చంద్రబాబూ… ఏమా ధైర్యం? ఆ కిటుకు ఏమిటో చెప్మా…?!

May 20, 2019 | News Of 9

  • ఆయన ఒరలో రెండు ప్లాన్లు… ఏది నిజం?  
  • ఫలితాలు రాకముందే హడావుడి వెనుక రహస్యం?

(న్యూస్ ఆఫ్ 9)

మాకెందుకో… ఎడమ కన్ను అదురుతున్నది. మా లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే లేదు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం పదే పదే గెలుస్తున్నామంటూ తెలుగుదేశం శ్రేణులకు చెప్పడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. మామూలుగా కాదు.. ఏకంగా వెయ్యిశాతం తామే గెలుస్తామని చెప్పడమే ఈ ఆందోళనకు కారణం. ఆయన ఏదీ ఊరికే అలా చెప్పరని చంద్రబాబు గురించి తెలిసిన వారు తేలికగానే అంచనా వేయవచ్చు. గెలిస్తే వైసీపీ గెలవాలి లేదంటే జనసేన గెలవాలి. తెలుగుదేశం పార్టీ ఎలా గెలుస్తుంది అన్నది ప్రశ్న. ఇందుకు చంద్రబాబు చెబుతున్న కారణం.. పోలింగ్ రోజు సాయంత్రం తాను పిలుపు ఇచ్చిన తర్వాత మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారని, అంట్లు తోముతున్న వాళ్లు కూడా చేతులు కడుక్కోకుండా అలాగే వచ్చేశారని, వారంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేసి హమ్మయ్య అనుకున్నారని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు పిలుపును అందుకుని వచ్చిన మహిళల్లో వైసీపీ వాళ్లు, జనసేన వాళ్లు ఉంటారని ఆయన అనుకోవడం లేదు. ‘‘పసుపు-కుంకుమ’’ పథకానికి వాళ్లు ఫిదా అయిపోయారన్నది చంద్రబాబు చెబుతున్న మాట. ఆయనకు తెలియని విషయం ఒకటి ఉంది.. పసుపు-కుంకుమ డబ్బులు తీసుకుని జనసేనకు, వైసీపీకి ఓటు వేసిన మహిళలు కూడా ఉన్నారు. ఇవన్నీ ఒదిలేసి… టీడీపీ వచ్చేస్తోందని ఢంకాబజాయించి మరీ చంద్రబాబు ఎందుకు చెబుతున్నట్లు…?

రెండు కారణాలు ఉండి ఉండొచ్చు.

1.        వైసీపీ గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటిస్తే, అంతా తొండి… మోడీ స్వయంగా వైసీపీకి ఓట్లు వేయించేశారని, ఈవీఎంలను హైజాక్ చేశారని, తాను అందుకే యుద్ధం చేస్తున్నానని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, తాము ఈ ఎన్నికల ఫలితాన్ని ఒప్పుకోవడం లేదని నానా యాగీ చేయడం ఆయన ఉద్దేశం కావచ్చని మా అనుమానం. రాజగోపాల్ సర్వేలోనూ, తాము సొంతంగా నిర్వహించుకున్న సర్వేలోనూ 90 శాతం మహిళలు తమకే ఓటు వేశారని వాదించడం ఆయన ఆలోచన కావచ్చు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఓడిపోదని, తాము ప్రజల్ని పరిపాలించడానికే అవతరించిన మహా పురుషులమని ప్రజలకు కూడా ఈ సంగతి బాగా తెలుసునని, అలాంటిది తాము ఎన్నికల్లో ఓడిపోవడం జరిగే పని కాదని చెబుతారు. డామిట్ మోడీ అంటూ శివ తాండవం చేయడం దీని వెనుక ఉద్దేశంగా ఉండొచ్చు.

2.       తామే వస్తున్నామని బల్లగుద్ది మరీ చెప్పడానికి మరో కారణం ఉండొచ్చు. ఓటర్ల జాబితా నుంచి ఆయన చాలా మంది ఓటర్లను తీసిపారేశారు. సేవామిత్ర యాప్ ను ఉపయోగించి ఓటర్లకు ఫోన్లు చేసి తెలుగుదేశం వ్యతిరేక ఓటర్లను చాకచక్యంగా గుర్తించారు. దీని గురించి ‘‘న్యూస్ ఆఫ్ 9’’ గత జనవరిలోనే ఒక వార్తను ప్రచురించింది.  ఆ తర్వాత డేటా చౌర్యం కథ వెలుగు చూసిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల జనసేన, వైసీపీ ఓటర్లను గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ప్రత్యేకంగా కొన్ని టీములు రాష్ట్ర వ్యాప్తంగా పని చేసిన విషయం తెలిసిందే. ఓట్లు గల్లంతయిన విషయం బయటకు పొక్కడంతో చాలా మంది మరోసారి తమ ఓట్లను నమోదు చేసుకున్నారు. భారతదేశం మొత్తం ఓటర్ల సంఖ్య పెరిగితే ఒక్క ఏపీలోనే ఓట్లర్ల శాతం మైనస్ లో నమోదైంది. చాలా తక్కువ సమయం ఉండటం వల్ల చాలా మంది ఓట్లను నమోదు చేసుకోలేకపోయారు. కొంత వరకూ కొందరు తిరిగి ఓట్లను నమోదు చేసుకున్నా… చాలా మంది చేసుకోలేకపోయి ఉండొచ్చు. దీనికి సంబంధించిన నిర్ధిష్టమైన సమాచారం మనకు లభించడం లేదు. చాలా లోతుగా పరిశోధన చేయాల్సిన అంశమిది. ఫలితాన్ని ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్లీ ఎన్నికలు అయితే పెట్టే అవకాశం చాలా అరుదు. ఈ విషయంలో నిజానిజాలను నిర్ధారణ చేయగలిగిన సామర్ధ్యం ఒక్క వైసీపీకి మాత్రమే ఉంది. మరి ఈ విషయంలో ఆ పార్టీకి ఉన్న భరోసా ఏమిటో తెలియదు.

3.       వైసీపీ గెలుస్తుందంటూ వచ్చిన ఎగ్జిట్ ఫలితాలపై చంద్రబాబు మండిపడుతున్నారు. ఏకంగా ఎన్నికల సంఘం దగ్గర ధర్నా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. జాతీయ స్థాయిలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ ఫలితాలు చెప్పడం ఆయన అరికాలి మంట నెత్తికి ఎక్కి ఉంటుంది. మొత్తానికి ఎన్నికలన్నీ రిగ్గు అయిపోయాయని దేశం మొత్తం రాద్ధాంతం చేయడం ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. అసలు కౌంటింగ్ ప్రక్రియనే ఏదో విధంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అదండీ… మాకు ఎడమ కన్ను అదరడానికి కారణాలు. ఎన్నికల్లో అసలు పోటీ నెలకున్నది వైసీపీ, జనసేన మధ్యనే అన్నది ఒక సమాచారం. ఈ సమాచారం ప్రకారం… అయితే వైసీపీ, లేదా జనసేన ఫలితాల్లో ముందంజలో ఉండాలి. తెలుగుదేశం ఎలా ఉంటుంది? కేవలం ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే టీడీపీ అనేక తాయిలాలను ప్రకటించిందన్న విషయం ఓటర్లకు తెలిసిన విషయమే. రాజగోపాల్ సర్వే కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండటానికి కారణం… నెపాన్ని రేపు ఈవీఎంలపై నెట్టడానికే అయి ఉంటుందని మేం బలంగా నమ్ముతున్నాం. లేదా… పైన చెప్పిన 2వ కారణం కూడా కావచ్చు. ఏదీ స్పష్టంగా చెప్పకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యితెర వెనుక ఏం చేసినా… అంతా తెలుగు ప్రజల కోసమేనని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమేనని ఆయన చెప్పడం ఆనవాయితీ. అందుకే… ప్రజాస్వామ్యాన్ని ఒక వైపు హననం చేస్తూ మరోవైపు దానిని కాపాడతామని వారే స్వయంగా చెబుతున్నారు. ఈ ధోరణి మిగిలిన రంగాలకూ పాకింది. తప్పులు చేసిన వారు ఆంధ్రాకు పారిపోవడం, నీతి నిజాయితీలకు తామే ప్రతినిధులం అన్నట్లు మాట్లాడటం ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఏ వెలుగుల కోసమో చంద్రబాబు గారి విన్యాసాలు అర్థం కావడం లేదు. తెలుగు ప్రజల్ని ఆ దేవుడే రక్షించాలి..!!

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *