో దాదాపు శూన్యం. పాలక వర్గాలు ప్రాథమిక వైద్య రంగంపై దృష్టిపెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక వైద్య రంగంలో పని చేసే వైద్యులకు ప్రోత్సాహకాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. డాక్టర్లపై ఉండే ఒత్తిడిని కూడా తగ్గించాల్సి ఉంది.

వైద్య రంగంలో వస్తున్న సరికొత్త మార్పులను మీరు ఏమైనా గమనించారా?

డాక్టర్-పేషెంటు నిష్పత్తి దారుణంగా ఉంది. డాక్టర్లు దూషణలకు గురవుతున్నట్లు, కొంతమందిపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైనాలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. డాక్టర్ల నుంచీ, మందుల నుంచీ అతిగా ఆశించడం వల్లనే ఇలా జరుగుతున్నది. ఇతర సమస్యలు లేవని కాదు. చికిత్సను అందించేటపుడు అతిగా ఆశపెడుతున్నాం. చికిత్స కోసం రుణాలు తీసుకుంటున్న రోగులు కూడా ఉంటున్నారు. ఆస్తులు అమ్మి వైద్యం చేయించుకుని, బికారులుగా మారుతున్న వారూ ఉన్నారు. చాలా కఠినమైన నిర్ణయాలు ఇవన్నీ.

మందుల ధరల్ని నియంత్రించడం వల్ల తక్కువ ఖర్చులో వైద్యం అందుబాటులోకి వస్తుందా?

వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మందులు ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైపోయాయి. పరిశోధన ఖర్చుల్ని తిరిగి రాబట్టుకోవాలని మందుల కంపెనీలు చెబుతున్నాయి. మందుల కంపెనీలు కూడా ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునే దిశగా వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో మందుల ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు తమ జేబుల్లో నుంచే చెల్లించాల్సి ఉంది.

–      (ఎకనామిక్ టైమ్స్ సౌజన్యంతో)

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *