మెరుపులా…? మూతి విరుపులా …?

February 9, 2019 | News Of 9

• ఏపీకి ప్రధాని రాక నేడు
• చంద్రబాబు మౌనంగా ఉండే అవకాశం
• సొంత పార్టీ బదులు రంగంలోకి డూప్!
• అంతా బల్లి యుద్ధమేనన్న అనుమానాలు
• గేట్లు మూసేసినా.. ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి
• భాజపా-దేశం నేతలకు స్పష్టత… ప్రజలకు అయోమయం

అమరావతి: స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందన్న అపవాదు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 10.45 గంటలకు ఆంధ్రలో అడుగుపెడుతున్నారు. 1.05 నిమిషాలకు హెలికాప్టరు ద్వారా గుంటూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభ జరుగుతున్న యేటుకూరు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకుంటారు. అక్కడే భాజాపా బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరిస్తారు. అనంతరం బటన్ నొక్కడం ద్వారా కృష్ణపట్నంలోని బీపీసీఎల్ కోస్తా టెర్మినల్ కు శంకుస్థాపన చేస్తారు. ఓఎన్జీసీ వాశిష్ట వీఅండ్ ఎస్ 1 అభివృద్ధి ప్రాజక్టులను జాతికి అంకితం చేస్తారు. 11.30 నుంచి 12.15 వరకూ బహిరంగ సభలో ఉంటారు. 12.20కి అక్కడి నుంచి బయల్దేరి గుంటూరు వరకూ హెలికాప్టరులో వెళతారు. 12.50కల్లా విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళతారు. స్థూలంగా ఇదీ ప్రధాని పర్యటన వివరాలు.

మోడీ-బాబులది బల్లియుద్ధమా లేక నిజమైన యుద్ధమా?

ఒకప్పుడు మోడీకి వంగి వంగి సలాము కొట్టిన ఏపీ సీఎం చంద్రబాబు ఇపుడు ప్రధానికి అధికారిక హోదాలోనైనా స్వాగతం చెబుతారా అన్నది అనుమానమేనన్న మాట వినిపిస్తున్నా… అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్ లో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన తర్వాత ప్రస్తుతం తెలుగుదేశం-భాజపాల మధ్య జరుగుతున్న యుద్ధం నిజమైనదేనా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు కాంగ్రెసుతో అంటకాగుతున్నా… రేపు ప్రధాని స్థానంలో మోడీ కాకుండా గడ్కరీ వచ్చినా మరో నేత వచ్చినా మళ్లీ భాజపా-తెలుగుదేశం నెయ్యం కొనసాగడం ఖాయం. అంటే ముందు గేట్లు మూసేసినా, ఇంటి వెనుక తలుపులు తెరిచే ఉంటాయని అర్థం చేసుకోవాలి. రేపు అధికారంలోకి భాజపా వస్తే… కాంగ్రెసును పక్కన పెట్టి చంద్రబాబు భాజపాతో కలిసి వెళ్లిపోవడం ఖాయం. కారణం చంద్రబాబుగానీ, చంద్రబాబు వెనుక ఉన్న కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు వారి సొంత వ్యాపారాలు ముఖ్యం. రాష్ట్ర అవసరాలు, తెలుగు జాతి ఆత్మాభిమానం ఇవన్నీ కూడా వారి వారి వ్యాపార అవసరాల తర్వాతనేన్నది గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ ఇదే పాలసీ తీసుకున్నది.

తెలుగుదేశం కంటే ఇపుడు మోడీని వ్యతిరేకించేందుకు… ప్రత్యేక హోదా, విభజన హామీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ను రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. రాజధాని శంకుస్థాపనకు మోడీ తెచ్చింది సాక్షాత్తూ పార్లమెంటు నుంచి సేకరించిన మట్టి. అయినా మట్టి ఇచ్చాడంటూ మోడీకి మట్టి కుండలతో స్వాగతం పలుకుతామని చలసాని పిలుపునిచ్చారు. ఏ ముఖం పెట్టుకుని వస్తారంటూ నిన్నటి వరకూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లు భావిస్తున్నాం. దీనికి కారణం… రెండు పార్టీల మధ్య ఒక అంగీకారం కుదిరిందేమోనన్న అనుమానమే. మోడీతో సఖ్యత లేకపోయినా భాజపాతో చంద్రబాబుకుగానీ, చంద్రబాబు వెనుక ఉన్న పెట్టుబడిదారులకు ఉన్న పూర్వ సంబంధాలు బంగారు తీగల్లా అల్లుకునే ఉన్నాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకయ్యనాయుడు రాజకీయ పదవుల నుంచి తొలగించడంపై స్వయంగా చంద్రబాబు మొన్న ఆక్రోశం వెళ్లగక్కారు. మోడీకి వ్యతిరేకంగా గడ్కరీని దువ్వుతున్నారు. స్పెషల్ స్టేటస్ పై తెలుగుదేశం నాటకాలు ఆడుతున్నది. స్పెషల్ స్టేటస్ కోసం ఆందోళన చేయడం ద్వారా తెలుగు రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు ప్రజలకు కనిపించడం ఒక్కటే ప్రస్తుతం దాని ముందు ఉన్న ట్రిక్కు. మీడియా సాయంతో దానినే రాజకీయ నాటక రంగంపై విజయవంతంగా రక్తి కట్టిస్తోంది. అలాంటిదే రేపు ఢిల్లీలో జరిగే జగన్నాటకం! నాటకం బాగా ఆడితే కోట్లు పోతేనేం? భవిష్యత్తులో ఒకగూడే లాభాలతో పోల్చితే ఢిల్లీ ఖర్చెంత అన్నది దాని అభిప్రాయం.

చంద్రబాబు మొదటి నుంచీ కేంద్రం నుంచి ఇచ్చే రాజధాని నిధుల్ని నాబార్డు ద్వారా ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి కారణం.. మళ్లీ వాటికి లెక్క చెప్పాల్సిన అవసరం లేకపోవడమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. స్పెషల్ పర్సస్ వెహికిల్ ను ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ పట్టుపట్టారు. దీనికి కారణం… చేసే ప్రతి పైసా ఖర్చుకూ కేంద్ర, రాష్ట్ర అధికారులు ఉమ్మడిగా బాధ్యులుగా ఉండాలని. దీని వల్ల డబ్బులు ఎక్కడికి వెళుతున్నదీ పారదర్శకత ఉంటుందన్నది ఆయన వ్యూహం. చంద్రబాబు ఆలోచన వేరు. మా డబ్బులు.. మా ఇష్టం. ఎవరికీ లెక్క చెప్పం అన్నది. డబ్బులు కేంద్రం నుంచి వచ్చినా… రాష్ట్ర ప్రభుత్వానివే అయినా పారదర్శకత వద్దని చెప్పడం ఎందుకు అన్నది ప్రజలు ఆలోచించాలి. అదేమంటే ఫెడరల్ స్ఫూర్తి అనీ, ప్రజాస్వామ్యం అనీ చంద్రబాబు ఉల్టా మాట్లాడతారు.

ప్రధాని పరిస్థితి ఎలా ఉందంటే… కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది. దేశ పరిపాలనలో ఉండే ప్రధానికి రోజూ చంద్రబాబు చెప్పే అసత్యాలకు కౌంటర్లు ఇచ్చేంత సమయం ఉండదు. అది ఆయన రోజు వారీ పాలనలో భాగమూ కాదు. భాజపా తరఫున ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏం చెప్పినా పత్రికలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. చంద్రబాబుకు దీటుగా సమాధానమిచ్చే స్థాయి నేత భాజాపాకి ఇక్కడ ఎవరూ లేరు. కారణం.. తొలి నుంచీ ఒక వ్యక్తి ఇక్కడ పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయనే భాజపా. భాపానే ఆయన అన్నట్ల ఉండింది.

కొద్దో గొప్పో తెలంగాణలో భాజపాకు నేతలున్నా ఏపీలో ఎవరూ లేరు. కారణం ఎవరినీ ఎదగనివ్వకపోవడమే అన్న భావన భాజపా పార్టీలోనే ఉంది. కన్నా లక్ష్మీనారాయణ మొన్న మొన్ననే కాంగ్రెసును నుంచీ వచ్చారు. కానీ ఆయనదీ మంత్రి స్థాయినే.

కమ్మవారికంటే కాపులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భాజపా ఏపీలో ఎదిగే ప్రయత్నం మాత్రం చేస్తోంది. అందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే రాసిలో ఎక్కువ ఉన్న కాపులు ఇపుడు జనసేన వైపు చూస్తున్నారన్నది వాస్తవం. పవన్ కళ్యాణ్ ను కాదని, ఈ సామాజిక వర్గం ఇపుడు ఇతర పార్టీలవైపు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల రాష్ట్రంలో బలపడటానికి భాజపా రాత్రికి రాత్రే ఎదిగే ప్రయత్నాలేమీ చేయదు. బడ్జెట్టు కూడా అయిపోవడంతో… ప్రధాని ఏపీ గురించి ఎలాంటి హామీలు కూడా ఇవ్వకపోవచ్చనే భావించాలి. అయితే ఆంధ్ర ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక ఓదార్పు ప్రకటన చేస్తారని అనుకోవచ్చు. లేదంటే చంద్రబాబుపై విరుచుకుపడే అవకాశం కూడా ఉండొచ్చు. ఒక వేళ విరుచుకుపడినా… దానిని కేవలం ఎన్నికల స్టంటుగా కొట్టిపారేయవచ్చు.

తెర వెనుక ఒప్పందాలు వేరు… బాహ్య ప్రపంచానికి చెప్పేవి వేరుగా ఉంటాయి. పారదర్శకత లేకుండా పార్టీలు చేసే కుయుక్తుల వల్ల తెలుగు ప్రజలకు ఏది నిజమో, ఏద కాదో అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. నిజానంతర (పోస్టు ట్రూత్) సమాజంలో సత్యాన్ని అసత్యాల నుంచి వేరు చేయడం తేలికకైన విషయమేమీ కాదు

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *