ప్రత్యేక హోదా పాపం ఎవరిది?

February 14, 2019 | News Of 9

Whose sin is it any way for SCS? | telugu.newsof9.com

ప్రత్యేక హోదా పాపం ఎవరిది?

ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కి అయిదేళ్లు హోదా ఇవ్వాలి అని పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ చెబితే, అయిదేళ్లు ఏం సరిపోతుంది పదేళ్ళు కావాల్సిందే అని ఆ రోజు బీజేపీ ముక్త కంఠంతో అడిగింది. విభజన జరిగి అయిదేళ్లు కావస్తున్నా హామీ నెరవేరకపోగా, ఇప్పటికీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంలో నాయకుల వైఫల్యం, నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో మన కళ్లకు కనిపిస్తోంది.

హోదా చుట్టూ అల్లుకున్న అడ్డంకులు

ఆ నాడు కాంగ్రెస్ హోదా ఇస్తాం అనే మాటయితే చెప్పింది గాని విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని పొందుపరచలేదు. హోదా విషయం చట్టంలో గనుక ఉండి ఉంటే ఈ పాటికి హోదావచ్చి సంవత్సరాలు గడిచేవి అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. హోదా విషయంలో కాంగ్రెస్ కి ఉన్న శ్రద్ధ, నిబద్దత ఏ పాటిదో ఇక్కడే తెలుస్తుంది. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాలు కూడా హోదా అడుగుతాయి, 14 వ ఆర్థిక సంఘం హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు అని… హోదావల్ల జరిగే ఉపయోగం ఏమీ ఉండదు అని… బీజేపీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం, టీడీపీ ఆ ప్యాకేజీని అసెంబ్లీ సమక్షంగా ఆమోదించడం, ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలపడం, వెంకయ్య నాయుడికి సన్మానం చేయడం.. చకచకా జరిగిపోయాయి.

టీడిపీ ప్యాకేజీని ఆమోదించడానికి కారణాలు

ప్యాకేజీని ఆమోదించడం మీద ఆ రోజు ఎన్ని విమర్శలు వచ్చినా… హోదా వస్తే కలిగే ప్రయోజనాలన్నీ ప్యాకేజీ రూపంలో వస్తున్నాయి అని, హోదా కంటే ప్యాకేజీయే ఎక్కువ మేలు చేస్తుంది అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. సొంత ప్రయోజనాల కోసమే ప్యాకేజీని ఆమోదించారని అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. హోదా వల్ల కలిగే పరోక్ష ప్రయోజనాల కంటే ప్యాకేజీ రూపంలో వచ్చే ప్రత్యక్ష ప్రయోజనాలలో అవినీతికి ఆస్కారం ఎక్కువ అనీ కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా పూర్తిస్థాయి జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని నిర్మించే బాధ్యత రాష్ట్రానికి రావడం, ఆ తరువాత పోలవరం కోసం ఇచ్చిన ఫండ్స్ విషయంలో అవకతవకలు జరిగాయి అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఆరోపించడం అనుమానాలకి దారి తీస్తుంది.

ప్యాకేజీ మీద టీడిపి యుటర్న్

ప్యాకేజీ విషయంలో కేంద్రం మమ్మల్ని మభ్య పెట్టింది అని టీడీపీ చెప్పే కారణాలు రెండు. మొదటిది: 14 వ ఆర్థిక సంఘం హోదా ఉన్న, లేని రాష్ట్రాలని ఒకే రకంగా చూస్తుంది అని కేంద్రం చెప్పడం. నిజమే ఈ విషయంలో కేంద్రం అబద్ధం చెప్పింది అయితే ప్యాకేజీ ఇచ్చినా సరిగ్గా రెండు వారాలకే జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో హోదా ఉన్న, లేని రాష్ట్రాలకి అందే ప్రయోజనాల విషయంలో వ్యత్యాసం చూపించింది కౌన్సిల్. ఇదే మీటింగ్ లో రాష్ట్రానికి చెందినా ఇతర ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నాడు. మరి ఈ విషయం మీద కేంద్రాన్ని అప్పుడే ఎందుకు నిలదీయలేదు? ఈ చిన్న విషయం అర్థం కావడానికి టీడీపీకి సంవత్సరం పైగా పట్టింది అంటే ఎలా నమ్మాలి?

రెండవ కారణం: ప్యాకేజి ఇచ్చారు కాని దానికి చట్ట భద్రత లేదు. అసలు చట్ట భద్రత లేకుండా ప్యాకేజీని ఎందుకు ఆమోదించారు? టీడీపీ వాళ్లు చెప్పినట్టు హోదా కంటే ప్యాకేజీ చాలా మేలు అయితే ఇప్పుడు దీక్ష చేయాల్సింది ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించడం కోసం కానీ హోదాకోసం ఎందుకు చేస్తున్నట్టు?

ధర్మపోరాట దీక్షల్లో ధర్మం ఎంత?

జరిగిన విషయాలన్నీ పరిశీలిస్తే, హోదా కంటే ప్యాకేజీ చాలా రెట్లు మేలు అని టీడీపీ ప్రజల్నిమభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం విఫలం అవ్వడం. అదే సమయంలో పవన్, జగన్ పదే పదే హోదాని ఆంధ్రుల హక్కుగా అభివర్ణించడం, ప్రజల్లో హోదా ఇవ్వకపోవడం అంటే ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడమనే భావన చెలరేగడంతో వేరే దారి లేక ఎన్డీయే నుండి బయటికి వచ్చి హోదా విషయంలో పూర్తి తప్పు బీజేపీదే అన్నట్టుగా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నది టీడీపీ. పవన్ ప్యాకేజీ వద్దు హోదా కావాలి అని డిమాండ్ చేసినప్పుడు ఎగతాళి చేసి ఈ రోజు కేంద్రం మీద తాము పోరాడుతుంటే ఎందుకు మాతో కలవట్లేదు అని అడిగే నైతిక భాద్యత టీడీపీకి ఎక్కడుంది? కేంద్రం ఇప్పటికీ ప్యాకేజీకి మాత్రమే కట్టుబడి ఉన్నాం… హోదా ముగిసిన అధ్యాయం అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కోట్లలో ప్రజా ధనాన్ని వృధా చేస్తూ టీడీపీ చేస్తున్న దీక్షల పరమార్థం హోదా విషయంలో తాము తీసుకున్న యూ టర్న్ ని కప్పి పుచ్చడానికి చేసే ప్రయత్నమే. టీడీపీది కేవలం ఎన్నికల స్టంటుగా మిగిలిపోయింది.

ప్యాకేజీని ఆమోదించిన టీడీపీ మీద పవన్ కళ్యాణ్  ప్రజావాహిణీలో తీవ్ర విమర్శలు చేశారు. ప్యాకేజీని రెండు పాచిపోయిన లడ్డూలతో పోల్చితే, పవన్ కళ్యాణ్ కు ఏమీ తెలీదు అని అపహాస్యం చేసింది ఈ టీడీపీ వాళ్లే. ప్యాకేజీ.. హోదా కంటే చాల గొప్పదని, ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని మభ్యపెట్టింది టీడీపీ వాళ్లే. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని, హోదా పేరు ఎత్తితే జైలే అని హెచ్చరికలు కూడా జారీ చేసిందీ, వైజాగ్ లో హోదా కోసం ఉద్యమిస్తున్న యువకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించిందీ టీడీపీ వాళ్లే. అదే టీడీపీ వాళ్లు ఈ రోజు మాతో ఎందుకు కలిసి రావట్లేదు అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడం హాస్యాస్పదం.

హోదా మీద రాజకీయాలు

హోదా రాకపోవడానికి ప్రథమ కారణం విభజన చట్టంలో హోదా గురించి కాంగ్రెస్ ప్రస్తావించకపోవడమే. ఇప్పుడు అదే కాంగ్రెస్ తో కలిసి హోదా సాధిస్తాం అని టీడీపీ ప్రగల్భాలు పలుకుతున్నది. ఆంధ్రాకి హోదా ఇస్తే మాకూ ఇవ్వాలి, ఆంధ్రాకి హోదా ఇస్తే మా పరిశ్రమలు తెలంగాణని వదిలి ఆంధ్రాకి వెళ్ళిపోతాయి మేము ఎలా ఒప్పుకుంటాము అని ఒకప్పుడు చెప్పిన తెరాసతో కలిసి హోదా సాధిస్తామని వైసిపీ హామీ ఇస్తున్నది. అయిదు సంవత్సరాల క్రితం ఆంధ్రులకి రావాల్సిన హక్కు ఈ రోజుకీ రాకపోవడం, వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా మేమంటే మేము సాధిస్తాం అని పార్టీలు హామీలు ఇవ్వడం… ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరేనా? లేక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనా? అన్న అనుమానాలు వేధిస్తున్నయి.

– ది పర్పెచ్యువల్ స్పెక్టేటర్ 

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *