దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత

February 12, 2019 | News Of 9

ప్రముఖ దర్శకుడు, రచయిత, పత్రికా సంపాదకుడు విజయ బాపినీడు హైదరాబాదులోని తన స్వగృహంలో కన్నుమూశారు. సినిమా దర్శకుడుగా, నిర్మాతగా, విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకత్వం వహించి  పేరు పొందారు. విజయబాపినీడు 1936 సెప్టెంబర్ 22న ఏలూరు దగ్గర చాటపర్రులో జన్మించారు. బీ ఏ వరకు చదివి కొంతకాలం పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్ లో పని చేశారు.

గుత్తా బాపినీడు పేరుతో రచనలు చేసిన బాపినీడు అనంతరం పత్రికలు కూడా స్థాపించారు. ఆయన రాసిన జగత్ జెట్టీలు కథ సినిమాగా వచ్చింది. మగ మహారాజు తో దర్శకునిగా మారి 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి దాసరి దర్శకత్వంలో ‘‘యవ్వనం కాటేసింది’’ సినిమా తీశారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారితో కలిసి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘‘జే గంటలు’’ చిత్రాన్ని నిర్మించారు.

ఆయన దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు, ప్రేమ పూజారి, విజయ, బొట్టు – కాటుక చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. మెగాస్టార్ చిరంజీవితో మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నేం.786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి భారీ యాక్షన్ చిత్రాలను రూపొందించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన కృష్ణ గారడీకి దర్శకత్వం వహించిన బాపినీడు.. రాజేంద్ర ప్రసాద్ తో ‘‘వాలు జడ తోలు బెల్టు’’, దొంగ కోళ్లు సినిమాలు తీశారు.

విజయబాపినీడు మరణ వార్త ఆయనతో అనుబంధం ఉన్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. బాపినీడు కుటుంబ సభ్యులను కలిసి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్  మహా ప్రస్థానంలో బాపినీడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అమెరికాలో ఉన్న ఆయన పెద్దమ్మాయి రావడానికి సమయం పడుతున్న కారణంగా అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

విచారం వ్యక్తం చేసిన మోహన్ బాబు

ప్రముఖ నటుడు మోహన్ బాబు బాపినీడు మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. విజయబాపినీడు మరణం తనను చాలా బాధించిందనీ తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో ఆయన ఒకరనీ మోహన్ బాబు అన్నారు. బాపినీడు మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుంచీ తనకు సాన్నిహిత్యం ఉందన్న మోహన్ బాబు  బాపినీడు మృదు స్వభావం, వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు.  విజయ బాపినీడు మంచి దర్శకుడు మాత్రమే కాదనీ అంతకు మించి మంచి రచయిత.. ఎడిటర్.. అభిరుచి గల నిర్మాత అని చెప్పారు. బాపినీడును కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అన్న మోహన్ బాబు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *