వర్జీనియా దొరలు – డబ్బుల కట్టలు!!

February 4, 2019 | News Of 9

70 ఏళ్ల ఊడిగానికి మూలాలు- పార్ట్ 03

  • పొగాకు డబ్బులు… సినిమాల్లోకి
  • అనంతరం పత్రికలు, టీవీలూ
  • తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం
  • ఇక ఆడింది ఆట-పాడింది పాట

70 ఏళ్ల ఊడిగానికి మూలాలు- పార్ట్ 03

‘‘తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం… ‘‘ఆడింది ఆట పాడింది పాట’’… అలా ఎందుకు అవుతున్నది? దీని మూలాలు ఎక్కడున్నాయి? ‘‘న్యూస్ ఆఫ్ 9’’ వెలికితీస్తున్నది. కాటన్ దొర నిర్మించిన ఆనకట్ట తొలి దశ. చెరకు, షుగర్ మిల్లులు, రైసు మిల్లులు రెండో దశ. దీని గుంటూరు జిల్లా నుంచి జరిగిన పొగాకు ఎగుమతుల వ్యాపారం మూడో దశ. నాలుగోది సినిమాలు, పత్రికలు. కోట్లకు పడగలు ఎత్తడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఒక వర్గానికి కలిసి వచ్చాయి? మిగిలిన బడుగు వర్గాలు వెనకబడిపోవడానికి కారణాలను తెలుసుకునే ముందు… కమ్మవారి ప్రయాణం ఎలా జరిగిందో తెలియాలి. సమాజంలో ఒక వర్గానికే అన్ని పరిస్థితులూ సహకరించి… 90 శాతం బడుగు వర్గాలకు ఎందుకు సహకరించలేదు? ఏం జరిగి ఉంటుంది? ఇవన్నీ తెలియాలంటే… పెట్టుబడిదారుల మనస్తత్వం తెలియాలి.

70 ఏళ్ల ఊడిగానికి మూలాలు- పార్ట్ 03 చదవండి’’

భూ సంస్కరణల వల్ల జమిందారీ పెట్టుబడులు.. పరిశ్రమల్లోకి తరలివచ్చాయన్నది కీలకం. 1930ల నుంచి జరుగుతున్న దున్నే వాడిదే భూమి వంటి ఉద్యమాల వల్ల ఎస్టేటు భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. చల్లపల్లి రాజా భూముల విషయంలో ఇదే జరిగింది. 1948లో జమిందారీ వ్యవస్థను రద్దు చేసే వరకూ వెళ్లింది. మద్రాస్ ఎస్టేటు (జమిందారీ ఎస్టేట్ రద్దు మరియు రైత్వారీగా మార్పు) చట్టం తర్వాత పట్టణ భూగరిష్ట చట్టం వచ్చింది. దాంతో గ్రామీణ ప్రాంతాల్లోని పెట్టుబడులు పరిశ్రమలకు పెట్టుబడిగా మారింది. తొలితరం కమ్మ పారిశ్రామికవేత్తలంతా కూడా భూస్వాములే. తర్వాత వారే పారిశ్రామికవేత్తలకు ప్రతీకలుగా మారారు. వ్యవసాయాధార పరిశ్రమలతోపాటు వారు నిర్మాణ రంగంలో, ప్రభుత్వ కాంట్రాక్టులు, రవాణ వ్యవస్థల్లోకి విస్తరించారు. 1940లో మద్రాసు ప్రెసిడెన్సీలో పబ్లిక్ వర్క్క్ డిపార్టుమెంటు, రైల్వే కాంట్రాక్టుల జాబితాలో ఎక్కువ మంది కమ్మ కుటుంబాల వారే ఉన్నారు. ఆ కుటుంబాల ఇంటి పేర్లు ఇవి: దేవినేని, యార్లగడ్డ, యలమంచిలి, కావూరి, సూరపనేని, వల్లభనేని, గోగినేని, చలసాని, కాకాని. 1944లో కాకినాడ ప్రధాన కేంద్రంగా శ్రీరామదాసు ట్రాన్స్ పోర్టు (SRMT) మొదలైంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ కంపెనీ యజమానులుగా ఉన్నారు. కాకినాడలో ప్రయాణికుల రవాణాతో ప్రారంభించిన ఈ కంపెనీ.. అనతికాలంలోనే లాజిస్టిక్స్ కంపెనీగా వృద్ధి చెందింది. 200 లారీలతో, 350 బ్రాంచులతో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో సేవలు అందిస్తోంది. 1953లో ఎస్ఆర్ఎంటీ మోటారు విడిభాగాల (పిస్టన్లు, పిన్నులు, ప్రొపెల్లర్ షాఫ్టులు, చక్రాల బోల్టులు, రోడ్ అండ్ క్లచ్ రిపేర్ కిట్లు) తయారీలోకి ప్రవేశించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు విడిభాగాలను సరఫరా ప్రారంభించింది. రెండేళ్ల తర్వాత టాటా వాణిజ్య వాహనాల డీలర్ షిప్పు ను పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తీసుకుంది. 1989 వచ్చే సరికి కంపెనీ అనుబంధ కంపెనీ శ్రీ విజయా ఇంజిన్ వాల్వ్స్ పేరుతో ఇంజిన్ వాల్వుల తయారీలోకి వెళ్లింది. రాజమండ్రి మాజీ మాజీ ఎంపీ (తెలుగుదేశం) కేవీఆర్ చౌదరి కి చెందిన సొంత కంపెనీగానే నేటికీ కొనసాగుతున్నది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చల్లపల్లి రాజా కాలం (యార్లగడ్డ శివరామ ప్రసాద్) నుంచీ కమ్మ వారి ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. వ్యవసాయంలో డబ్బులు వచ్చిన ప్రతిసారీ చాలా మంది కమ్మ ధనికులు చెన్నై వెళ్లి పిక్చర్ (సినిమా) తీసేవారని చెబుతారు. అనారోగ్యం కారణంగా గూడవల్లి రామబ్రహ్మం సారధి ఫిలింస్ నుంచి తప్పుకున్నారు. గృహ ప్రవేశం సినిమాని దర్శకత్వ బాధ్యతల్ని అక్కినేని లక్ష్మీ వర ప్రసాద్ రావు (ఎల్వీ ప్రసాద్)కి యార్లగడ్డ శివరామ ప్రసాద్ అప్పగించారు. ఏలూరు తాలూకా సోమవరప్పాడుకు గ్రామంలో వ్యవసాయ కుటుంబం నుంచి ఎల్వీ ప్రసాద్ వచ్చారు. కదిలే బొమ్మలతో ఎల్వీ ప్రసాద్ ప్రేమలో పడ్డారు. ఏలూరులో పంపు సెట్లు బాగు చేయించేందుకు వచ్చినపుడు మూగ సినిమా కాలం నాటి సినిమా ప్రింట్లు ఆయన దృష్టిలో పడ్డాయి. 1930లో ప్రసాద్ వయసు 22 ఏళ్లు. సినిమాల్లో భవిష్యత్తును వెదుక్కుంటూ ఆయన ముంబయి వెళ్లిపోయాడు. తండ్రి అప్పులపాలయ్యాడు. అటవీ ప్రాంతాన్ని సాగులోకి తేవాలని భావించాడు. అదే సమయంలో కరువు వచ్చింది. ధరలు మరింత తగ్గిపోయాయి. ఎల్వీ ప్రసాద్ లైట్ బోయ్, వాచ్ మెన్ వంటి చిన్న ఉద్యోగాలు చేశాడు. అర్దేశర్ ఇరానీ తీసిన ఆలం ఆరా సినిమా (హిందీ) టూరింగ్ టాకీస్ ప్రయణాల్లో ఉండే వాడు. తమిళం (హెచ్.ఎం.రెడ్డి కాళిదాసు), తెలుగు (భక్త ప్రహ్లాద) 1931లో వచ్చాయి. పదేళ్లు ముంబయిలో ఉండి తర్వాత చెన్నైకి వచ్చేశారు ఎల్వీ ప్రసాద్. అప్పటికే ఆయన సహాయ దర్శకుడుగా పని చేశారు. తర్వాత 1946లో చల్లపల్లి రాజ ఎల్వీ ప్రసాద్ కు దర్వకత్వ అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన అనేక హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించాడు. 1949, 1950ల్లో మన దేశం, షావుకారు (ఈ రెండు సినిమాలూ ఎన్టీయార్ పరిచయం అయ్యారు) నుంచి 1950లో చేసి చూడు, మనోహర, మిస్సమ్మ (దీన్నే హిందీలో మిస్ మేరీగా తీశారు). 1956లో ఇలవేలుపు తో ఆయన నిర్మాతగా మారాడు. మిలాన్, ఖిలోనా, బిదాయి, ఏక్ దూజ్ కే లియో వంటి హిందీ సినిమాలు, తెలుగు సినిమాలతో హిట్లు సాధించారు.

1965 వచ్చే సరికి చెన్నైలో రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ సౌకర్యాలతో ప్రసాద్ స్టూడియోస్ ప్రారంభించారు. 9 ఏళ్ల తర్వాత ఫిల్మ్ ప్రాసెసింగ్ యూనిట్ – ప్రసాద్ ఫిల్మ్ లాబొరేటరీ వచ్చింది. ఇదే దేశంలో అతిపెద్ద ఫిల్మ్ లాబొరేటరీ. తర్వాత హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, ముంబయి, భువనేశ్వర్, ఢిల్లీలలో బ్రాంచీలు వచ్చాయి. తర్వాత దగ్గుబాటి రామానాయుడు ప్రవేశించారు. ప్రకాశం జిల్లా కారంచేడు స్వగ్రామం. ఎల్వీ ప్రసాద్ లాగానే రామానాయుడు నటుడు కావాలని అనుకున్నాడు. కానీ నిర్మాతగా ఆయన మారాడు. సురేస్ ప్రొడక్షన్స్ 150కి పైగా సినిమాలు నిర్మించింది. ఇదే గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదైంది. 1964లో రాముడు-భీముడు (ఎన్టీఆర్) తో మొదలు పెట్టి తోఫా, మాక్సద్ వంటి హిట్ సినిమాలు అందించారు. హిందీలో విజయవంతమైన మరో పేరు… అట్లూరి పూర్ణ చంద్రరావు. అంథా కానూన్, ఆఖరి రాస్తా (అమితాబ్ బచ్చన్), చాల్ బాజ్ (శ్రీదేవి)లతో సినిమాలు తీశారు. కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరున్న చౌటపల్లికి చెందిన కమ్మ- అట్లూరి పూర్ణ చంద్రరావు. ఈ జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. నటులు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి (కృష్ణ) కూడా కమ్మవారే. ఎన్టీఆర్, అక్కినేనిలది గుడివాడ దగ్గర గ్రామాలు కాగా, కృష్ణది గుంటూరు జిల్లా. అలాగే మోహన్ బాబుది రాయలసీమ కమ్మ. చిత్తూరు జిల్లా. బాలకృష్ణ (ఎన్టీయార్ కొడుకు), నాగార్జున (అక్కినేని కొడుకు), సుమంత్ (అక్కినేని మనవడు), వెంకటేష్ (రామానాయుడు కొడుకు) కూడా సినిమాల్లోకి వచ్చేశారు. ఇది చాలనట్లు… వీళ్లందరికీ సొంత ప్రొడక్షన్ స్టూడియోస్ కూడా ఉన్నాయి. ఏఎన్నార్ –అన్నపూర్ణా స్టూడియోస్, కృష్ణ- పద్మాలయా స్టూడియోస్ వచ్చాయి. తెలుగు సినిమాలో… కమ్మ ఆధిపత్యాన్ని సవాలు చేసిన ఏకైక సినిమా నటుడు మెగా స్టార్ చిరంజీవి. కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతిది కూడా కాపు సామాజిక వర్గమే. (మెగా బ్రదర్స్ అందరి గురించీ ఇవ్వడం లేదు).

1980లకు పూర్వం తొలి తరం కమ్మ పారిశ్రామికవేత్తలు ఉన్న మరో రంగం- పొగాకు. 1940ల నాటికే వర్జీనియా పొగాకు పంట సాగులో పూర్తిగా మెళకువలను తెలుసుకున్నారు. చాలా మందికి బార్న్ లు వచ్చేశాయి. గ్రామాల్లో ఉన్న పెద్ద రైతులే సొంత బార్నీసుల్లో పొగాకు నిల్వ ఉంచి పెద్ద కంపెనీలకు వీళ్లు డీలర్లుగా మారారు. తర్వాత పొగాకు రష్యా తదితర దేశాలకు ఎగుమతి కూడా అయ్యేది. 60 శాతం వర్జీనియా పొగాకును ఎగుమతి చేసేవారు, అందులో 80 శాతం బ్రిటన్ కు వెళ్లేది. 1960లకు బ్రిటన్ వాటా 35 శాతానికి పడిపోయింది. కమ్యూనిస్టు దేశాలకు 40 శాతానికి మించింది. దీంతో కొత్తతరం ఎగుమతిదారులు కూడా వచ్చారు. 1982 వచ్చే సరికి.. గుంటూరు ప్రాంతం నుంచి 92 మంది ఎగుమతిదారులు పొగాకు బోర్డు వద్ద నమోదై ఉన్నారు. వీరిలో 60 శాతం మంది కమ్మవారే. ఇందులో సగం మంది 1950, 60ల్లో స్థిరపడినవారే. జాతీయ స్థాయిలో ఒక కోటి లేదా అంతకు మించి టర్నోవర్ ఉన్న కంపెనీలు 19 ఉండగా, అందులో 9 కంపెనీలు కమ్మవారివే. కమ్మ సామాజిక వర్గం నుంచి వినిపించే పేర్లలో రాయపాటి సాంబశివరావు ప్రముఖంగా ఉంటుంది. కాంగ్రెసు ఎంపీగా సుప్రసిద్ధుడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

సోవియట్ రిపబ్లిక్కు కుప్పకూలిపోక ముందు రాయపాటికి చెందిన జయ లక్ష్మీ గ్రూపు రష్యాకు ఎగుమతి అయ్యే పొగాకులో 35 శాతం వాటా ఈ కంపెనీదే. రష్యాకు ఇండియన్ టీ ఎగుమతుల్లో కూడా పావుశాతం వాటాను వీరే కైవశం చేసుకున్నారు. గుంటూరు సమీపంలోని చేబ్రోలు వద్ద 30 వేల కండెలున్న స్పిన్నింగ్ మిల్లు కూడా ఈ గ్రూపు కిందనే ఉన్నది. పొగాకు ఎగుమతులు చేస్తున్న మరో కమ్మవారికి చెందిన కంపెల్లో బెస్ట్ ఇండియా టుబాకో ఒకటి. దీని యజమాని యంపరాల వెంకటేశ్వరరావు. (2004లో గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. 1999లో సాంబశివరావును ఈయన ఓడించారు). తర్వాత చేబ్రోలు నరేంద్రనాధ్ కు చెందిన- ట్రాన్స్ కాంటినెంటల్ టుబాకో ఇండియా, అలాగే యార్లగడ్డ ఎక్స్ పోర్ట్సు (యార్లగడ్డ అంకమ్మ చౌదరి), మిట్టపల్లి ఆదినారాయణ అండ్ కంపెనీ (మిట్టపల్లి రామారావు) కూడా కమ్మవారివే.

ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా ఎగుమతిదారులు ఉన్నారు. వారిలో ముఖ్యమైనవి బొమ్మిడాల (మద్ది లక్ష్మయ్య), పొలిశెట్టి సోమసుందరం గ్రూప్స్ (అందరూ కోమట్లు), డెక్కన్ టుబాకో అండ్ రహంఖాన్ టుబాకో ఎంటర్ ప్రైజెస్ (ముస్లిం)లు ఉన్నాయి.

వీరంతా కలిసి.. ఐఎల్టీడీ వ్యాపారాన్ని 28 నుంచి 30 శాతానికి తగ్గించారు.

మరో ముఖ్యమైన కమ్మ ఇండస్ట్రియలిస్టు దేవినేని సుబ్బారావు. ఈయన మచిలీపట్నం దగ్గర గ్రామంలో జన్మించారు. సుబ్బారావు తెలివైన విద్యార్ధి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. న్యూయార్క్ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 1949లో భారతదేశం వచ్చిన తర్వాత ఆయన పుణేలోని నేషనల్ కెమికల్ లాబొరేటరీలో పని చేశారు. 1954లో టాటా స్టీల్ లో జాయిన్ అయ్యారు. రెండేళ్ల తర్వాత వెలగపూడి రామకృష్ణ కేసీపీ గ్రూపులో చేరారు. రాయగఢలో ఫ్రెర్రో మాంగనీసు ప్లాంటు పెట్టడానకి సహకరించారు. 1972లో సుబ్బారావు, మరో ఇద్దరు సహచరులతో కలిసి సొంతంగా నవభారత్ ఫెర్రో ఎల్లాయ్ స్ లిమిటెడ్ కంపెనీ పెట్టారు. భారతదేశంలో క్రోమియం, మాంగనీసు మిశ్రమ లోహాలు తయారు చేస్తున్న కంపెనీల్లో ఇదే పెద్దది. పాల్వంచ (ఖమ్మం), ఒరిస్సాలోని ఢెంకనాల్ జిల్లా ఖడ్గప్రసాద్ అనే ప్రాంతాల్లో వీరి కంపెనీలు ఉన్నాయి. 1980లో ఈఐడీ ప్యారీ నుంచి డెక్కన్ సుగర్స్, సామర్లకోట (ప.గో.జిల్లా)లో ఉన్న అబ్కారీ కంపెనీ యూనిట్ లను కొన్నారు. నవభారత్ ఫెర్రో ఎల్లాయ్స్ కు అనుబంధంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ 3,500 టన్నుల చెరకు ఆడుతున్నది.

తెలుగుదేశం పార్టీ రాక.. ఆ తర్వాత…?

షుగర్, పొగాకు, రైస్ మిల్లుల నుంచి మొదలైన కమ్మవారు.. తర్వాత ప్రభుత్వ కాంట్రాక్టులు, రవాణా, నూలు మిల్లులు, మిశ్రమ లోహాలు, సినిమా రంగాల్లో దూసుకుపోయారు. వ్యవసాయ రంగం నుంచి మార్పు చెందడానికి 50 ఏళ్ల కాలంలో పూర్తిగా పారిశ్రామక రంగానికి మారిపోయింది. ఇక జరగాల్సింది.. కార్పొరేట్ అధికారాన్ని రాజకీయ అధికారంగా మార్చివేయడమే మిగిలింది. రాజకీయ అధికారం దిశగా దృష్టి మరల్చారు. అప్పటి వరకూ కమ్మవారు ఒక్క ముఖ్యమంత్రిని కూడా తయారు చేసుకోలేదు. తమదిగా చెప్పుకోవడానికి ఒక సొంత పార్టీని కూడా ప్రారంభించుకోలేదు. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత కొంతకాలం వామపక్షాలతో కలిసి పని చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)ని ‘‘కమ్మ’’నిస్టు పార్టీ అని పిలిచేవారు. సీపీఐ జమిందారీ వ్యతిరేక ఉద్యమం కమ్మ రైతుల్ని ఆకర్షించింది. సాధారణ రైతులు, అప్పుడప్పుడే ఎదుగుతున్న కౌలు రైతులు కూడా అందులో ఉన్నారు. అలాగని వీళ్లంతా పేదలేమీ కాదు. ఒక్కొక్కరి వద్దా కనీసం 5 నుంచి 10 ఎకరాలు పొలాలు చేతిలో ఉన్నాయి. జమీందారులకూ, ఈ రైతులకూ మధ్య ఒకింత ఘర్షణ వాతావరణం కూడా ఉండింది. రైతుల నుంచి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టేది కూడా మధ్యలో ఉన్న జమిందారీ వర్గాలే. 1940-41 నాటికి వ్యవసాయ భూముల్లో 25 శాతం డెల్టా జిల్లాల్లోని భూములు జమిందారీ వ్యవస్థ కింద ఉండేవి. విశాఖపట్నం-శ్రీకాకుళం బెల్టులో మూడొంతులు ఉండేది. జమిందారీ వ్యవస్థ ఎలా ఉండేందంటే అదొక స్థానిక ప్రభుత్వం అనుకోవచ్చు. జమిందారులే పన్నులు వసూలు చేసేవారు. వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజలకూ మధ్య ఘర్షణలను సృష్టించేవారు. ఈ పరిస్థితి.. 1952లో సీపీఐ ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా మారడానికి ఉపకరించింది. 1950ల్లో కమ్మలు.. కాంగ్రెసు పార్టీలో ఉండేవారు. వామపక్ష ప్రభావాన్ని తుడిచిపెట్టేందుకు కాంగ్రెసు వాళ్లు.. కౌలు చేసుకున్న వారికే ఆంధ్ర, తెలంగాణల్లోని జమిందారీ భూముల్నీ, జాగిర్దారీ భూముల్నీ అప్పగించేస్తూ భూసంస్కరణల చట్టం తెచ్చారు. 1957లో కొత్త పంచాయితీరాజ్ చట్టం కూడా తెచ్చారు. ప్రభుత్వ నిధుల్ని గ్రామం, తాలూకా, జిల్లా స్థాయిల్లో ఖర్చు చేసుకునే విధానం వచ్చింది. భూసంస్కరణల పుణ్యమా అని జమిందారీ, జాగిర్దారీ వ్యవస్థలు అంతరించిపోయాయి. కౌలు రైతులే.. బలమైన రైతులుగా మారారు. పంచాయితీరాజ్ చట్టం వల్ల, కొత్తగా అందివచ్చిన భూముల ద్వారా లభించిన దన్నుతో స్థానిక సంస్థల్లో రాజకీయ అధికారాలన్నీ వారికే దఖలు పడ్డాయి. గ్రామీణ ఆర్ధిక రాజకీయ వ్యవస్థపై వారి ఆధిపత్యం పెరిగింది. కమ్మ మధ్య తరగతి వేరు… చల్లపల్లి, కపిలేశ్వరపురం రాజాలు వేర్వేరు. కమ్మ మధ్య తరగతి వారంతా కాంగ్రెసు పార్టీలో కుదురుకున్నారు.

హనీమూన్ ఇక్కడితో ఆగిపోలేదు. 1970 తొలినాళ్లలో దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం కొన్ని సంస్కరణలను తేవాలని ఇందిరాగాంధీ భావించారు. రైత్వారీగా గ్రామాల్లో ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది కమ్మవారు భావించారు. గ్రామాల్లో ఓటు బ్యాంకులుగా ఉన్నది దళిత, వెనుకబడి తరుగతి ప్రజలే. పీవీ నరిసింహారావు ప్రభుత్వం పట్టణ భూగరిష్ట చట్టాన్ని తెచ్చింది. రెండు పంటలు పండుతున్న పొలాల్ని 18 ఎకరాల కంటే మించి ఒక వ్యక్తి తన కుటుంబం పేర ఉంచుకోవాడానికి వీల్లేదు.

కమ్మవారికి ఇది పెద్ద అవరోధంగా మారింది. వ్యవసాయ యోగ్యమైన భూముల్ని సేకరించుకోవడానికి ఇది అడ్డంకిగా మారింది. భౌతికంగానూ, మానసికంగానూ కూడా. దీనికితోడు 1972 నాటి సుప్రీంకోర్టు తీర్పు కూడా వారికి అవరోధంగా మారింది. తెలంగాణ (హైదరాబాదుతో సహా)లో ఉద్యోగాలను స్థానికులకే (ముల్కీలు) ఇవ్వాలన్న నిజాం ఫర్మానా (డిక్రీ)ను సుప్రీం సమర్ధించింది. ఇది జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసింది. కోస్తా జిల్లాల్లోని మధ్య తరగతి ప్రజలు ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. స్వరాష్ట్రంలోనే… తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ వారంతా ఉద్యమించారు. దీంతో కమ్మవారు పూర్తిగా కాంగ్రెసుకు దూరమయ్యారు. పైకి ఎదిగే దారులను మూసివేయడం, పేరుకుపోతున్న ధనరాసులు చదువుకున్న కమ్మలను ఒత్తిడికి గురిచేశాయి. వ్యాపారం చేయడం తప్పనిసరి అవసరంగా మారింది. ఈ ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు హైదరాబాదులో రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు ఆధిపత్యాన్ని నాశనం చేయడం… ఈ రెండు లక్ష్యాలతో పార్టీ అవసరమని వారు భావించారు. ఇందిరాగాంధీ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఎన్టీరామారావు సరిపోతాడని వారు భావించారు. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. అప్పటికి ఎన్టీరామారావు వయసు 59 సంవత్సరాలు. తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఎన్టీరామారావు మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించారు. 1980లో కాంగ్రెసు నలుగురు ముఖ్యమంత్రులను మార్చడం కూడా వీరికి కలిసివచ్చింది. బలహీన వర్గాలను ఆకర్షించేందుకు 2 రూపాయలకే కిలో బియ్యం వంటి అనేక ప్రజాకర్షక పథకాలను ఎన్టీరామారావు ప్రవేశపెట్టారు. 1983 జనవరి 9న తొలి కమ్మ ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు ప్రమాణ స్వీకారం చేశారు.

(తరువాయి… 70 ఏళ్ల ఊడిగానికి మూలాలు– పార్ట్ 04 లో)

Other Articles

5 Comments

  1. కమ్మ వారు వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందారు. దానికి ఎవరు తప్పు పట్టాల్సిన ఆవసరం లేదు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో పెట్టుబడిదారుల ప్రభావం ఎక్కువ అయింది కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వెనక ఉన్న దురాలోచన అర్ధం చేసుకోగలము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *