ఆకలిదప్పికలు లేనిదే… స్మార్ట్ విలేజ్: పవన్

November 29, 2018 | News Of 9

‘‘అవినీతితో నిండిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేద్దాం’’ (స్ఫూర్తి)
– ఆడపడుచులు బహుమతిగా ఇచ్చిన కత్తిని ప్రజలకు చూపిస్తూ…
‘‘నువ్వు అన్యాయాన్ని ఎదిరించే సైనికుడుని కన్నావ్.. ’’
– నిన్ను ఏమైనా చేస్తారేమో నాన్నా అన్న తల్లితో పవన్. (సెంటిమెంటు)
‘‘ఈ అవినీతిని చూసి తుపాకీ పట్టలేక ఓటు అనే ఆయుధంతో మీ దగ్గరికి వచ్చా’’ (సీరియస్)
– ‘‘అప్పు ఇస్తానంటే సీఎం ఏనుగును కూడా కొంటారు’’ (ఛలోక్తి)

మలికిపురం: యువతను ఆకట్టుకుంటూ, మరోవైపు చిన్న చిన్న జోకులు వేస్తూ, అప్పుడప్పుడూ ఎక్కడో చదివిన విషయాలను అలవోకగా చెబుతూ, తన ప్రసంగానికి రెండు మంచి మాటలు కూడా జోడించి దాదాపు గంటకుపైగా జరిగే పోరాట యాత్ర ప్రసంగాన్ని చాలా చక్కగా, గొప్పగా అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడటంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ ఇతర రాజకీయ నాయకుడు దరిదాపులకు రానంత ఎత్తులో ఉన్నారు.

వైఫై ఉంటే స్మార్ట్ సిటీ అవుతుందా?

ఒకవైపు తినడానికి తిండిలేక, ఆస్పత్రులు లేక, వంతెనలు లేక ఎన్నో రకాల మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఒక గ్రామంలో వైఫై ఏర్పాటు చేసి దాన్ని స్మార్ట్ విలేజ్ అంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ఆకలిదప్పులు లేని గ్రామమే స్మార్ట్ విలేజ్ అని అన్నారు. పాలకులకు ఈ విషయం ఎప్పటికీ అర్థంకాదని, ఎందుకంటే వారికి మనసు లేదని అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గ్యాస్ పైపులైన్ల ప్రమాదాలు జరిగి 20 మందికిపైగా చనిపోయారనీ, చాలా మంది వళ్లు కాలిపోయినా, వారికి ఇంత వరకూ ఎవరూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుగానీ, ప్రతిపక్ష నేత జగన్ గానీ ఈ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. సీఎం అయితేనే పనులు చేస్తాననడం సరికాదని, ముఖ్యమంత్రి కూడా మారాలని అన్నారు. ఆయనా ఆయనకు వయసు అయిపోయిందని, కొడుకు లోకేష్ ను సీఎంను చేయాలని ఆరాటం ఒక్కటే ఆయనకు మిగిలిందని అన్నారు. ప్రజల్ని నా తోటి ప్రజలని అనుకోవాలని అన్నారు. ఏదైనా అడిగితే చంద్రబాబు డబ్బులు లేవంటారని, కానీ స్పీడు బోట్లను 400 కోట్లతో కొన్నారని, ఇవన్నీ ఇపుడు మనకు అవసరమా అని అన్నారు. అప్పు ఇస్తానంటే, సీఎం ఏనుగును కూడా కొంటారని ఎద్దేవా చేశారు.

తాను ముతక సామెతలు ప్రయోగించడంపై ఒకరు ప్రశ్నించారని, కడుపు కాలి ఇలా మాట్లాడుతున్నానని చెప్పానన్నారు. అడ్డగోలుగా అవినీతి చేయడం తప్ప వారికి ఆత్మగౌరవం అంటే కూడా తెలియదని అన్నారు. ‘‘పవన్ మాట్లాడుతూ ఊగిపోతాడు అంటే… ఊగిపోపోడా మరి. దోపిడీని చూసి తట్టుకోలేకే.. ఓటు ఆయుధంతో రాజకీయాల్లోకి వచ్చాను’’ అని చెప్పారు. రిలయెన్స్ వాళ్లను అడిగేందుకు ఒక్కరికీ ధైర్యంలేదని అన్నారు. ‘‘వాళ్లు దోపిడీ చేస్తుంటే స్థానిక నేతలు ఎక్కడ ఉన్నారు?’’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకూ, నాయకులకూ సొమ్ములు ఇచ్చస్తే సరిపోతుందని వాళ్లు (రిలయెన్స్) అనుకుంటున్నారేమోనని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులను కల్పించకపోతే… వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయన్నారు. చంద్రబాబుకు దేశభక్తి లేదని, ఆయనగానీ జగన్ గానీ… వేలాది కోట్లు సంపాదిస్తూ తప్పుడు సంప్రదాయాలను నెలకొల్పారని అన్నారు. రాజు నీతి తప్పితే, నేల సారం తప్పుతుందన్న సామెతను గుర్తుచేశారు. పైన ఉన్నవాడు చేసిందే తలమానికం అవుతుందని, దీనిని బట్టి సమాజానికి వారు ఏం చెబుతున్నట్లు అని ప్రశ్నించారు. కోనసీమలోనే 9 అణువిద్యుత్ కేంద్రాలు పెట్టడానికి సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని, ఈ ప్రాంతానికే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఈ ప్రాంతం నుంచి 100 మంది క్రీడాకారుల్ని తయారు చేయవచ్చని అన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చితీరుతుందని, అప్పుడు ఇవన్నీ చేసుకోవచ్చని అన్నారు. ఎక్కడ దోచేద్దామని మాత్రమే తెలుగుదేశం వారు ఆలోచిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను చదవుల తల్లిగా తీర్చిదిద్దుతామని అన్నారు.
వారు రాజకీయాలను వేల కోట్ల స్థాయికి తెచ్చేశారనీ, అయితే తాను మార్పు కోసం వచ్చానని అన్నారు. ‘‘చిన్నతనం నుంచి ఎన్నో కలలు కన్నాను.. శత్రు దేశం కన్నెత్తి చూడటానికి భయపడే భారతదేశాన్ని కలలు కన్నాను. విదేశీయులు కూడా ఉద్యోగాల కోసం మన దేశానికి వచ్చేంత భారతదేశాన్ని కలలు కన్నాను. కలలు కనండి. కలల్ని ఖండించే వాడిని పట్టించుకోకండి’’ అంటూ యువతకు హితబోధ చేశారు. 2019లో అలంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుందామని చెబుతూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.

చివరిగా… జనసేన నాయకుల గురించి మాట్లాడుతూ… జనసేన సైనికుల్ని నేతలు ప్రేమించాలని.. వాళ్లను ప్రేమించగలిగిన వారే జనసేన నేతలు అవుతారని అన్నారు. ‘‘మనుషులు వస్తుంటారు.. పోతుంటారు కానీ నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది’’ అన్న పంక్తులతో ముగించారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *