వెంటాడే… ఆ మహిళ!!

April 26, 2019 | News Of 9

ఈనాడులో ఉండగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన మహిళ ను ఇంటర్వ్యూ చేయడానికి ఆమె ఇంటికి వెళ్లాను. ఆమె పేరు ప్రియ. ఆమెకు హెచ్ఐవీ ఎందుకు వచ్చింది? ఆమె జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటో తెలుసుకోవాలని వెళ్లాను. వెళ్లిన వెంటనే.. కూర్చోమని కుర్చీ చూపింది. కూర్చున్నాను. రండి సార్ అంటూ మొదట షేక్ హ్యాండ్ ఇచ్చింది. చేయి కలిపాను. వెంటనే గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. తాగాలా? వద్దా? తాగితే ఛస్తానేమో. నీళ్లు తాగడం వల్ల ఎయిడ్స్ రాదని వైద్యులు చెప్పారు. అది నాకు తెలుసు. కానీ మనసులో ఎక్కడో చిన్న అనుమానం ఉంటుంది కదా. అయినా వద్దని సున్నితంగా చెప్పవచ్చు కానీ, తనకు హెచ్ఐవీ ఉన్నందునే తాగడం లేదని ఆమె ఖచ్చితంగా భావిస్తుంది. ఎదుటి వారిని నొప్పించడం నాకు సుతరామూ ఇష్టం ఉండదు. వెంటనే గ్లాసు అందుకుని గటగటా తాగేశాను. ‘‘ఒక మనిషి నీళ్లు ఇస్తే తాగనని తిరస్కరించడం మానవత్వం కాదు… ఒక వేళ విధి నిర్వహణలో భాగంగా పోతే పోతాం.. పోనివ్వండి…’’ అని మనసులోనే సర్దిచెప్పుకున్నాను. ‘‘మీరు నా చేతితో మంచినీళ్లు ఇస్తే తాగరేమోనని అనుకున్నాను’’ అంటూ హాయిగా నవ్వేసింది.

వృత్తిలో ఇలాంటి అనుభవాలు ఎన్నో..!!

ప్రియ… అందరిలాంటి అమ్మాయే. జీవితంపై ఎన్నో ఆశలు ఉన్న యువతి. పెళ్లి అయిన తర్వాత హెచ్ఐవీ వచ్చింది. అది కూడా ఆమెకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? తల్లి అయిన సమయంలోనే ఈ చేదువార్త ఆమెకు తెలిసింది. గర్భవతిగా పరీక్ష చేయించుకునేందుకు డాక్టరు దగ్గరకు వెళ్లినపుడు తనకు హెచ్ఐవీ సోకిందని డాక్టరు చెప్పింది. హెచ్ఐవీ ఉన్నవారికి చికిత్స చేయడానికి డాక్టర్లు కూడా భయపడతారు. పెళ్లి కాక ముందు భర్త ఎక్కడో తిరగడం వల్ల తనకు ఆ వ్యాధి వచ్చిందని ప్రియకు అర్థమైంది. పెళ్లికి ముందే భర్తకు తెలిసినా ఆ విషయాన్ని భర్త దాచిపెట్టాడు. ఎవరికీ తెలియకపోవడం వల్ల పెళ్లి జరిగిపోయింది. కానీ ప్రియ ఇపుడు నిండు గర్భిణీ. ప్రియ ఇపుడు తన గురించి ఆలోచించడం లేదు. తన పొట్టలో పురుడు పోసుకున్న చిన్నబిడ్డ గురించి ఆలోచిస్తోంది. ఏడుస్తోంది. ‘‘ఏం పాపం చేస్తే నాకు ఈ శిక్ష విధించావు తండ్రీ’’ అనుకుంటూ రోజూ దేవుడుని శపిస్తోంది.

నెలలు నిండాయి… ప్రసూతి సమయం వచ్చేసింది. కాన్పు కష్టం కావడంతో సిజేరియన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. కానీ ప్రియ హెచ్ఐవీ ఉన్న గర్భవతి. ఆపరేషన్ సమయంలో వైద్యులు కత్తులు ఉపయోగిస్తారు. ఏ కత్తి మొన కొద్దిగా గుచ్చుకున్నా డాక్టరు కూడా ఎయిడ్స్ బారిన పడటం ఖాయం. ఈ భయం తరచూ డాక్టర్లను వెంటాడుతూ ఉంటుంది. ‘‘ఎక్కడెక్కడో తిరుగుతారు… ఇలాంటి జబ్బులు తెచ్చుకుని మా ప్రాణాల మీదకు తెస్తారు…!!’’ అన్న లేడీ డాక్టర్ మాట… ప్రియ గుండెల్ని చిదిమేసింది. నర్సు స్టెచరుపై ఆపరేషను ధియేటరులోకి తీసుకుపోతున్నది. ప్రియ కళ్లు ఎర్రగా బారి నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నొప్పులు పడుతూనే ‘‘డాక్టర్ గారూ… నేను ఎవరితోనూ తిరగలేదండీ… పెళ్లికి ముందే.. నా భర్తకు హెచ్ఐవీ ఉంది. పెళ్లి అయిన తర్వాతనే నాకు తెలిసింది’’ అని ఏడుస్తూనే చెప్పింది.

మొత్తానికీ ఆపరేషను విజయవంతంగా పూర్తి అయింది. ఒక ఆడపిల్ల పుట్టింది. ఈ పిల్ల ఇపుడు కాన్వెంటుకు కూడా వెళుతున్నది. అదృష్టవశాత్తూ ప్రియ కూతురుకు హెచ్ఐవీ సోకలేదు. నిజానికి గర్భవతిగా ఉన్నపుడు హెచ్ఐవీ వస్తే… అది బిడ్డకు కూడా వస్తుంది. ఒక్కోసారి దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది. పిల్లకు ఆ వ్యాధికి సంబంధించిన వైరస్  రాలేదు. అయినా… ముందు జాగ్రత్తగా పిల్లకు కూడా మందులు ఇస్తున్నారు వైద్యులు. కొన్నిసార్లు హెచ్ఐవీ వైరస్ దేహంలోకి ప్రవేశించిన పదేళ్ల వరకూ కూడా బయటపడదు. తర్వాత బయటపడుతుంది. ఒక రోజు జీవితం ఇలా అయిపోయిందే… అని ప్రియ ఏడుస్తుంటే కూతురు దగ్గరకు వచ్చి ‘‘అమ్మా… నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను. ఏడవకమ్మా’’ అంటూ తల్లి కన్నీళ్లు తుడిచింది. ఇదే విషయం డాక్టరుకు చెప్పి తన బాధను ఆమెతో పంచుకుంది. ‘‘ఓసీ పిచ్చిదానా… నీ కన్నీళ్లలో కూడా వైరస్ ఉంటుంది. పిల్లను ఎప్పుడూ అలా చెయ్యనివ్వకు’’ అని చెప్పంది డాక్టరు. ప్రియ ఈ విషయం నాతో చెబుతూ… ‘‘ఆ రోజు నుంచీ నేను ఏడుపు మానేశానండి’’ అని చెప్పింది. కూతురు భవిష్యత్తు బాగుండాలంటే తాను ఏడవకూడదు మరి. ప్రియ పరిస్థితి చూసి నాకు కడుపులో దేవినట్లు అయింది. కన్నీళ్లు వచ్చాయి. ప్రపంచంలో మాతృమూర్తిని మించిన దైవం లేదు. తాను ఒక వైపు శిధిలం అవుతున్నా… రేపటి చిన్నారి కోసం ఆమె కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.

ఒక చిన్న పొరపాటు… జీవితాన్ని చిదిమేస్తుంది. అది ఒకరు కాదు… కుటుంబ సభ్యులను కూడా ఛిద్రం చేసేస్తుంది అని చెప్పడానికే ఈ ఉదాహరణ. జర్నలిస్టుగా నా జీవితంలో ఇలాంటి అనుభవాలను ఎన్నో చూశాను. ఎయిడ్స్ లేదా హెచ్ఐవీకి సంబంధించి ఆ వ్యాధిగ్రస్థులతో మాట్లాడి ఎన్నో వార్తలు రాశాను. ఎయిడ్స్ గురించిన ఆపోహల గురించి ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేశాను. ఇలాంటి ప్రయత్నం తెలుగు మీడియా చాలా తక్కువగానే జరిగింది.

– శ్రీనివాసరావు గుగ్గిళ్ల

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *