మాయావతి షూస్ కథ…!!

April 14, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

బానిసత్వ వ్యవస్థ డబ్బున్న వర్గాలకు ఆనందాన్నిస్తే… దిగువ వర్గాలకు నరకం. ఈ పరిస్థితి చాలా వరకూ మారుతున్నా ఇంకా డబ్బున్న ఆధిపత్య వర్గాల ‘‘సోషల్ డామినేషన్’’ కొనసాగుతూనే ఉందని నిత్యజీవితంలో ఎన్నో ఉదాహరణలు మనకు తారసపడతాయి. ఒక వ్యక్తిని కలిసేందుకు మనం వెళ్లినపుడు ‘‘షేక్ హ్యాండ్’’ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కానీ అవతలి వ్యక్తి నుంచి స్పందన ఉండదు. ‘‘షేక్ హ్యాండ్’’ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని అర్థమవుతుంది. వాడికి కొవ్వు పట్టిందనీ, పొగరు అనీ మనసులో తిట్టుకుని మన చేతిని వెంటనే వెనక్కి తీసేసుకుంటాం.

సోషల్ డామినేషన్ ఎందుకు?

దానికి పరిష్కారం ఏమిటి?

సామాజికంగా మనం అతని హోదాతో సరితూగే స్థాయి మనకు లేదని, అందుకే తాను చేతులు తాకడం లేదని అతను మనకు స్పష్టంగా చెప్పదలచుకున్నాడు. ఇది కూడా ఒక రకమైన అంటరానితనం. రాజకీయాల్లోకి ఇతరులను రానివ్వకుండా చేసేది రాజకీయ అంటరానితనం. కులం, మతం, ధనిక-పేద, ఉద్యోగ హోదా వంటి కారణాలతో జరిగే దాష్టీకం.

మీరు పొగరు అనండీ… స్థాయి అనండీ… అవతలి వ్యక్తి ‘‘సామాజిక అంటరానితనాన్ని’’ పాటిస్తున్నాడు అని అర్థం. ఉద్యోగపరమైన హోదాలో ఉన్నవారు కూడా ఇలా చేస్తుంటారు… ఉదాహరణకు ఒక డీజీపీ తన కారు డ్రైవరుకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు. కానీ ఇది కూడా తప్పే. బ్రిటను వంటి దేశాల్లో డీజీపీ హోదాలోని పోలీసు అధికారి, అతని కారు డ్రైవరు కలిసి ఒకే టేబుల్ పై కలిసి భోజనం చేస్తారు. ఇంత సంస్కారం మన దగ్గర లేదనుకోండి.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే- వారం రోజుల కిందట (ఏప్రిల్ 7) ఉత్తర ప్రదేశ్ లో ఒక సంఘటన జరిగింది. అది బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు సంయుక్తంగా షెహరాన్ పూరులో ఒక ప్రచార సభను నిర్వహించాయి. ఈ సభకు రాష్ట్రీయ లోక్ దళ్ నేత… చౌధురి అజిత్ సింగ్ కూడా హాజరయ్యారు. వేదికపై అప్పటికే మాయావతి ఉన్నారు. అజిత్ సింగ్ ను వేదికపైకి రాక ముందే ఒక బీఎస్పీ నేత ఎదురు వచ్చి… ‘‘మీరు షూస్ తీసేసి స్టేజిపైకి వెళ్లండి’’ అని సూచించాడు. బెహన్జీకి డస్ట్ ఎలర్జీ ఉందని, వేదికపై తాను తప్ప ఎవరూ షూస్ వేసుకోవడానికి వీల్లేదని, ఇది తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెప్పాడు. దీంతో జాట్ నేత అజిత్ సింగ్ తన షూస్ ను వేదిక కిందనే వదిలివేసి స్టేజ్ పైకి వెళ్లాల్సి వచ్చింది.

బలహీన వర్గాలకు చెందిన నేతలంటే జాట్ (మన దగ్గర డబ్బున్న కులాల గురించి తెలిసిందే కదా)లకు చిన్నచూపు. దేశంలోని 29 సీఎంలు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నా సమాజం వారిని అంటరానివారుగా చూడదు. ఆయనకు 2 లక్షల కోట్లు సంపాదించాడంట అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఇంట్లో 29 లిఫ్టులు ఉన్నాయంట… అని చెప్పుకుంటారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఒక మహిళ ముఖ్యమంత్రి కావడం అంటే… అది రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో ఎదుర్కోవడం కంటే చిన్న విషయమేం కాదు. ఆధిపత్య వర్గాలను కాదని, నిమ్నవర్గం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ పై ఎన్ని నిందలు వేస్తున్నదీ, ఎన్ని అబద్ధాల్ని ప్రచారంలో పెడుతున్నదీ మనం చూస్తున్నాం.

బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే జనసేన పార్టీని చాలా మంది అభిశంసించారు. తిట్టడం తేలిక, అనుకున్నది సాధించడం కష్టం. ‘‘మాయావతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి… జనసేన ఆమెతో పొత్తు పెట్టుకున్నది.. ఛీ ఛీ’’ అని అనేక మంది సోషల్ మీడియా వేదికగా ఆడిపోసుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత సమాధానం చెబుదాంలే అని నేను మిన్నకున్నాను. వైసీపీ అధినేత జగన్ పై అనేక కేసులు ఉన్నా… ఆయన్ను సమర్ధించే వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒకే ఒక ఎస్సీ ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణలు భూతదద్ధంలో కనిపిస్తున్నాయి. కారణం.. నిమ్నవర్గాలపై అగ్రవర్ణాలకు ఉన్న చిన్నచూపే. జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినపుడు… ‘‘ఛీ ఛీ అవినీతిపరుడి మద్దతు ఇచ్చారు’’ అని ఎవరూ అనలేదు. చంద్రబాబు సామాజిక హోదా వేరు కనుక అది పెద్ద తప్పుగా ఎవరికీ కనిపించదు. మాయావతి పెద్ద నేరస్థురాలుగా అగ్రవర్ణాలకు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. లోపం ఆమెలో లేదు. మన మనసులో ఉంది. చంద్రబాబుకున్న ఆక్రమాస్థులు ఎన్ననేది చెప్పేవాడు లేడుగానీ… ఏ స్థాయిలో అన్నది లెక్కించడం సాధ్యం కాకపోవచ్చు. ఒక చిన్న కాంట్రాక్టరుగా జీవితాన్ని ప్రారంభించి చంద్రబాబు ఇంటి పక్కనే ఇల్లు కట్టుకున్న సీఎం రమేష్ వేల కోట్లలో సంపాదించుకోగా.. చంద్రబాబుకు లక్షల కోట్లలో ఉంటుంది. కానీ చంద్రబాబుకు ఇచ్చిన గౌరవం మాయావతికి ఇవ్వరు. చంద్రబాబు అధికారాన్ని మామ నుంచి కొట్టేశాడు. మాయావతి అధికారాన్ని సంపాదించుకుంది. కాన్సీరాం, అంబేద్కర్ చూపిన బాటలో పయనించి ఆమె అధికారానికి వచ్చారు. అందుకే 63 సంవత్సరాల కుమారి మాయావతి కాళ్లకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశాడు. తెలుగు ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ ఒక దళిత యోధురాలికి అందించిన గౌరవం. దళిత, నిమ్న వర్గాల ఉన్నతిని కోరుకున్న వారు మాత్రమే ఈ పని చేయగలరు.

మాయావతి- అగ్రవర్ణాల దాష్టీకంపై పోరాడిన వనిత. అనేక గుణపాఠాలు కూడా ఆమె నేర్పిన సందర్భాలు ఉన్నాయి. కుమారి మాయావతి మాత్రమే షూస్ వేసుకుని ఉంటారు. ఆమెకు డస్ట్ ఎలర్జీ ఉంది అని చెప్పడం ద్వారా ఇతరులకు ఆమె ఒక సందేశాన్ని పంపుతున్నారు. గుడిలోకి వెళ్లేటప్పుడు మాత్రమే చెప్పులు తీసి వెళతాం. లేదా ఆస్పత్రిలో రోగుల్ని పరామర్శించేటపుడు (ఐసీయూ) మాత్రమే పాదరక్షలు తీసేసి వెళతాం. ఇంక మరెప్పుడూ తియ్యాల్సిన అవసరం ఉండదు. (కొంతమంది ప్రైవేటు ఆఫీసుల్లో పాదరక్షలు బయట వదిలి రావాలని బోర్డులు పెడతారు. అలాంటి ఆఫీసులకు వెళ్లడం నేను మానేస్తాను).

బీఎస్పీ సహకారంపై ఆర్ఎల్డీ ఆధారపడింది. షూస్ తీసేసి అజిత్ స్టేజిపైకి వెళ్లకతప్పలేదు. దీనిపై ఆరెల్డీ పార్టీని వారిని సంప్రదించగా… రాజకీయ సభా వేదికలను అజిత్ సింగ్ పవిత్రస్థలంగా భావిస్తారనీ, అందుకే షూస్ తీసివేసి వెళ్లారని చెప్పారు. ఇది తప్పించుకునే అలా చెబుతున్నారని అర్థం అవుతూనే ఉంది. ఇది ఖచ్చితంగా మాయావతి చెబుతున్న పాఠమే.


దళిత యువతిని ఇలా కరెన్సీ నోట్లతో సత్కరించడం ఆధిపత్య వర్గాలకు కంటగింపుగా మారింది. పత్రికలు కూడా ఆమెపై విరుచుకుపడ్డాయి.

మరో సంఘటన: మాయావతి ఢిల్లీలో ఉన్నారనుకుంటాను.. ఆమె తన షూస్ తెచ్చుకోవడం మర్చిపోయారు. పక్కనే ఉన్న ఐఏఎస్ అధికారిని వెళ్లి షూస్ తెమ్మని పురమాయించారు మాయావతి. ఒక దళిత యువతి ఆదేశిస్తున్నది. చుట్టూ ఉన్న సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి. విమానంలో లక్నో వెళ్లి షూస్ తెచ్చిపెట్టారు ఆ అధికారి. అంటే దళిత యువతి ఆదేశాన్ని ప్రపంచం పాటిస్తున్నది. ఎందువల్ల అధికారం… దళిత యువతి చేతికి వచ్చింది కనుక అని తేలికగానే అర్థం చేసుకోవచ్చు.

మా ఊళ్లో వెలమ దొరలు పై నుంచి కిందకు తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు. నా స్నేహితుడు కూడా సరిగ్గా వెలమ దొరలా తయారై… సెంటర్లో నిలబడి ఉంటే… ‘‘బాబయ్యా…. మీరు దొరలా?’’ అని గ్రామస్థుడు అడిగాడు. ‘‘అవును. మేం మాల దొరలం’’ అని సమాధానం ఇచ్చాడు. సమాజంపై ఒక మనిషి చేస్తున్న ధిక్కారమిది. వెలమ దొరల ‘‘సోషల్ డామినేషన్’’ను వ్యతిరేకిస్తున్నాడు. లేదా తిరస్కరిస్తున్నాడు. ఒక దళిత ఉపాధ్యాయుడుగా అతను అనేక ప్రయోగాలు చేస్తుండేవాడు. సామాజిక అసమానతల గురించి.. ఎంతో చర్చించుకునేవాళ్లం.

ఆలోచనలూ మారుతున్నాయి..

ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ… ఆమె దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు మాయావతి. ‘‘బహుజన హితాయా… బహుజన సుఖాయా’’ అన్న సిద్ధాంతం భూమికగా బీఎస్పీ పని చేసినా, తర్వాత కాలంలో ‘‘సర్వజన సుఖాయా…సర్వజన హితయా’’ అన్న సిద్ధాంతంలోకి వచ్చేసింది. మరింత విశాల దృక్ఫథంతో రాజకీయాలు చేయడం మంచిదే. ఒకప్పుడు బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పని చేసినా… బీఎస్పీ అనంతరం కాలంలో పేద బ్రాహ్మణులకు కూడా సీట్లు ఇచ్చి రాజకీయాల్లో వారికి కూడా ఒక అవకాశాన్ని అందించింది. అసలు మ్యానిఫెస్టో లేకుండానే బీఎస్పీ ఎన్నికలకు వెళ్లడం చాలా గొప్ప ప్రయోగం. అంటే పార్టీ సిద్ధాంతం వారిని గెలిపిస్తూ వస్తోంది. తొలిసారి కాబట్టి పవన్ కళ్యాణ్ మ్యానిఫెస్టోని ప్రకటించారు. తర్వాత కాలంలో పార్టీ సిద్ధాంతాలు అన్నీ మట్లాడతాయి. తొలిదశలో ఇలాంటి ఇబ్బందులు సహజమైనవిగా మనం భావించవచ్చు. జనసేన పార్టీ… సమాజంలోని ఇలాంటి అసమానతలను పొగొట్టేదిశగా మార్పును తెస్తోంది. అందులో సందేహం లేదు!

– శ్రీనివాసరావు

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *