యల్లో మీడియా: మరుగుజ్జు కలాలు-మందుపాతరలు

December 9, 2018 | News Of 9

Yellow Media | telugu.newsof9.com

ఈ ప్రపంచంలో నీతికి నిలువుటద్దం ఎవరని అడిగితే యల్లో మీడియా ఠక్కున చంద్రబాబు అనేస్తుంది. అలా నడుస్తూ నడుస్తూ చంద్రబాబు పొరపాటున ఏ బురద గుంటలోనో కాలేశాడని అనుకుందాం.. వెంటనే యల్లో మీడియా అందుకుని… తెలుగు ప్రజల కోసం ఆయన బురదను సైతం లెక్కచేయకుండా నడస్తున్నారంటూ ఫ్రంటు పేజీలో తాటికాయంత అక్షరాల్లో రాసి ఆ బురదను ప్రజల నెత్తిన పోస్తుంది. చంద్రబాబు జేబులో కూర్చుని ఉంటే ఒక దినపత్రిక ఈ రోజు ఒక వార్త రాసింది. జనసేనతో పొత్తు బెడిసికొట్టిందంట.. అని. జనసేనతో వైసీపీ ఎప్పుడు పొత్తు పెట్టుకుంది? అది ఎప్పుడు బెడిసికొట్టింది? ఇది చదివిన తర్వాత ఈ పత్రిక విలేకరి ప్రమాదకరమైన ‘‘యల్లో ఫీవర్’’ తో బాధపడుతున్నాడని మీకు కూడా అనిపిస్తుంది కదూ. నిజానికి జనసేన, వైసీపీ పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందాలూ లేవు. ఎలాంటి పొత్తులూ లేవు. జనసేన అవకాశాలను తగ్గించడానికి వైసీపీ, తెలుగుదేశం పార్టీలు వేస్తున్న ఎత్తుగడ. వైసీపీ మెల్లగా విలేకరుల చెవిలో వేయడం, దాన్ని తెలుగుదేశం మీడియాకి అనుబంధంగా ఉన్నవారు నమ్మేసి.. ఆ బురదను ప్రజల నెత్తిన గుమ్మరించడం.
ప్రధాన రాజకీయ పార్టీల ధోరణి ఎప్పుడూ ఒకటే. అది తెలుగుదేశం కావచ్చు.. వైసీపీ కావచ్చు. డబ్బున్న వాళ్లను వెదుక్కోవడం, టిక్కెట్లు అమ్మేసుకోవడం. ఇదే కదా… తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచీ జరుగుతున్న తంతు. వైసీపీకి కూడా ఈ విషయంలో ఎలాంటి శషభిషలూ లేవు. ఫక్తు పెట్టుబడిదారీ పార్టీ, పెట్టుబడిదారుల చేత, పెట్టుబడిదారీ వర్గాల కోసం ఏర్పడిన పార్టీ వైసీపీ. జనసేన పార్టీ మాత్రమే ఓ సరికొత్త జెండాతోనూ, అజండాతోనూ వచ్చింది. అందులో బలహీన వర్గాలకే పెద్దపీట. అయితే, అభ్యర్థుల విషయంలో రిస్కు తీసుకోవడం జనసేనానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే కాలయాపన జరిగింది. 2009లోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కాలేదు. కుట్ర చేసి ప్రజారాజ్యాన్ని మీడియా అధినేతలు కూల్చేశారు. కానీ ఇపుడు అంత్యంత జాగ్రత్తతో పవన్ ముందుకెళుతున్నారు. అయినా మరోవైపు నుంచి పార్టీల మీడియా సంస్థలు, పార్టీల పంచన పనిచేసే మీడియా సంస్థలు… జనసేన పార్టీని పేల్చివేయడం కోసం అబద్ధాలనే మందు పాతరలను పెట్టి ఉంచాయి. రోజూ వండి వార్చే వార్తల మధ్యలో ఉంచుతున్నాయి. జనసేనకు అనుకూలంగా కొన్ని సీట్లలో వైసీపీ బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతుందంటూ చాప కింద నీరులా ప్రచారాన్ని చాలా కాలం కిందటే మొదలు పెట్టింది యల్లో జ్వరంతో జోగుతున్న మీడియా. వాళ్ళు రాయగా రాయగా మనం చదవగా చదవగా ఇది నిజమేగా అనిపిస్తుంది.
తాజాగా యల్లో మీడియా చెప్పదలచింది ఏమంటే.. వైసీపీతో పొత్తు బెడిసికొట్టడంతో వైసీపీ అభ్యర్థుల కసరత్తు మొదలెట్టింది అని. వార్త రాసింది వైసీపీ గురించి అన్నట్లే కనిపిస్తోంది కదూ… కానీ అసలు మందుపాతర అందులోనే ఉంది. వైసీపీ జనసేనల మధ్య పొత్తు కుదరలేదు అని ప్రజలు అనుకోవాలి. అంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు ప్రయత్నాలు జరిగినాయి అని ప్రజలు అనుకోవాలి. నిజానికి ఇలాంటి రహస్య పొత్తులకు తెగబడేది చంద్రబాబు మాత్రమే. తెలుగుదేశం మాత్రమే ఇలాంటి కుట్రలు చేయగలదు. ఆపరేషన్ గరుడ, కోడి కత్తి డ్రామాలను సృష్టించింది తెలుగుదేశం పార్టీనే అన్నది తేలికగానే ఎవరికైనా అర్థం అవుతుంది. వాళ్లే డ్రామాను సృష్టించి… వాళ్లే ఎదుటివారిపై బురద చల్లి… ఎంత మోసం? వైసీపీ ఎన్ఐఏ విచారణ కోరుతోంది. ఎన్ఐఏ చేతికి వెళ్లితే గానీ ఈ చెత్త డ్రామాలు బయటకు రావు. తెలుగుదేశం పార్టీ నెత్తిన రూపాయి పెట్టి తీసుకోమంటే వద్దు బాబూ అనే పరిస్థితి. సామాన్య ప్రజలు దానికి దూరమై… జనసేన వైపు సాగిపోతున్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించి.. అధికారాన్ని ఎత్తుకుపోవాలని తెలుగుదేశం చూస్తోంది. తెలంగాణలో మహా కూటమి గెలిస్తే.. చూశారా? తెలంగాణలో సైతం బాబు బాబు… బాబు అంటూ ప్రజలు కలవరిస్తున్నారని యల్లో మీడియా ద్వారా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయవచ్చు. ఎంచక్కా రేపటి ఏపీ ఎన్నికల్లో అధికారాన్ని కొట్టేయవచ్చన్నది వారి ఆలోచన.
గుర్తుంచుకోండి… ఏపీ రాష్ట్ర బడ్జెట్టు రూ.2 లక్షల కోట్లు. ఈ బాధ్యత చంద్రబాబుకే మళ్లీ అప్పగిస్తే… మరో రెండు పవర్ ప్లాంట్లు జేబులో వేసుకోవచ్చు. లేదా మరో 1000 కోట్లు జేబులో వేసుకోవచ్చు. ప్రజల బాగు చంద్రబాబుకీ పట్టదు. చంద్రబాబు జేబులో ఉన్న మరుగుజ్జు కలాలకూ పట్టదు. మీ పత్రికలు ఇక్కడే చదువుతారు కానీ… లేకపోతే చంద్రబాబును అమెరికాకి అధ్యక్షుడుని చేసేద్దురు…!!
వైసీపీ భాజపా వైపు చూస్తోందంటూ మరో యల్లో మందుపాతర. చివరికి ఈ మరుగుజ్జు కలాలు చెప్పేంది ఏమంటే.. తెలుగు ప్రజలందరూ చంద్రబాబుకు గుళ్లు, గోపురాలూ కట్టి… ప్రజలు గుళ్లు చేయించుకుని చంద్రన్నా చంద్రన్నా అని భజన చేయాలని యల్లో మీడియా ఉద్దేశంగా ఉంది.
ఒకవైపు చంద్రబాబు శత్రు పార్టీగా ఉన్న కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునేసినా.. ఒక్క మాట అనని యల్లో మీడియా మరుగుజ్జు కలాలు… రేపు భవిష్యత్తులో వైసీపీ భాజపాతో వెళుతుంది కాబట్టి అంటూ రాతలు. రేపు భవిష్యత్తులో జనసేన భాజపాతో వెళుతుందని రాతలు… మరుగుజ్జూ కలాలూ… ఇపుడు కళ్ల ముందున్న తెలుగుదేశం-కాంగ్రెసు పొత్తు గురించి మీకు అభిప్రాయం ఉందా? చంద్రబాబు ఏం చేసినా రైటే. చారిత్రక అవసరం. డమోక్రాటిక్ కంపల్షన్. ఆహాహా… ఏం సమర్ధింపులూ… ఏం బుకాయింపులూ.. ఒక్కసారి సోషల్ మీడియాలో మీపై వస్తున్న అభిప్రాయాలు చూసుకోండి. నవ్విపోతారు నాకేటి… అంటే ఏం చేస్తాం? తెలుగువాళ్ల ప్రారబ్ధం ఇంకెన్నాళ్లు అనుకుని సరిపెట్టుకుంటాం.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *