డ్రోన్ రాజకీయాలు ఆపండి..

August 18, 2019 | News Of 9

కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లుపడుతుంటే.. వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయం.

రెండు రోజులుగా కృష్ణాతీర ప్రజలు వరదలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వరద ఉదృతి పెరిగిపోవడంతో ప్రకాశం బ్యారేజీ కెపాసిటీకి మించి ఎగువ నుంచి వస్తున్న నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నగరంలోని కృష్ణలంక ప్రాంతం నీట మునిగింది. నదికి నివాస ప్రాంతాలకి తేడా లేనంతగా పరిస్థితి ఉంది. బ్యారేజీ ప్రమాదకరంగా ఉందని వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం తమ సహజదోరణిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. పునరావాస సహాయ కార్యక్రమాలు పక్కనపెట్టి అధికార పార్టీ చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించడంపై దృష్టి పెట్టిందని ప్రతిపక్షం.. టీడీపీ నేతలు వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని అధికారపక్షం ఆరోపిస్తోంది. వరద ఉదృతిని తగ్గించడంలో విఫలమవడమే కాక మంత్రులు, అధికార పక్ష నేతలు డ్రోన్లు ఎగరేస్తూ తన ఇల్లు మునుగుతోందాలేదా అని చూస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతిపక్ష నేత హైదరాబాదులో ఉండి లేనిపోని చిచ్చులు పెడుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు.

వరద ఉధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వం విధి. కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటమా మంత్రుల బాధ్యత. కరకట్ట మీద ఉన్న మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారు రెండు రోజులపాటు బస చేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గారి గృహం, అదే వరుసలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసంతో పాటు ప్రముఖుల ఇళ్ళు, శ్రీ శారద పీఠం కార్యక్రమం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళిన ఆశ్రమం ఉన్నాయి. వరద ఉధృతి పెరిగితే అన్నీ మునుగుతాయి. డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదు. ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావల్సిన అన్ని రకాల సహాయాలు చేయండి. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్ళి రాజకీయాలు చేస్తూ బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరవాత చేసుకోండి. ఇది విపత్కాలం. ముందు వరద బాధల్లో ఉన్న పేదలను కాపాడండి.
151 సీట్లు వచ్చిన అధికార పార్టీ ప్రజల పట్ల బాధ్యతతో సుపరిపాలన అందించాలి. విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడం తగదు. జనసేన ఎప్పుడూ రాజకీయాల్లో హుందాతనం పాటించాలనే కోరుకొంటుంది. జగన్ రెడ్డి గారిపై విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు ఆయనకు ప్రభుత్వం తగిన భద్రత ఇవ్వాలని జనసేన స్పష్టంగా చెప్పింది. నాటి పాలకపక్ష నేతలు ఆ దాడి జగన్ రెడ్డి గారి తల్లి చేయించారని ఆరోపణలు చేస్తే.. ఆ విధంగా మాట్లాడటం సరికాదని తప్పుబట్టి, ఏ కన్న తల్లీ తన బిడ్డను చంపించుకోవాలి అని చూడదని, అలాంటి కువిమర్శలు తగవని చెప్పాను. వరద వేళ సాయం అందడంలేదని ప్రజలు వాపోతున్నారు. రాజకీయాలు కొద్ది రోజులు పక్కనపెట్టి ముంపు బాధిత ప్రాంత ప్రజలకు, రైతులకు సహాయం చేయండి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Other Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *