మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లారా… జన సేనాని విజయాలు ఇవిగో..!!

February 3, 2019 | News Of 9

పవన్ కళ్యాణ్…

అది ఇపుడు ఒక వేద మంత్రం.

ప్రజల కష్టాలకు తారక మంత్రం.

తెలుగు నాట పెను మార్పులకు నాందీ వాచకం.

ఒక్క మాటలో మార్పు కోరుకునే నోట పలుకుతున్న సంకీర్తన నామం.

అందరినీ దీర్ఘమైన ఆలోచనలో పడేసింది.

ప్రజలు నేతలందరినీ చూస్తున్నారు.

కేవలం అధికార కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఒకరు.

తిమ్మిని బమ్మిని చేసి తాను అనుకున్న దారిలోనే ప్రజల్ని డబ్బుతో వశ పరుచుకుని అధికారాన్ని కైవశం చేసుకుందామని చూస్తున్నదొకరు.

అన్ని జిమ్మిక్కులనూ తేరపార పరికించి చూస్తున్నారు.

“ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం… దారంతా గతుకులు… చేతిలో దీపం లేదు… కానీ గుండెల నిండా ధైర్యం ఉంది’’ అంటూ 2014లో జనసేన నాయకుడు నినదించిన రోజు యువత ఆవేశంతో ఊగిపోతుంటే పెద్దలంతా నిబిడాశ్చర్యంతో ఇదంతా అయినప్పుడు కదా అంటూ నిట్టూర్చారు. కానీ పవన్ నేడొక ప్రభంజనం. రానున్న మార్పులకు దిక్సూచి. పేదలకు దారి చూపే దీపస్తంభం.

పరమాణువు కంటికి కనిపించనంత చిన్నగా ఉంటుంది. కానీ అవి ఢీకొన్నపుడు ప్రళయమే వస్తుంది. పవన్ విషయంలో అదే జరిగింది. ప్రతి మనిషి గుండెలో ఉన్న పరమాణువులను కదిలించాడు. ప్రతి ఒక్క జన సైనికుడూ ఒక పవన్ కళ్యాణ్.

నాయకులు ఏరీ.. ఎక్కడ అని నొసలు చిట్లించారు నేటి వరకూ. సేనానికి తెలుసు.. వారుఎక్కడ ఉన్నదీ. నాయకుడు చెబుతాడేమో ఏదైనా చేసేద్దాం అని లక్షల మంది ఎదురుచూశారు. ఏమీ చెప్పడాయే. తానుగా అన్నీ చేసే వాడు నాయకుడు కాలేడు. తన ప్రభావంతో అన్నీ జరిగిపోయేలా చూసేవాడు నాయకుడు. పవన్ అలాంటి నాయకుడే. అందుకే కార్యకర్తలు ఎదురుచూడలేదు. ఆయన్నే గుండెల్లో నింపుకున్న జనసైనికులు అన్నీ తామే అయిపోయారు. కదన రంగంలోకి దూకారు. కార్యకర్తలే నాయకులు అయ్యారు.. జెండాలు సమకూర్చుకున్నారు. ఎన్నికల గుర్తు రాగానే గాజు గ్లాసులు ఎగబడి మరీ కొనుక్కువచ్చారు. పార్టీ గుర్తుల్ని గ్లాసులపై ముద్రించేశారు. తెలుగుదేశం, వైసీపీలు చేస్తున్న కువిమర్శలను జనసైనికులు ట్విటర్ వేదికగా తూర్పారపడుతున్నారు. ఆధారాలను సేకరించుకుని… ఇవిగో మీ తప్పులు అంటూ వీడియోలతో, నిప్పులాంటి నిజాలతో విరుచుకుపడుతున్నారు. అన్ని పార్టీల వారూ జన సైనికుల పేరు చెబితే ఇప్పుడు వణుకుతున్నారు.

ఒకడు జీతంలో నాకు ఈ నెల 2 వేలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఇవ్వలేకపోయామన్న బాధను గొంతులోనే దిగమింగి 2 వేల రూపాయలు పార్టీకి ఫండ్ ఇచ్చారు. ఇలా ఎందరో… ప్రధానమైన రెండు పార్టీల దగ్గర లక్షల కోట్లున్న విషయం జన సైనికులకు తెలియనిది కాదు. ఏ దేశానికైనా ప్రజలే అమూల్యమైన సంపద. ఇవ్వాళ జనసేన దగ్గర కోట్లాది రూపాయలు లేకపోవచ్చు. కానీ అపూర్వమైన దేశ సంపద జనసేనకు అండగా నిలబడింది. ఇంతై… వటుండింతై అన్నట్లుగా జనసేన ఝంఝా మారుతమై శత్రు పార్టీలకు సైతం నిద్రను దూరం చేస్తున్నది. పార్టీ నిర్మాణం దానంత అదే జరిగి పోతుతున్నది. మార్పు పార్టీ నిర్మాణం దగ్గరే మొదలైంది. ‘‘మీరంతా పార్టీ కాదా…? ఏమిటి వీళ్లంతా అంటున్నది?’’ అని సూటిగా ‘‘మబ్బుల్లో పరుగులు’’ తీసే జనసైనికులను అడిగాడు.

నాయకుడు భాష, భావం రెండూ వారికి తెలుసు. వారి కళ్లల్లో ప్రేమ సేనానికి తెలుసు. తానంటే కిలోమీటర్ల లెక్కన నడిచివస్తారని తెలుసు. అందుకే వేలాదిగా జనసైనికులున్నా… చిన్న చిరునవ్వుతో వారి హృదయాన్ని పలకరించి మళ్లీ తన ప్రయాణం సాగిస్తున్నాడు.

తన వల్ల తన అభిమానులు ఒక్క చిన్న లాఠీ దెబ్బ కూడా తినకూడదని భావించి తన సినిమా జీవితకాలంలో ఒక్కసారి కూడా 100 రోజుల ఫంక్షను కూడా పెట్టని కఠినుడు పవన్ కళ్యాణ్. ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత మళ్లీ వంద రోజుల ఫంక్షను పెడదామని అడిగే సాహసం చేసిన నిర్మాత లేడు. శిలాశాసనం! రూల్స్ అంటే రూల్స్ అంతే. తలకిందులుగా తపస్సు చెయ్యి మారడు. ఎవరో చేస్తే నాయకులు అయిన వారు మారవచ్చు. ఆయనకు తిక్క అన్నవారూ ఉన్నారు. అయినా సరే. నిజమైన మట్టి మనుషులు.. బయట ఒకలా… ఇంట్లో మరోలా ఉండలేరు. పవన్ ఇంటా, బయటా ఒక్కటే. పవన్ ఒక్కడే. పవన్ లో మరో పవన్ లేడు. నాలుగైదు ముఖాలు లేవు. మనకు ఇపుడు కనిపిస్తున్న ఇతర నేతలకు 16 ముఖాలు ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ మాస్కులు మారుతూ ఉంటాయి. కానీ, అరుదుగా మాత్రమే పవన్ లాంటి వారు మనకు తారసడతారు. కనబడతారు. లక్షలాది మంది ఆయన్ను ఆరాధిస్తున్నారంటే అది పవన్ చేసుకున్న పుణ్యమో, పత్రికలూ, టీవీలూ నోట్లు తీసుకుని అందించిన పొగడ్తలు కావు. ఆయన వ్యక్తిత్వమే ఆయన్ను పటేల్ విగ్రహంలా ఆకాశమంత ఎత్తున నిలబెట్టింది. వ్యక్తిత్వం, ప్రేమ, ధైర్యం వంటి వాటిని చిల్లర కొట్లో కొనుక్కునేవి కావు.

జనసేన పార్టీ ఇంకా కొన్ని నెలల్లో ఎన్నికలకు వెళుతున్నది. ఎన్నికల విజయాలను రుచి చూడకముందే రికార్డులు బద్ధలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన ఏమీ సాధించనట్లే కనిపిస్తున్నారు కానీ… తరచి చూస్తే ఇప్పటికే జనబాహుళ్యంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచాక మరెన్ని రికార్డులు బద్ధలవుతాయో చెప్పలేం.

1. కరడుగట్టిన దుర్మార్గపు వ్యవస్థతో సామాన్యులు సైతం పోరాడవచ్చు.

ఇప్పటి వరకూ మనకు ఉన్న నమ్మకం ఒకటే. ఈ అవినీతి పోదు. ఈ సమాజాన్ని మార్చలేం. మన పని మనం చేసుకుంటే చాలు. మేథావులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ప్రతిదానికీ ఇది మన వల్ల ఎక్కడవుతుంది బాసూ అంటూ రెండు తిట్టుకుని వెళ్లిపోయే వారు. కానీ నేడు సామాన్యుడికి ధైర్యం వచ్చింది. దుర్మార్గపు వ్యవస్థను వారు చీల్చిచండాడుతున్నారు. ముఖ్యమంత్రి కాకముందే.. పవన్ కళ్యాణ్ సరాసరి గనుల వద్దకు వెళ్లితే.. అక్రమార్కులు పారిపోయారు. నీతి వచ్చి దుర్మార్గం ఎదురుగా నిలబడితే కళ్లలోకి చూడలేదు కదా… వంతాడ బైరైటీల గనుల నుంచి పలాయనం చిత్తగించింది. మారదు మారదు అన్న సమాజం ఇపుడు గట్టిగా మార్పును కోరుతున్నది. ఇది పవన్ సాధించిన తొలి విజయం.

2. వ్యవస్థ మారదు అన్న ఆలోచన సరికాదు.

కలికాలం వచ్చేసిందని, రాజకీయాలు అందుకే అలా ఉన్నాయనీ, నాయకులు అవినీతి ఎక్కువ చేస్తున్నారనీ అందరికీ తెలుసు. కానీ వ్యవస్థ మారదు… మనం ఏం చేయలేం అని అందరూ చేతులెత్తేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలూ కోపం వస్తే సామాన్యులను చితకబాదుతారని ఎవరూ ప్రశ్నించడానికి సాహసించే వారు కాదు. ఇది ఇప్పుడు గతం. పవన్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని లాంటి దుర్మర్గులను పవన్ తాట తీస్తానన్నాడు. వ్యవస్థ మారడానికి సిద్ధంగా ఉన్నది. అందువల్ల వ్యవస్థ మారదు అన్నది శిలాక్షరాలేమీ కాదని… మార్చవచ్చని నిరూపించాడు. ఆ దారిలో ముందుకు వెళ్లిపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇది మరో విజయం.

3. ఒక మంచి ఆలోచనతో ఒకడు వస్తే.. లక్ష మంది నీ వెనుక ఉంటారు.

నీ ఆలోచన మంచిదైతే, అందులో నీకు స్వార్థం లేకపోతే లక్ష మంది నీ వెంట నిలబడతారని పవన్ కళ్యాణ్ నిరూపించారు. సినిమా నటుడుగా పరిచయమైనా… కల్పిత ప్రపంచం కంటే వాస్తవం ప్రపంచంలోనే జీవించాలని నిర్ణయించుకున్నవాడు పవన్. వస్తున్న డబ్బును సైతం నమ్మిన సిద్ధాంతం లేదా తన మనసు చెప్పినట్లు చేయడం కోసం వదులుకున్నాడు. జనం వెంట నిలబడ్డారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10 లక్షల మందితో జనవారధిని నిర్మించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు పవన్ కళ్యాణ్. ఇది మరో విజయం.

4. నేటి తరం యువతకు రాజకీయాలు ఇష్టం ఉండవు.

అందిరి అభిప్రాయమూ ఇదే. తెలంగాణలోగానీ. అటు ఆంధ్రలోగానీ యువత ఇపుడు రాజకీయాలపై మాట్లాడుకుంటున్నారు. ట్విటర్ వేదికగా ప్రతి అంశాన్నీ తెలుసుకుంటున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ఎలాంటి పుస్తకాలు చదివితే బెటర్ అని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ను అడుగుతున్నారు. మంచి దేశం కోసం, మంచి రాష్ట్రం కోసం, మంచి ఊరు కోసం కలలు కనని మనిషి ఎక్కడ ఉంటాడు? అందుకే యువత పవన్ మంత్రం జపిస్తోంది. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలని ఒక కుర్రాడు పవన్ ను అడిగాడు. ప్రజల ఆకాంక్ష నేడు జనసేన రాజకీయ మంత్రం అయింది. అదిప్పుడు అమరావతి వీధుల్లో మార్మోగుతున్నది. యువకులు మోటారు సైకిళ్లపై తిరుగుతుంటారు అన్న విమర్శను పవన్ ఎంత అందంగా చెప్పాడు. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే అలాగే తిరుగుతారు… ఏం చేస్తారు అని ప్రశ్నించి వారి మనస్సులను గెలుచుకున్నాడు. చంద్రబాబులా తిట్లపురాణం ఎత్తుకోలేదు. మీరు వైసీపీ వాళ్లు అయి ఉంటారని వారిని అనుమానించలేదు. అందుకే యువత కులాలకు అతీతంగా ఒక గొప్ప నేతను పవన్ కళ్యాణ్ లో చూస్తున్నది. దీనిని విజయం అనేక ఏ పేరుతో చెబుతాం!

5. మహిళలకు రాజకీయాలంటే ఇష్టం ఉండదు.

మహిళలకు రాజకీయాలంటే ససేమిరా పడదు… వాళ్లు టీవీలో కూడా వార్తలు చూడరు… వాళ్లు టీవీ సీరియళ్లు మాత్రమే చూస్తారు అన్న విమర్శలు మహిళలపై ఎన్నో ఉన్నాయి. కానీ పవన్ ఆడపడుచులను అర్థం చేసుకున్నారు. వాళ్లకు పార్టీ పరంగా పట్టం కట్టారు. మహిళలు ఆకాశంలో సగం అని పొగిడి ప్రోగ్రాం తర్వాత మర్చిపోయిన వారే అందరూ. పిలిచి పెద్దపీట వేసిందెక్కడ? పవన్ వెంటనే ఆ పని చేశాడు. బంగారు తల్లులకు వీర మహిళ అని పేరు పెట్టి కిరీటమే పెట్టాడు. ఆత్మగౌరవం ఎక్కడ ఉంటే అక్కడే మహిళలు ఉంటారు. ‘‘వసుంధర’’ అంటే భారాన్ని మోసేది అని అర్థం. ఆత్మస్థైర్యానికి ప్రతీకగా వారికి వీర మహిళ అన్నాడు. అబలలుగా ఉండాలని వారు కోరుకోవడం లేదు. యుద్ధ విమానాలనే నడుపుతాం అంటున్నపుడు వారు వీర మహిళలు కాకుండా సంసారం కోసమే అన్నట్లు ‘వసుంధర’’లు ఎందుకు అవుతారు. ఇదీ పవన్ సాధించిన విజయమే.

6. నీతికి చోటు ఉంది.

నీతికి చోటులేదని, అంతా అవినీతిమయం అయిపోయిందని భావిస్తున్న తరుణంలో.. అక్రమార్కులను వణికించి వారికి గట్టి సందేశమే పంపాడు పవన్ కళ్యాణ్. ఇపుడు నీతిని ప్రేమించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా పవన్ కళ్యాణ్ కు సహకరిస్తారు. అవకాశాలు ఇవ్వకుండా వదిలివేస్తే మనుషులు అవినీతికి పాల్పడతారని పవన్ చెప్పాడు. నీతిగా సంపాదించుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటే దొంగతనం చేసి పట్టుబడి తన్నులు తినాలని ఎవరికి ఉంటుంది? డబ్బులు చాలనపుడు… అధికారులు లంచాలు తీసుకోకుండా వారు నీతిగా సంపాదించుకునే మార్గాలు ఉండేలా ప్రభుత్వాలు చూడాలి. పది వేలు వచ్చే అటెండర్ని పది వేలతోనే ఎందుకు చచ్చిపోమని చెప్పాలి. అవకాశం ఉంటే అదనంగా పని చేసుకుంటాడు. వ్యవస్థ అవకాశాలను కల్పించ లేనప్పుడే 90 శాతం మంది దారితప్పుతారు. అవకాశం ఉంటే నీతిగా ఉండే మార్గానే అందరూ ఎంచుకుంటారు. ఇలాంటి మార్పులకు కూడా పవన్ శ్రీకారం చుడతాడు. ఇదీ పవన్ సాధించిన లేదా సాధంచబోతున్న విజయమే.
…..
ఒడ్డున ఉండి.. వాడు వేస్టు, వీడు వేస్టు అని సొల్లు కొట్టేవారు ప్రతి యుగంలోనూ ఉంటారు. వాగే వాళ్లు వాగుతున్నా… మౌనంగా మునుల్లా నమ్మిన సిద్దాంతం కోసం పని చేసుకుంటూ ముందుకు దూసుకుపోయే వారు కొందరు ఉంటారు. ఒక మార్పు తేవాలని పవన్ నిర్ణయించుకున్నాడు. నీ పని నువ్వు చెయ్యి… ఫలితం ఆశించకు… ఫలితాలు అవే వస్తాయి. ఇదే కదా పవన్ కూడా అనేక బహిరంగ సభల్లో చెప్పింది. జన సైనికులూ… మీరు సాధిస్తారు. మీలోనే అనేక మంది పవన్ కళ్యాణ్ లు కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను మీరంతా ఆవాహన చేసేసుకున్నారు. అందుకే మీరు మబ్బుల్లో పరుగెత్తే పిడుగులు అయ్యారు.

– గుగ్గిళ్ల శ్రీనివాసరావు

(చీఫ్ ఎడిటర్).

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *