ఓట్లే లేనపుడు… ఈ ఎన్నికలు ఎందుకు?

March 13, 2019 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9)

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. దేశ వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య పెరిగితే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఓటర్ల సంఖ్య 2014 కంటే తగ్గిపోయింది. దేశ వ్యాప్తంగా ఓటర్ల పెరుగుదల సరాసరి 7.6 శాతం చొప్పున పెరిగింది. ఏపీలో మాత్రం 2014లో 3.67 కోట్ల ఓటర్లు ఉండగా 2019నాటికి నమోదైన ఓటర్ల సంఖ్య 3.66 కోట్లకు తగ్గింది. దేశ వ్యాప్తంగా సరాసరిన 7.6 శాతం పెరిగినపుడు ఒక్క ఏపీలోనే తగ్గుదలను చూపించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉండే ఉంటుంది. కుట్ర ఉంది అని చెప్పడానికి మరో సూచన ఏమంటే… ఏపీలో సర్వీసు ఓటర్ల సంఖ్య 2014 నుంచి 2019కి ఏకంగా 45 శాతం పెరిగింది. అంటే సర్వీసు ఓటర్లు తక్కువ మంది ఉంటారు కాబట్టి శాతం ఎక్కువ కనిపించవచ్చు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓటర్ల సంఖ్యను చూస్తే జాతీయ సరాసరి లేకపోవడం దారుణం.

తెలుగుదేశం ప్రభుత్వం సేవామిత్ర అప్లికేషనును ఉపయోగించుకోవడం ద్వారా వైసీపీ, జనసేన సానుభూతిదారుల ఓట్లను తొలగించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం పేరుతో రాష్ట్రంలో ఉన్న అందరికీ ఫోన్లు చేయడం… తెలుగుదేశం ప్రభుత్వ సేవలపై సంతృప్తిగా ఉన్నారా లేదో అని ప్రతి ఒక్కరినీ అడగడం, సంతృప్తిగా లేమని చెప్పినపుడు వెంటనే ఆ వ్యక్తి గురించి మరింతగా అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించడం గత కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారమేనని ప్రజలందిరికీ తెలిసిన విషయమే. అయితే ఎన్నికల సర్వేల పేరుతో కొన్ని బృందాలు క్షేత్ర స్థాయిలో తిరగడం, సమాచారాన్ని సేకరించడం వరకూ నిజమే. సేవామిత్ర పట్టుబడినపుడు తెలంగాణ పోలీసులు చూపించిన గ్రాఫుతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహారం సరిపోలుతున్నది. దీనిని బట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను దారుణంగా తొలగించి ఉంటుందనేది సుస్పష్టం.

ఒకవైపు రాష్ట్రం ఎన్నికల ముంగిట ఉన్నది. ఈ పరిస్థితిలో 2014 నాటి ఓటర్ల జాబితాతోనే ఎన్నికలకు వెళ్లినట్లు అవుతుంది. ఇది జనసేన పార్టీకి పెద్ద కోలుకోని దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల నాటికి 18 సంవత్సరాలు నిండి చాలా మందికి ఓటు హక్కు వచ్చింది. ముఖ్యంగా జనసేన పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నది కూడా యువతే. ఆ లెక్కన పోయిన ఓట్లన్నీ కూడా జనసేనవే అయితే… ఎన్నికలకు వెళ్లి ఉపయోగం ఏమిటి అన్నది ప్రశ్న.

2019 ఎన్నికలు ప్రజాస్వామ్యం ఒక బూటకమని నిరూపించే దిశగా వెళుతున్నాయి. తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అవకాశం ఉన్నదో లేదో తెలియదు. కానీ జనసేన దీనిపై అధ్యయనం చేసి వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఒక్క ఏపీ గురించి దేశ వ్యాప్తంగా ఫలితాలను ఆపేస్తారా…? లేక ఏపీలో ఎన్నికలను వాయిదా వేస్తారా…? బూటకపు ఎన్నికలను నిర్వహించడం కంటే… ఆపివేయడమే మేలు అని ‘‘న్యూస్ ఆఫ్ 9’’ గట్టిగా భావిస్తోంది. ఈ ఎన్నికలను తెలుగుదేశం ప్రభుత్వం ఎంత అవసరంగా భావిస్తున్నదీ చెప్పేందుకు ‘‘న్యూస్ ఆఫ్ 9’’ అనేక కథనాలను ప్రచురించింది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కుయుక్తులను 1983 నుంచి చెప్పింది కూడా మేమే. కానీ చివరికి ఎన్నికలు మరీ ఇంత బూటకంగా తయారవుతాయని మేమూ ఊహించలేదు.

బూటకపు ప్రజాస్వామ్యమా… కలకాలం వర్ధిల్లు!!

Other Articles

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *