చంద్రబాబు నడిచిన చోట… !!

November 29, 2018 | News Of 9

Chandrababu | telugu.newsof9.com

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడంలేదని, తమ్ముళ్లూ మీరైనా చెప్పండి అంటూ వాపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తమ్ముళ్లకు ఏం తెలుసు.. చంద్రబాబు గురించి.. మేం చెబుతాం. కేసీఆర్ ఎందుకు తిడుతున్నారో మాకు తెలుసు. తెలంగాణలో అభివృద్ధి పేరుతో వేలాది ఎకరాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టినందుకు తిడుతున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నా.. ఇక్కడి వారి అభివృద్ధిని పట్టించుకోనందుకు తిడుతున్నారు. సైబరాబాదుగానీ, హైటెక్ సిటీగానీ, శంషాబాద్ విమానాశ్రయంగానీ పెట్టినపుడు వేలాది ఎకరాలు తక్కువ రేట్లకు కొనేసి, తర్వాత కోట్లకు కోట్లకు అమ్ముకున్న ఘనత ఎవరిది? తెలుగుదేశం నేతలది కాదా? తెలుగుదేశం పార్టీది కాదా?

ఒక పని చేయండి.. మీరు మారువేషంలో వచ్చి… సెక్యురీటీ గార్డులు లేకుండా తెలంగాణలో పర్యటించి.. మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోండి. అప్పుడు వాస్తవం తెలుస్తుంది.

తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని మీరు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పదే పదే అడుగుతున్నారు. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలోని నిధుల్నీ, భూముల్నీ దోచుకున్నది వాస్తవం కదా? అభివృద్ధి పేరుతో సొంత బొక్కసాలు నింపుకోవడం నిజం కాదా? అందుకు తిడుతున్నారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని. చిన్నపిల్లల్లా ఏమీ తెలియనట్లు ముఖం పెడుతూ మాట్లాడుతున్నారే? తెలంగాణ వాసులపై సానుభూతి కార్డును ప్రయోగిస్తున్నారా?

ఇంకా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఇంకా ప్రజల్ని మభ్య పెడదామనే మీ జిత్తులమారి ఆలోచన. అంటే మీరు మారలేదు. మారరు కూడా. ‘‘మంచి నీళ్లు లేకపోతే మంచినీళ్లు ఏర్పాటు చేశాను’’ అని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం ఎంత అసహ్యం? స్కూలు పిల్లలు కూడా ఇలా మాట్లాడరు. మీరు చెబుతున్నదానిలో ఏమాత్రం హుందాతనం లేదు. ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఎవరైనా ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందే. ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలను ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుంది… చేయాల్సిందే. అందులో మీ దయాదాక్షిణ్యాలు ఏమున్నాయి? నేతలు అంటే.. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసే దార్శనికులు. మీరు ఎప్పటికీ అలా కాలేరు.

తెలంగాణ… చెరువులపైన ఆధారపడిన దక్కను ప్రాంతం. ఎప్పుడైనా తెలంగాణలో చెరువులను తవ్వించి.. ఇక్కడి ప్రజలు మంచిగా వ్యవసాయం చేసుకునే వెలుసులుబాటు కల్పించారా? తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా… మిషన్ కాకతీయ పథకాన్ని తెచ్చింది. తెలంగాణ సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత… ఎంత మంది కొత్త నాయకులు బయటకు వచ్చారో చూశారా? మీరు ఊహించనంత మంది వచ్చారు. కొత్త రాష్ట్రం కొత్త తరం రాజకీయ నాయకుల్ని అందించింది. మీరున్నపుడు… అదే పాత రాజకీయ నాయకులు.. మీరున్నపుడు ఆ పాత కాంట్రాక్టర్లే. అంటే కోస్తా, రాయలసీమ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం. తెలంగాణలో కాంట్రాక్టర్లు ఎక్కడున్నారు? కొత్త కొత్త ఆశలతో ఈ నేల పురుడు పోసుకున్నది. కొత్త ఆశలూ… కొత్త ఆకాంక్షలూ… చిగుర్లు తొడుగుతున్న తెలంగాణను ప్రజా కూటమి రూపంలో మరోసారి చిదిమేద్దామని వచ్చారా?

మీరున్నపుడు.. తెలంగాణలో ఏం జరుగుతున్నదో మాకు తెలియని పరిస్థితి. ఏం చేసి, కోస్తా, రాయలసీమ కాంట్రాక్టర్లు డబ్బులు సంపాదిస్తున్నారో తెలియని పరిస్థితి. మాకు తిండి ఎందుకు లేదో తెలియని పరిస్థితి..

దేవుడు మీ ఒక్కరికే వరాలన్నీ ఇచ్చాడేమో అనుకునే వాళ్లం. రాజకీయాలను అడ్డం పెట్టుకుని… తెలంగాణలో భూములు కొట్టేసి, సంపదను తరలించుకుపోయి…మా నోళ్లలో మట్టి కొట్టారు. మమ్మల్ని మేం ఉద్ధరించుకోగలం. లేదంటే… ఆకలితో పస్తులైనా ఉంటాం. మళ్లీ మీ గాలి కూడా మాకు సోకవద్దు.

తెలంగాణ భూముల్ని పందేరం చేసి.. కోస్తా, రాయలసీమకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు నేతలు తమ బొక్కసాలను నింపుకున్నారు. అపర కోటీశ్వరులు అయిపోయారు. తెలంగాణ విముక్తి చెందింది అనుకుంటే.. అక్కడ అమరావతిని చెరబట్టారు. ఒక పూట అన్నంలేక అలమటించే.. తెలంగాణ బిడ్డలకు తాము ఎందుకు నిరుపేదలుగా ఇన్నాళ్లూ మిగిలిపోయామన్నది వారికి ఎలా చెబితే అర్థం అవుతుంది? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో దోపిడీ ఎట్టకేలకు ఆగింది అనుకుంటే.. అదిగో మళ్లీ అదే రాబందుల రెక్కల చప్పుడు… మళ్లీ మహాకూటమి రూపంలో తెలంగాణ గడ్డపై కాలుపెట్టారు కదా. మీరు కాలు పెట్టిన తెలంగాణ ప్రాంతంలో మళ్లీ ఇక గడ్డి మొలుస్తుందా? ఎవరికి కావాలి మీ మెట్రో రైళ్లు.. మీ గచ్చిబౌలీ స్టేడియాలు? తెలంగాణ బిడ్డ ఆకలి తీరుస్తాయా అవి? మిషన్ కాకతీయ చూడండి. అది అన్నం పెడుతుంది. ఇవ్వాళ కాకపోతే రేపు… 25 ఏళ్ల భవిష్యత్తును అది అందిస్తుంది. పెద్దనోట్ల రద్దు దేశంలో అందరూ నష్టపోవడం జరిగింది అంటున్నారు.. మీరు నష్టపోలేదు కదా… అప్పుడు ఒక మాట.. ఇపుడు ఒక మాట. అది నాలుకా.. తాటిమట్టా.. ? ఆంధ్ర ప్రజల్నే కాల్చుకుతింటున్నారు. మళ్లీ తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలా తెలుగుదేశం? తెలంగాణ లో అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయింది అంటున్నారు. మీరున్నపుడు ధర్మం నాలుగు పాదాలా నడిచిందా? ఎందుకండీ.. ఈ నాలుక మచ్చల మాటలు… తెలుగు రాష్ట్రాలకు ఈ దుర్గతి ఎన్నాళ్లో…?

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *