బాబును ఛీకొట్టారు… గులాబీకి ఛీయర్స్ చెప్పారు

December 11, 2018 | News Of 9

TRS | telugu.newsof9.com

  • మహాకూటమికి గుణపాఠం
  • చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత
  • ఓటమి దిశగా సుహాసిని
  • వెనుకంజలో సీనియర్ కాంగ్రెసు నేతలు
  • ఓడిన రేవంత్ రెడ్డి
  • ఆనందోత్సాహాల్లో తెలంగాణ ప్రజ

 (హైదరాబాద్, న్యూస్ ఆఫ్ 9)

హైదరాబాదులో ఉదయమే… చలి చలిగా ఉంది. కానీ,

ఎముకలు కొరికే చలిలో వేడి వేడి టీ తాగినంత ఆనందం….

గుర్రం ఎక్కి గాలిలో ప్రయాణిస్తున్న ఆనందం…

పుష్కరం తర్వాత వచ్చిన ప్రాణ స్నేహితుడితో రాత్రంతా కబుర్లు చెప్పుకున్నంత ఆనందం…

తెలంగాణలో గులాబీ పార్టీకే ప్రజలు మళ్లీ పట్టం కడుతున్నారు. డబ్బులు విసిరేసి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనేద్దామనుకున్న అరాచక శక్తులను తెలంగాణ ప్రజలు మట్టి కరిపించిన ఘడియలు… తెలంగాణను తెచ్చిందీ, సాధించిందీ అన్నీ ఆయనే అంటూ నమ్మి బయట వారిని బయటే ఉండమని చెప్పిన అమృత ఘడియలు… నేటికీ తెలంగాణ ఉద్యమ సూరీడు కేసీఆరేనని నిరూపించిన ఘడియలు..

45 సీట్లను గెలుచుకుని, మరో  42 సీట్ల ఆధిక్యంతో తెరాస దూసుకుపోతున్నది. తెరాసను మట్టిలో కలిపేస్తామంటూ మన్నూ మిన్నూ వినపడేలా హూంకరించిన ప్రజాకూటమి ఎన్నికల గోదాలో ఉత్త డొల్ల అని తేలిపోయింది. అధికారం వస్తే చాలన్నట్లు ప్రవర్తించిన మహాకూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. కుర్చీపైన ఆశ ఒక్కటే ఉంటే సరిపోదు… కాస్తంత నీతి కూడా ఉండాలని చాటి చెప్పారు. ప్రజాకూటమిని తిరస్కరించారు. 

తెలంగాణ ఓటరు తీర్పు ప్రజాకూటమికి చేదు కషాయంగా మారింది. జానారెడ్డి, రేవంత్ రెడ్డి వంటి సీనియర్ నేతలు సైతం ఓటమిపాలయ్యారు. పరకాలలో కొండ సురేఖ ఓడిపోయారు. ఎవరితో కలిసినా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే భంగపాటు తప్పదని తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు అనన్య సామాన్యం.

రేపటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఈ తెలంగాణ తీర్పు చక్కగా ప్రతిఫలిస్తోంది. తెలుగుదేశం వస్తాననగానే… చంకనెక్కించుకున్నందుకు… ఇపుడు కాంగ్రెసు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోంది. మోడీ డొక్క చించి డోలు కట్టేస్తానంటూ డోలు వాయించుకుంటూ తిరుగుతున్న చంద్రబాబుకు తెలంగాణ ఫలితాలు ఖాయంగా చేదు అనుభవాన్ని మిగిల్చేవే. 

కుట్రల్ని తిప్పికొట్టిన తెలంగాణ ప్రజ 

నిజానికి ప్రజాకూటమి పేరుతో కేసీఆర్ పై కత్తి కట్టింది తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం, పరోక్షంగా కమ్మ సామాజిక వర్గం. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం పార్టీలకు అతీతంగా తెర వెనుక, తెర బయట బాహాటంగా కలిసిపోయి.. ప్రజా కూటమిగా ఏర్పడ్డారు. తెలంగాణకు స్వరాష్ట్రాన్ని సాధించిన పెట్టిన కేసీఆర్ వెలమ అయినందున… దొర పాలన, దొర పాలన అంటూ నానా యాగీ చేశారు. ఆఖరికి రెడ్డి కార్డును ప్రయోగించి ప్రొఫెసర్ కోదండారాం (రెడ్డి)ని కూడా ప్రజా కూటమిలోకి దింపేశారు. అయిష్టంగానే ఆయన కూడా ప్రజాకూటమిలోకి దిగక తప్పని పరిస్థితిని కల్పించారు. తెరాస నుంచి విశ్వేశ్వరరెడ్డి వంటి వారినీ బయటకు తెచ్చేశారు.  

కేసీఆర్ పై రెడ్లందరూ కత్తి కట్టినట్లున్నారన్న ఓ విలేకరి ప్రశ్నకు కోదండరామ్ సమాధానం చెప్పేందుకు నిరాకరించడం దేనిని సూచిస్తోంది? బయటకు ఎవరూ కులం గురించి మాట్లాడకపోయినా… కులం ప్రాతిపదికగానే వీళ్లంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా జట్టు కట్టినట్లు ‘‘న్యూస్ ఆఫ్ 9’’ విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పడానికి ఇష్టపడని అనేక కథనాలను, విశ్లేషణలనూ అందించింది. తెలుగుదేశం పార్టీకి కాలం చెల్లిందని కూడా స్పష్టంగానే ఈ వెబ్ సైటు విశ్లేషించి చెప్పింది. మహాకూటమి అభ్యర్ధులు ఒక్కొక్కరి మెడలో నాలుగైదు కండువాలు కప్పుకుని చేసిన ప్రచార ఘట్టాలు ప్రజలకు జుగుప్స కలిగించాయన్నది వాస్తవం.  

చంద్రబాబుకు చెంపపెట్టు! 

తగుదునమ్మా అంటూ చంద్రబాబు కూడా రంగంలోకి దిగి… ఒకప్పుడు తెలంగాణ కూడా నా జాగీరే కదా.. దీనిని ఎందుకు వదిలేయాలని అనుకుంటూ  ‘‘ఒంటె-షేకు’’ కథలో ఒంటె టెంటులో తలదూర్చినట్లు ప్రజాకూటమి రూపంలో తెలంగాణలో వేలు పెట్టారు. కాలు పెట్టారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది తానేనంటూ డప్పాలు కొట్టారు. హైదరాబాదులో కొంచెం తగ్గి మాట్లాడినా… కోదాడ దాటి అమరావతి చేరగానే హైదరాబాదులో ప్రతి అంగుళం తానే అభివృద్ధి చేసినట్లు మాట్లాడారు. యల్లో మీడియా దన్నుతో తెలుగుదేశం, ప్రజా కూటమి ప్రజల్ని మాయలో పెట్టి… తామే అభివృద్ధికి మారు పేరు అంటూ చెప్పుకున్న మాటల్ని ప్రజలు తిప్పి కొట్టారు. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు  వ్యవహరించిన తీరును తెలంగాణ ప్రజలు అసహ్యించుకున్నారు. 30 ఏళ్ల శత్రుత్వాన్ని వదిలివేసి… కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ జట్టు కట్టడాన్ని ప్రజలు హర్షించలేదని దీనిని బట్టి తేలిపోయింది.

సొంత సామాజిక వర్గం అవసరాల కోసమే చంద్రబాబు పని చేస్తూ పోయారు. నేటికీ ఆయన ధోరణిలో ఎలాంటి మార్పూ లేదు. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్న కోటీశ్వరుల అక్రమాస్తులపై జరుగుతున్న దాడుల్ని కూడా కేంద్రంపై యుద్ధం చేయడానికి వాడుకున్నారు చంద్రబాబు. సొంత పార్టీ నేతల్ని వెనకేసుకొచ్చారు. సీబీఐని సైతం రాష్ట్రానికి రాకుండా నియంత్రించి సీఎం హోదాకు మచ్చ తెచ్చారు. ఒక దేశపు నియంత వ్యవహరించిన తీరులోనే ఆయన వ్యవహారం నేటికీ నడుస్తోంది. సొంత పార్టీ నేతల కోసం.. మోడీని డొక్క చింపేస్తానంటూ ఢిల్లీలో చిందులు తొక్కిన బాబు మరి ఇపుడు ఏం చేస్తారో? తేదేపాతో అంట కాగడం వల్ల రేపు లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెసు దెబ్బతినడం ఖాయం.

తడాఖా చూపించిన కాపు సామాజిక వర్గం

సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిలో సుహాసినీని తెచ్చి తెలంగాణ ప్రజలపై రుద్దారు. కానీ కూకట్ పల్లిలో ఉన్న కాపులు ఈ మార్పును తట్టుకోలేక.. తెరాసకు బాహాటంగా మద్దతు పలికారు. ఎన్నో సమావేశాలు పెట్టుకుని మరీ తెరాస అభ్యర్ధికి మద్దతు పలికారు. సుహాసినీని ఏమైనా ఓడించి తీరాలనీ, కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు ఈ దెబ్బతో బుద్ధి చెప్పాలని భావించింది. కంకణం కట్టుకుని మరీ ఆమె ఓటమి కోసం పని చేశారు. తెలుగుదేశం పార్టీ డబ్బులు వెదజల్లింది. కాపు వర్గం నాయకులు కొంత మందిని చేరదీసింది. కమ్మసంఘం నేతలు సైతం కూకట్ పల్లిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాత్రింబవళ్లు పని చేశారు. సుహాసిని వెనుకంజలో ఉండటంపైన కూకట్ పల్లిలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

కొడంగల్ కోటలో చతికిల పడిన గెలుపు గుర్రం 

ఓటుకు నోటు కేసులో చిక్కినా… తప్పు చేసిన భావం ఆయనలో ఏమాత్రం లేదు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలే అన్నట్లు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కూడా భావించాయి. రేవంత్ రెడ్డిని కాంగ్రెసులో చేర్చుకున్నారు. కేసీఆర్ ను తిట్టగల దమ్మున్న నేతగా మీడియాలోనూ రేవంత్ ను ఆకాశానికి ఎత్తేశారు. జైపాల్ రెడ్డిగానీ, రేవంత్ గానీ సీఎం అయిపోదామని కలలు కూడా కన్నారు.

రేవంత్ రెడ్డి సాయంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంతో తెలంగాణలో జండా ఎగరేద్దామని భ్రమసిన కాంగ్రెసు బోల్తాపడింది. ‘‘తెలంగాణ ప్రజలు… నా బిడ్డలు’’ అంటూ సోనియాగాంధీ ఇచ్చిన పిలుపును కూడా ప్రజలు పట్టించుకోలేదు. చంద్రబాబుతో అంటకాగడం వల్ల కాంగ్రెసు దారుణంగా నష్టపోయింది. చంద్రబాబు రాకపోయి ఉంటే… తెరాసకు 60 సీట్లు మాత్రమే వచ్చి ఉండేవి కావచ్చు. చంద్రబాబు పుణ్యమా అని తెరాస 100 సీట్ల మార్కును దాటిపోయేట్లు ఉంది. ఇప్పటి వరకూ కొడంగల్ లో ఓటమి చవి చూడని రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ప్రజల ఆమోదం లేకుండా.. మేం కలిసిపోతాం… మీరు ఓట్లు వేస్తే చాలన్నట్లు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు వ్యవహరించాయి.

ఇక చెల్లని నాణెం చంద్రబాబు

తెలంగాణలో గెలవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని, దీనిని అడ్డంపెట్టుకుని ఆంధ్రలో కూడా తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని చంద్రబాబు తలపోశారు. అందుకే ప్రజా కూటమి గెలుపు కోసం చంద్రబాబు కోట్లాది రూపాయలు ఇక్కడ ఖర్చు  చేసి ఉంటారు.  తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఒకటే నమ్మకం. డబ్బులు పారేస్తే ఓట్లు కొనుక్కోవచ్చని ఒక గుడ్డి నమ్మకం ఆ పార్టీకి ముందు నుంచీ ఉంది. ప్రతి రోజూ పత్రికా సమావేశాల్లో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతుంటారు. పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న దినపత్రికలు వాటిని పేజీల నిండా పరిచేసి పాఠకుల నెత్తిన గుమ్మరిస్తూ వస్తున్నాయి.

ప్రశ్నించే పాత్రికేయులు ఉండరు. ఒకవేళ ప్రశ్నించినా ఆయన సమాధానం చెప్పడానికి ఇష్టపడరు. తన సామాజిక వర్గమే ఆంధ్రలో కూడా అధికారంలో ఉండాలని ఆయన కోరుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా పని చేస్తోందని, ‘‘డీకోడింగ్ టీడీపీ’’ పేరుతో ఇటీవల ‘‘న్యూస్ ఆఫ్ 9’’ అనేక ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఎన్టీరామారావు కాలం నుంచీ పార్టీ తీరు ఒకేలా ఉందని, ప్రజల అభ్యున్నతి వారికి ఎన్నడూ పట్టదని చెప్పాం. ఇవ్వాళ ప్రజలు ఒక్క ఈనాడు దినపత్రికనో, కేవలం ఏబీన్ ఆంధ్రజ్యోతినో నమ్మడం లేదు. బాబుకు మద్దతుగా యల్లో మీడియా ఎన్ని చెప్పినా, ఏం రాసినా తెలంగాణ ప్రజలు ప్రజా కూటమిని తుంగలో తొక్కిపారేయడం చారిత్రక అవసరం. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఎంతో పరిణతిని ప్రదర్శించారు. అందుకు తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతోంది ‘‘న్యూస్ ఆఫ్ 9’’. కేవలం కులంతోనూ, డబ్బున్న అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని కొనుక్కుందామనుకున్న శక్తులకు ఇదో పెద్ద గుణపాఠం. చంద్రబాబు సామాజిక వర్గం వారు… తమ జీవనకాలం మొత్తం తెలుగు దేశానికే ఓటు వేసినా.. చంద్రబాబు (కులపరమైన కట్టుబాటు) కోసం తెలంగాణ ఎన్నికల్లో రెట్టించిన ఆనందంతో  కాంగ్రెసుకు ఓటు వేయడం విశేషం.

తెరాసకు మద్దతుగా నిలబడిన జనసేన

పరోక్షంగా చెప్పినా… తెరాసకే మద్దతు ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. దీంతో జన సైనికులంతా కూడా తెరాసకు మద్దతుగా నిలబడ్డారు. తెలంగాణకు చెందిన జన సైనికులతోపాటు, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన వారు కూడా తెరాస వెనుక నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించి మంచి పని చేశారని తెలంగాణ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అనేక మంది అభ్యర్థులు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.  

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *