‘‘పసుపు’’ కొట్టేస్తున్నారుగా!!

January 7, 2019 | News Of 9

Yellow Media | telugu.newsof9.com

రోజూ ఉదయాన్నే తెలుగు దిన పత్రిక చేతిలోకి రాకముందే… ‘‘వీళ్లు నన్ను చంద్రబాబుకు ఓటు వేయించేలా నా ఆలోచనలను మార్చేస్తారు’’ అని ఒకసారి మనసులో అనుకుని తర్వాత యల్లో తెలుగు దినపత్రికలు చదవడం మంచిది. లేదంటే పత్రిక చదవడం పూర్తయ్యేలోగా మీకు చంద్రబాబు శ్రీమహా విష్ణువు అవతారంలో లీలగా మీ కళ్ల ముందే ప్రత్యక్షం అవుతాడు. మీకు తెలియకుండానే చంద్రబాబు మీ మనసులో దూరిపోతాడు. ఒక యల్లో దినపత్రికలో వచ్చిన వ్యాసంపై ‘‘న్యూస్ ఆఫ్ 9’’ విశ్లేషణ.

ఏపీ ముఖ్యమంత్రిని ఏకాకిని చేసి తెరాస, భాజపాలు ఆయనపై యుద్ధం ప్రకటించాయని చెప్పడం ద్వారా చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా ఒక యల్లో మీడియా బాగా ‘పసుపు’ కొట్టింది. తెరాస, భాజపాలు కలిసి జగన్మోహనరెడ్డికి పట్టం కట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని  సారు ఎలా చెబుతారో అర్థంకాదు.  జస్ట్…హిజ్ మాస్టర్స్ వాయస్! విచిత్రం ఏమంటే.. బాబు ఎవరిని విలన్ గా చేయదలచుకుంటే… అధ్యక్షుడి దగ్గర నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ఊడ్చే వ్యక్తి వరకూ అందిరిదీ ఒకటే రకమైన గొంతు. అంత కరెక్టుగా ఎలా సెట్ అవుతుందో అర్థం కాదు. తెలుగుదేశం నేతలంతా ఒకే రకంగా పసుపు కొడతారు. యల్లో మీడియాది  అదే పోక..అదే పోటు.

కేసీఆర్ తెలంగాణ వాణిజ్య ప్రకటనలను ఆంధ్రలో కూడా ఇస్తున్నారని ప్రశ్నిస్తూనే, చంద్రబాబును ఓడించాలని అనుకుంటున్న కేసీఆర్ అక్కడి వార్తలను చదవకపోతే ఎలాగ అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబును ఓడించాలని కేసీఆర్ అనుకుంటే కదా మాస్టారూ? ప్రజల దృష్టిలో మాత్రమే ఈ బల్లి యుద్ధం. లోపాయకారీ డిజైను వేరే ఉందని మనం ‘న్యూస్ ఆఫ్9’’ కథనాల్లో చెప్పుకున్నాం.

ప్రధాన ప్రతిపక్షాలు వెనక్కిపోయి సంబంధంలేని వారు తెరపైకి వస్తున్నారని చెప్పడం అంటే సంబంధంలేని వ్యక్తి అంటే కేసీఆర్ ఆంధ్రాకు వస్తే… తీవ్రంగా వ్యతిరేకించాలన్న భావనను  ప్రజల రక్తనాళాల్లోకి ఎక్కించడమే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటున్నారు అని రాశారు. శత్రుత్వం లేదు.. గాడిద గుడ్డూ లేదు. కత్తులు దూసుకుంటున్నది అంతకంటే లేదు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నందుకు ప్రతీకరంగా కేసీఆర్ చంద్రబాబును ఓడించాలని చేస్తున్నారని చెప్పడం మరో ప్రపంచ వింత. నిజానికి కేసీఆర్ ఇపుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. పక్క రాష్ట్రం వెళ్లి ప్రచారం చేసేంత కోపం ఉంటుందా? అందుకు ఒక బలమైన కారణమే ఉంది. అది చంద్రబాబు గెలవాలి. జగన్ ఓడిపోవాలి. ఇంతకు మించిన పెద్ద అవసరం కేసీఆర్ కు లేదు.

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రధాన శత్రువుగా ప్రొజెక్ట్‌ చేసి సెంటిమెంట్‌ రగిలించడం ద్వారా కేసీఆర్‌ రాజకీయంగా లబ్ధి పొందారు. అరె నిజం చెప్పేశారే. కేసీఆర్ గెలిచిన రోజున యల్లో మీడియా ఏం రాసింది? తెరాస పథకాలకు ప్రజలు పట్టం కట్టారు అని కదా రాశారు. నిజాల్ని దాచలేం మాస్టారూ. మెదడులో ఉన్న నిజాలు అప్పుడప్పుడూ కలం తప్పి కాగితంలోకి వస్తాయి. అది మానవ బలహీనత. నిజమేనా? కేసీఆర్ కు మేలు చేయడానికి చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి వచ్చారని మేం రాసిందే నిజమైంది కదా. మరి రిటర్ను గిఫ్టు అంటే చంద్రబాబును పడగొట్టడం ఎందుకు అవుతుంది? మొన్నటికి మొన్న చంద్రబాబును గుడ్డలూడదీసి కొట్టినంత పని చేశారు కేసీఆర్. అప్పటి వరకూ 120 సీట్లు వస్తాయనుకున్నది తెలుగుదేశం పార్టీలో కొండంత ధైర్యం వచ్చింది. కేసీఆర్ తిట్టిన వెంటనే 160 సీట్లు వస్తాయని తెలుగు తమ్ముళ్లు లెక్కలు పెట్టేసుకున్నారు. ఇక కేసీఆర్ బెజవాడ నడిబొడ్డున నిలబడి చంద్రబాబును తిడితే 175 వచ్చేస్తాయని తెలుగు తమ్ముళ్లు బల్లగుద్దిమరీ చెప్పేస్తారు. ఎందుకంటే… సెంటిమెంటు. ప్రజల్ని అడ్డంగా నరికేయడానికి సెంటిమెంటును మించిన ఆయుధం మరొకటి లేదు. అందుకే భాజపా మాట్లాడితే రామాలయం అంటుంది. లేదా ముస్లింలను తిడుతుంది. తలాక్ ను రద్దు చేస్తుంది… ఇక కేసీఆర్ బెంజి సర్కిల్ దగ్గర నిలబడి చంద్రబాబును తిడితే.. ఆంధ్ర సెంటిమెంటు రగులుతుంది. 83 సీట్లు ఇచ్చిన మిత్రుడికి ఆ మాత్రం రిటర్ను గిఫ్టు ఇవ్వాలని అనుకోవడం మంచిదే. సమస్యల్లా…. జనం పిచ్చివాళ్లు. మిత్రుడు పేరుతో ఒకరు, శత్రువుగా ఒకరు కలిసి రెండు పెద్ద తుపాకులు.. జగన్ పై గురిపెట్టి ఉన్నాయి. యల్లో టీవీల్లోనూ, యల్లో పత్రికల్లో ముసుగులో ‘‘పసుపు’’ కొట్టుడు వార్తలు చదవి.. ఆవేశం తెచ్చుకుని ఓటు వేసిన వారి నోట్లోనే చివరికి మట్టి కొట్టి, లక్షల కోట్ల ఆస్తులను కూడబెట్టుకుని, పేదవాడి నోటి దగ్గర అన్నం ముద్దను లాగేసుకునే ఈ ముదురు రాజకీయవేత్తలను ఏం చేయాలి?

‘‘కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రావాళ్లు మళ్లీ కబళించబోతున్నారని కేసీఆర్‌ అండ్‌ కో చేసిన ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మారు. ఫలితంగా ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన దృష్టిని ఇప్పుడు ఏపీ రాజకీయాలపై కేంద్రీకరించారు’’ అని యల్లో కథనం. అంటే ఇపుడు కేసీఆర్ వస్తే.. రివర్స్ గేర్ వెయ్యమనే తెలుగువారి నరాల్లో ఎక్కిస్తున్నారు.

చంద్రబాబును ఓడించేందుకు నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని యల్లో మీడియా చెబుతున్నది. తెలుగుదేశం పార్టీ చెబుతున్నది. టీడీపీని ఓడించి… ఆయనేం చేస్తారు. ఆంధ్రకు సీఎం అవుతాడా నరేంద్ర మోడీ? ఆంధ్రలో ప్రజాధనం పక్కదారి పడుతున్నది అని ఆయన మొన్న వీడియో కాన్ఫరెన్సులో ఉన్నది ఉన్నట్లు చెప్పారు కదా.

ప్రశ్న తప్పుగా అచ్చయింది మాస్టారూ. ‘‘జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే వారికి వచ్చే లాభం ఏమిటి?’’ అని కాదు అడగాల్సింది. జగన్ గెలిస్తే వారికి వచ్చే నష్టం ఏమిటి? అని రాస్తే… అప్పుడు దానికి సమాధానాలు దొరుకుతాయి. జగన్ గెలవకుండా ఉండటం తెరాసకు ముఖ్యం. ఎందుకంటే… జగన్ గెలిస్తే… తెలంగాణలో కూడా కాలుపెడతాడు. జగన్ పై టీవీ9 ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఒక ప్రశ్న వేశాడు. తెలంగాణలో కేసీఆర్ తో ఉన్న స్నేహం కారణంగానే వైఎస్సార్సీపీ పోటీచేయడం లేదా? అని అడిగారు. జగన్ ఎంచక్కా.. అదేం లేదండి. 2019లో చేయడం లేదు. అంతే. ఆంద్రలో గెలిచి అందరూ వైఎస్సార్సీపీని పైకి లేపితే.. అప్పుడు ఇక్కడ పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణంలో మేం పోటీ చేస్తే.. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గెలిచేవాడు కాదు అని జగన్ అన్నారు. మరి ఆంధ్రలో ఎవరు గెలవాలని కేసీఆర్ అనుకుంటారు? చంద్రబాబు బెటర్ కదా. కోస్తాంధ్ర ఆస్తుల కోసమైనా తెరాసను చంద్రబాబు లోలోన కూడా ప్రేమిస్తాడు. అదే జగన్ వస్తే… తెరాస పని గోవిందా అనే కదా జగన్ చెప్పింది.

‘‘గత ఎన్నికలలో జగన్మోహన్‌రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌ స్కామాంధ్రప్రదేశ్‌ అవుతుందని విమర్శించిన మోదీ, రెండు రోజుల కిందట పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ చంద్రబాబును అవినీతిపరుడిగా చిత్రించడానికి ప్రయత్నించారు’’ అని యల్లో పత్రిక కథనం. ప్రయత్నించడం ఏమిటి? చంద్రబాబు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అని యల్లో పత్రిక భావిస్తోందా? విచిత్రం.

‘‘కేసీఆర్‌ విషయానికి వస్తే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాలలో తనకు పోటీ అవుతారు కనుక జగన్మోహన్‌రెడ్డిని గెలిపించుకోవడానికి ఆయన తన శక్తియుక్తులను అందించడానికి నిర్ణయించుకున్నారు’’  అని మరో కామెంటు. కేసీఆర్ తనకు పోటీ అని చంద్రబాబు గురించి ఆలోచించడమే లేదు. ఎవరిని ఎక్కడ నొక్కితే బల్బు పగులుతుందో కేసీఆర్ కు తెలియనంత చిన్నోడు కాదు. సిసింద్రీ. యల్లో కథనాలను జగన్ నమ్మవచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర ఇదీ రాజకీయం అని చెప్పడానికి సరైనోడు ఒక్కడూ ఉన్నట్లు లేదన్నది జగన్ మాటల్ని చూస్తే అర్థమైపోతుంది.

‘‘మోదీ, ఇటు కేసీఆర్‌ రాజకీయ ఆకాంక్షలు నెరవేరడానికి ఆంధ్రప్రదేశ్‌ ఒక ప్రయోగశాల కాబోతున్నదని స్పష్టమవుతోంది’’ అని రాశారు. నిజానికి ఏపీ ఎప్పుడో ప్రయోగశాల అయిపోయింది. ప్రజలు వద్దు మొర్రో అన్నా అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేయని ప్రయోగం లేదు. అధికారం కోసం మోడీ వెళ్లి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటాడా? తెలుగుదేశం ఇంకా ఆ పని చేసింది. ఇదో రకం కలంకారీ అనుకుని సరిపెట్టుకుందాం.

‘‘దీన్నిబట్టి రానున్న ఎన్నికలలో ఏపీలో చంద్రబాబు ఓడిపోతే రాజకీయంగా కేసీఆర్‌ లాభపడతారన్న మాట! తెలంగాణ ప్రజలు ఆయనకు మళ్లీ అధికారం అప్పగించగా, జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ ప్రధాన పాత్ర పోషించడానికి ఏపీ ప్రజలు ఇచ్చే తీర్పు కీలకం అవుతుంది’’ అని అచ్చు ఒత్తారు. అంటే దీని అర్థమేమి తిరుమలేశా? చంద్రబాబును గెలిపించండి అనేగా..!!

‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే..’ అని ఒక సినీ కవి అన్నారు కానీ.. ‘రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు వేరులే..’ అని మనం ఇప్పుడు సవరించుకోవాలి’’ అని రాశారు కదా. దీనికి కూడా మరో సవరణ చేద్దాం. యల్లో పత్రికల రాతలకు కూడా అర్థాలు వేరయ్యా అని చేద్దాం. సరేనా?

‘‘నరేంద్ర మోదీ, కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి.. అనే ముగ్గురు బలమైన ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే సవాళ్లను చంద్రబాబు ఎదుర్కోవలసి ఉంటుంది’’ అన్నారు. అంటే జనం ‘‘అయ్యో పాపం.. చంద్రబాబూ’’ అని ఇపుడు తెలుగు ప్రజలు విషాదగీతాలు పాడాలనేగా సారూ…  !!

‘‘జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలన్న కేసీఆర్‌, మోదీ కోర్కెను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తీరుస్తారా? లేదా?’’ అని ఆగిపోయారేమి సారూ. లేక ఇంతమంది కలిసి ఓడించాలని అనుకుంటున్న చంద్రబాబునే మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెడతారా  అనేగా మీరు చెప్పాలనుకుంది. అర్థమైంది సారూ.

‘‘చంద్రబాబుపై ఆయనకు (కేసీఆర్)కు ఎంత కోపం ఉందో ఆయన వాడిన భాషను బట్టి అర్థమవుతోంది. తమ ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటి కొచ్చినట్టు తిట్టడాన్ని ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు’’ అని సెలవిచ్చారు. కేసీఆర్-బాబు పాము-ముంగిస బంధం అని చెప్పాలని మీ తాపత్రయం. కానీ అవి టామ్ అండ్ జెర్రీ.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *