కాషాయధారి ఇక… రావెల్!!

June 8, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

జనసేన పార్టీ ప్రక్షాళన కోసం జన సైనికులు ఎదురు చూస్తున్న సమయంలో ఓ వికెట్ పడింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు శనివారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఒక లేఖను పంపారు. జనసేన పార్టీ తరఫున రావెల కిషోర్ బాబు గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. డిసెంబరు 1, 2018న జనసేన పార్టీలోకి అట్టహాసంగా చేరిన రావెల కిషోర్ బాబు పార్టీకి అంకితభావంతో పని చేస్తానని, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు నచ్చాయని, దళిత బడుగు వర్గాలకు రాజ్యాధికారం జనసేనతోనే సాధ్యమని చెప్పారు. అంబేద్కర్, కాన్షీరాం ఆశయాలతో మొదలైన జనసేన పార్టీలో చేరుతున్నందుకు అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేసిన రావెల కిషోర్ బాబు… జనసేన నుంచి ముందే ఆయన వెళ్లిపోతున్నారు. ఓటమిని భరించే శక్తి, దీర్ఘాకాలం పోరాటం చేసే సామర్ధ్యం రాజకీయ నాయకులకు అవసరం. ఓటమి రాగానే… కొత్త అవకాశాల కోసం వెదుక్కుంటూ వెళ్లిపోవడం రావెల కిషోర్ బాబుకే చెల్లిందని గుంటూరు జిల్లాకు చెందిన జన సైనికులు వ్యాఖ్యానించారు. ‘‘రావెల కిషోర్ బాబుపై తనకు ముందు నుంచీ అనుమానం ఉంది… ఆయనకు సైద్ధాంతికపరమైన కట్టుబాటు లేదు. కాన్షీరాం, అంబేద్కర్ పేర్లు ఆయన బయటకు చెబుతారు కానీ.. ఆయన ఆలోచనలు పెట్టుబడిదారీ రాజకీయ పార్టీలకు చెందిన నేతల మాదిరిగానే ఉంటాయి. సైద్ధాంతిక నిబద్ధత లేనివారు జనసేనలో ఉండలేరు. ఎవరు వెళ్లిపోయినా జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ తోనే ఉంటారు’’ అని పత్తిపాడుకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానించారు.

కాన్షీరాం నుంచి కాషాయానికి బదిలీ

కాన్షీరాం శిష్యుడుగా చెప్పుకుంటున్న రావెల కిషోర్ బాబు గారు కాషాయ పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాషాయ పార్టీ అంటే భాజపా. ఇప్పటికే ఆయన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో శనివారమే భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రంలో… భాజపా పాగా వేయడానికి భాజపా పావులు కదుపుతోంది. దానిలో భాగంగా భాజపా అన్ని పార్టీల్లో ఉన్న నేతల్ని గుర్తించే పని ఏపీలో చురుగ్గా సాగుతోంది. ఒక వైపు పార్టీ సభ్యత్వాలను పెంచుకునే పని కూడా భాజపా ప్రారంభించింది. వారం రోజుల కిందట.. పలనాడుకి చెందిన జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఈ కసరత్తులో భాగంగానే రావెల భాజపాలో చేరుతున్నారు. ఆదివారం నాడు ప్రధాని మోడీ తిరుపతికి వస్తున్నారు. ఈ సందర్భంలోనే రావెల భాజపా తీర్థం పుచ్చుకుంటారు. నీలం కండువాను తొలగించుకుని… కాషాయ కండువాను కప్పుకుంటారు.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *