రెండు దయ్యాలు… రెండు భయ్యాలు!!

January 22, 2019 | News Of 9

  • వణుకుతున్న ఏపీ సీఎం చంద్రబాబు
  • 30 మంది ముఖ్యమంత్రుల్లో భయపడుతున్నది ఆంద్రా సీఎం మాత్రమే

(న్యూస్ ఆఫ్ 9)

‘‘న్యూస్ ఆప్ 9’’ కొన్ని నెలల కిందట చెప్పినట్లే.. ఈవీఎం విషయం వివాదాస్పదం కావడానికి అవసరమైన ప్రయత్నాలు తెరవెనుక మొదలయ్యాయి. ఎక్కడో లండన్ నుంచి ఈవీఎంల గురించి వివాదాన్ని సృష్టించడం వెనుక కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ బలంగా విశ్వసిస్తోంది. జమ్మూకాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా ఈవీఎంల విషయాన్ని ప్రస్తావించారు. కొన్న ప్రాంతీయ పార్టీలను భయపెడుతున్న అంశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒకటి అయితే, రెండోది ఈవీఎం.

 ఈవీఎంలపై సయ్యద్ షూజా ఏం చెప్పాడు?

సైబర్ నిపుణుడుగా తనను తాను పరిచయం చేసుకుని… భారతదేశంలో ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చంటూ… లండన్ నుంచి చేసిన ప్రకటన దేశంలో ప్రకంపనలు పుట్టించింది. ఈవీఎంలను హ్యాక్ చేయడం ద్వారానే 2014లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందనీ… మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా హ్యాకింగ్ ను తాను అడ్డుకున్నానని చెప్పాడు. లేదంటే భాజపా గెలిచి ఉండేదని అన్నాడు. పైగా ఈవీఎంలను తయారు చేసిన ఈసీఐల్ కంపెనీలో తాను పని చేశాననీ, తన మిత్రబృందాన్ని హత్య చేయడంతో తాను విదేశాలకు పారిపోయానని పెద్ద కట్టుకథ అల్లాడు. 21వ తేదీన స్కైప్ ద్వారా లండన్ నుంచి మీడియా సమావేశాన్ని నిర్వహించాడు. 2014లో వాడిన ఈవీఎంలను తామే డిజైన్ చేశామని, వీటిని ఎలా హ్యాక్ చేయవచ్చో చూపించమని ఈసీఐఎల్ తమను అడిగిందనీ చెప్పాడు. జియో రూపొందించిన మాడ్యులేటర్ ద్వారా మిలిటరీ గ్రేడ్ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో భాజపా ఈవీఎంలను హ్యాక్ చేసిందని చెప్పాడు. ఈ విషయం తెలిసినందునే భాజపా నేత గోపీనాధ్ ముండేని చంపేశారని చెప్పాడు. కర్ణాటకలో గౌరీ లంకేష్ ఈ వార్తను రాయబోయినందుకే ఆమెనూ చంపేశారని చెప్పాడు. దీంతో చాలా కలకలం చెలరేగింది. ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రయత్నం జరిగిన వెంటనే.. మిషన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి హ్యాక్ చేయడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది.

ఇక్కడితో ఆగుతుందన్న శేఖర్ గుప్తా..!!

ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న రచ్చకు ఇక్కడితే తెరపడుతుందని ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలని కూడా ఆయన హితవు పలికారు. ఆయన ఇలా చెప్పడానికి కారణం.. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కాంగ్రెసు పార్టీ ఇప్పటికీ విశ్వసిస్తోంది. గతంలో అనేక సార్లు ఆరోపణలు చేసింది. సయ్యద్ వీడియో కాన్ఫరెన్సులోకి అమెరికా నుంచి జాయిన్ కాగా, లండన్ నగరంలో ఉన్న ఒక వెబ్ సైట్ ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసింది. లండన్ ఆఫీసులో కాంగ్రెసు నేత కపిల్ సిబల్ ఉండటం పెద్ద ఎత్తున విమర్శలకు తావు ఇచ్చింది. కాంగ్రెసు పార్టీనే ఈ ఈవీఎం హ్యాకింగ్ పై అనవసరంగా రచ్చ చేస్తోందని భాజపా ఆరోపించింది.

అసలు కారణాలు ఏమై ఉంటాయి?

ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత… రాజకీయ పార్టీలు అనేక సార్లు వాటిని అనుమానించాయి. కేంద్ర ఎన్నికల సంఘం అనేక సార్లు ఈవీఎంలను పరీక్షించి వాటిని హ్యాకింగ్ చేయడం అసాధ్యమని చెప్పింది. అనేక మంది ప్రయత్నించారుగానీ… ఎవరూ ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించలేకపోయారు. దీంతో ఎన్నికల సంఘం ఈవీఎంలను ఎన్నికల్లో విస్కృతంగా ఉపయోగిస్తోంది.

వచ్చిన చిక్కు ఏమిటి?

ఈవీఎంలు వచ్చిన తర్వాత.. రాజకీయ పార్టీలకు ఓట్లను రిగ్గింగ్ చేయడానికి ఉన్న అవకాశం చేజారి పోయింది. ప్రజల్ని బెదిరించి ఓట్లు కొట్టేయడానికి అవకాశం లేకుండా పోయింది. చేసేదేమీ లేక ఓటుకు 2 వేల వరకూ చెల్లించి.. ఓట్లను బహిరంగంగా కొనుక్కునే స్థాయికి రాజకీయ పార్టీలు దిగజారిపోయాయి.

సమాజం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆలోచనలు మారుతున్నాయి. ఇపుడు రాజకీయ పార్టీలకు దొడ్డి దారిలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలను ఉదాహరణగా తీసుకుంటే… ఇపుడు ఓట్లు తెచ్చుకోవడానికి రెండే రెండు మార్గాలు. ఒకటి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం. అందుకే స్కీముల పేరుతో… సీఎంలు డబ్బులు విచ్చలవిడిగా హామీల రూపంలో విసిరేస్తున్నారు. అడిగిన వారికీ అడగని వారికీ 2 వేలు, 10 వేలు.. వాళ్లిష్టం అయిపోయింది. ప్రజాధనాన్ని హామీలకే ఖర్చు పెట్టేస్తున్నారు. ఇదంతా దాదాపుగా అనుత్పాదక వ్యయమే. ఇక రెండోది… ప్రజల్ని ఏమార్చడం. ఫలానా వాడికంటే నేను బెటర్… అన్న ధోరణిలో మీడియాను ఉపయోగించుకుని ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం. లేదంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి..పబ్బం గడుపుకోవడం.  

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 2019 ఎన్నికలకు వెళుతున్నది. అధికార తెలుగుదేశం ప్రభుత్వం… అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు అష్టకష్టాలూ పడుతోంది.

ఒక పక్క అనుపమాన వాగ్దాటితో.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో జనసేన ఒక సంచలనం. సునామీలా వారు ప్రజల్లోకి వెళ్లిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను అంత ఉద్ధృతంగా ఉపయోగించుకోవడం లేదు. కొత్తగా చెప్పుకోవాల్సిందిలేదుగానీ… చంద్రబాబు ప్రసంగాలు ఎప్పుడూ చర్విత చర్వణంగా ఉంటాయి. కిరాణా కొట్టుకి ఇచ్చే సరుకుల లిస్టు ఇంకా నయంగా ఉంటుంది.

ఈ పెట్టుబడి కథలతో, కట్టు కథలతో, కనికట్లతో యువతను ఆకట్టుకోవడం కష్టం. సరే, చంద్రబాబు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా చంద్రబాబు సామాజిక వర్గం పెద్ద ఎత్తున దాడిని ఎదుర్కొంటున్నది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు మొత్తం 3 రకాల రహస్య ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. జగన్, పవన్ కళ్యాణ్ లను జీరో చేయగల ప్రణాళికలవి. సీనియర్ నేత కదా!!

1.     రహస్యంగా కేసీఆర్ సాయం తీసుకుని ఆంధ్ర సెంటిమెంటును రగిలించి… ఆ మంటల నుంచి ఓట్లను రాబట్టుకుని అనూహ్యంగా సీఎం అయిపోవడం.  

2.     ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల ద్వారా ఎన్టీఆర్ ను మళ్లీ ప్రజల మెదళ్లలో నింపి.. తెలుగుదేశం పార్టీపై సానుభూతిని కలిగించి, లేదా రగిలించి ఓట్లు కొట్టేయడం.

3.     మళ్లీ బ్యాలెట్ తరహా పోలింగ్ కు వెళ్లడం. ఈవీఎంలను రద్దు చేయాలని, అమెరికాలో కూడా బ్యాలెట్ వాడుతున్నారని ఎంత చక్కగానో ఆయన చెప్పారు. అమెరికా జనాభా ఎంత? భారత జనాభా ఎంత? ఇది చాలా చిన్న ప్రశ్న.

కాబట్టి… ఈ మూడో ప్లాను ప్రకారం.. ఇప్పటి నుంచే వర్కవుట్ చేసి, ఎన్నికల నాటికి బ్యాలెట్ తరహా ఎన్నికలకు వెళ్లిపోతే చాలా వరకూ పోలింగ్ ను గుప్పెట్లో పెట్టేసుకుని చక్రం తిప్పవచ్చన్నది ఆయన ఆలోచన. లండన్ నుంచి సయ్యద్ మాట్లాడిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై పెద్ద చర్చకు తెర లేపారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు… ఒకప్పుడు సవతుల్లా కొట్టుకున్నా… ఇపుడు నవ వధువుల్లా  చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాయి. లండన్ లో జరిగిన సయ్యద్ కాన్ఫరెన్సులో కాంగ్రెసు సీనియర్ నేత కపిల్ సిబల్ ఉండటం గమనార్హం. ఇక్కడ చంద్రబాబు ఈవీఎంలను ఒక అంశంగా చేయాలని భావించడం.. ఎక్కడో లండనులో ముసుగు వీరుడు రావడం… యాధృచ్ఛికంగా అనిపిస్తోందా? 22 పార్టీలతో వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని కూడా చంద్రబాబు చెబుతున్నారు. ఎటు తిరిగి ఈవీఎంలను భ్రష్టు పట్టించడమే ఆయన లక్ష్యం. పైకి మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదమంటూ సన్నాయి నొక్కులు!!  

జాతీయ స్థాయిలో మోడీని ఎదుర్కోవడం కూడా ప్రాంతీయ పార్టీలకు గడ్డు సమస్యగా అయింది. జాతీయ పార్టీలు బలహీనపడి… ప్రాంతీయ పార్టీల బేరసారాలు పెరిగిన తర్వాత.. భాజపా అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రాంతీయ పార్టీలకు మింగుడుపడని సమస్యే. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తుండేవి. యూపీఏలో చేసినట్లుగా… ఎన్డీయేలో సాధ్యంకాకపోవడం ప్రాంతీయ పార్టీలు గుర్రుగా ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలు కేంద్రంలో ఉండే.. రాష్ట్రం హక్కులను సాధించుకోవచ్చని ప్రాంతీయ పార్టీలు మైకుల ముందు బాగానే ఊదరగొడతాయి గానీ… ఎంపీలందరూ తలో ప్రాజక్టును తెచ్చుకుని సంపాదించిన డబ్బుల్ని చూసి మురిసిపోయేవారే. హా.. ఒక్క విషయం. ఈవీఎంల గురించిగానీ, మోడీ గురించిగానీ భయపడుతున్న సీఎంలలో ముందున్నది చంద్రబాబు ఒక్కరే. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో విపరీతంగా వణికిపోతున్నది చంద్రబాబు ఒక్కరే. ఎందుకో మీకు అర్థం అయ్యివుటుంది. ఓటమి భయం!!

ఈ కుట్రలూ, కూహకాలకూ విసిగిపోయే… పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారు. ఈనాటి యువత.. కేవలం యల్లో మీడియాలో వస్తున్న వార్తలు చదువుకుని మురిసిపోయే రకం కానే కాదు. చంద్రబాబు కోల్ కతా సమావేశంలో రాఫెల్ యుద్ధ విమానాలకూ, బొమ్మ విమానాలకూ తేడా తెలియకుండా మాట్లాడారు కానీ.. యువత చాలా వేగంగా సమస్యలను అర్థం చేసుకుంటున్నది. ఎవరు అబద్ధాలు చెబుతున్నారు.. ఎవరు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్న విషయాన్ని వారు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

అందుకే చంద్రబాబు… యువతపైన కాకుండా… ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మన దేశంలో ఇపుడు యువతదే అగ్రస్థానం. వారిని మోసం చేయడం, ఏమార్చేయడం అసాధ్యమని ఆయనకు అర్థమైంది.

అయితే… ఎన్నికలు దగ్గరపడే కొద్దీ… కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ‘‘బాలెట్ ద్వారా పోలింగ్’’ అంశాన్ని తెరపైకి పెద్ద ఎత్తున తెస్తారు. సరే, దింపుడుకళ్లెం ఆశ. అధికారం.. ఏటా రూ.2 లక్షల కోట్ల బడ్జెట్టుపై సంతకం..ఎవరు పెట్టాలి అన్నదే ది బిగ్ క్వశ్చన్!

కొసమెరుపు: బ్యాలెట్ తరహాను సమర్ధించబోమని, ఈవీఎంలే మంచిదని తెరాస ఎంపీ వినోద్ కుమార్, ఇదే తమ పార్టీ విధానమని ప్రకటించారు.

నోట్: అధికారం కోసం బాబు రహస్య ప్రణాళికలపై న్యూస్ ఆఫ్ 9 కథనం ఈ దిగువ లింకులో చూడవచ్చు.  

https://www.telugu.newsof9.com/2019-babu-3-bombs-120-seats/

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *