రత్న ఖచిత ఖడ్గం నీ చేతికి నేనిస్తా… రథం ఎక్కి కూర్చో, సారధినై నే నడిపిస్తా

December 8, 2018 | News Of 9

(న్యూస్ ఆఫ్ 9- వారాంతపు కథనం)
Pawan Kalyan | Newsof9.com

రత్న ఖచిత ఖడ్గం నీ చేతికి నేనిస్తా… రథం ఎక్కి కూర్చో, సారధినై నే నడిపిస్తా

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… ఆలోచనలకు ఈ మాటలు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆయన గొంతు.. తాడిత పీడిత వర్గాల గొంతును తనలో నింపుకుని ఆంధ్ర దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. తన ప్రసంగాల్లో అంబేద్కర్ గురించి చెప్పని సందర్భం లేదు. అంబేద్కర్ ను తన గురువుగా ప్రతిష్ఠించుకోవడం అంటేనే అణగారిన వర్గాలకు తాను ప్రతినిధినిని నొక్కి చెబుతున్నాడు. అంబేద్కర్ కు దండలు వేయడం కాదు… అణిచివేతకు గురవుతున్న వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడటం ముఖ్యమంటున్నాడు. తాను ఓట్లు అడగడానికి రాలేదు… 25 కిలోల బియ్యం ఇవ్వడానికి రాలేదు… యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వడం కోసం వచ్చానంటున్నాడు. తాను చెబుతున్న మాట కూడా నిజమే. ఏపీలో భూములను దోచుకుంటున్నారు.. సహజ వనరులను దోచుకుంటున్నారు. ఈ దోపిడీ వర్గాలకు ప్రతినిధి తెలుగుదేశం అధిపతి చంద్రబాబు. ఆయన అవినీతికి పాల్పడతారు. ఆయన మంత్రివర్గంలోనే అవినీతిపరులు ఉన్నారు.. పార్టీలో ఉన్నారు… నాయకుల స్థాయి నుంచీ కార్యకర్తల స్థాయి వరకూ అవినీతి వేళ్లూనుకుపోయింది. తొలి నుంచీ తెలుగుదేశం పార్టీ పెట్టుబడిదారుల కోసం, భూస్వాముల కోసం పని చేసింది. అయితే బీసీలకు కొంత మేలు జరిగిందన్న వాదన ఉన్నా… దొంగ కూడా తన దగ్గర పని చేసే వారికి కొంత సొమ్ములో వాటా ఇస్తాడు. అంత మాత్రం చేత దొంగ దోపిడీలు చేయడం లేదని చెప్పలేం. ఇదీ అంతే.
తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంలో అవినీతి పెరిగిపోయింది. బోఫోర్సు కుంభకోణం కేవలం రూ.60 కోట్లే. దీనికే దేశం దద్దరిల్లేలా గొడవలు జరిగాయి. కానీ ఇపుడు తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి ఒక్కడే రూ.6 వేల కోట్లు బ్యాంకు రుణాలు తీసుకుని ఎగవేశారంటే… తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల దగ్గర ఇక డబ్బులు ఎక్కడ ఉంటాయి? చిన్న, మధ్యకారు పరిశ్రమల వారికి బ్యాంకులు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తాయి? అందుకే తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వడం మానుకున్నాయి. యువత మాత్రం నిరుద్యోగంతో అల్లాడిపోతున్నది.
జవాబుదారీతనంతో కూడిన రాజకీయం రావాలని పవన్ కళ్యాణ్ చెబుతున్నది అందుకే. ప్రజలకే పెద్దపీట వేసే రాజకీయాలు, యువతకు పెద్ద పీట వేసే రాజకీయాలు రావాలని చెబుతున్నాడు. స్వాంతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత రెండు సామాజిక వర్గాలే రాజకీయాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయి. 90 శాతం మంది ప్రజలు రాజకీయాధికారాని దూరంగా, ఆర్దిక చట్రానికి బయట ఉన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే… అందరినీ ఆర్థిక చట్రంలోకి తేవాలంటూ ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాటలు ఎప్పటికి నిజమయ్యేను?
70 ఏళ్లుగా మన బతుకుల్ని మార్చని రాజకీయాలు వద్దనే వద్దు అని ఢంకా బజాయించి చెబుతున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయవేత్త కావాలని అనుకున్నవాడికి దార్శనికత ఉండాలి. రాబోయే తరానికి ఏం కావాలన్నది నేడు ఆలోచించగలగాలి. ఈ స్పృహ పవన్ కళ్యాణ్ లో మెండుగా కనిపిస్తోంది. వెయ్యి గజాల్లో వ్యవసాయం చేస్తే నలుగురికి పోషణ లభిస్తుందని చెప్పడం ఎంత గొప్ప మాట. అది వాస్తవంలో నిజమో కాదో తెలుసుకునేందుకు స్వయంగా వ్యవసాయం చేసి చూసుకున్నాడు పవన్. అది నిజమే. మరి… ఇంకా ఆకలి చావులు ఎందుకు సంభవిస్తున్నాయి? ఆర్థిక భారంతో అప్పుల భారంతో అనేక కుటుంబాలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి? ఒక కుటుంబానికి ఎలాంటి ఆధారంలేక… ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని భావించినపుడు… లేదు మనం ప్రభుత్వం దగ్గరకు వెళదాం… మనకు సాయం అందుతుంది అన్న భరోసా నేడు ఉన్నదా? ఒక జిల్లా కలెక్టరు వద్దకు వెళ్లి.. ‘‘అయ్యా.. మాకు జీవనాధారం లేదు. ఉన్న ఒక్క ఉద్యోగం పోయింది.. ఏదైనా జీవనాధారం చూపిస్తారా?’’ అని జిల్లా కలెక్టరు దగ్గరకు వెళితే న్యాయం జరుగుతుందన్న భరోసా లేదు. ఈ భరోసాని ఇవ్వాల్సింది ప్రభుత్వాలే. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దొడ్డిదారిలో ఎంత సంపాదించుకుందామన్న ధ్యాసలో ఉండిపోయినపుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు? అదే పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటే… అధికార వ్యవస్థ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రతి పేదవాడికీ మేలు జరుగుతుందన్న భరోసా ఆయన మాటల్లో కనిపించడం లేదూ?
ముఖ్యమంత్రిగా… చంద్రబాబు ఎలాగూ ఉపయోగంలేదన్నది అర్థం అవుతూనే ఉన్నది. బాబు మళ్లీ రావాలి అన్న కోరుకుంటున్న వారంతా… ఆ సామాజిక వర్గానికి చెందిన వారేనన్నది నిజం. వారు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న 90 శాతం సామాజిక వర్గాలు ఇంకా రాజకీయాధికారాని దూరంగానే ఉండదలచుకున్నారా అన్నది ఆలోచించాలి? ప్రతి కులానికీ ఒక పార్టీ పెట్టుకోవడం సాధ్యం కానే కాదు. పవన్ కళ్యాణ్ తాను ఒక కులానికి ప్రతినిధిని కాదు అని ఘంటాపథంగా చెబుతున్నాడు. ఎవరో ఒకరు ప్రశ్నించేవారు ఉండాలి? ప్రశ్నించేవారే లేరు. ఇప్పటి వరకూ ఆర్థిక చట్రానికి బయట ఆధునిక బానిసలుగా (మోడరన్ స్లావరీ) నిస్తేజంతో నిర్లిప్తంగా ఉండిపోయిన వారి ఆర్ధిక స్వాంతంత్ర్యం దిశగా పవన్ అడుగులు వేస్తున్నాడు.

 

previous arrow
next arrow
Slider

వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లో ప్రవేశించిన జగన్మోహన రెడ్డి రావడమే.. సీఎం కుర్చీ లక్ష్యంగా పని చేస్తున్నారు. అధికారంపై ఆరాటం తప్ప… ఇందుకు మరో కారణం ఏమైనా ఉన్నదా? తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే… చిల్లర కొట్టు జాబితాలా ఉంది. అది ఫ్రీ. ఇది ఫ్రీ. ఇంత మాత్రం మీరు (పాఠకుడుగా మీరే) సీఎం అయినా.. చేయగలరు. నాయకుడంటే.. గతంలో ఏం జరిగిందీ తెలుసుకోవాలి. రాబోయే వందేళ్లకు ఏం కావాలో తెలుసుకుని ఉండాలి. అతడే నాయకుడు. తెరాస నాలుగంటే నాలుగే వాగ్దానాలు చేసింది. కేసీఆర్.. దీర్ఘకాలంలో తెలంగాణకు మేలు చేసే నీటి ప్రాజక్టులను చేపట్టారు. మరో పదేళ్లు పోతే సీఎంగా కేసీఆర్ చేసిన పనుల విలువ తెలుస్తుంది. నాయకుడు అంటే ఇలా ఉండాలి. పవన్ కూడా… 25 కేజీల బియ్యం కాదు… 25 ఏళ్ల భవిష్యత్తును ఇస్తానంటున్నాడు. నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానంటే ఇది అందరూ చేయగలరు. చిల్లర కొట్టు జాబితాలా ఉండే మానిఫెస్టోలను నమ్మకండి. 70 ఏళ్లుగా నమ్మి మోసంపోయాం. ఏ ప్రభుత్వం అయినా.. చేపలు పట్టి ఇవ్వడం నేరం. సొంతంగా చేపలు పట్టుకోవడం నేర్పాలి. స్వావలంబన అంటే ఇదే. ప్రతి ఇంటికీ ఒకరో ఇద్దరో యువకులు ఆర్ధిక స్వావలంబనను సాధిస్తే.. ఆ కుటుంబం మొత్తాన్నీ ఆ కుర్రవాడు పోషించగలడు. ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. జగన్ కు ఇన్ని తెలివి తేటలు ఉన్నాయా అన్నది అనుమానమే. జగన్మోహనరెడ్డిది ఫ్యాక్షనిస్టు మనస్తత్వం అని చెబుతారు. ఆయన తన తాత రాజారెడ్డి జుట్టులో నుంచి ఊడిపడ్డారని చెబుతారు. లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి… పార్టీ పెట్టి నడిపిస్తున్నారు. సీఎం కావడానికి లక్షల కోట్ల డబ్బూ, ఒక పార్టీ ఉంటే సరిపోతుందా? వ్యక్తిగా ఆయన ఏమిటి అని ఆలోచించాల్సిన పని లేదా? ఒక ఫ్యాక్షనిస్టుగా రాజారెడ్డి జీవితాన్ని ప్రారంభించినా.. రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టుగా లేరు. రాజశేఖర రెడ్డిని రాబిన్ హుడ్ తో పోల్చవచ్చు. పెద్దలకు ఇవ్వాల్సింది ఇచ్చి…తీసుకోవాల్సింది తీసుకుని ఆ డబ్బుతో పేదలకు కొన్ని మంచి పనులు చేసిన మాట వాస్తవం. మరి జగన్ ఎలాంటి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు? తాత రాజరారెడ్డి వారసత్వాన్నా? లేక తండ్రి రాబిన్ హుడ్ వారసత్వాన్నా? ఇది ప్రజలు తేల్చుకోవాలి. జగన్ సీఎం అయిపోతాడేమో అని అందరి కంటే ఎక్కువ భయపడుతున్నది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులు, తెలుగుదేశం పార్టీని పోషిస్తున్న దనవంతులే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి దగ్గరకు వెళ్లినంత తేలికగా జగన్ వద్దకు వెళ్లలేమన్నది వారి భయం. జగన్ ఎలాంటి వారన్నది సామాన్య ప్రజల కంటే ఇపుడు ఒక వెలుగు వెలుగుతున్న యల్లో క్యాపిటలిస్టులకు బాగా తెలుసు. అందుకే వారు ‘‘బాబు మళ్లీ రావాలి’’ అన్న పథకానికి పెద్ద ఎత్తున డబ్బు అందిస్తున్నారు. ఈ పథకం పూర్తిగా కోటేశ్వరులు తమకు తాముగా వారి కోసమే తయారు చేసుకున్న సంక్షేమ పథకం. బాబును సీఎం చేస్తానని మీరు హామీ ఇవ్వండి… మీకు ఒక లక్ష కోట్లు తెచ్చి మీ ఇంటి దగ్గర పెట్టడానికి వారు సిద్ధంగా ఉంటారు.
చంద్రబాబు ఉంటే…యల్లో క్యాపిటలిస్టులకు పండగ. జగన్ సీఎం అయితే… ఎవరికీ పండగ ఉండదు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే… మిగిలిన వారి సంగతి దేవుడి ఎరుక. సామాన్యులకు మాత్రం మేలు జరుగుతుందని చెప్పవచ్చు. యువతకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వారి దగ్గర నుంచీ కమీషన్లు వసూలు చేసుకోడు కాబట్టి… వాళ్లు చెప్పింది చేస్తారు. యువతకు ఉద్యోగాలు ఇస్తారు. దీనివల్ల పేదలకు ఆర్థికంగా ఒక ఆసరా లభిస్తుంది. వారి కాళ్లపై వారు నిలబడతారు.
ఏపీలో ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్ల బడ్జెట్టుపై సంతకం ఎవరు చేయాలి అన్నదే ప్రశ్న. అది జగన్ గారు చేయాలా? లేక చంద్రబాబుగారు చెయ్యాలా? లేక తాడితపీడిత వర్గాల ప్రతినిధిగా కొత్తగా వచ్చిన రెల్లి సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ చేయాలా? ఏపీ ప్రజల ముందున్న అతి పెద్ద ప్రశ్న. యల్లో క్యాపిటలిస్టుల చేతుల్లో ఉన్న పత్రికలూ, టీవీలూ ఈ విషయాలేవీ చెప్పవుగాక చెప్పవు. పాము కథలతో, సినిమా కథలతో ఛానెళ్లను నింపేసి మిమ్మల్ని రాజకీయల లోగుట్టు గురించి ఆలోచించకుండా చేస్తాయి. రోమన్ల సామెత ఒకటి ఉంది. ‘‘ప్రజలకు మేలు చేసే పథకాలేమీ లేకపోతే వారికి కనీసం వినోదం చూపెట్టు’’ ఆ మాయ నిన్ను కాపాడుతుంది అని చెప్పాడట ఆ రోజుల్లో… రాజకీయాలనేవి.. దుర్మార్గులకు ఉత్త వ్యాపారం. పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు వ్యాపారం కానే కాదు. మంచి చేస్తానంటున్నాడు. మంచిగా ఉంటున్నాడు. మంచిగా ఎలా ఉండాలో కూడా చెబుతున్నాడు. ఇది మరింత గొప్ప లక్షణం. చరిత్ర ఈ సారి పవన్ కళ్యాణ్ ను ఎంచుకుంది. మార్పు అనివార్యం. ఏపీ రాజకీయాలు అగ్గి రాజుకునే కేంద్ర బిందువు (టిప్పింగ్ పాయింట్)ను చేరుకుంటున్నాయి. మార్పు అనివార్యమైనపుడు వాటంతటవి అవే జరిగిపోతాయి.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *