తెలుగుదేశం ‘‘జన్మభూమి’’కి… వంగవీటి ఫ్యామిలీ ఎలా స్ఫూర్తి అయింది?

January 17, 2019 | News Of 9

Ranga Family is the inspiration behind Janmabhoomi programme | News of 9

  • చెడుతోపాటు మంచి చెప్పుకోవడం మంచిదే

తెలుగుదేశం పార్టీ ఇపుడు ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న ‘‘జన్మభూమి-మా వూరు’’ ప్రభుత్వ పథకం మూలాలు కృష్ణాజిల్లాలో ఉన్నాయి. విజయవాడకు సమీపంలో ఉయ్యూరు అనే గ్రామంలో పంట కాల్వలో గుర్రపు డెక్క బాగా పెరిగిపోయి నీటి ప్రవాహం ఆగిపోయింది. అప్పటికి ఒక సంప్రదాయం ఏమంటే ఇరిగేషన్ అధికారులు రావాలి… కాల్వల్లో అడ్డుపడుతున్న గుర్రపు డెక్క (తూడు) తియ్యాలి. ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయో తెలుసుకదా. దీంతో వంగవీటి రంగా సోదరుడు చలపతిరావు… రైతుల్ని సమీకరించి వారితోపాటు తాను కూడా కాల్వలోకి దిగి గుర్రపు డెక్కను తొలగించారు. ఈ వార్తను ఈనాడు ప్రచురించింది. అప్పట్లో ఈనాడు జిల్లా పత్రికలను ప్రారంభించిన తొలి రోజులు. కృష్ణాజిల్లాలో వ్యవసాయ వార్తలకు పెద్దపీట ఉండేది. దీంతో.. దీనిని ఇంకాస్త ప్రోత్సహిస్తే బాగుంటుందన్న ఆలోచన కృష్ణాజిల్లా డెస్కులో ఉన్న పాత్రికేయులం (మేము) ఆలోచించి.. స్వయం కృషి పేరుతో ఈ వార్తలను ప్రచురించడం అనతికాలంలోనే ఇది జిల్లా మొత్తానికీ వ్యాపించింది. ఈనాడులో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. ఒక జిల్లాలో జరిగిన మంచి పనులకు సంబంధించిన వార్తల్ని స్ఫూర్తి కోసం ఇతర జిల్లా ఎడిషన్లలో ప్రచురించే వారు. ప్రధాన సంపాదకులు రామోజీరావు ఆలోచనే. అలా గుంటూరులో కూడా ఉద్యమం అందుకుంది. ప్రతి 3 నెలలకోసారి ఆయన విజయవాడ వచ్చి జిల్లా సంపాదకులతో విడివిడిగా కలిసి సమీక్షా సమావేశాలను నిర్వహించేవారు. గత మూడు నెలలూ ఏం చేశామో వారికి వివరించాలి. తర్వాత 3 నెలలూ ఏం చేస్తామో చెప్పాలి. ఏ మాటకు మాట. డబ్బున్న వర్గాలు ఆ తర్వాత పత్రికలూ, టీవీలూ పెట్టినా, రామోజీరావులా ధవళ వస్త్రాలు ధరించినా ఆ స్థాయికి వెళ్లడం కష్టమని వారికి తెలియదుకానీ.. నాకు తెలుసు.

ఒక త్రైమాసిక సమీక్షలో ఈ ‘‘స్వయంకృషి’’ వార్తలు చర్చకు వచ్చాయి. ఈ వార్తలన్నింటినీ ‘‘సెల్ఫ్ రిలయన్స్’’ అని ఒక ఫైల్ పెట్టి హైదరాబాదు లైబ్రరీలో భద్రపరచమని చెప్పారు. దీన్ని ఒక ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని నేను సూచించాను. ఈనాడు తొలి పేజీలో మీ సంతకంతో ఒక సైన్డ్ ఎడిటోరియల్ రాసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని చెప్పాను. అందుకు ఆయన ‘‘నీ మొఖం.. నేను హైదరాబాద్ వెళ్లాక చూడు’’ అన్నారు. సీనియర్లు బిత్తరపోయి నా వంక చూస్తున్నారు. నాకేం భయం. చేరిన కొత్త. అయినా ధైర్యంగా మాట్లాడేవాడిని. ఆయన రాజధాని (హైదరాబాద్)కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కృష్ణాజిల్లా మొత్తం పర్యటించి మా సబ్ ఎడిటర్లం అంతా.. దీన్ని ఉద్యమంగా చేపట్టాం. గ్రామీణ విలేకరులకు ఇదే ఉద్యమం. కొన్నాళ్ల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దీనిని ‘‘జన్మభూమి’’ పథకంగా ప్రకటించింది. సంతోషించాను. రామోజీ… చంద్రబాబుకు సూచించినట్లు అర్థమైంది. ఇదీ బాగానే ఉంది అనుకున్నాను. రైతు సమస్యలు పరిష్కారమైతే అది పదివేలు అనుకునేవాడిని.

క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడో మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు తెలుగుదేశం వారితో నింపేశారనీ, అడ్డంగా డబ్బులు దోచుకుంటున్నారని అని విమర్శించారు. ఇంత మంచి కార్యక్రమం విజయవాడలో అదీ ఈనాడు దినపత్రిక కార్యాలయంలో.. అదీ మా ఉప సంపాదకుల ఆలోచనగా ప్రారంభం అయింది కదా అని గుర్తుకొచ్చి బాధపడ్డాను. మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా గబ్బు పట్టాయో ఈ గబ్బు మొత్తం జన్మభూమికి అంటుకుపోయింది.

మర్చిపోయాను. ఇంకో విషయం చెప్పాలి. రామోజీరావు విజయవాడ వచ్చినపుడు ‘స్వయంకృషి’ రైతు చైతన్య కార్యక్రమాలకు స్ఫూర్తి ఎవరు అని అడిగితే… మా సంపాదకుల్లో సీనియర్ అయిన నవీన్ వివరించి చెప్పారు. రంగా సోదరుడే దీనికి స్ఫూర్తి అని నవీన్ చెప్పగానే రామోజీరావు అవాక్కయ్యారు. ఆశ్యర్యపోయారు. వాళ్లంతా ఆ తానులో ముక్కేనని అనుకున్నానే అని అన్నారు. అలా ఏమీ కాదని నవీన్ చెప్పారు. అయితే… ఈనాడు ప్రధాన పత్రికలో వేద్దాం అన్నారు రామోజీరావు. రంగా ఫ్యామిలీ ఏమిటి…? ఫస్ట్ పేజీలో ఏమిటి? ఇది ఎక్కడ కొంప ముంచుతుందోనని కొందరు సీనియర్ పాత్రికేయుల ముఖాలు చిన్నబోయాయి. రామోజీరావు ఒకసారి కన్వీన్స్ అయ్యారా.. ఇక అది శిలాశాసనం.

రంగా సోదరుడు చేసిన స్వయంకృషి వార్తలు ఈనాడు మొదటి పేజీలో అచ్చయ్యాయి. చంద్రబాబు పుణ్యమా అని అది ప్రభుత్వ పథకం అయింది. జన్మభూమి పేరతో ఎక్కడ లేని చెడ్డ పేరును సంపాదించుకుంది. ఇదీ జన్మభూమి పుట్టుపూర్వోత్తరాలు. జన్మభూమిని తెలుగుదేశం మెదడులో పుట్టిన అద్భుత పథకం అనుకుంటే ప్రజలు పప్పులో కాలేసినట్లే.

(ఎవరికైనా అనుమానం ఉంటే… ఈనాడుకు పెద్ద లైబ్రరీ ఉంది. అందులో ప్రతి కాగితం ఉంటుంది. స్వయంకృషి ఫైళ్లు ఇంకా జాగ్రత్త చేసి పెట్టి ఉంటారనే భావిస్తున్నాను.)

                                                                                                                                                                –      జి.శ్రీనివాసరావు

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *