చీకటి కోణం: ‘వంతాడ’కు ఉరి… పది వేల కోట్లు హరీ!!

November 15, 2018 | News Of 9

Vanthada | telugu.newsof9.com

ప్రకృతిని చెరబట్టి… వంతాడ గనుల ద్వారా అక్రమార్కులు దోచుకున్న సొమ్ము ఎంతో తెలుసా? జనసేన ఆరోపించినట్లు రూ.3 వేల కోట్లు కాదు.. ఇప్పటి వరకూ అక్షరాలా రూ. 10 వేల కోట్లని అంచనా. ఇది మరో ఓబులాపురాన్ని మించిన కుంభకోణం!!

 

2002 లో మొదలైన ఈ దోపిడీ నేటికీ కొనసాగుతూనే ఉన్నా… తెలుగుదేశం ప్రభుత్వంగానీ, అధికార యంత్రాంగం గానీ దీనిపై ఇంత వరకూ చర్య తీసుకోలేదంటే అక్రమార్కులు ఏ స్థాయిలో రాజకీయ నాయకులకూ, అధికారులకూ లంచాలు మప్పి… లొంగదీసుకుంటున్నారో అర్థం అవుతుంది.

దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన స్వచ్ఛంద సంస్థలపైన… ‘‘నగ్నంగా ఉన్న ప్రైవేటు ఆర్మీ’’ బాణాలతో దాడులు చేస్తోందని బాహ్య ప్రపంచంలో ఎందరికి తెలుసు?

తెలుగుదేశం ప్రభుత్వం నిద్రపోతున్నదా…? లేక, అన్నీ తెలిసీ…తెలియనట్లు నటిస్తున్నదా? చదవండి… ‘‘వంతాడ’’ గనుల బాగోతానికి సంబంధించిన వాస్తవ కథను క్షేత్రస్థాయి నుంచి ‘‘న్యూస్ ఆఫ్ 9’’ సేకరించింది.

(న్యూస్ ఆఫ్ 9 స్పెషల్ స్టోరీ)

తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న కొండ ప్రాంతాల్లో చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతిలో వంతాడ గ్రామం. 2001 వరకూ ఈ గ్రామం గురించి ఎవరికీ తెలియదు. అప్పట్లో మలేరియాతో చాలా మంది మృత్యువాత పడుతున్నపుడు తొలిసారి ఈ గ్రామం గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ తూర్పు కనుమలు వంతాడ ఒక్కటే కాకుండా, ఏలేశ్వరం, శంఖవరం, రవుతులపూడి, కోట నందూరు, తాండవ, కాకరపాడు, కొయ్యూరు, రాజ వొమ్మంగి, అడ్డతీగల మండలాల వరకూ విస్తరించి ఉన్నాయి. వంతాడ అక్కడున్న మూడు కొండలపైన ఉంది.  దీన్ని నాగుల పర్వతం అని అంటారు. మేకలు వెళ్లే దారిలో నడుస్తూ కొండెక్కితేగానీ ఒకప్పుడు వంతాడను చేరుకోలేని దుస్థితి. ఈ మూడు కొండలకు చుట్టుపక్కల 100 నుంచి 200 గ్రామాలు ఉంటాయి. కొండపైన వంద గ్రామాలు ఉంటాయి. ఇక్కడున్న గిరిజనులకు కలపేతర అటవీ ఉత్పత్తులే (తేనె, కుంకుళ్లు) ఆధారం. కొండ కిందకు వచ్చి వాటిని అమ్ముకునేవారు గిరిజనులు. కొండపైన సహజంగా ఉన్న జలపాతాల నుంచి మంచినీళ్లు తెచ్చుకునేవారు. గనుల తవ్వకాలు జరగక ముందు వరకూ గిరిజన సంప్రదాయాలే ఉండేవి. బాక్సైటు ఖనిజం ఉన్న మట్టి గొప్పతనం ఏమంటే అది నీటిని నిల్వ చేసుకుంటుంది. వేసవిలో ఆ నీరు కరిగి జలపాతంలా రాళ్లపై నుంచి పారుతూ ఉంటాయి. కొంత ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల దాహం తీరడానికి ఇది ఆధారం. గనుల కోసం అక్రమార్కులు వచ్చిన తర్వాత నుంచీ సహజ నీటి వనరులు కనుమరుగైపోయి… ఇపుడు గిరిజనులు తాగడానికి చుక్క మంచినీరు లేని పరిస్థితి. గనులు తవ్వకాలు మొదలైన తర్వాత ఇక ప్రకృతి సమతౌల్యం దెబ్బతిన్నది.

దోపిడీకి ముందు నేపథ్యం…  

అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం మొదలైంది కానీ, ఇవన్నీ గ్రామాలుగా గతంలో ఎప్పుడూ లేవు. పిఠాపురం రాజులు వేటకు వెళ్లినపుడు గిరిజనుల సాయం తీసుకోవడానికి ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు. కొండపైన మొత్తం గిరిజన తాండాలే ఉన్నాయి. వీటిని ఆక్రమిత గ్రామాలని అప్పట్లో పిలిచే వారట. అక్కడక్కడా బౌద్ధమంతం ఛాయలు కనిపిస్తాయి. శివాలయాలూ ఉన్నాయి.  అప్పట్లో దారిలేని 55 గ్రామాలను ఆక్రమిత గ్రామాలని చెప్పేవారు. నాగుల పర్వతం ఎక్కడానికి గిరిజనులు మేకలు నడిచే దారినే ఉపయోగించేవారు. కొండ కిందకు వచ్చి.. అటవీ ఉత్పత్తులను అమ్ముకుని పైకి వెళ్లిపోయేవారు గిరిజనులు. అప్పటికి ఇంకా దోపిడీ ప్రారంభం కాలేదు. తొలిసారి అటవీ సంరక్షణ పేరుతో ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చాయి. రూ.1800 కోట్లను రెండు విడతలుగా వన సంరక్షణ సమితులను ఏర్పాటు చేసి… వాటి ద్వారా అటవీ సంరక్షణను ప్రారంభించారు. దాదాపు 480 గ్రామాల్లో ఈ పనులు చేపట్టారు. అడవి ఎంత పెరిగిందో తెలియదు గానీ, అడవిలోకి స్వార్థపరుల కాలు పెట్టింది అదే సమయం. 2001-2002 సంవత్సరంలో రవి అనే ఒక వ్యక్తి అక్కడ కాలు పెట్టాడు.

దుర్మార్గం కాలు పెట్టింది ఇలా…!!

ఏదైనా చూసేవాళ్ల కళ్లను బట్టి ఉంటుంది కదా.. మనకు చెట్టూ, పుట్టా, అమాయకులైన గిరిజనులు కన్పిస్తారు. రవికి గనులు కనిపించాయి. అతను గనుల తవ్వకంలో నిపుణుడు మరి. ఎక్కడెక్కడ  గనులున్నదీ రెక్కీ చేసి డబ్బు చేసుకోవడం అతని వ్యాపారం. అటవీ ప్రాంతాల్లో ఏం చెయ్యాలన్నా.. ముందు స్వచ్ఛంద సంస్థ ఉంటే… సేవ పేరుతో లోపలికి స్వేచ్చగా వెళ్లవచ్చు. రవి అదే పని చేశాడు. హైదరాబాదులో ఒక స్వచ్ఛంద సంస్థను రంగంలోకి దింపాడు. బ్యాంకు రాజుగా పిలిచే స్థానిక నేతను పట్టుకున్నారు. అడవి నుంచి వెళ్లేటపుడు వారంతా లాటిరైటు రాళ్లు పట్టుకుపోయారు. లక్ష్మీదేవి అందులో దాగి ఉందని పరీక్షల ద్వారా వారికి అర్థమైంది. సహకరించడానికి గిరిజనులు అడిగింది ఏమిటో తెలుసా? రాములోరి గుడి. అంతే హైదరాబాదు నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు వంతాడ అడవిలో ప్రత్యక్షం అయ్యాయి. గిరిజనుల ఆనందానికి అవధుల్లేవు. గిరిజనులకు తలకు రూ.500 పడేశారు. అంతే తెల్లకాగితాలపై సంతకాలు చేసేశారు. తగినంత సారాయి కూడా వారి గొంతుల్లో పోశారు. ఈస్టిండియా కంపెనీ మన దేశంలో కాలుపెట్టినపుడు కూడా స్థానికులను ఆకర్షించడానికి టీ పోశారట. అంతే బానిసలం అయ్యాం. ఇపుడు జరిగిందీ అదే తరహా! లొంగదీసుకోవడం!!  గిరిజనులను లొంగదీసుకోవడానికి వారికి నీలిచిత్రాలను కూడా చూపించేవారంటే, వారిని ఏ స్థాయిలో లొంగదీసుకున్నారో తెలుస్తోంది. 1983-84 సంవత్సరంలో ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ గిరిజనులకు డి-పట్టాలు ఇచ్చారు. ఈ పట్టా భూముల్నే రూ.500 ఇచ్చి అక్రమార్కులు లాగివేసుకున్నారు. స్థానిక ఎమ్మేల్యే సాయంతో.. అక్రమార్కులు కొండపైకి రోడ్డు వేసుకున్నారు. అసలు ఈ భూములకు పట్టాలే లేవని, సర్వే చేయని ప్రాంతం అని చెప్పి రెవిన్యూ నుంచి నివేదికలు అక్రమార్కుల చేతికి వచ్చాయి.  వరుపుల సుబ్బారావు తెర వెనుక దన్నుగా ఉంటారు… గనుల తవ్వకాలు మొదలయ్యాయి. లారీలు వస్తున్నాయి. లాటిరైటును తవ్వుకుని పట్టుకుపోతున్నాయి. రవి, శ్రీనివాసు అనే ఇద్దరూ బావా బావమరుదులు.  మైనింగ్ చేస్తున్న కంపెనీలు వీళ్లిద్దరివే. కుడే లక్ష్మీ అనే ఆమెకు కూడా లీజు ఉన్నది. శోభన్ బాబు పేరు మీద గనులున్నాయి కానీ… అతను కూడా రవి, శ్రీనివాసు అనే వారికి బినామీ అని తెలిసింది. స్థానికంగా ఎంపీపీగా ఉన్న వరుపులా రాజా కూడా ఈ గనుల వల్ల కోట్లు సంపాదించారని చెబుతారు. కాంగ్రెసు ప్రభుత్వాలు ఉన్నపుడు మైనింగ్ అడ్డూ ఆపూ లేకుండా జరిగి పోయింది. ఒక రకంగా ఓబుళాపురంలో ఎలా అయితే… ఇష్టం వచ్చినట్లు మైనింగ్ జరిగిందో వంతాడను కూడా అదే విధంగా దోచుకున్నారు. గిరిజనుల దగ్గర నుంచి అధికారులు, రాజకీయ నాయకుల వరకూ అందరికీ వాటాలు ఉన్నాయి. ఊళ్లు దుమ్ము కొట్టుకుపోయాయి. లారీల రాకపోకల కోసం రోడ్లు వచ్చేశాయి.

అయ్యో అన్న పద్దుల కమిటీ కూడా మోసం చేసింది!

అనేక ఫిర్యాదుల మీదట…  ఒకసారి శాసన సభ పద్దుల కమిటీ వచ్చింది కానీ.. అది మైనింగ్ అక్రమం అంటూ చెప్పి, గనులను ఆండ్రూస్ కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీలన్నింటికీ ఒకడే ప్రజా సంబంధాల అధికారి ఉన్నాడంటే… ఏదో ఒక రూపంలో వీటి అన్నింటినీ నడిపించే అదృశ్య శక్తి ఒకటే అన్నది నిజం. నిన్న మొన్న జనసేన అధ్యక్షుడు వంతాడ వెళ్లే వరకూ మైనింగ్ నిరాఘాటంగా సాగిపోతున్నది. అదో ప్రైవేటు రాజ్యం. అక్కడ ప్రైవేటు సైన్యాలు కూడా ఉన్నాయి. సొంత సామ్రాజ్యంలా మైనింగ్ ప్రాంతాలన్నింటికీ ఇనుప కంచెలు కూడా వేశారు. బయట వారు ఎవరైనా అక్కడికి వెళితే… వాళ్లపైన నగ్నంగా ఉండే గిరిజనులతో దాడులు చేయిస్తున్నారు అక్రమార్కులు. అక్కడికి వెళ్లడానికి ఎవరూ సాహసం చేయడం లేదు.  ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి… ఎవరినీ అక్కడికి రానివ్వడం లేదు. కనీసం 150 ఎకరాల కంటే ఎక్కవ విస్తీర్ణంలోనే మైనింగ్ జరుగుతోందని జనసేన ఆరోపించింది కానీ… నిజానికి 2000 ఎకరాల్లో అక్రమంగా మైనింగ్ సాగుతోందని స్థానిక సమాచారం. దీనివల్ల ఇప్పటి వరకూ కనీసం రూ.10 వేల కోట్లు అక్రమార్కులు సంపాదించుకుని ఉంటారని అనధికారికంగా తెలుస్తోంది. టన్ను లాటిరైటుకు రూ.20 రూపాయలు తీసుకునే రాజకీయ నేత కూడా కోట్లు సంపాదంచాడని చెబుతున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తోంది?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వంతాడ గనులపై ఆరోపణలు గుప్పించినా… చంద్రబాబు ప్రభుత్వం కిమ్మనడం లేదు. ప్రభుత్వం నిద్రపోతున్నదా లేక నిద్రపోతున్నట్లు నటిస్తోందా అన్నది తెలియదు. తక్షణం చర్యలు తీసుకునేది. గతంలో 15 మంది అధికారులను సస్పెండు చేశారు కానీ… డబ్బు కోసం సాగే వేటలో ప్రకృతి బలి అయిపోతున్నది. గిరిజన సంప్రదాయాలూ మట్టిలో కలిసిపోతున్నాయి. మైదాన ప్రాంతాల డబ్బు దాహం ముందు, రాజకీయ పార్టీల స్వార్థం ముందు,  వంతాడ ఓడిపోయింది. గిరిజనులు ఓడిపోయారు. నాగుల పర్వతం కథ వింటుంటే మీకు జేమ్స్ కామరూన్ తీసిన అవతార్ సినిమా గుర్తుకు వస్తున్నది కదూ…!!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *