ఇంకా అక్రమాలు చేసే వారినే నమ్ముతారా?: పవన్

November 29, 2018 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

అమలాపురం: యువత, మహిళలు తలచుకుంటే… ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చవేయగలరని, ఆ నమ్మకంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, మార్పు తెచ్చే శక్తి వారికి మాత్రమే ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అమలాపురంలో చేనేత కార్మికులు, విద్యార్ధులతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. పాత తరం వారు తనను అంతగా నమ్మకపోవచ్చని, ఈ అబ్బాయి ఏం చేస్తాడులే అనుకుంటారని, కానీ యువత, ఆడపడుచులు మాత్రం తనను నమ్ముతున్నారని చెప్పారు. పాత తరం రాజకీయాలు వద్దు.. ఆ తరానికి ప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు, లోకేష్, జగన్ వద్దని అన్నారు. ‘‘నేను రేపటి తరం ప్రతినిధిని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. తాను కొత్త తరాన్నే ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. పెద్దవాళ్లు అంతగా తనను నమ్మరని చెబుతూ… ఎలా ఉంటే నమ్ముతారు…? చంద్రబాబులా అవినీతికి పాల్పడితే నమ్ముతారా? లేక జగన్ లా జైలు కెళ్లి వస్తే నమ్ముతారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

కొత్త ప్రభుత్వాన్ని తెద్దామని మీరంతా రోజూ ఒక సారి అనుకోమని చెప్పారు. ఇపుడున్న నాయకులకు మనల్ని పాలించే హక్కులేదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోవడంపై మాట్లాడుతూ ‘‘ఏం చేసుకుంటాం ఈ డబ్బులు… దరిద్రపు డబ్బులు ఏం చేసుకుంటాం. ఎన్ని నోట్ల కట్టలు సంపాదిస్తావ్?’’ అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ‘‘ఉమ్మడి సంపాదనను అందరికీ పంచవయ్యా అని చెబితే.. నేను ఇచ్చాను. నేను ఇచ్చాను అంటూ చంద్రబాబు మాట్లాడుతుంటే వినడానికే అసహ్యంగా ఉంది’’ అని అన్నారు. మొన్న చంద్రబాబు తెలంగాణలో మాట్లాడుతూ కూడా జనసేన అంటున్నాడు. ఆయనకు మనసులో జనసేన, పవన్ కళ్యాణ్ నిండిపోయారు. భయం వేస్తోంది ఆయనకు’’ అని వ్యాఖ్యానించారు. దేశ సంపద అంటే తనకు యువత గుర్తుకొస్తుందని, జగన్, చంద్రబాబులకు మాత్రం వేల ఎకరాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. చేనేత రంగంలో ఉన్నవారిని కార్మికులు అని పిలవలేనని, వారు కళాకరులని, వారు బాగుండాలని, వారికి అండగా నిలబడతానని చెప్పారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *