నేడు తీర్పు చెప్పనున్న ‘‘కడుపు మంట’’… !!

December 7, 2018 | News Of 9
Why people turn against its own government
                          (న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేకం)
ఆ రోజు రానే వచ్చింది.. తెలంగాణ ప్రజలు ఎవరికి అధికారాన్ని కట్టబోతున్నదీ ఈ రోజు తీర్పు చెప్పనున్నారు. తెలంగాణ ప్రజలకు సొంత రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తెరాసాకే మరోసారి అధికారాన్ని ఇవ్వబోతున్నారా లేదా అన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బలమైన తెలంగాణ సెంటిమెంటు రాజకీయాలను తిరుగులేని విధంగా శాసించిన పరిస్థితి నేడు లేదన్నది అర్థంమైంది. ‘‘అధికారాన్ని తెచ్చి ఇచ్చాము… ఎంత వరకూ నువ్వు దీనిని సద్వినియోగం చేసుకున్నావు? ఎంత వరకూ తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించావంటూ ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజ తెరాసను దాదాపు బలిపీఠంపై నిలబెట్టింది. తెలంగాణ అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసి అతిశయించిన ఆత్మస్థైర్యంతో ఉన్న తెరాస పోలింగ్ దగ్గరపడే కొద్దీ భయంతో బిగుసుకుపోతున్నది. తెరాస 100 సీట్లు గెలవడం ఖాయం అని తెరాస అధినేత కేసీఆర్, ఆయన కుటుంబం- ఆ నలుగురు ఘంటాపథంగా చెబుతున్నా… ఎక్కడో గుబులు మాత్రం అందరినీ భయపెడుతున్నది. తెరాస ఓడిపోనున్నది అన్న మాటే ఎక్కడా వినిపిస్తోంది. అన్ని రకాల సర్వేలూ ఇదే రకమైన ఫలితాలను ఇవ్వడంతో బహుళ పంచమి జ్యోత్స భయపెట్టు నన్ను అన్నట్లుగా ఉంది తెరాస అభిమానుల స్థితి. ఒక్క టైమ్స్ నౌ మాత్రమే 70 సీట్లు రాబోతున్నాయి తెరాస పార్టీకి అని చెప్పింది. నిజంగా గెలిచే పరిస్థితి తెరాసకు ఉన్నదా? సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా టిక్కెట్లు ఇచ్చివేయడం, అసెంబ్లీని ఒక్క ఉదుటున రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లిపోవడంవంటి నిర్ణయాలు కేసీఆర్ ది దుందుడుకు వైఖరి అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను నిజం చేశాయి.
తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన అంశాలు.. నిధులు, నీళ్లు, నియామకాలు. ఈ మూడే ప్రధానం. తెలంగాణలో నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేర్లతో తెరాస ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నెత్తిన ఎత్తుకుంది. ఇవన్నీ ఒక్క రోజులో ప్రజల చేతికి అందివచ్చే ప్రాజెక్టులు కాదు. ప్రజలు అప్పటి వరకూ వేచి చూడలేని పరిస్థితి. నియామకాలు అన్నింటికన్నా ముఖ్యమైనది. ఒక ఆర్టీసీ డ్రైవరు కూడా మీరు ఎవరికి ఓటేస్తున్నారు అని అడిగితే… కాంగ్రెసుకే అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఆశ్చర్యం… ఎందుకు అని అడిగితే.. ఒక్క ఆర్టీసీలో 28 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ వాటిని భర్తీ చేయలేదు అని చెప్పాడు. ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేకపోయిందన్నది అంతు పట్టని ప్రశ్నే. నిజానికి తెలంగాణ ఒక్కటే అని కాదు. ఏపీలో కూడా ఉద్యోగాల భర్తీ జరగలేదు. కానీ చంద్రబాబు అక్కడ నిరంతరం మీడియాలో ఉంటూ అబద్ధాలను సైతం నిజాలుగా చిత్రించగల నేర్పును సంపాదించారు.
దేశంలో యువత దాదాపు 50 శాతానికి మించి ఉన్నారు. ఎక్కడా యువతకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఉంది. ప్రభుత్వాలన్నీ కూడా ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. దీంతో ఏపీలోనూ, తెలంగాణలో అనే కాదు దేశ వ్యాప్తంగా యువతలో నిర్లిప్తత తెచ్చేసింది. ఎవో కొన్ని కార్పొరేటు కంపెనీలు మినహా ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు సమృద్ధిగా లేవు. బ్యాంకింగ్ వ్యవస్థను నీరవ్ మోడీ, సుజనా చౌదరి వంటి బడా పెట్టుబడిదారులు వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేయడం కూడా పరోక్షంగా జాబ్ మార్కెట్టుపై ప్రభావం చూపేదే. యువత అన్ని రకాల ప్రభుత్వాలపైనా మండిపడుతున్నారు. తెలంగాణలోని తెరాస ప్రభుత్వం ఈ విషయంలో యువతను నిర్లక్ష్యం చేసింది. రైతులకు కూడా ఆఖరి ఏడాదిలోనే తెరాస సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. షాదీ ముబారక్ వంటి చిన్న చిన్న స్కీములు మినహా, యువత ఉపాధి అవకాశాలపై మిగిలిన ప్రభుత్వాల మాదిరే కేసీఆర్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.
ఇపుడు చీమ చిటుక్కుమన్నా…  సోషల్ మీడియాలో వచ్చేస్తోంది. సంప్రదాయబద్ధంగా ఉన్న మీడియా మాయాజాలం ప్రజలపై పని చేయడం లేదు. ఏపీలో చంద్రబాబును మీడియా ఎంత ఆకాశానికి ఎత్తేస్తున్నా… అక్కడి యువతలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. పవన్ కళ్యాణ్ సభలకు పోటెత్తుతున్న యువతను చూస్తే ఇది అర్థమవుతోంది. నిన్న తిరుపతిలో జరిగిన ఒక సమావేశంలో ఉద్యోగాల కోసం నిరసన వ్యక్తం చేసిన నిరుద్యోగ యువతను క్రమశిక్షణ ఉండాలంటూ చంద్రబాబు కసురుకున్నారు. ఇలాంటివన్నీ ప్రతికూలంగా పని చేసేవే. ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం పని చేసి ఉండవచ్చు… కానీ పని చేస్తున్నట్లు ఆయన కనిపించ లేదు. మంత్రులను కూడా
డమ్మీలుగా చేసేయడం కూడా ప్రతికూలంగా పని చేసి ఉంటుంది.
కేసీఆర్ ప్రభుత్వం- తొలి రోజుల్లో మీడియాని నియంత్రించే పని చేసింది. టీవీ9, ఏబీఎన్ ఛానెళ్లపై ఆపరేటర్ల ద్వారా పరోక్షంగా నిషేధం విధించింది. ఈనాడు గొంతును కూడా నొక్కింది. దీంతో… వ్యతిరేక వార్తలు వెయ్యలేదు  కానీ ప్రభుత్వం గురించి మంచి మాటలు కూడా రాయలేదు. పరోక్షంగా తెరాసను మీడియా వదిలివేసింది. మీడియా మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందింది. మీడియాకున్న పవర్ ఏమిటంటే.. ప్రజలకు తెలియకుండానే పగలుని రాత్రి అనీ, రాత్రిని పగలనీ నిరూపించగల సామర్థ్యం ఉన్నది.
సరిగ్గా… ఆ సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మిత్ర పక్షాలూ ఒక చోటకు చేరడం, రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఏకం కావడం జరిగిపోయింది. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ప్రభుత్వం బుక్ చేయడం రెడ్డి సామాజిక వర్గానికి కడుపు మంటగా మారింది. ఒక టీవీ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ చేయడం వేరు.. ప్రభుత్వం చేయడం వేరు. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల కడుపు మంటకు ఇది కారణమైంది. బయటకు కేసీఆర్, కేటీఆర్ లకు నమస్కారాలు పెట్టినా.. లోలోన కడుపు మంట అలానే ఉంది. పరిస్థితులన్నీ కేసీఆర్ కుటుంబం… నియంతలా వ్యవహరిస్తోందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. అధికారంతో వచ్చిన దురుసుతనం ఎవరికైనా ఉంటుంది.
బయటకు చెప్పకపోయనా, ముఖ్యమంత్రులైనా బ్రోకర్లుగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బ్రోకర్లు అన్న పదం ఎందుకు వాడుతున్నామంటే.. రకరకాల పెట్టుబడిదారులకూ, ప్రభుత్వానికీ మధ్య అనుసంధానంగా ఉండేది సీఎంలే. మాట వినని సీఎంలు, అహంకారంతో ఉండే సీఎంలనూ పదవి నుంచి దించివేయడానికి పెట్టుబడిదారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీళ్లు ఎన్నికల్లో ఓట్లు వేయరు. కానీ ఓట్లు వేసే వారి మనస్సులను విరిచేసి కొత్త ప్రభుత్వాలను తెస్తూనే ఉంటారు. నాలుగు డబ్బులిస్తే… జీహుజూర్ అనే మీడియా సంస్థలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అహం బ్రహ్మస్మి అని సీఎంలు అనుకుంటే.. మనుగడ కష్టమే.
నిజానికి ఒక గ్రాండ్ డిజైను ప్రకారమే సమాజం నడుస్తోందని, అది కొద్ది మందికే అనువుగా ఉందని అది కూడా అతి కొద్ది మందికే తెలుసు. డబ్బున్న ఆ వర్గాలు నడిపించినట్లుగానే సమాజంలో వ్యవస్థలు పని చేస్తూ ఉంటాయి. మరి ఆ గ్రాండ్ డిజైనులో కేసీఆర్ ఓటమే ఉంది. దీనిని తెలంగాణ ప్రజలు ఈ రోజు అధిగమిస్తారో లేక… బయట కంటికి కనిపించే అంశాలనే బేరేజు వేసుకుని తెర వెనుక ఉన్న పెట్టుబడిదారులను గెలిపిస్తారో వేచి చూడాలి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *