మిమ్మల్ని కూలదోయకపోతే.. మేం జనసేనే కాదు: పవన్

December 2, 2018 | News Of 9
 • తెలుగుదేశం కుంభ స్థలంపై కొట్టాలి… అది తలవంచాలి
 • కొడుకు కోసం చంద్రబాబు దృతరాష్ట్రుడుగా మారాడు
 • ఊర పిచ్చుకపైన తాటిపండు… అంటూ లోకేష్ కు చురక
 • పాత దొంగ ఎప్పటికైనా దొరికిపోతాడంటూ జగన్ పై విసుర్లు
 • లాలూ ప్రసాద్ ఇప్పటికీ బయటలేదని గుర్తు చేశారు
 • జనసేన వస్తే.. బోలెడు కంపెనీలు వస్తాయి
 • మీ కోసం చచ్చి పోవడానికైనా సిద్ధమే
 • రాయల నాటి పాలనను మళ్లీ తెద్దాం
 • కదం తొక్కిన అనంతపురం కవాతు

(అనంతపురం, న్యూస్ ఆఫ్ 9)

అనంతపురం… మాయమై అది జనసేన పురంగా మారింది. అనంత జన ప్రవాహంలో అనంతపురం ఒదిగిపోయింది. జనసేన కవాతు అనంతానంత ఆనందంతో కదం తొక్కింది. ‘‘మేమంతా మార్పును కోరుకుంటున్నాం. ఓ సైనికుడా… మీతోపాటే మేమున్నాం’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒక అమ్మలా అక్కున చేర్చుకున్నది అనంతపురం. కవాతులో ఆయన నడిచి వస్తుంటే, సీమవాసులు ప్రేమపూర్వకంగా ఆయనతో పాటు అడుగులో అడుగు వేశారు. చేతిలో చేయి వేసి.. మేమున్నాం అన్నారు. ధవళేశ్వరం కవాతు అనుకుంటే.. అంతకు మించిన, రెట్టించిన ఉత్సాహంతో రేపు మార్పు రావడం ఖాయం అన్నట్లుగా సాగింది కవాతు. పిల్లాజెల్లా చిన్నాపెద్దా తేడా లేకుండా.. జన ప్రవాహం కవాతును ముంచెత్తింది. మిన్నూమన్నూ ఏకమై కవాతు సాగిపోయింది.
మీకు టైం అయిపోయింది…

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించేస్తామని, ఇది ఖాయమని జనసేన కవాతు సాక్షిగా పవన్ కళ్యాణ్ సవాలు చేశారు. ‘‘తెలుగుదేశాన్ని కుంభస్థలంపై కొట్టాలి. అది తలవంచాలి. నెలల నెలలు ఏడిపించారు. మీ ప్రభుత్వాన్ని కూలదోయకపోతే మాది జనసేన పార్టీయే కాదు’’ అంటూ పవన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఒక పక్కన ఆయనకు వయసు అయిపోతున్నా… విజన్-2050 అంటున్నారని, అప్పటి వరకూ ఆయన ఉంటారా అని ప్రశ్నించారు. లోకేష్ చూస్తే.. వెన్నముద్ద తినలేడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అన్నట్లుగా ఉన్నాడని, కానీ మట్టిగుట్టలు, ఇసుక గుట్టలు మాత్రం తినేశాడని ఎద్దేవా చేశారు. ‘‘ఊర పిచ్చుకపై తాటిపండు పెడితే అదెలా మోస్తుంది? పంచాయితీకి పోటీ చేయనివాడు పంచాయతీరాజ్ మంత్రిగా ఎలా చేయగలడు?’’ అని ఎద్దేవా చేశారు. ‘‘ముఖ్యమంత్రి కొడుకు మీద ప్రేమతో దృతరాష్ట్రుడిలా తయారయ్యాడు.. రాష్ట్రాన్ని దృతరాష్ట్ర పర్వం చేస్తున్నాడు.. ఆయనకు వయసైపోయింది’’ అని అన్నారు.

పాత దొంగ ఎప్పటికైనా దొరికిపోతాడు

జగన్ పై అనేక కేసులున్నాయనీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ను నేటికీ అవినీతి కేసులు వదలడం లేదని, పాత దొంగ ఏదో ఒక రోజు దొరికిపోతాడని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఈ చచ్చు రాజకీయ వ్యవస్థను మార్చేద్దాం. కమ్యూనిజం కాదు.. కాపిటలిజం కాదు.. మధ్యేవాదంగా వెళదాం. ప్రజాస్వామ్య విధానంలో వెళదాం. అవినీతిలేని పాలనను తెద్దాం’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. మీ భవిష్యత్తును తన చేతిలో పెట్టాలనీ, మీకు అమ్మా, నాన్న, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురే ముఖ్యమని భావించాలన్నారు. పెద్ద మాటలే అంటున్నాననీ, ఒకవేళ విఫలమైతే తిట్లు తినడానికి కూడా సిద్ధంగానే ఉన్నానని, మీ కోసం ఆ మాత్రం భరించగలనని అన్నారు. ‘‘మీరు సీఎం అవుతారా? లేక నన్ను నక్సలైటు అవ్వమంటారా?’’ అంటూ ఒక యువకుడు అడిగాడనీ, ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. తెలుగుదేశం, వైసీపీలు అధికారంలోకి రావడంలేదని నివేదికలు వచ్చాయని చెప్పి.. కొందరు పారిశ్రామికవేత్తలు తనతో మాట్లాడారని, జిల్లాకు 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఇవ్వాలని వారికి చెప్పానని, ఒక్క కియా ఫ్యాక్టరీ వస్తేనే సీఎం నానా గోల చేస్తున్నాడని అన్నారు. ‘‘నేను యూరోప్ వెళ్లి అక్కడి వారితో ఇక్కడ పరిశ్రమలు పెట్టొచ్చు కదా అని అడిగితే మీ ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ అబ్బాయికి వాటాలు ఇవ్వలేం’’ అని వారు అన్నారని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే మా నిజాయితీ చూసి కంపెనీలే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని అన్నారు. 2019 లో రాయలసీమ గడ్డ… జనసేన అడ్డా అని మీరు అందరికీ చెప్పాలని కోరారు.

కొత్తగా తప్పులు చేయవద్దనుకుంటే పార్టీలోకి రావచ్చు..

‘‘పవన్ కళ్యాణ్ ఏముంది ఒక సినిమా నటుడు అని అనుకుని నా దగ్గర రాజకీయాలు చేద్దామని అనుకుంటారేమో… నా గురించి తక్కువ అంచనా వేయకండి’’ అంటూ పరోక్షంగా నేతలను హెచ్చరించారు. పార్టీలోకి వచ్చేవారు నిజాయితీగా ఉండాలని, పాత తప్పులేమైనా ఉంటే, వాటిని మానుకోవాలని చెప్పారు. ఇది మార్పుల కాలమని, అందరూ మారాలని పిలుపునిచ్చారు.

రాయలసీమకున్న పేరును మార్చేద్దాం

‘‘రాయలసీమ అంటే అందరు నరికేస్తాం, చంపేస్తాం అనే సినిమా డైలాగ్స్ అనుకుంటారు, కానీ ఇది చదువుల సరస్వతి ఉన్న నేల… ఇక్కడ ఎక్కడా లేనన్ని గ్రంధాలయలు ఉండేవి.. అలాంటి నేలపై ఫ్యాక్షన్ అనే మాట వినిపించకూడదు’’ అని అన్నారు. మనిషి పుట్టిన దగ్గర నుంచీ పిరికితనం ఉంటుందని, అయితే ఆగిపోయేవాడు ఒకడు, పోరాడేవాడు ఒకడు ఉంటారని, తాను రెండోదానిని ఎంచుకున్నానని అన్నారు. అధ: పాతాళంలోకి వెళ్లిపోయినా, రాకెట్ లా మళ్లీ దూసుకొచ్చేయాలని అన్నారు. రాయలసీమ నుంచి అన్నమయ్య, వెంగమాంబ, కట్టమంచి రామలింగారెడ్డి, ధూర్జటి, అల్లసాని పెద్దన, తరిమెల నాగిరెడ్డి లాంటి గొప్పవాళ్లు జన్మించిన ప్రాంతమని జనసేనాని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కాన్షీరామ్ గారే తనకు ఆదర్శమని, ఉత్తరప్రదేశ్ లో వీధికో రౌడీ ఉన్నా ఆయన పార్టీని స్థాపించారని అన్నారు. ‘‘మీలో ఉత్తేజాన్నీ, ధైర్యాన్నీ నింపడానికే వచ్చాను. ఎవరికీ మీరు భయపడక్కర్లేదు. మీ కోసం చచ్చిపోవడానికీ సిద్ధమే. ఈ దుస్తులు వేసుకుని వచ్చాం. వెళితే ఇంటికి వెళతాం. లేకపోతే లేదు. నాకెలాంటి భయాల్లేవు’’ అని జనసేనాని స్పష్టం చేశారు.

చంద్రబాబు, జగన్ లను విమర్శించడానికి కారణం వారి విధానాలు బాగోనందునే తప్ప, చంద్రబాబు తనకు అన్నయ్యకాదనీ, జగన్ తనకు శత్రువు కాదని అన్నారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్ని మంచి పనులు చేశారని, కానీ మంచి కంటే చెడు పనులు కూడా చేశారని గుర్తు చేశారని, కాంగ్రెసు హయాంలోనే రైతులు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. రైతుల భూముల్ని లాక్కున్నపుడు విదేశాల్లో వర్గపోరాటాలు వస్తే, మన దగ్గర కుల పోరాటాలు వస్తాయని అన్నారు. భూసేకరణ చట్టాన్ని అమలు కాకుండా ఆపింది కూడా జనసేనేనని గుర్తు చేశారు. వైసీపీని నమ్ముకుని లాభంలేదని, 2019 ఎన్నికల్లో రాయలసీమ పౌరుషాన్ని చూపిద్దామని అన్నారు. తాను భాజపాను విమర్శించడంలేదని చంద్రబాబు అంటున్నారని, పాపాలు చేసిన వారికి భయాలు ఉంటాయని, మోడీ అయినా, మరెవరైనా తనకు ఒకటేనని అన్నారు. ప్రజా విప్లవాలు వచ్చినపుడు అవినీతిపరులు ఆకుల్లా కొట్టుకుపోతారని అన్నారు.

బొత్సా… నోరు అదుపులో పెట్టుకో

బొత్సా సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదా విజయనగరం రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. మీ సారా వ్యాపారాలూ, అవినీతి గురించి తెలుసునని చెప్పారు.

హామీలు:

 • జనసేన అధికారంలోకి వస్తే వలసలు వెళ్లిన వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి అండగా నిలబడతాం.
 • జనసేన SC, ST యువతకు SC, ST సబ్ ప్లాన్ కి సంబంధించిన కాంట్రాక్టులు ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం.
 • రాయలు పాలించిన రాయలసీమను మళ్లీ తెద్దాము.
 • వలసలను నివారిద్దాం.
 • కొత్త తరం రైతుల్ని తయారు చేద్దాం.
 • కొత్త తరం కాంట్రాక్టర్లని తెద్దాం.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *