ఆంధ్ర ప్రదేశ్ ను అవినీతిమయం చేసేశారు

November 26, 2018 | News Of 9

Pawan Kalyan | telugu.newsof9.com

  • చంద్రబాబు గారు… ఇందుకా మీకు మద్దతు ఇచ్చింది
  • ప్రజలకు మంచి చేస్తారని ఆశించాను
  • ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కడ?
  • ప్రభుత్వ అవినీతిని నిలదీయలేని చేతకానితనం జగన్ ది
  • 2019 ఎన్నికలు కురుక్షేత్రమే
  • సగటు మనిషి సంక్షేమమే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది
  • అవినీతికి ఆస్కారం లేని పాలన జనసేన అందిస్తుంది
  • రైతులకి అండగా…. ఆడపడుచులకు రక్షణగా నిలుస్తాం
  • చంద్రన్నకి సెలవిచ్చి జగనన్నను పక్కనపెట్టి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం
  • పి.గన్నవరం బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

ప్రజలకు మంచి చేస్తూ నీతిమంతమైన పాలన చేస్తారని ఆశించి 2014 లో తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలిస్తే ఆంధ్ర ప్రదేశ్ ను అవినీతిమయం చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన యువతకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాల్సిన బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరించింది అన్నారు. వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కడ అని ప్రశ్నించారు. 2019 లో వచ్చే ఎన్నికలు కురుక్షేత్రమే అనీ, ధర్మం పక్షాన నిలిచే మనమే గెలుస్తామన్నారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన ప్రజా పోరాట యాత్రను నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పట్టారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ “రాబోయే ఎన్నికల్లో చంద్రన్నకు సెలవిచ్చి, జగనన్నను పక్కన పెడదాం. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. తెలుగుదేశం, వైసిపి పార్టీలు మనుషులను ఓట్లుగా చూస్తున్నాయి. మనుషుల్ని మనుషులుగా చూడాలి.

వీళ్ళు ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం అంటూ చిచ్చులు రేపుతున్నారు. వాళ్ళ స్వార్థం కోసమే చేస్తున్నారు. వాళ్ళకి అభివృద్ధి చేసే శక్తి లేక, దోపిడీకి అలవాటుపడి ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారు. మానవత్వంతో చూస్తే కులం, మతం ప్రాంతం ఏవీ కనిపించవు. జనసేన ప్రజలకి పాతికేళ్ల భవిష్యత్ ను ఇచ్చేందుకు వస్తుంది. నేనేదో ఐదేళ్లకోసారి ఎన్నికల కోసం వచ్చి రాజకీయం చేయను. పాలకులు చేసే తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించ కూడదు అనుకొనేవాణ్ణి. విభజన సమయంలో ఆంధ్రులు దోపిడీదారులు అన్నారు. పాలకులు చేసిన దోపిడీలకు సామాన్య ప్రజలు మాటలుపడి అవమానాలకి గురయ్యారు. వీటిని స్వయంగా చూసినవాణ్ణి కాబట్టి ప్రజలకు మంచి భవిష్యత్ ఇచ్చేందుకు పార్టీపెట్టాను. నేను పార్టీ పెట్టినపుడు వేల కోట్ల రూపాయలు లేవు… అనుభవం ఉన్న నాయకులు లేరు. కానీ గుండెల నిండా దేశభక్తి ఉంది. జగన్ లా వేల కోట్లు, చంద్రబాబు, లోకేష్ ల్లా కోట్లు తెచ్చే హెరిటేజ్ లేదు… అయినా ప్రజలకు మంచి చేయాలనే బలమైన సంకల్పం ఉంది.

 సభకు వెళ్లి నిలదీయండి

జగన్ లా సీఎం అయితే చేస్తాను, చంద్రబాబులా నన్ను మరోసారి సీఎం చేస్తే చేస్తాను అని చెప్పను. ఎప్పుడూ మీతోనే ఉంటాను. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసేసి, దోచేస్తుంటే ప్రతిపక్ష నేతగా జగన్ ఏమీ మాట్లాడరు. అసెంబ్లీలో నిలదీయరు. ఏమిటీ అంటే మా ఎమ్మెల్యేలను కొనేశారు అంటారు. అది మీ ఇంటి గొడవ. మీ పంతాలు పట్టింపులు కోసం ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా? ప్రజల సమస్యలపై మాట్లాడరా? ప్రతిపక్ష నేత అనేది ఎంత బలమైన స్థానమో గుర్తించరా? ముందు చట్ట సభకు వెళ్లి చంద్రబాబు, లోకేష్ లను నిలదీయండి. జగన్ ఆ పని మాత్రం చేయరు. దాని గురించి అడిగితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. నేనూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడగలను. అవి ప్రజా జీవితాన్ని మార్చి, అభివృద్ధి చేస్తాయా? పోలవరం ప్రాజెక్ట్ నుంచి చిన్నపాటి ప్రాజెక్ట్ వరకూ టిడిపి, వైసిపి కలిసే వాటాలు పంచుకొంటున్నాయి. చంద్రబాబు గారు జగన్ కి డబ్బులు వెళ్ళిపోయాయా అని అడుగుతారు. ఇసుక మాఫియాలో కూడా టిడిపి, వైసిపి కలిపే దోచుకొంటున్నారు. దాంతో ప్రభుత్వ అవినీతిని నిలదీయాలి అంటే జగన్ కు భయం. అందుకే సభకు వెళ్ళరు. ప్రభుత్వం అవినీతిని నిలదీయలేని చేతగానితనం, పిరికితనం ఆయనది.

రిలయన్స్ కి భయపడేది లేదు

పచ్చని కోనసీమలో ప్రకృతినీ, పచ్చదనాన్నీ పణంగాపెట్టి ఇక్కడి గ్యాస్, ఆయిల్ నిక్షేపాలను దేశానికి ఇస్తుంటే ఈ ప్రాంతానికి ఏమి చేశారు. ఎంత సంపద పెంచారు, ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు. రిలయన్స్ వాళ్ళు ఇక్కడి నుంచి మన సంపద తరలించుకుపోతున్నారు. మన రైతులకు ఏమి చేశారు. కోనసీమ యువతకి ఎంతమందికి ఉపాధి ఇచ్చారు. రిలయన్స్ కు ఇక్కడి నిక్షేపాలు ఇచ్చినప్పుడు మనకు ఏమిటి? ఎంత సంపద ఈ ప్రాంతంలో సృష్టిస్తారు? లాంటివి కూడా అడగరు. అప్పుడు పాలనలో ఉన్నది చంద్రబాబే. నాటి ప్రతిపక్షం ఏమీ మాట్లాడదు.

దేశాన్ని శాసించే రిలయన్స్ అంటే భయం. ఏమిటీ ఈ భయం. అందరికీ భయపడితే రాయకీయం ఏమి చేస్తాం. రిలయన్స్ కి భయపడేది లేదు. లోకేష్ కి రెండు సూట్ కేసులు ఇస్తే థాంక్స్ చెప్పి ఇంట్లో పెట్టుకుంటారు. జగన్ అడిగితే మోడీ కేసులు చూపిస్తారు భయపడి మాట్లాడరు.జనసేనకు అలాంటి భయాలు లేవు. ఇక్కడి నుంచి మన నిక్షేపాలు గుజరాత్ కి తరలిపోతున్నాయి. ఇక్కడ సంపద సృష్టి, ప్రజల సంక్షేమంపై నిలదీస్తాం. మా కోనసీమకు అన్యాయం చేస్తున్నవారిని అడిగే హక్కు, నిలదీసే ధైర్యం మాకు ఉంది. నేను ధర్మాన్ని నమ్మినవాణ్ణి.

వాళ్ళకి ఓటేస్తే గోదావరి మిగలదు

టిడిపి పోవాలి.. జగన్ ను పక్కనపెట్టాలి. వాళ్ళకి అవకాశం ఇస్తే ఇసుకను మరింత దోచేస్తారు. ఒకప్పుడు వెన్నెల్లో గోదావరి అందం, గోదాట్లో ఇసుక తిన్నెలు అని చదువుకున్నాం. టిడిపి, వైసీపీలకు అవకాశం ఇస్తే ఇసుక మొత్తం తవ్వేసి, గుంతలు మిగులుస్తారు. గోదావరి కూడా మిగలదు. అప్పుడు గుంతల్లో గోదావరి అని చదువుకోవాలి. పి.గన్నవరం దగ్గర ఒక ఇసుక ర్యాంప్ కి లోకేష్ పేరు పెట్టుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లు లోకేష్ చట్ట సభలోకి వెళ్ళగానే అవినీతి మొదలుపెట్టారు. అవినీతితో నిండిన ఇసుక ర్యాంప్ కి పేరు పెట్టుకొంటే సిగ్గు అనిపించడం లేదా. భూమిని దోచుకొందామనుకున్న వాళ్ళు ఎవరూ మిగల్లేదు. పురాణాల్లో రాక్షసులు ఉంచి ఇప్పటి వరకూ. చింతకాయల్లా రాలిపోయారు. పంచ భూతాలనీ శాసిద్దాం అనుకొంటే కుదరదు.

జనసేన ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తాం. రైతుల కష్టాలు తెలిసినవాణ్ణి. రైతులకి ఎప్పుడూ అండగా నిలుస్తాం. చంద్రబాబులా రుణాల భారాన్ని రైతులకి ఇవ్వం. ఆడపడుచులకు రక్షణ నిలుస్తాం. వారికి 33 శాతం రాజకీయ రిజర్వేషన్ ఇస్తాం. వారికి స్థానం ఇవ్వడం వాళ్ళ అవినీతి తగ్గుతుంది. ఆడబిడ్డలకు స్కూల్స్ లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. విద్య, వైద్యం ప్రజలకి అందుబాటులోకి తెస్తాం. నారాయణ, చైతన్య కార్పొరేట్ కాదు. సర్కారీ స్కూల్స్ లోనే మంచి విద్య అందిస్తాం” అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *