రాహుల్ కాకినాడ నుంచి పోటీ…!!

March 16, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలోని కాకినాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారా? ఈ దిశగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాహుల్ ప్రస్తుతం యూపీలోని అమేథీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నది తెలిసిందే. అమేథీ తో పాటు రాహుల్ దక్షిణాది నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇస్తామంటూ కాంగ్రెసు వాగ్దానం చేసింది. రాహుల్ కాబోయే ప్రధాని కాబట్టి… మా రాష్ట్రం నుంచే పోటీ చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కూడా రాహుల్ గాంధీని కోరుతున్నారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చే అభ్యర్థులకు పీసీసీల నుంచి అభ్యర్ధనలు తరచూ వస్తూనే ఉంటాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ (మెదక్) నుంచి 1980లో ఇందిరాగాంధీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అభ్యర్థన.. సొంత పార్టీ నుంచి కాకుండా మిత్ర పార్టీ నుంచి రావడం విశేషం. రాహుల్ ను ఏపీ నుంచి పోటీకి దింపాలన్న ఆలోచన ఎవరిదో తెలుసా? తెలుగుదేశం అధినేత.. చంద్రబాబు నాయుడిదే. కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సొంత పార్టీ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆ సీటు రాహుల్ కు ఇస్తే సరిపోతుందని చంద్రబాబు భావించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఇపుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. రాహుల్ వస్తే.. తన పార్టీకి కూడా కొంత కొత్త జోష్ వస్తుందన్నది ఆయన ఆలోచన. రాహుల్ వస్తే… ప్రియాంకమ్మ కూడా దిగుతుంది కదా. ప్రధాని నరేంద్ర మోడీ కూడా 2014లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. రాహుల్ కూడా అలా చేయాలన్నది కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

చంద్రబాబు ఐడియాలు ఎలాఉన్నా… స్పెషల్ స్టేటస్ ఇస్తానని కాంగ్రెసు అన్నా కాంగ్రెసును ఆంధ్ర ప్రజలు ఇప్పట్లో నమ్ముతారన్న గ్యారంటీ ఏమీ లేదు. మరో పదేళ్ల వరకూ కాంగ్రెసు ఆంధ్రాలో ఖాతా తెరవడం కష్టం కావచ్చు. తెలుగుదేశంతో బహిరంగంగా పొత్తు లేకపోయినా… లోపాయికారీగా తెలుగుదేశం సాయం చేస్తుందనడంలో సందేహం లేదు. రాహుల్ రావడం వల్ల పోర్టు సిటీ రాజకీయాలు పూర్తిగా మారిపోనున్నాయి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *